Friday, 6 June 2025

T-227. సచరాచరమిదె సర్వేశ్వరుఁడే

 తాళ్లపాక అన్నమాచార్యులు

227. సచరాచరమిదె సర్వేశ్వరుఁడే

 For English version press here 

ఉపోద్ఘాతము

మొదటి పంక్తి చూస్తూనే భగవద్గీతలో సంజయుడు చెప్పినట్టు (“తత్రైకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమనేకధా” 11-13) = ‘ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడుఅన్న మాటలు గుర్తుకు వస్తాయి. 

అయితే దీనిని అన్నమాచార్యులవారి ఇంకొక​ కీర్తనతో కలిపి చదవాలి  “వెలినుండి లోనుండి వెలితిగాకుండి /  వెలి లోను పలుమారు వెదకేవె గాలి”       (భావము: మానవుడా! బయటలోను లోపలలోను వెలితి లేకుండా నిండి వున్న  ఆ దైవమును తిరిగి తిరిగి బయట వెదకేవు దేనికని?) 

ఈ రెండింటినీ కలిపి చూస్తే అన్నమాచార్యులవారు అర్జుని మాదిరిగా బయట కనబడుతున్న దృశ్యమును గురించి చెప్పలేదు వారు తమ నిశ్చలమైన మనసుతో అచంచలమైన భక్తితో, దైవముతప్ప తనకు వేరు మార్గం లేదని, సర్వస్వము ఒడ్డి, శరణాగతిని పొందారు. 

ఆ నిర్వికల్ప స్థితిలో వారు తమకు ప్రత్యక్ష అనుభవమునకు వచ్చినది మనకు కీర్తనములుగా చెప్పిరి. ఈ కీర్తన పరీక్షగా చూచిన అన్నమాచార్యుల వారి స్థితి అర్జునుని వంటిది కాదు అని తెలియవచ్చును. అర్జునునికి భగవానుడు దివ్యదృష్టి ఒసగుటచేత విశ్వరూపమును వీక్షించగలిగినాడు (11-8 న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ). అన్నమాచార్యులు తమ యోగ దృష్టి చేత అర్జును కనిపించిన దృశ్యమునే కనిరి అనుకోవచ్చును. 

సామాన్యులు భగవంతుని భజించి తృప్తి పడుదురు. ఇహసుఖాలకే మనసు ఇచ్చినవారు దైవాన్ని గుర్తించలేరు. యోగులు ఆ పరమాత్మ తత్త్వమును తెలియుదురు. యేది రాత్రియై కనులు గానలేకున్నవో దానియందు రమింతురు (2-69 యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ).

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 320-5 సంపుటము: 4-116

సచరాచరమిదె సర్వేశ్వరుఁడే
పచరించి యీతని భావింపు మనసా ॥పల్లవి॥
 
కదలెటి దంతయు కమలారమణుని-
సదరపు సత్యపు చైతన్యమే
నిదిరించెటి యీనిశ్చేష్టజగమును
వుదుటున నాతఁడు వుండేసహజమే ॥సచరా॥
 
కలిగివుండినదె కల దింతయు హరి-
నలుగడఁ బరిపూర్ణపుగుణమే
మలల్సి లేనిదియు మహిమల నాతని-
నిలుకడగలిగిన నిర్గుణమే   ॥సచరా॥ 

జీవరాసులగు సృష్టియింతయును
శ్రీవేంకటపతి చిత్తంబే
కైవల్యమె లోకపు టిహముఁ బరము
భావించ నేర్చిన పరమవిదులకు   ॥సచరా॥

 

Details and Explanations: 

సచరాచరమిదె సర్వేశ్వరుఁడే
పచరించి యీతని భావింపు మనసా ॥పల్లవి॥ 

పచరించి = ఇక్కడ పచ అంటే వంట. పచరించి అంటే పరిపక్వము చెందిన అని తీసుకొనవలెను; భావింపు  = సత్యముగా అనుభవించు; 

భావము: ఈ చరాచర జగత్తంతా సర్వేశ్వరుడే. పరిపక్వత పొందిన మనసుతో అతడిని నీలోనే తెలియుము.


