Friday, 20 June 2025

T-231 అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను

 తాళ్లపాక అన్నమాచార్యులు

231. అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను

For English version press here

ఉపోద్ఘాతము

ఇది స్పష్టంగా అన్నమాచార్యుల 
ఆత్మ విమర్శలా అనిపించినా
మనందరికీ వర్తిస్తుంది.
 
చదువు స్వభావాన్ని మార్చదు.
పరిణతిని ఇచ్చేవి
పుస్తకములో, వేదములో, తీయని మాటలో కావు.
చూచే చూపులలో పరిణితి.
మనసు నిశ్చలమై,
నిరంతరమైన అవగాహనతో చూసే దృష్టే పరిపక్వత.

 ఇందులో గుండ్రని మాటల గురువుల 
విమర్శ కూడా లేకపోలేదు
అయితే ముఖ్యంగా తానేమిటో
ఈ ప్రకృతి ఏమిటో,
ఈ ప్రేమలేమిటో,
ఈ గతజన్మల పరంపర ఏమిటో
తెలుసుకోవాలనే ఆతృత అంతే.
 
ఎన్నో జన్మలు గడిచినా
ఈ దేహమొక నీడ.
ఈ పిప్పి జీవితం
విప్పలేము.
 
కానీ అదే మన ఖేదం —
ఇతరుల నోట వింటామే తప్ప
తనలోకి చూసే ధైర్యం, నిశ్చలత ఉండదు.
దీక్షలేని ఆత్మ జ్ఞానమేది?

అధ్యాత్మ కీర్తన

రేకు: 261-6 సంపుటము: 3-354

అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను
నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో          ॥పల్లవి॥
 
వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా
చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా
ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా
యెద్దువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో    ॥అన్ని॥
 
యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా
తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా
ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా
పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో        ॥అన్ని॥
 
యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా
కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా
యీడనే శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గాచెఁగా
నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో         ॥అన్ని॥

 

Details and Explanations:

పల్లవి:

అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను
నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో     ॥పల్లవి॥

 

పదబంధం

అర్థం

అన్నియుఁ జదివితిఁగా

అన్నీ చదివినట్టు, అన్నిరకాల విద్యను సంపాదించినట్టు అనుకుంటానే

ఆహా నేను

 అబ్బో నేనేనా? (వ్యంగ్యార్థములో)

నున్ననిమాటల

మెత్తని, మృదువైన మాటలను ఉపయోగించి

నోరు నుడిగెడిదేదో

ఏం మాట్లాడుతున్నారో ఏమిటో


భావము: అన్నీ చదివినట్టు, అన్నిరకాల విద్యలను ముఖ్యంగా పరమార్థమును సంపాదించినట్టు అనుకుంటానే. అబ్బో నేనేనా (ఇదంతా నాకే వచ్చును. వ్యంగ్యార్థములో). (ఐతే ఈ గురువులమని చెప్పుకునేవారంతా) మెత్తని, మృదువైన మాటలను ఉపయోగించి ఏం మాట్లాడుతున్నారో ఏమిటో.


వ్యాఖ్యానం:

 

"కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా?"
నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో.

నుడివే ప్రతి మాట తేనెలొలికి మెత్తగున్నా,
అవి సత్యమని నిర్ధారించలేం.
శ్రావ్యమైన సంగీతం, పంచదార పలుకులు
సాధనచేసి సాధించవచ్చు —
కానీ అంత మాత్రాన అవి సత్యమైపోవు.
 
