తాళ్ళపాక అన్నమాచార్యులు
256 యింత నీ వుపకారము లే మని పొగడుదు
For English version press here
ఉపోద్ఘాతము
దీనిని అన్నమాచార్యులవారికి అపురూపము, అరుదైన సత్య (భగవంతుని) సాక్షాత్కారము జరిగిన పిమ్మటి కీర్తనగా భావించవచ్చును.
శృంగార సంకీర్తన |
రేకు: 420-1 సంపుటము: 12-115 |
యింత నీ వుపకారము లే మని
పొగడుదు
సంతసించి యేలితి నా సరివారిలోనా
॥పల్లవి॥ కలవు నాకు నీ వని గర్వించి
వుండుట గాక
చెలఁగి నీకుఁ బ్రియము చెప్పవత్తునా
నలువంక నటువంటి ననుఁ దెచ్చి
నీ సేవకు
అలవఱచుక నన్ను నాదరించితివి ॥ యింత ॥ చుట్టరికపు వరుస సుద్దులె
చెప్పుదుఁ గాక
నెట్టుక నీ కొలువులో నిలుచుందునా
యిట్టి నన్ను మన్నించి నీ
యెదుట నిలుపుకొని
గుట్టు దెలిపి నాకు నీ గుణము
నేర్పితివి॥ యింత ॥ నీ విచ్చిన సలిగల నే దొరనై
వుందుఁ గాక
యీవిధాన నీ యక్కుపై నిర వౌదునా
శ్రీ వేంకటేశుఁడ నేను జిగి
నలమేల్మంగను
వావి తోడ నన్నుఁగూడి వన్నె
కెక్కించితివి ॥ యింత ॥
|
Details
and Explanations:
Telugu
Phrase
|
Meaning
|
యింత నీ
వుపకారము లే మని పొగడుదు
|
నీ కృప, ఉపకారం లాంటివి వేరే ఎక్కడా పొందలేము. వాటిని
తగ్గట్లుగా పొగడలేను కూడా
|
సంతసించి
యేలితి నా సరివారిలోనా
|
సంతోషించి
నన్ను నా సమానుల మధ్య నుంచి ఎత్తి కాపాడావు.
|
సూటి భావము:
దైవమా! “నీ కృపయు ఉపకారములకు సాటి యేదియు లేవు గాక; వాటిని యథార్థముగా వర్ణింపగను నేనెవడనో. సంతసించి నన్ను సమసమానులలోనుండి పైకి లాగి నిలుపితివి.”
గూఢార్థవివరణము:
ఇక్కడ అన్నమయ్య ఒక వ్యక్తిగత ప్రకటన చేస్తున్నారు. ఆయన చెబుతున్నది ఏమిటంటే — తాను ఇతరుల కంటే ఎక్కువ కానని, ప్రత్యేకం కాదని.
కానీ ఆ అనేక మంది సమానుల మధ్యనుండి తాను దేవుని కృపకు పాత్రుడవడం తన అదృష్టం అంటున్నారు.
ఇది “తన కృషి కాదని", అది పూర్తిగా దైవకృప అని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఈ భావన, భక్తులందరికీ తమలోని న్యూనతా భావము, అశక్తతా భావములను
తొలగించి దైవ కృప ప్రతి ఒక్కరికి లభిస్తుందని
ధైర్యం ఇచ్చే సందేశం.
మొదటి చరణం:
Telugu
Phrase
|
Meaning
in Telugu
|
కలవు నాకు
నీ వని గర్వించి వుండుట గాక
|
నీవు నాకు గలవనె గర్వము తప్ప
|
చెలఁగి
నీకుఁ బ్రియము చెప్పవత్తునా
|
నా అంతట నేను నిన్ను పొగడగలనా
|
నలువంక
నటువంటి ననుఁ దెచ్చి నీ సేవకు
|
నల్లబంకమట్టి వంటి నన్ను పైకి తీసుకొచ్చి
|
అలవఱచుక
నన్ను నాదరించితివి
|
నన్ను మలచి తీర్చిదిద్ది ఆదరించితివి.
|
సూటి భావము:
దైవమా! నీవు నాకు గలవనె గర్వము
తప్ప నా అంతట నేను నిన్ను పొగడగలనా? నల్లబంకమట్టి వంటి నన్ను పైకి తీసుకొచ్చి
నన్ను మలచి తీర్చిదిద్ది ఆదరించితివి.
