తాళ్ళపాక అన్నమాచార్యులు
257 ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు
For English version press here
ఉపోద్ఘాతము
తోలుబొమ్మలాట కొనసాగుతూనే ఉంది
శృంగార సంకీర్తన
|
రేకు: 1066-2 సంపుటము: 20-392
|
ఆడే బొమ్మలు వారు ఆడించే
సూత్రము నీవు
యేడో ఇన్నాళ్లు నేను ఇదెఱఁగనైతిని ॥పల్లవి॥ నీవు చెప్పినబుద్దుల నెలఁతలు
నడవఁగా
ఆవలివారి దూరితి నయ్యా నేను
చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను
వేవేలుచోట్లను వెదకితి నేను ॥ఆడే॥ కన్నుగీఁటి నీవు వారి కైకొని
మొక్కించఁగా
సన్నల వారి దొబ్బితి సాదించి
నేను
పన్నినకూఁకటివేరై పారి నీవు
వుండఁగాను
వున్నతిఁ గొనలకు నీ రొగ్గి
నేఁ బోసితిని ॥ఆడే॥ కోరి పెండ్లాడిన పెండ్లి
కొడకవు నీవుండఁగా
గారవించితిని వారిఁ గరుణ
నేను
యీరీతి నన్ను శ్రీ వేంకటేశ
నీవు గూడుండఁగా
కారణ మిందరునంటాఁ గడల మెచ్చితిని ॥ఆడే॥
|
Details and Explanations:
Telugu
Phrase
|
Meaning
|
ఆడే బొమ్మలు
వారు ఆడించే సూత్రము నీవు
|
సూత్రము
= దారము, ఉపాయము, యంత్రము,
ఏర్పాటు, ఎత్తుగడ బొమ్మ = కీలుబొమ్మ,
జంత్రపు బొమ్మ
మేమంతా
ఆడే కీలు బొమ్మలము. మమ్మల్ని ఆడించే సూత్రము నీవు.
|
యేడో ఇన్నాళ్లు
నేను ఇదెఱఁగనైతిని
|
నీవు యాడో? ఇంతకాలము ఈ విషయము ఎరగనైతిని.
|
సూటి భావము:
ఆడే బొమ్మలే
వారు; వారిని ఆడించు సూత్రము నువ్వే. ఇన్ని రోజులుగా ఈ
రహస్యం నాకు తెలియదు; ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది, గానీ నీవు యాడుంటావో తెలియదు ప్రభూ!
గూఢార్థవివరణము:
ఈ కీర్తనలో ఆచార్యులవారు కీలుబొమ్మలలాగ మనమంతా ఆడుతుంటామనే సాధారణ భావనను విస్తృతంగా చర్చించారు. మనను కీలుబొమ్మలలాగ ఆడించే సూత్రమేమి? ఒకటో వందో దారాలైతే తొలగించవచ్చు. అసలు ఆ సూత్రం అంటూ కనబడితే ఏదో ఒకటి చెయ్యవచ్చు. ఇక్కడ అన్నమయ్య చివరిదాకా కనబడలేదని చెప్పటంపై విచారించవలెను.
దీనికి కారణమిది, ఆ కారణమునకు మరొకటని, అందుకు వేరొకటని..ఇలా చెప్పుకుంటూ పోతే సర్వమునకు కారణమైన వాడు "దైవము" అని తెలుస్తుంది. కానీ చెప్పడానికి సులభమైన ఇందులో కారణములను గుర్తించుటలో మానవుడు స్వయంగా పాత్ర పంచుకుంటాడు. మనలను మనము విశ్లేషించుటలో నిష్పాక్షికంగా వుండలేము. కావున ఈ పద్ధతి లోపభూయిష్టమైనది.
ఇటువంటి
స్థితిలో మానవుడు చేయగలిగినదేమి? ఇక్కడ అన్నమయ్య తాను ఏరకముగా విఫలమైనది
చెబుతున్నారు. అవి ఒకటొకటి చరణములలో తెలుసుకుందాము.
భగవద్గీత
ఏమి చెప్పింది
పరమేశ్వరుడు
జీవుల హృదయములలో నిలిచి, జంత్రగాడు బొమ్మలను ఆడించు విధముననే
సర్వప్రాణులను భ్రమింప చేయుచున్నాడు.