వ్యాఖ్యానం:

ఈ పల్లవి మూసలో పోసిన భక్తిలా అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా దృష్టి పెడితే — ఇది అద్భుతమైన అద్వైత భావనకి, అనుభూతి మీద ఆధారపడిన తాత్త్విక దృష్టికి మూలమవుతుంది.


పచరించి యీతని భావింపు మనసా:

పచరించి అంటే పక్వము చెందు. ఇక్కడ పరిపక్వం చెందేది మనసు. “పచరించి యీతని భావింపు మనసా అంటే పరిపక్వమైన మనసుతో చూచిన ఆ భగవంతుని భావనను వాస్తవముగా అనుభూతి చెందవచ్చును అని చెప్పారు. (“జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ భగవద్గీత​ 7-18) 


"పచరించి యీతని భావింపు మనసా"
ఈ పాదం విప్లవాత్మకం.
ఊహించేదానిని “నమ్ము” అని కాదు —
"పక్వత పొందిన మనసు మాత్రమే దీనిని భావించగలదు" అనే సూచన.
 

ఇక్కడ పచరించి అన్న పదం ఎంతో గరిమ గలది—

ఆచార్యులవారి ఇంకొక కీర్తన మననం చేసుకుంటే బాగుంటుంది
పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము
(= వయస్సు పెరిగినా పరిపక్వత రాలేదు.
జీవితమంతా పళ్లునూరటంలోనే వృధా చేసుకున్నాము.
కట్టకడపటిది చూడనేలేదు)

 కర్తృత్వం లేని భావన

"పచరించి యీతని భావింపు మనసా"
అది మనసు రూపాంతరాన్ని సూచిస్తుంది —
అజ్ఞానంతో, స్పందనలతో నడిచే ముడితనపు స్థితి నుంచి
అంతర్ముఖమైన, శాంతమైన, పక్వమైన స్థితికి.

ఈ విధమైన పరివర్తితమైన మనసే
 విశ్వము యొక్క​ ఏకత్వాన్ని అనుభవించగలదు. 

ఇక్కడ "భావింపు" అన్నది కర్తృత్వం లేని భావన.
ఇది కర్తృత్వాన్ని పూర్తిగా తొలగించి,
ఇక్కడ “నేను గ్రహించాను” అనే గర్వమును కాక​
"మనసు భగవంతునితో ఐక్యమై
ఆ అనిర్వచనీయమైన  ఏకత్వపు ఆలింగనమును"
చూపించుచున్నది.

 జీవిత సత్యం. అనుభూతి.

ఇది చేతనావస్థ​ జోక్యం లేకుండా చూసే దృష్టి—
ఇదే జిడ్డు కృష్ణమూర్తి ​చెప్పిన

చూచువాడు లేకయే చూచుట
(seeing without the seer)

ఈ పల్లవిలో కవిత్వపు కోణం లేదు—
జీవిత సత్యం. అనుభూతి.
అన్నమాచార్యులు పదాలు—
తానుభవించిన దాన్ని చెప్పేందుకు వ్రాశారు.


మొదటి చరణం:

కదలెటి దంతయు కమలారమణుని-
సదరపు సత్యపు చైతన్యమే
నిదిరించెటి యీనిశ్చేష్టజగమును
వుదుటున నాతఁడు వుండేసహజమే ॥సచరా॥

భావము:

ఈ సృష్టిలోని ప్రతీ కదలిక​, ప్రతీ జీవి, 
కమలారమణుని సత్యభరితమైన చైతన్యమే.
అలాగే, నిశ్చలంగా, నిస్సత్తువగా అనిపించే
ఈ స్థూల ద్రవ్య ప్రపంచమూ —
అతడిగా వెలిసిన పరబ్రహ్మ స్వరూపమే;
అదే భగవానుడు తానై వున్న సహజ స్థితి.

