230. గొల్లెతలకేలరా గోవజవ్వాది
For English version press here
ఉపోద్ఘాతము
శ్రమల
భారం పెరిగిపోయి,
వయసు కరిగిపోయి,
జీవితం ప్రశ్నల మయంగా మారి,
చివరికి భక్తే ప్రశ్నార్థకం అయినప్పుడు —
ఆ మాటలన్నీ కలసి రూపుదిద్దుకున్నది
భగవద్భావంతో ముడిపడిన మానవభాష.
శృంగార
సంకీర్తన |
రేకు:
18-2 సంపుటము: 5-103 |
గొల్లెతలకేలరా గోవజవ్వాది నీకు
చెల్లుఁగాక యెటువలెఁ జేసినా నన్ను ॥పల్లవి॥ కట్టినది అంచులతొగరుఁ జీర సందిఁ
బెట్టినది మొలవంక పెద్దగాజు
మెట్టిన కంచుమట్టెల మించుమోఁత చేత-
బట్టినది చల్లచాడె పట్టకురా నన్నును ॥గొల్లెత॥ మాసినది తురుము చెమరుకంపు నే
వేసినది వెండికుప్పె వెంట్రుకదండ
వోసికొట్లు గొట్టి కంచుటుంగరాల చేయి
తీసేవు నీ చెల్లెతోడు తియ్యకురా నన్నును ॥గొల్లెత॥ ముంచినవి చెమటలు మోమునిండ కడు-
నంచినది చూడరా నావాలుఁజూపు
యెంచనేల నన్నునిట్టె యేలితివి వోరి
చెంచెతల వేడుకగాడ శ్రీవేంకటేశుఁడా ॥గొల్లెత॥
|
పల్లవి:
గొల్లెత = గొల్లది, గొల్లెత, పసుల
కాపరి; గొల్లెతలకేలరా = మా లాంటి సామాన్యులకేలరా? గోవజవ్వాది = మనోజ్ఞములైన పరిమళద్రవ్యములు; నీకు
చెల్లుఁగాక = అవి నీకే (దైవానికే) సరిగ్గా సరిపోతాయి; యెటువలెఁ
జేసినా నన్ను = నీవెలా అనుకుంటే అలా నన్ను మలచుకో. తిప్పుకో. (నీ ఇష్టం).
భావము,
భావము: (అన్నమాచార్యులు భగవంతునితో): "నేను సామాన్యురాలిని, నాకు గోవజవ్వాది వంటి గొప్ప అలంకారాలు తగనివి. అవి నీకే, దైవానికే తగినవినీవెలా అనుకుంటే అలా నన్ను మలుచుకో. (నీ ఇష్టం).
వ్యాఖ్యానం:
ఈ కీర్తనను తొలుత చదినపుడు అది విపులమైన శృంగారాన్ని వ్యక్తీకరిస్తున్నట్లే అనిపించవచ్చు. కానీ శృంగారం కేవలం ఆవరణం మాత్రమే. పైపైకప్పిన ముసుగు లాంటిది. అచార్యుల అసలైన హృదయం మాత్రం భగవదర్పణే.” "నేను నీదాన్ని, నన్ను ఎలా వాడుకోవాలో అది నీ ఇష్టం," అని నిశ్శేష భక్తితో సమర్పణ చేస్తారు.
మానవులుగా మనం మన దేహానికీ, మన ఇష్టానికీ విలువలిచ్చి, సౌందర్యారాధకులుగా మారతాం. భగవంతునికి సమర్పించాల్సిన ఈ శరీరాన్ని మన ఆత్మతృప్తి కోసం అలంకరించు కోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే — అది భక్తి మార్గాన్ని (ఆత్మసమర్పణ బాటను) మర్చిపోయే అపరాధమే కాగలదని అన్నమాచార్యులు హెచ్చరిస్తున్నారు."
అందరు ఆహ్లాదమైన కవిత్వం కోరుకుంటారు. కష్టాలను చెత్తబుట్టలో పారేద్దామనుకుంటారు. (పాపం పారెయ్యలేరు!) ఆ శ్రమను, ఆ చెమటను కీర్తనగా మలచడం అన్నమాచార్యుల కాలానికే కాదు —ఈనాటికీ సాహసమే. కానీ ఒక గొల్లెపడచు మనో వ్యథను అందమైన కీర్తనగా మలచడం అన్నమాచార్యులకే చెల్లు.