సత్యం స్వతంత్ర స్వరూపం.
తనంతట తానే నిలుచును.
ఆత్మసాక్షిగా.
అలంకరణ శోభలేకనే
 
నన్నని మాటల రహదారి
అలంకారాల మహమ్మారి
విన్న బోటు జారి
పడుతుంది వలయపు దారి

మొదటి చరణం:

వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా
చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా
ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా
యెద్దువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో          ॥అన్ని॥

 

పదబంధం

అర్థం

వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా

గతజన్మమును అయ్యో మరచిపోతిగా

చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా

చిన్నప్పుడు తల్లి ప్రేమగా పాలుపట్టడము మరచితిగా

ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా

మలమూత్రముల దేహమును ఇట్టే మరచి, ముద్దు  ముచ్చట​చేస్తునుగా

యెద్దువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో

ప్రేమను, ఈ మురికి దేహము సంగతిని, ప్రకృతిపై సున్నితత్వమును విడిచిన​ ఎద్దులాంటి నేను చెప్పేదేమిటో. తెలిసేదేమిటో

 


భావము:

"గత జన్మల జాడలు మరిచాను.
తల్లి ప్రేమగా పాలుపట్టిన రోజులూ మదిలో మసకబారిపోయాయి.
ఈ మలమూత్రముల దేహాన్ని ముద్దుగా ముచ్చటలాడుతుంటాను.
ప్రేమలోని నిర్మలత్వం, ఈ శరీరపు అసలు స్వరూపం,
ప్రకృతిచ్చిన సున్నిత తత్వం — ఇవన్నీ విస్మరించి,
ఒక ఎద్దులా మారిపోయిన నేను,
ఏం చెప్పగలను? ఏం తెలుసుకోగలను?"

 


వ్యాఖ్యానం:

అన్నమాచార్యులు విజృంభిస్తున్నారు.

 

భగవంతుని గురించి

ఈ తీయని కబుర్లతో పొద్దుపుచ్చే వారికి,

గతకాలపు తలపులకు తలుపులు మూసిన వారికి,

వాస్తవాలు మరిచి నేల విడిచి సాము చేయువారికి,

తల్లి నిర్వ్యాజమైన ప్రేమ అలసైన వారికి,

దేహము మురికియని ఒప్పుకోని అల్పులకు —

ఈ పంచదార పలుకు లేమితెచ్చు?

వంచన దారులలో పంచు మంచి ఏమి?


రెండవ చరణం:

యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా

తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా

ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా

పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో   ॥అన్ని॥

పదబంధం

అర్థం

యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా

ఈ రోజు రుచులు రేపటికి కూడా వుండాలని తలఁచుచు తృప్తిని పొందలేక (సాపేక్షతతో వచ్చిన చిక్కులు- జీతాలు, ఇళ్ళు, కార్లు, దుస్తులు, అలంకరణలు)

తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా

పరకాంతలను చూచి మనసు ఉండబట్టుకోలేక (పరిపరి విధములుగా అలోచిస్తూ, పొందు కొరకు ప్రణాలికలు రచించుతూ కాలము గడుపుతారు)

ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా

ముల్లోకాలలో (స్వర్గము, భూలోకం, నరకము) చాలాకాలమున్నప్పటికీ ముసలివాళ్ళైనా తృప్తిలేక (తాను అనుభవించుచున్నది తప్పు అను విజ్ఞతలేని) – Ref: మొదటి చరణం మొదటి పంక్తి చూడండి)

పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో

ఇంద్రియ పరవశమను దారిలో, సారము తీసివేయగా మిగిలిన పిప్పి వంటి ఈ బ్రతుకులో పెనగులాడేదేమి? ఒనగూడేదేమి?

 

భావము:

అనుభవమునకు వచ్చిన రుచులకు
నాటికి, ఆ మరునాటికి వుంచాలని
అర్రులుచాచుతూ
ఎంత పొందినా తృప్తిలేక
తలమునకలవుతున్నాడు.
 
మనిషి పరస్త్రీలను చూసి
మనసు ఉండబట్టుకోలేక,
వారి పొందుకై ఆలోచనలు,
ప్రణాళికలు రచిస్తూ కాలాన్ని ఖర్చు చేస్తాడు.
 
జాగ్రద్ స్వప్న సుషిప్తు లోకాలలో తిరుగుతూ
ఎన్నెన్నో జన్మలు గడిపినా
విజ్ఞత అమరక​ తృప్తి కలగక— ​
 
ఇంద్రియ పరవశమను గాడిలో,
తిరుగాడు పిప్పి బ్రతుకులో –
పెనగులాడేదేమి?
ఒనగూడేదేమి?
మెప్పించేదేమి?

