Wednesday, 27 August 2025

T-255 ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు

                                             తాళ్ళపాక అన్నమాచార్యులు

255 ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు

For English version press here 

ఉపోద్ఘాతము 

గుండె లోతుల నుండి జాలువారిన గీతమిది. మొదటి నుండి చివరి వరకు రసపూర్ణమైన ఈ కీర్తన, కొండల మధ్య స్వేచ్ఛగా పారే తీయని జలములను తలపిస్తుంది. స్వచ్ఛమైన, నిర్మలమైన కవిత్వం ఆ జలాలపై పడే సూర్యకాంతిలా మెరుస్తూ, శృంగారాన్ని ప్రత్యేకంగా ప్రతిఫలింపజేస్తుంది. ఏ కోణంలో చూచినా — ఇది సుగమంగా, సహజంగా, అయితే లోతైన సౌందర్యాన్ని ఆవిష్కరించును. 


కృతిరస విశ్లేషణ​: మొదట చూసేటప్పుడు ఈ కీర్తన రసమయంగా, గిలిగింతలు పెట్టే ప్రేమ కవిత్వనిపిస్తుంది. కానీ ఆ స్పష్టమైన ఆహ్వానానికి చాటున, అన్నమాచార్యులు భగవంతుని చేరువ అయ్యే లోతైన సత్యాలను అల్లిపెట్టారు. ఇది సహజమైన​, నిజమైన ధ్వని కావ్యానికి ఒక అద్భుత ఉదాహరణ. ప్రతి పదం, ప్రతి పంక్తి రెండు స్థాయిలలో అర్ధాన్నివ్వడం దాదాపు అసాధ్యం. కానీ అన్నమయ్య భాషపై స్వతస్సిద్ధముగా ఉన్న నైపుణ్యం దీనిని సహజంగానే సుసాధ్యం చేసింది — అదే వారి కవితా సౌరభం. ​ 

సాధారణంగా మనషులు రసికత్వానికి త్వరగా ఆకర్షితమవుతాయి. అందువల్లే అన్నమయ్య ఈ రసరహస్యాన్ని అవలంభించి, జనుల మనసులను నేరుగా తాకే మార్గాన్ని ఆవిష్కరించారు.  “ఈ విధంగా రసికత్వమూ, ఆధ్యాత్మికతమూ ఏకమైపోవడం అన్నమయ్య కీర్తనల ప్రత్యేకత.” 

శృంగార సంకీర్తన

రేకు: 305-2 సంపుటము: 11-26

ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు
పతులకు సతులకు భావజుఁడే సాక్షి         ॥పల్లవి॥
 
తలఁపు గలిగితేను దవ్వు లేమి నేరు వేమి
అలరి సమ్మతించితె నడ్డాఁక లేమి
కొలఁది మీరినప్పుడు కొంచ మేమి దొడ్డ యేమి
నెల విచ్చి యేకతానఁ జేసినది చేఁత        ॥ఇత॥
 
యిచ్చకమె కలిగితే యెక్కు వేమి తక్కు వేమి
హెచ్చినమోహములకు నెగ్గు సిగ్గేది
పచ్చి యైనపనులకు పాడి యాల పంతమేల
చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట ॥ఇత॥
 
అన్నిటా నొక్కటియైతే నైన దేమి కాని దేమి
యెన్నికల కెక్కితేను యీడు జోడేది
వున్నతి శ్రీవెంకటేశుఁ డొనగూడె నేర్పు లివి
కన్నెలుఁ దాఁ గూడిన గతులే సంగతులు   ॥ఇత॥

Details and Explanations:

ఇతరులే మెరుఁగుదు రేమని చెప్పఁగ వచ్చు
పతులకు సతులకు భావజుఁడే సాక్షి     ॥పల్లవి॥         

Telugu Phrase

Meaning

ఇతరులే మెరుఁగుదురు

ఇతరులే మెరుఁగుదురు?

ఏమని చెప్పఁగ వచ్చు

వారెలా చెప్పగలరు?

పతులకు సతులకు భావజుఁడే సాక్షి

సంసారమునకు మన్మథుడే సాక్షి కదా!

సూటి భావము:

ప్రియుడా! “పైవారికి తెలియదు. పైవారేమీ జోక్యం చేసుకోలేరు. సంసారమునకు మన్మథుడే నిశ్శబ్ద సాక్షి.

దాగివున్న భావము:

దైవమా! “భక్తునికి–భగవంతునికి మధ్య ఉన్న రహస్య అనుభూతిని బయటి వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. భక్తుడు కూడా వ్యక్తం చేయలేడు. అయితే ఈ బంధానికి సాక్షి మన్మథుడు ఒక్కడే.

గూఢార్థవివరణము:

మనము అనుభవించే ప్రేమ అసలు ప్రేమ కాదు.
అది నిజానికి ప్రతిస్పందన మనసు తనలోని లోపాన్ని ఒప్పుకోలేక, దానిని ప్రత్యామ్నాయంతో పూడ్చిపెట్టే యత్నం. అందుకే ఆ తహతహ మనలను అల్లకల్లోల పరుస్తూ, మధన పెట్టును.
 

ద్రష్ట (ఆత్మ) మరియు దృష్టి (కోరిక।విషయం) మధ్య దూరం ఉన్నంతవరకు ఈ అనుభవం తప్పదు. కానీ కోరికలను వదలి జీవించడం కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే మన్మథుడు ఒక్కడే  మనకున్న ఏకైక సమాచారము.  అందుబాటులో ఉన్న దానినే, అది ఎంత అప్రయోజనకరమైనప్పటికీ, ఆ దైవాన్వేషణకు మరల్చ గలగాలి. 