మొదటి చరణం:
పదబంధం |
అర్థం |
కట్టినది అంచుల తోగరు జీర |
ఎఱ్ఱనూలు (తోగరు = border) అంచులతో
ఉన్న చీరను వేసుకున్నాను |
సందిఁ బెట్టినది |
చీర కుచ్చెళ్ళు నడుములో ఒదిగించుకున్నాను |
మొలవంక పెద్దగాజు |
చేతి మడిలో (బాహువుల్లో) పెద్దగాజులు ధరించాను |
మెట్టిన కంచు మట్టెల మించు మోఁత |
నడుస్తుంటే (మెట్టిన = నడిచే సమయంలో) కంచు
మట్టెలు మిన్నంటూ శబ్దం చేస్తున్నాయి |
చేత బట్టినది చల్లచాడె |
నెత్తిమీద మజ్జిగ కుండను చేతులెత్తి పట్టుకొన్నాను. (చల్లచాడె
= చల్ల ద్రవము = మజ్జిగ కుండ) |
పట్టకురా నన్నును |
ఇప్పుడు నన్ను పట్టకొద్దురా / నన్ను
వెంటాడవద్దురా (ఇప్పటి ఇంటి పనిలో నిమగ్నమై ఉన్నాను) |
భావము:
(గొల్లెత భగవంతునితో): నేను కట్టినది ఎఱ్ఱనూలు
అంచుల చీర. కుచ్చెళ్ళు నడుములో దోపుకున్నాను. చేతులకేమో పెద్దగాజులు పెట్టుకొన్నాను.
నడుస్తున్నప్పుడు కంచుమట్టెల బాగా శబ్దం వస్తోంది. నెత్తిమీద మజ్జిగ కుండని
చేతులెత్తి పట్టుకొన్నా. ఇప్పడు పట్టకోకురా నన్నును. ( నేను నా పనుల్లొ మునిగి
వున్నా. నువ్వు మళ్ళీ నే తీరిగ్గా వున్నప్పుడురా)
వ్యాఖ్యానం:
ఆ కార్య వర్ణన గొల్లవనితదే కాదు. మనందరి స్థితి ఇదే. దివారాత్రములలో సంసార విషయములలో, పిల్లలను పెంచుటలోను, సంసారమును నడుపుటకు వలయు జీతబత్తెములతోను, వ్యాపారాది
వ్యాసంగములతోను, తక్కిన అనేకానేక కార్యక్రమములలో మునిగితేలుతూ
ఉక్కిరిబిక్కిరి అవుతాము. భగవంతుణ్ణి స్మరించేందుకు కూడా సమయంలేదు.
ఎందుకంటే భగవంతుడు
మనమూహించలేని రూపంలో వస్తాడు. (తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె = అనాదిగా — మనం
తక్కువ విలువ ఇచ్చే మఱ్రాకు తొట్టెల వంటి వాటిలోనే అగపడతాడు). ఒకవేళ భగవంతుడే వచ్చినా
కూడా తర్వాత రమ్మంటాము. భగవంతుడికి బిచ్చగాడికి వ్యత్యాసము తెలియనివారము. కచ్చితము. అసంబద్ధము, కానీ వాస్తవమిదే.
రెండవ చరణం:
పదబంధం |
అర్థం |
మాసినది తురుము |
ముడిచిన కొప్పు చెదరినది |
చెమరుకంపు నే వేసినది |
చెమట కంపు కొడుతోంది |
వెండికుప్పె వెంట్రుకదండ |
వెండికుప్పలా ఉంది నా జుట్టు ( నా వయస్సు
అయిపోతోంది) |
వోసికొట్లు గొట్టి |
నిందించుతూ పలుకుతావే. |
కంచుటుంగరాల చేయి తీసేవు |
ఇంకా చెయ్యిలేపుతావు. (కొడతావా? ఏంటి?)
నిస్సహాయత పెల్లుబుకుతోంది. (చాలా శ్రమ అయిపోతోంది,
విసుగు, కోపం వస్తున్నాయి.) |
చెల్లెతోడు తియ్యకురా నన్నును |
నీకు నాకు చెల్లు. నువ్వెవరో. నేనెవరో. నన్ను లాగకురా. |
(గొల్లెత భగవంతునితో): ముడిచిన కొప్పు చెదరినది. చెమట కంపు కొడుతోంది. వెండికుప్పలా ఉంది నా జుట్టు (నా వయస్సు అయిపోతోంది). ఒక ప్రక్క నిందించుతూ పలుకుతావే. ఇంకా చెయ్యిలేపుతావు. (కొడతావా ఏంటి?) నిస్సహాయత పెల్లుబుకుతోంది. (చాలా శ్రమ అయిపోతోంది, విసుగు, కోపం వస్తున్నాయి). నీకు, నాకు చెల్లు. నువ్వెవరో. నేనెవరో. నన్ను లాగకురా. నన్ను నీ రొంపి లోకి.