 

వ్యాఖ్యానం:

 

సాపేక్షజీవితములో
ముఖ్య పాత్ర
ప్రక్కవాడి జీతము
వాడుండే ఇల్లు
వాడెక్కే కార్లు
వేసే దుస్తులు
గుబాళించే పరిమళాలు
గుండెలో అగ్నిగోళాలు

 

పక్కింటి సొగసు
పోగొట్టు మనసు
తెగ్గొట్టు నిగ్రహం
పొగబెట్టు అరాచకం.
 
ఎంత కాలమో ఈ మాయా ప్రకృతి
కలకాలము బంధించెనీ ప్రవృత్తి.

 

మూడవ చరణం:

యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా
కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా
యీడనే శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గాచెఁగా
నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో    ॥అన్ని॥

పదబంధం

అర్థం

యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా

ఈ దేహము ఎక్కడినుంచి వచ్చినదో. ఈ దేహము కలగడం అనగా నేమో నెరుగను.

కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా

ఈ దేహముతో జతగూడిన ఈ మనువు (=జీవనము) ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టలేను..

యీడనే శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గాచెఁగా

ఈ భూ ప్రపంచములోనే శ్రీవేంకటేశుడు ఇలా అనుకున్నానో లేదో అలా గాచెఁగా

నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో

నేనొక నీడవంటివాడను (స్వతంత్ర ప్రతిపత్తి లేని వాడను). నేర్పులు, తెలివి, జ్ఞానము నాకెలా తెలియును

భావము:

ఈ దేహమేడది?  ఎలా వచ్చింది?
జీవనము ఈ శరీరంతో జత కూడడమేమి? —
నాకిది అస్పష్టము.
ఈ భూమిమీదే శ్రీ వేంకటేశుడు ఉండి —
నన్ను ఆయన దయతో కాపాడుతున్నాడు.
నిజానికి నేను స్వతంత్ర ప్రతిపత్తి లేని వాడను.
నాకెలాంటి నేర్పు?
తెలియగల తెలివి లేవంటే
జ్ఞానానికి ఆర్హతేది?

వ్యాఖ్యానం:

అన్నమాచార్యులు  ప్రశ్నలను పేల్చుతున్నారు.
చూచుటకు సులభమనిమించినా
అవి మౌలికమైనవి. ఛేదింపలేనివి.
మానవ జాతికే సవాళ్ళుగా నిలిచినవి.

 

ఈ శరీరమేమి? జీవమేమి?
వీని కూడికేమి? (స్వధర్మము)​
వీటిని విచారించక
జీవించి ప్రయోజనమేమి?

 

మానవులు తక్కిన జంతువులవంటి వారుకారు.
పుట్టిన ప్రతివానికి ఒక ధర్మము నిర్దేశించబడినది.
అది తెలియుట జీవనము.
లేకుంటే అజ్ఞానము కొనసాగించుట​.
 
ఇక్కడ నీడవంటి వాడను అంటే
ఏదో ఒక ఆశ్రయణమును దన్నుగా చేసుకొని నిలబడుట​.
నీడవిడుచుట అజ్ఞానము తొలగుట​.

 నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో

 

దీనిని భగవద్గీతలోని క్రింది శ్లోకం ద్వారా మరింత విపులముగా తెలుసుకుందాం.
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 13-2 

భావము:
వివేకవంతులు, ఋషులు
ఈ దేహము క్షేత్రమని,
ఈ దేహమును బాగా తెలిసిన వానిని క్షేత్రజ్ఞుడని అందురు.
 
ఎంత సులభమైనది!
ఈ దేహమే కార్యక్షేత్రము.
ఈ దేహమునెరుగుట కార్యము.
తక్కినవన్నీ అపభ్రంశములే.