వ్యాఖ్యానం:

విప్లవాత్మకమైన అనుభూతి

ఈ చరణంలో అన్నమాచార్యులు
సూక్ష్మమైన, లోతైన, విప్లవాత్మకమైన అనుభూతిని అందిస్తున్నారు:
కదలిక ఉన్నదంతా — చైతన్యానికి రూపం.
అది కమలారమణుని ప్రణాళిక —
సదరపు సత్యపు చైతన్యం —
అనగా నిస్సందేహమైన సత్యంగా కనబడే చైతన్యమే.
 
కానీ, ఆయన అక్కడ ఆగడం లేదు.
మనకు నిర్జీవంగా కనిపించే, కదలికలేని ఈ జగమూ —
అన్నమయ్య దృష్టిలో అదే పరమాత్మ సహజ స్థితి.

సర్వం జగన్నాధం

మనం "చలనాన్ని" ప్రాణంగా అనుకుంటాం;
"నిశ్చలత"ని శూన్యం లేదా తక్కువగా అంచనావేస్తాం.
కానీ ఇక్కడ అన్నమయ్య చెప్పే నిజం:
కదలికలో ఉన్నది శ్రీహరి.
నిశ్చలతలోను ఉన్నది కూడా శ్రీహరియే.

 సత్యము అనిశ్చయము

ఇది భగవద్గీత 13-13వ శ్లోకాన్ని గుర్తుచేస్తుంది:
"అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే " —
ఆ పరబ్రహ్మము సత్ (ఉన్నది) అనిగాని, అసత్ (లేదని) అనిగాని చెప్పబడదు.

సత్యము యొక్క విలోమ తత్వం ప్రకాశింపజేశారు

అదే గీత 4-18లో ధ్వనిస్తుంది:
“కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః..”
కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడగలవాడే మేధావి.

అన్నమయ్య ఇక్కడ శ్రీహరిని తత్వాన్ని వర్ణించడమే కాదు —
మన చూపులను పూర్తిగా మార్చే విధంగా మార్గనిర్దేశం చేస్తున్నారు:

 సహజ స్థితి

నిశ్చలంగా, మౌనంగా, శూన్యంలా అనిపించే ప్రతి వస్తువులో
దైవిక చైతన్యం నిండి ఉంది.
సాధనల పేరుతో, జ్ఞానార్జన పేరుతో
మనము శక్తిని వృధాచేస్తున్నాం.

కాని సర్వవ్యాపియైన పరమాత్మ —
శ్రమించడు, అలసిపోడు, విశ్రమించాల్సిన అవసరం లేదు.
అన్నీ తానై వుంటాడు — కదలికలోను, నిశ్చలతలోను.
అది ఆయన సహజ స్థితి.

 

ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే —
కలతల ప్రపంచం విడిచి,
శూన్యంలోకి మెల్లగా ప్రవేశించాలి.
అక్కడే జీవనం;
అప్పుడే జ్ఞానం

రెండవ చరణం:

కలిగివుండినదె కల దింతయు హరి-
నలుగడఁ బరిపూర్ణపుగుణమే
మలల్సి లేనిదియు మహిమల నాతని-
నిలుకడగలిగిన నిర్గుణమే ॥సచరా॥ 

మలల్సి లేనిదియు = వెనుకకు మరలవలసి లేనిదియు, no need to turn back;


భావము:

ఈ కనిపించే జగత్తు — హరిచైతన్యమే.
మనకు క్రొత్తగా కనిపించునది ఏదీ లేదు.
విశ్వం నలుగడల అతడి వ్యాప్తి పరిపూర్ణము. 
 
శ్రీహరి మహిమల వలన
దీని నుండి వెనుకకు మరలవలసిన అవసరమేలేదు.
 
గమనించగలవారికి.
అపూర్వమైన ఆ నిర్గుణతత్వం —
ఈ మాయా-లోకంలోనూ నిలిచి ఉంటుంది,

వ్యాఖ్యానం:

పరమసత్యం అనేది ఈ ప్రపంచాన్ని విడిచివున్నది కాదు.
భగవంతుని చైతన్యం, పరమ నిశ్చలత,
పరిపూర్ణమైన సహజత్వంతో జగత్తంతా వ్యాపించివుంది.
నిలుకడగా ఆ నిర్గుణమును పరిశీలించిన కానీ
వెంకటపతి మహిమలను తెలియలేము.