వ్యాఖ్యానం:
దృశ్యం మారిపోయినది. మొదటనున్నది భక్తి. ముందుగా నిరాసక్తతకు తరువాత విసుగు, కోపములకు మారిపోయాయి. భగవద్గీత శ్లోకాన్ని వుదాహరణ ద్వారా నిరూపిస్తున్నారు ఆచార్యులు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే । సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ॥ 2-62 ॥ ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది.
అన్నమాచార్యుల వారు చివరికి మనిషికి కోపం రావడమే కాదు, భగవంతుడిమీద కూడా విసుగు, కోపం నిందా చూపబోతాడు. భగవానుడని కుడా గమనించము. కోపమెంతటి అరిష్టమో కదా.
మూడవ చరణం:
పదబంధం |
అర్థం |
ముంచినవి చెమటలు |
చెమటతో నా జీవితము తడిసిపోయినది. నా జీవితములో శ్రమ
తప్పించి మరేమీ లేదు. |
మోమునిండ కడు-నంచినది |
నీ కోసం మొహము అంతా కళ్లు పెట్టుకొని అనేక జన్మల నుంచి
ఎదురు చూపులు చూసిచూసి అలసిపోయాను. |
(కడు-నంచినది) కడున్ + అంచినది |
ఒకదాని తర్వాత వస్తున్నవి (జన్మలు) |
చూడరా నా వాలుఁజూపు |
నా వాలుఁజూపులు
చూడరా = నా ప్రక్కదృష్టి, వంకరచూపులు = నిన్ను నేను
సరిగ్గా చూచుటలేదు. |
యెంచనేల |
నేను ఇది, అది అని అలోచించకు. దైవమును తలచుము.
మురికి బట్టలతోనో, చమటకారు చెతులతోనో, చినిగిన వస్త్రములతోనో. నలిగిన శరిరముతోనో. భావము, నీవు తప్ప నాకేమీ లేదన్న ఏకీకృత భావము.
|
నన్నునిట్టె యేలితివి |
అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చేశావు. నీవే నా హృదిని
ఏలుచున్నది |
వోరి చెంచెతల
వేడుకగాడ |
ఏలరా! చంచలత్వముతో మేము అవి ఇవి చెస్తుంటే వేడుకగా
చూసేవాడా. "పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ
సంకటం"లా మా జీవితాలతో ఆడుకుంటున్నావా? (అన్నమాచార్యులు
దైవమును తిట్టుటలేదు. మన భావాలకు రూపమిచ్చారంతే.) |
శ్రీవేంకటేశుఁడా |
శ్రీవేంకటేశుఁడా |
భావము:
(గొల్లెత భగవంతునితో): చెమటతో నా జీవితము తడిసిపోయినది.
నా జీవితములో శ్రమ తప్పించి మరేమీ లేదు నీ కోసం మొహమంతా కళ్లు పెట్టుకొని అనేక జన్మల
నుంచి ఎదురు చూపులు చూసిచూసి అలసిపోయాను. నేను నిన్ను వాలుఁజూపులు (వంకరచూపులు) చూస్తున్నాను
కాని, సరిగ్గచూడటంలేదని తెలిసింది. నేను ఇది, అది అని అలోచించకు. దైవమును తలచుము. మురికి బట్టలతోనో, చమటకారు చెతులతోనో, చినిగిన వస్త్రములతోనో. నలిగిన శరిరముతోనో.
భావము ప్రధానము, నీవు తప్ప నాకేమీ లేదన్న ఏకీకృత భావము. అలా అనుకున్నానో లేదో ఇలా వచ్చేశావు. నీవే నా హృదిని ఏలుచున్నది. ఏలరా! శ్రీవేంకటేశుఁడా! చంచలత్వముతో మేము అవి ఇవి చెస్తుంటే
వేడుకగా చూసేవాడా. "పిల్లికి చెలగాటం,
ఎలుకకు ప్రాణ సంకటం"లా మా జీవితాలతో ఆడుకుంటున్నావా? (అన్నమాచార్యులు దైవమును తిట్టుటలేదు. మన భావాలకు రూపమిచ్చారంతే.)