అనేక ప్రత్యక్ష కారణాల మధ్య దాగి ఉన్న అసలు మూలకారణాన్ని గుర్తించడం ఎంత కష్టమో — షెర్లాక్ హోమ్స్ ఒక మాటలో అద్భుతంగా ప్రతిబింబిస్తాడు:
"చిన్న విషయాలే అంతులేని ప్రాధాన్యమున్నవని నేను ఎప్పటి నుంచో నా సూత్రంగా
తీసుకున్నాను." "(It has long been an axiom of mine that the
little things are infinitely the most important.). ఈ సందర్భంగా ముందటి
కీర్తనను (Ref poem 224) గుర్తు చేసుకుందాం:
మొదటి చరణం:
Telugu Phrase
|
Meaning
in Telugu
|
నీవు చెప్పినబుద్దుల నెలఁతలు నడవఁగా
|
నెలఁతలు= వనితలు (ఇక్కడ నారదాది పెద్దల క్రింద పరిగణించవలెను)
నీవు ఆదేశించిన మార్గములో పెద్దలైనవారు నడుస్తుంటే
|
ఆవలివారి దూరితి నయ్యా నేను
|
రేఖకు అవతలవున్నవారిని తిట్టితినయ్యా నేను
|
చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను
|
నా సమస్యలకు పరిష్కారమనే తాళాముచెవి చక్కగా నీదగ్గర
వుంటే
|
వేవేలుచోట్లను
వెదకితి నేను
|
వేల చోట్ల దాని కోసం వెదికాను
|
సూటి భావము:
గూఢార్థవివరణము:
పెద్దలు, జ్ఞానులు మంచి చెబుతారు. దైవబోధను అనుసరించమంటారు. కానీ అవి అర్థం చేసుకోలేక, వారిని తప్పుగా అర్ధం చేసుకుని; వారినే తక్కువ చేసి చూస్తాం.
నిజమైన తాళంచెవి (సూత్రధారత్వం, దిక్సూచి) దేవుని చేతిలోనే ఉందని మనకందరకు తెలుసు. ఆ దైవాన్ని పట్టుకొనుటకు బదులు వేరే బయట ఎక్కడో వెదుకుతూనే ఉంటాం.
ఈ
ఉదాహరణలు పైపైకి అర్ధమైనట్ల నిపించినా మనము సాధారణంగా అన్నమయ్య చెప్పినట్లుగానే మనముంటున్న
స్థితిని కొనసాగిస్తాం. ఈ శాస్త్రాలు, వేదాలు, పురాణాలు
వేలాది ఏళ్ళనుంచి వున్నా మానవుని స్థితిలో అణువంతైనా మార్పు రాలేదు. చెబితే వినం.
రెండవ చరణం:
తెలుగు పదబంధం
|
అర్థం
|
కన్నుగీఁటి నీవు వారి కైకొని మొక్కించఁగా
|
కన్నుగీఁటి
నన్ను ప్రభోదించమని వారిని నువ్వే ప్రేరేపించగా
|
సన్నల వారి దొబ్బితి సాదించి నేను
|
(సన్నల వారి = సంజ్ఞల వారి = unable to
read their sign language)
వారి సంజ్ఞల
భాషను అర్ధం చేసుకోలేక వారిని సాధించి త్రోసివేసాను.
|
పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను
|
రహస్యముగా
నీవు ప్రధానమైన వేరై వుండగాను
|
వున్నతిఁ
గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని
|
పైన ఎక్కడో
వున్న కొమ్మల కొనలకు నీరు పోసితిని
|
సూటి భావము:
గూఢార్థవివరణము:
ఆ పెద్దలు కోరికోరి నన్ను ఆశీర్వదించడనికి వస్తే వెళ్ళగొట్టాను. (అలాగే మనము వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటాం).
మూలానికి నీరుపోసే బదులు నేను కొమ్మలకు పోసి సంతోషపడిపోతాను. (అనవసరమైన పనులలో పడి అసలు పని మరచిపోతాను). మూలము ఒకటే వుంటుంది. కొమ్మలు అనేకము. అర్ధం చేసుకోండి.
ఇదే విషయమును
భాగవతము నాల్గవ స్కందములో (4-31-14) కూడా చెప్పిరి.
యథా
తరోర్మూలనిషేచనేన
తృప్యంతి తత్స్కంధభుజోపశాఖాః .