మూడవ చరణం:

జీవరాసులగు సృష్టియింతయును
శ్రీవేంకటపతి చిత్తంబే
కైవల్యమె లోకపు టిహముఁ బరము
భావించ నేర్చిన పరమవిదులకు ॥సచరా॥

భావము:

ఈ సృష్టిలోని జీవరాశులన్నీ
శ్రీ వేంకటపతి యొక్క చిత్తప్రకంపనలే.
కైవల్యం’ అనేది —
ఈ లోకమునూ, పరలోకమునూ
ఒకే అంతరదృష్టిలో దృఢంగా పట్టే స్థితి.

అలాంటి స్థితిని
చదువులతో కాదు —
జ్ఞానంతో, పరిశీలనతో, స్థితప్రజ్ఞతతో
గ్రహించి, సాధించగలవారే
పరమవిదులు.


వ్యాఖ్యానం:

నిశ్శబ్ద ప్రసరణ:

ఈ చరణంలో అన్నమయ్య
ఆధ్యాత్మికత పట్ల మన ధారణను పూర్తిగా మార్చేస్తారు.
మనలో చాలా మంది
“ఈ లోకం నిజం”
మరియు
“మోక్షం” అనేది ఈ జన్మ తరువాతి దశ అని కానీ
ఎక్కడో శ్రీమహావిష్ణువు వుండు ప్రదేశమనో భావిస్తారు.

కానీ అన్నమయ్య అలా అనటంలేదు —
ఈ రెండూ వేర్వేరు కావు.
ఒకే జగత్సంబంధమైనవి, సక్రమమైనవి
ఒకే సముద్రము నుండి ఉద్భవిస్తున్న అలల వలె
జీవరాశులన్నీ
ఒకే చిత్తాంతరంలో కలుగుతున్న అనుభవాలే

కైవల్యమంటే ఏమిటి?

పరిమితులు లేవు. విధించుకున్నవి.
సర్వమును గ్రహించి, సత్యంగా చూచుట​.
కనులు తెరిచి
ఈ లోకమునూ, మరణానంతర స్థితినీ
ఒకే సమయంలో జ్ఞానదృష్టితో చూడగలగడమే కైవల్యం.
"యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి"
 
అందుకే అన్నమయ్య అంటారు:
“కైవల్యమే లోకపు టిహము బరము”
లోకానికి సర్వసమ్మతిని తెలుపకుండా
మరణమును అనుభూతి చెందని మోక్షం లేదు.
ఈ రెంటినీ ఒకే బౌద్ధిక శక్తిలో చూడగలగడం —
వాని గరిమను, ప్రకాశాన్నీ అంగీకరించడమే —
మోక్షం.

 పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే”
ఈ లోకము పరము వేరు వేరు లోకాలు కావు. 

విశ్వమంతా వ్యాపించి వున్నదొకటే. 

"ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే"


నిజమైన విద్య ఏమి?

పరమాత్ముని పొగడటం, లేదా నామస్మరణ చేయడం —
మంచివే. కానీ అవి పరిష్కారాలు కావు.
అన్నమయ్య దృష్టిలో ‘విద్య’ అనేది గ్రంథాలతో వచ్చిన మేధస్సు కాదు.

పరమవిదులు అంటే —
అచంచలమైన స్పష్టత గలవారు

శూన్యములో నిలిచే ధైర్యం.

అవధులులేని నిశ్శబ్దంలో మేల్కొని ఉండే సామర్థ్యం.
భ్రమలో తడబడకుండా,

వ్యక్తంచేయలేని తేటదనముతో చూచువారు.
మాయను నిష్కపటంగా (నిర్వ్యాజంగా ) చూసే వారు.
భ్రమల లోలకానికి చిక్కుకోనివారు.
వారే అసలైన జ్ఞానులు.