వ్యాఖ్యానం:
ఈ చరణం అసలు వేదనకు అద్దం.
మొత్తం కీర్తనలో నాలుగు
దశలు (Spiritual Narrative Progression):
దశ | స్థితి | భావం |
పల్లవి | సమర్పణ | నన్ను నీవే మలుచుకో. కానీ అలా అంటే అయిపోతుందా? |
చరణం 1 | దైనందిన జీవనం | శ్రమతో నిండి, దైవం వెనక్కి. |
చరణం 2 | విసుగు, నిరాస, కోపం, నిస్సహాయత | శరీర శ్రమ ద్వారా రాగ రహితత. తిరస్కృతి |
చరణం 3 | ఆవేదన, తిరుగుబాటు. పశ్చాత్తాపము | తన తప్పు తెలుసుకొనుట. ప్రేమతో కూడిన కోపం — తిరిగి సమర్పణ వైపు మలుపు |
.. అంతరార్థమును అద్భుతముగా ఆవిష్కరించారు .
ReplyDeleteవయస్సు
బాగున్నప్పుడు భౌతికమే ..
వయసస్సు
ఉడిగిననాడు పరమాత్ముడు చేరుకోడేమో అన్న అపనమ్మకము .
నిజానికి ఈ జీవుడి అంరరాత్మ యే ఆ పరమాత్మ అను ఎరుక కలగని మాయలో ఎన్ని జన్మలు గడిపేస్తూ ఉంటాడో కదా 🙏
భగవన్ నిర్హేతుక కృపకు తార్కాణం. మనం ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా భగవంతుడు వెంటపడి మరీ ఏలుకుంటాడు. ఇక్కడ గోపికకి సువర్ణాభరణాలు మొదలైనవి లేవు. పరిమళ ద్రవ్యాలు తన శరీరంపై అద్దుకోలేదు . తన నిత్యజీవన వ్యాపారంలో తాను ఉంది. అయినా పరమాత్మ వెంటపడి ఏలుకున్నాడు. పరమాత్మ కోసం మనం ఈ విధమైన తపస్సు చెయ్యక్కర్లేదు అనీ, ఆయన అనుగ్రహానికి కావలసిన అర్హతలు అంటూ ఏమీ లేవు అనీ అంతరార్థం. నీ వ్యాఖ్యానం బావుంది. మీరు అన్నట్టుగా ఇది ఎంత మాత్రం శృంగార కీర్తన కాదు. అన్నమయ్య శృంగార కీర్తనలుగా చెప్పబడే వాటిలో అధికశాతం జీవేశ్వర సంబంధానికి చెందినవే.
ReplyDeleteభగవదర్పణముగానున్న ఈ శరీరానికి సుగంధ పరిమళద్రవ్యములేల? ఆత్మసమర్పణకు మించి ఈ శరీరానికి వేరేమి అవసరం లేదని అంటున్నారు ఆచార్యులవారు.
ReplyDeleteవస్త్రభూషణాదులు, భోగభాగ్యములతో మమేకమైన మనకు భగవంతునితో అనుసంధానమగుటకు తీరిక యేది సాధన, ప్రయత్నము లేక మోక్షమేరీతి ప్రాప్తించును? అని మనకు గుర్తు చేస్తున్నారు అన్నమయ్య.
ఐహికసుఖాలలో మునిగి తేలుచున్న మనకు దైవచింతన చేయమంటే దానిమీద మనస్సు లగ్నంకాక, భగవంతునిపై కోపం, విసుగు జనించి భగవద్గీత సాంఖ్యయోగంలో "ధ్యాయతో విషయాన్...సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే" అన్న శ్లోకంలో చెప్పబడినట్లు క్రోధం ఉత్పన్నమవుతుంది. బుద్ధి నశిస్తుంది.
పునరపి జననం, పునరపి మరణంలా
అనేక జన్మలనెత్తి పరమపదము చేరుటకొఱకు తపించి అలసిపోయితిని.ఈ జన్మలోనైనా నన్నేలుకొని దరికి చేర్చవా వెంకటేశ్వరా!అని గొల్లెత రూపంలో అన్నమయ్య శ్రీనివాసుని వేడుకొంటున్నారు.
శృంగారము వలె అనిపించుచున్న ఈ కీర్తన అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కీర్తనగా భావించాలి.
ఓం తత్ సత్ 🙏🏻
పసుమర్తి కృష్ణమోహన్