గూఢార్థవివరణము:
“నలువంక నటువంటి ననుఁ దెచ్చి నీ సేవకు”: “నలువంక” →నల్ల బంక మన్ను→ కృష్ణమృత్తిక వంటిది, పచ్చి నేల మానవుని మనస్సు— దానిలో ఏదైనా పంట పండాలంటే కష్టమే. అది మలచబడకపోతే ఉపయోగం ఉండదు. అంటే అన్నమయ్య తనను రూపు లేని మట్టిగా (ముడి సరుకుగా) చూసుకుంటున్నాడు. స్వతహాగా తనలో విలువేమీ లేదని చెబుతున్నాడు.
“అలవఱచుక
నన్ను నాదరించితివి” → ఆ పచ్చి మట్టిని నువ్వే తీసుకుని, నీ సేవలోకి చేర్చి, దానిని ఉపయోగపడేలా చేశావు.
రెండవ చరణం:
తెలుగు పదబంధం
|
అర్థం
|
చుట్టరికపు
వరుస సుద్దులె చెప్పుదుఁ గాక
|
మన బంధము, చుట్టరికము గురించి కబుర్లు చెబుతాను గానీ నాకే
తెలియదు.
|
నెట్టుక
నీ కొలువులో నిలుచుందునా
|
నెట్టుకుకొని
నా స్వశక్తితో నీలో చొచ్చుకొనిపోయి నీ కొలువులో నిలబడగలనా?
|
యిట్టి
నన్ను మన్నించి నీ యెదుట నిలుపుకొని
|
అయినా
నా అల్పత్వమును నీవు క్షమించి, నీ ముందర
నిలుపుకొన్నావు..
|
గుట్టు
దెలిపి నాకు నీ గుణము నేర్పితివి
|
నీ రహస్యముల
గుట్టు విప్పి, నీ గుణములు కొంత పరిచయము చేసావు.
|
సూటి భావము:
దైవమా! మన బంధము, చుట్టరికము గురించి అనేకమైన కబుర్లు చెబుతాను గానీ, వాస్తవానికి నాకేమీ తెలియదు. నెట్టుకొని నా స్వశక్తితో నీలో చొచ్చుకొనిపోయినీ కొలువులో నిలబడగలనా? అయినా నా అల్పత్వమును నీవు క్షమించి, నీ ముందర నిలుపుకొన్నావు. నీ రహస్యముల గుట్టు విప్పి, నీ గుణములు కొంత పరిచయము చేసావు.
గూఢార్థవివరణము:
”చుట్టరికపు వరుస సుద్దులె చెప్పుదుఁ గాక” — ఇక్కడ “చుట్టరికపు వరుస” అనేది వంశ బంధం కాదు, దైవంతో అన్నమయ్యకున్న సంబంధం కూడా. “నాకు నీతో ఎలాంటి బంధం ఉందో చెప్పలేను, ఎందుకంటే నీవే నాలో వుంటావు. నేనుండను. ఆ ఏకత్వంలో లీనమైతే, ఆ సంబంధాన్ని తెల్సుకోవడం లేదా వర్గీకరించడం అసాధ్యం. నేను చెప్పలేను”.
ఈ రోజుల్లో
“నాకు దైవంతో సంబంధం వుంది. నేనతడికి పరిచయం” అని చెప్పుకునే వారి మాటలలో సత్యమెంతో మీరే నిర్ణయించగలరు.
గుట్టు
దెలిపి నాకు నీ గుణము నేర్పితివి — ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి రాసిన /
చెప్పిన అనుభవాలలో కూడా ఇదే నమూనా కనిపిస్తుంది:
ఏకత్వ
క్షణం (Timeless Experience)
జిడ్డు అనుభవం గురించి చెబుతాడు — "ఒక క్షణం, మనసు పూర్తిగా నిశ్శబ్దమైపోతుంది. అక్కడి నుంచి ఆత్మ, సమయం, వ్యక్తిగతము అనే విభజన అన్నీ ఆగిపోతాయి."