ప్రాణోపహారాచ్చ యథేంద్రియాణాం
తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా
“ఎలాగైతే ఒక వృక్షము వేర్లకు నీరు పోస్తే దాని కొమ్మలు, ఆకులు, దుంప అన్నింటికీ అందుతుందో, ఎలాగైతే ప్రాణవాయువు అన్ని ఇంద్రియాలను నిలబెడుతుందో, అలాగే అచ్యుతుని (పరమాత్ముని) ఆరాధనచేత సమస్త దేవతలు సంతృప్తి పొందుతారు.”
మూడవ చరణం:
Telugu
Phrase
|
Meaning in
Telugu
|
కోరి పెండ్లాడిన
పెండ్లి కొడకవు నీవుండఁగా
|
నేను కోరిన
నిజమైన పెండ్లికొడుకువు నువ్వే అయినా
|
గారవించితిని
వారిఁ గరుణ నేను |
గౌరవించాను
అత్యంత కరుణతో ఇతరులను
|
యీరీతి
నన్ను శ్రీ వేంకటేశ నీవు గూడుండఁగా
|
ఈ రకముగా
నాకు తెలియకుండా నాలోనే వున్న శ్రీ వేంకటేశుడా
|
కారణ మిందరునంటాఁ
గడల మెచ్చితిని
|
(గడల = చిట్టచివరి జ్ఞాన దంతము వరకు)
కారణము
వేరే ఎవరో అనుకుంటూ చివరివరకు వారినే మెచ్చుకుంటూ జీవితం గడిపేశాను.
|
సూటి భావము:
గూఢార్థవివరణము:ఇక్కడ అన్నమయ్య తన అజ్ఞాన స్థితిని అంగీకరిస్తున్నారు. ఇక్కడ గమనిస్తే మనము చేయవలసినవి కాక వేరే పనులలో ఇరుక్కుంటున్నామను విషయము తేటతెల్లము. ఈ రకముగా ఆ సూత్రం తప్పించి మిగిలినవి పట్టబోతాం.
మనలను మన సంకల్పమునుండి మరల్చునవి అనంతములు. ఇంకోరకముగా చూస్తే సంకల్పము కూడా ఒక రకమైన ప్రతిబంధకమే (గీత 6-2). భగవంతునితో అను సంధానము చెందుటకు గల అన్ని మార్గములు ఆటంకములే. అందుకనే అన్నమయ్యకు కనిపెట్టడం కష్టమైంది.
ఇది ఎలా వుంటుందంటే, పై బొమ్మలా! రెమెడియోస్ వారో అను చిత్రకారిణి "బల్ల మీది కళ్ళు" (‘eyes on the table’ 1938 by Remedios Varo) పరీక్షగా చూడండి. గాలిలో తేలియాడుతున్న ఒక చదును బల్ల. దానిపై ఒక పాత కాలపు కళ్లజోడు. విచిత్రంగా దానికి కనురెప్పలు. కళ్ళేమో దూరంగా ఆ కళ్లజోడు వైపు చూస్తున్నట్లున్నాయి. తేలియాడుతున్న బల్ల మన మనస్సు వంటిది. తేలియాడడం అంటే స్థిరం లేదన్నమాట. ఆ స్థిరం లేని మనసుతో అది ఎంత కష్టమైనా కూడా దృష్టి వెలుపలకు కాదు, లోపలికి చూడమని అర్ధం. తదేక దీక్షతో తనలోకి తాను నిష్పక్షంగా చూడడం అత్యంత కఠినము. "చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట" అని అన్నమయ్య ఇదే చెప్పారు. (రెఫరెన్స్: poem 255 “ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు”).
ఈ విధముగా
ఆ సూత్రాన్ని లోచూపు ద్వారానే పట్టగలమని బొమ్మద్వారాను, అన్నమయ్య కీర్తన ద్వారాను తెలుస్తుంది.
అన్నమయ్య ఇక్కడ ఒక లోతైన సత్యాన్ని సులభంగానే చూపిస్తారు.
‘నాకు తెలుసు’ అన్న భావమే నిజమైన అజ్ఞానం.
పాత కళ్లజోడుతో చూస్తే దారి తప్పుతాం,
కొత్త కళ్లజోడు ఎలా వుండాలో తెలియదు.
అందుకే, మన అనుభవమునకు వచ్చిన దానిని
నిశితంగా పరిశీలించని వరకూ
మనలో ఉన్నది ఏమిటో—తెలిసినదా, తెలియనిదా—ఎప్పటికీ
గ్రహించలేము.
ఈ
స్థితిలో మనం కూడా
అన్నమయ్య చెప్పినట్లే “ఆడే బొమ్మలు”గానే మిగిలిపోతాం.
X-X-The
END-X-X