 విశృంఖల జీవితం:

ఈ పంథాలో అన్నమయ్య
ఒక గూఢమైన హెచ్చరికనిచ్చారు:

గతించిన​
రాజులు, చక్రవర్తులు, కవులు, తత్త్వవేత్తలు,
ధనికులు, పేదలు, కళాకారులు, తపస్వులు —
ఎవ్వరూ ఈ అసలుసిసలైన విద్యా బోధనను
వారసత్వంగా ఇవ్వలేకపోయారు.

వారంతా వచ్చారు. పోయారు.

మనమేమి నేర్వలేదు.
తరువాతి తరంవారిని అజ్ఞానంలోకి మనమే తోసేస్తున్నాం.
వారి జీవితాలను
అలసటతోను, ఆరాటముతోను కూడిన శ్రమగా మార్చేస్తున్నాం.
ఆ శ్రమైక జీవితం కేవలం బ్రతుకుదెరువు మాత్రమే.
వీటికి అతీతముగా వున్నదే అసలు విద్య.
దానిని అందిపుచ్చుకోకుంటే నిజమైన దురదృష్టం.

భగవద్గీత అనుసంధానం:

భగవద్గీత 2.69 లో ఇది స్పష్టంగా చెప్పబడింది:
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ...”
నిద్రపుచ్చే తామసపు అంధకారంలో 

ఈ జనమంతా మునిగివుంటే
జ్ఞాని మేల్కొని ఉంటాడు.
ఆ సత్యాన్ని వాస్తవముగా చూడగలవాడే మేధావి.
అన్నమయ్య పిలుపు ఇదే:
భక్తిలో వుండు. కానీ వివేకంతో.
నమ్మకం ఉంచు. కానీ అన్వేషణతో.
భయపడకు. కానీ ఆగి, పరీక్షగా చూడు.
అదే విద్య.
అదే మోక్షము.

 

4 comments:

  1. మీరు ఎంతో విపులముగా , లోతైన భావనలనన్నీ శోధించి శోధించి వివరణాత్మకముగా పాఠకుల అరచేతి వెన్న ముద్దగా అందించారు .

    దానిని అంది పుచ్చుకుని ఆస్వాదించగలగటము మా భాగ్యము .

    🙏🙏

    అద్భుతముగా వ్రాసారు మాన్యా 🙏

    నమస్సులు

    ✍️ వేణుగోపాల్ యెల్లేపెద్ది

    ReplyDelete
  2. చాలా బావుంది. జీవ కర్తృత్వం అనేది లేదు అని మీరు నిర్మొహమాటంగా చెప్పారు.

    ReplyDelete
  3. గుణభృన్ నిర్గుణో మహాన్ - అన్న విష్ణుసహస్రంలోని నామాలకు పరాశర భట్టర్ వ్యాఖ్యానంతో ఈ కీర్తన సరిపోతుంది.

    ReplyDelete
  4. స్థావరజంగములందు నిండియున్న సర్వేశ్వరుడు నీలోనూ ఉన్నాడని సాధన ద్వారా తెలిసికొనుము.
    ఓం పూర్ణ మదః పూర్ణ మిదం
    పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ।
    పూర్ణస్య పూర్ణ మాదాయ
    పూర్ణ మేవావ శిష్య తే ॥
    అన్న ఈశావాస్యోపనిషత్తులోని మంత్రం ఇదే చెప్పుచున్నది.

    స్థావరముల యందు, జంగమముల యందును ఉండే చైతన్యము ఆ పరబ్రహ్మమే.జగమంతా చైతన్యస్వరూపమే.
    శ్రీవెంకటేశ్వరుని చిత్తమే ఈ జీవరాశులు.అట్టి
    పరంధామమును జ్ఞానసాధన ద్వారా చేరవచ్చునని అన్నమయ్య ఈ కీర్తనలో అనుభవపూర్వకముగా తెలియజెప్పుచున్నారు.

    🙏🏻
    కృష్ణమోహన్

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...