ఇది
అన్నమయ్య చెప్పినట్టు “మనసు దేవుని గుణముగా మారుట” లాంటిది.
తిరిగి మనసు వస్తే
ఆ అనుభవం దాటిన తర్వాత, జిడ్డు చెప్పేవాడు: “దానిని వివరించడం అసాధ్యం. తెలిసినట్టే ఉంటుంది, కానీ చెప్పాలంటే జారిపోతుంది.”
అదే
అన్నమయ్య మాటల్లో: “గుట్టు దెలిపి నాకు నీ గుణము
నేర్పితివి” → గుణాన్ని చూపించాడు, కానీ తిరిగి దానిని నిలుపుకోలేడు.
స్మృతి
లో మసకబారిన చాయ
జిడ్డు చెప్పిన మరో ముఖ్యమైన విషయం: “స్మృతి దానిని పట్టుకోలేదు. స్మృతి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, అది చలనం (movement of thought) అయిపోతుంది, నిజమైనది కాదు.”
అన్నమయ్యకూ
ఇదే సమస్య: ఆ స్థితిలో ఉన్నప్పుడు మనస్సు లేనట్టే; కానీ
బయటకు వచ్చిన తర్వాత ఆ అనుభవం "తెలిసినట్టూ తెలియనట్టూ" అనిపిస్తుంది.
మూడవ చరణం:
తెలుగు పదబంధము
|
అర్థము
|
నీ విచ్చిన
సలిగల నే దొరనై వుందుఁ గాక
|
నీ విచ్చిన ప్రాపు, ఆశ్రయముల వలనే నన్నందరు గొప్ప అనుకుంటున్నారు
|
యీవిధాన
నీ యక్కుపై నిర వౌదునా
|
కాకపోతే ఈ రకముగా నీ హృదయంలో నాకు చోటు దొరికేదా?
|
శ్రీ వేంకటేశుఁడ
నేను జిగి నలమేల్మంగను
|
శ్రీ వేంకటేశుఁడ నేను కాంతిని వెదజల్లు అలమేలుమంగను
|
వావి తోడ నన్నుఁగూడి వన్నె కెక్కించితివి
|
ఈ సంబంధము తోడ నన్ను చేరి గౌరవము, కీర్తి, ప్రసిద్ధి కలిగించితివి.
|
సూటి భావము:
శ్రీ వేంకటేశుఁడా! నీ విచ్చిన ప్రాపు, ఆశ్రయముల వలనే నన్నందరు గొప్ప అనుకుంటున్నారు.
కాకపోతే ఈ రకముగా నీ హృదయంలో నాకు చోటు దొరికేదా? శ్రీ వేంకటేశుఁడ నేను కేవలము నీ కాంతినే వెదజల్లు సేవకుణ్ణి. ఈ సంబంధము తోడ నన్ను చేరి గౌరవము, కీర్తి, ప్రసిద్ధి కలిగించితివి.
గూఢార్థవివరణము:
శ్రీ వేంకటేశుఁడ నేను జిగి నలమేల్మంగను — ఇంతకు ముందు కీర్తనలలో పెదతిరుమలాచార్యులవారు ఇలా సెలవిచ్చారు. “అలమేల్మంగ పురుషాకారమున ఆచార్యుననుమతి మెలఁగును” (= అలమేల్మంగదేవి ఆ భక్తుని రూపాన్ని ధరిస్తుంది. ఆచార్యుని (శ్రీనివాసుని) అనుమతి, మార్గదర్శకత్వంతోనే ఆమె నడుస్తుంది). ఇక్కడ అన్నమయ్య కూడా అదే మాటంటున్నారు.
ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే, తిరిగి పైన చూపిన ‘యిన్ మరియు యాంగ్'లతో పోల్చుదాము. అవి పరస్పరము విరుద్ధములైనా కూడా అవి శాశ్వతమైన సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ అవి ఒకదానిపై మరొకటి అధారపడిన శక్తులను సూచిస్తాయి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు.