మనిషికి ప్రపంచానికి సంబంధం

జిడ్డు కృష్ణమూర్తి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో ఉన్నప్పుడు, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా కలిశారు. నెహ్రూకు ఇచ్చిన ఉపదేశాలలో, ఒక సందర్భంలో కృష్ణమూర్తి ఇలా అన్నారు: 

"ఆత్మ జ్ఞానం అనేది రెంటి మధ్య సంబంధాల ద్వారా మాత్రమే తెలియగలము. ఇతరులతో, ఆలోచనలతో, వస్తువులతో, చెట్లతో, భూమితో, చుట్టూ ఉన్న ప్రపంచంతో, లోపల ఉన్న మనసుతో — ఈ అన్నిటితో మన సంబంధాన్ని గమనించే క్రమంలోనే ఆత్మ అవగాహన కలుగుతుంది. ఆ సంబంధమే మన ‘నేను’  — కనబడే అద్దం. ఆత్మ జ్ఞానం లేకుండా సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా కార్యకలాపాలు చేయడం అసాధ్యం." తెలియగలము 

దానికి నెహ్రూ ప్రశ్నించారు: "అయితే దాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి?" ​ 

కృష్ణమూర్తి సమాధానం:

"నీవున్న చోట నుంచే మొదలుపెట్టు. మనసు ఆలోచన రూపంలో ఎలా పనిచేస్తుందో, దాన్ని ఒక్కో పదంగా, ఒక్కో వాక్యంగా, ఒక్కో పేరాగా చదువు."


ప్రత్యక్షము-పరోక్షము

ఏ జీవైనా తన్ను తాను ప్రత్యక్షముగా చూచుకొనలేదు.
తెలియవలసినది పరోక్షముగానే.
ఆత్మసాక్షి మనసు అద్దం వంటిదైతే
ప్రపంచం అందులో స్పష్టం.
మన భావనలే ఆ ప్రతిబింబానికి రంగులు అద్దునవి.
ఆ రంగు మరకల తొలగింపే ధ్యానము.
రంగుల్లేని బింబము విశ్వమంతటిని చూపును.
తాను విశ్వము ఒకటై నిలుచుట​
అదే సమత్వము.
అదే భగవత్తత్వం.  

3 comments:

  1. ఈ కీర్తన అర్దం చేసుకోడానికి మొదటి పాదంలో "చదువు",
    ఆఖరి పాదంలో "నేరుపు" దృష్టిలో పెట్టుకోవాలి. నేరిచిన
    ది ఏమిటి? ఈడనే వెంకటేశ్వరుడు ననుగాచి ఉంటాడు!
    నేను చేయవలసినది ఆ స్వామిని నీడవోలె అనుసరించటమే!
    చదువు వంటబట్టిందా? ఏమైనా నేర్చుకున్నావా?
    అంటే ఏదీ నేర్వలేదు!
    గత జన్మను, తల్లి చనుగుడుపును, నెలల వయసులో నా మలమూత్రాదులతో నేనే ఆడుకున్న వైనం, అన్నీ మరచాను. నిన్నటి రుచులు మర్చి రోజూ కొత్త రుచులు కావాలి.
    ముప్పిరిగా వయసు పైబడి తనువు డస్సినా తనివి తీరలేదు! ఇంద్రియాలకు బానిసనై
    కట్టుతాడు తెంచుకోలేని గానుగెద్దు వలెనైనది నాబతుకు!
    మరి దారేది.? వెంకటేశుడొక్టడే! ఏ ఒక్కటి నేరిచిన వేరేది నేర్వ నక్కర లేదో అదే ఇది.
    ఇదొక్కటే నేరిచిచితిని. ఓ వెంకన్నా! నిను వీడను. నీడవోలె నీతోనే ఉంటాను! !

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యానము సరళసుందరము . అన్నమయ్య అంతరంగ ఆవిష్కరణము

    ReplyDelete
  3. అజ్ఞానికి కనువిప్పు కలిగేలా వ్రాసిన అన్నమయ్య కీర్తనకు సమగ్రమైన సరళమైన మీ వ్యాఖ్య మణి దీపంలా ఉంది. 🙏🙏

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...