బ్రహ్మాండమంతా అన్నిటికీ ఈ రెండు శక్తుల సమతుల్యత అవసరం. తైజిటు అనే పైన చూపిన చిహ్నంలో ఒక వైపు నలుపు (యిన్), మరొకవైపు తెలుపు (యాంగ్) ఉంటాయి. రెండింటిలోనూ స్థూలముగా వున్నదానికి వ్యతిరేక రంగు బిందువు ఉంటుంది. దీని ద్వారా, ప్రతి శక్తిలో మరొకటి కూడా అంతర్లీనంగా ఉందని తెలిపే సందేశం వస్తుంది.
అవి రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ (పూరకము) అయి ఒకటి వుంటే రెండవ దానిని గుర్తించలేము. దైవము లేదా సత్యము అను అనుభవము ఆ రెంటి ఏకీకరణ దశలోనే చూడగలము. మనమున్న స్థితి అసంపూర్ణము. ఈ స్థితిలో మనము అనుభవించునది మనలో లేనిదాని ప్రభావము మాత్రమే. ఆ లేమి స్థితిలో దానిని పూరించుకునేందుకు చేసే యత్నమే ఈ జీవితము. అనేకానేక విషయములతో ముడిపడిన మానవ మనస్సు ఆయా ప్రభావముల మూల కారణాలు కనిపెట్టలేదు. సహజమైన చర్యలు చేపట్టలేదు. ఆ కృత్రిమత్వమును వదలి నిలుటయే ధ్యానము (మెడిటేషన్). అపుడే సహజమగు స్థితిలో నిలబడగలము.
ఆ లేమిని భరించి దానిని స్వీకరించుట అత్యంతము సాహసోపేతము. అటువంటి సాహసము జీవితము లేదా మరణముల తలములో (సమయము గణించు తలములో) వుండదు. అనగా మానవుని చేతిలో లేదు. అది దైవాధీనము. హృదయ నిర్మలత్వము మాత్రము మానవుని చేతిలోనిది. అ అమలమైన స్వచ్ఛత పరమావధిగా జీవించుటయే మానవుని విధి. అందులోనే మనమంతా విఫలులౌతాము.
ఇవి ‘యిన్ మరియు యాంగ్'లు ఒక డైనమిక్ (క్రియాశీల) వ్యవస్థను ఏర్పరుస్తాయి. వీని సమాకలనము (ఇంటెగ్రేషన్) అందలి విడివిడి భాగాల మొత్తము కంటే ఎక్కువగా ఉంటుంది, అయితే ఆయా భాగాలు లేకుండా ఆ ఏకీకరణ సాధ్యముకాదు. ఆ ఏకీకరణ మనకళ్ల ముందే వున్నా మనకు తెలియదు. మనము ఆ ఏకీకరణను మనమున్న తలము నుండి పరిశీలించలేము. కావున అసలైన జీవితమును సమూలమైన మార్పును దాటకుండా తెలియలేము. ఆ స్థితిని (సమూలమైన మార్పు దశను) చేరుకున్న వారు బహు కొద్ది మంది మాత్రమే. అది మరణము కానప్పటికీ ఇంచుమించు వాటి మధ్య వ్యత్యాసమును తెలియలేని స్థితి.
అన్నమాచార్యులవారు
అటువంటి అపూర్వమైన స్థితిని చేరుకొని వ్రాసిన ఈ కీర్తనలు అమూల్యములు. అవిభాజ్యములు.
మానవాళికి మేలొనర్చునవి.
అన్నమాచార్యుల
నిరాడంబరతకు, వినయమునకు, సౌశీల్యమునకు,
సహృదయమునకు, విశాల దృక్పధమునకు ఈ కీర్తన తార్కాణము. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి
వుండాలనేదే ఈ కీర్తన సందేశము.
X-X-The
END-X-X
In this poem Sri Annamacharya saying that he is an ordinary person and with the devotional friendship with God's only he became somewhat great but in real he is not. Also he mentioned that without Sri Hari, he is none. All he got from the heart of Lord Venkateswara only. Also saying he never expected any compliments from the people but he expected the grace of Lord Venkateswara. So it is saying thT we,the common people must do their karmaas without expecting from others.
ReplyDeleteWith Regards
Srinivas Rayavarapu