అయితే పరిష్కారం ఏమిటి?

ఆ అనుభూతిని ఏమీ చేయకుండా గమనించాలి. కొంతకాలం తర్వాత అది తానే తొలగిపోతుంది.

కానీ ప్రతీ క్షణమూ “ఏమీ చేయకూడదు” అనే నియమముతో జీవించడం సాధ్యం కాదు; అది సహజస్థితికి విరుద్ధం.

 

కాబట్టి మనము సహజస్థితి నుండి తప్పుకొన్న క్షణాన్నే గ్రహించగలగడం ముఖ్యం.

సాధారణ మానవులు సహజస్థితిని అతిక్రమించిన తర్వాత మాత్రమే గ్రహిస్తారు.

జ్ఞాని మాత్రం అతిక్రమించుచున్నప్పుడే గ్రహిస్తాడు.

అలా గమనించడం, అర్థం చేసుకోవడం ద్వారా ద్రష్ట–దృష్టి ఏకమౌతాయి.

ఆ ఏకమైన క్షణం, మానవునికి ప్రపంచానికి మధ్య అంతరాయం కనబడదు.

ఈ అవగాహనలో, భక్తుడు–దైవం మధ్య ఉన్న అంతరంగిక సంబంధం తానే ప్రత్యక్షమవుతుంది.

అదే నిజమైన ప్రేమ. అదే మానవులు పొందగల అత్యుత్తమమైన అనుభవం.

 


మొదటి చరణం:

తలఁపు గలిగితేను దవ్వు లేమి నేరు వేమి
అలరి సమ్మతించితె నడ్డాఁక లేమి
కొలఁది మీరినప్పుడు కొంచ మేమి దొడ్డ యేమి
నెల విచ్చి యేకతానఁ జేసినది చేఁత     ॥ఇత॥ 

Telugu Phrase

Meaning in Telugu

తలఁపు గలిగితేను దవ్వు లేమి నేరు వేమి

తలఁపంటూ వుంటే దూరము, నేర్పు చూస్తావా?

అలరి సమ్మతించితె నడ్డాఁక లేమి

సమ్మతించిన తర్వాత అడ్డెందుకు?

కొలఁది మీరినప్పుడు కొంచ మేమి దొడ్డ యేమి

అసలు గీతను దాటిన తరువాత చిన్నాపెద్దా ఎంచకు

నెల విచ్చి యేకతానఁ జేసినది చేఁత 

ఆ ఏకత్వమునకు నెలవు ఇచ్చుట మాత్రమే చెయగల కార్యము

సూటి భావము:

ప్రియుడా! తలఁపంటూ వుంటే నేనున్న దూరము, నా నేర్పు చూస్తావా? సమ్మతించిన తర్వాత ఇంకా అడ్డెందుకు? అసలు గీతను దాటిన తరువాత చిన్నాపెద్దా ఎంచకు. ఆ ఏకత్వమునకు నెలవు ఇచ్చుట మాత్రమే చెయగల కార్యము.


దాగివున్న భావము:

దైవమా! “తలఁపంటూ వుంటే నేనున్న దూరమును, నా చేతగానితనమును చూస్తావా? సమ్మతించానుగా, ఇంకా ఈ మాయల అడ్డెందుకు? అసలు దాటవలసిన గీతను దాటాను. ఎక్కువ తక్కువల నెంచకు. నీతో ఏకత్వము ఒకటే  మేము ఆశించగలది.


గూఢార్థవివరణము: 

నెల విచ్చి యేకతానఁ జేసినది చేఁత:

ఏకత్వమునకు నెలవు ఇచ్చుట అనగానేమి? ఆలోచింతము. ఆ ఏకత్వములో “నేను” అనే భావం పూర్తిగా లయమైపోయి, చూచినది ఒక్కటే మిగిలే స్థితి.
కానీ ఇది మాటలతో చెప్పినంత సులభం కాదు.
నేను లేను” అని తెలిసే అవగాహన కూడా తెలిసినదేఅంటే ఇంకా “నేను” అనే బీజం మిగిలే ఉంటుంది.

నేను” అనేది ఒక ఆవరణం, ఒక సరిహద్దు చూపేది.
ఆ సరిహద్దుకు కావలసినది నిజానికి “నేను” కాదు; కానీ “నాది” అని మనకు తారసపడే ఆలోచన.
నాది–నాదికానిది” అనే సంఘర్షణే జీవితం.

ఆ సరిహద్దును ఎంత విస్తరించినా, ఎంత కుంచించినా అవి ఆ చిహ్నముతోముడీపడి ఉన్న విషయములే.

విస్తరించుట, కుంచించుట అన్నవి మనం చేసే కృత్రిమ కర్మలు; అవి సహజస్థితి కావు.
సహజము కాని దానిని వదలివేయుటయే మానవుడు చేయగల విశిష్టమైన అసలు కార్యము.

కానీ, మనిషి ప్రయత్నం చేస్తూ చేస్తూ — అది తనవల్ల సాధ్యం కాదని చివరికి గ్రహిస్తాడు.
ఆ గ్రహింపే శరణాగతి. అదియే ఏకత్వము.

నా వల్ల కాదు, నీవు చేయాలి” అనే లోతైన ఒప్పుకోలు శరణాగతి. 

ఆ శరణాగతిలోనే ఏకత్వం పూర్ణమవుతుంది. అదే నిజమైన చెంత సత్యమునకు. తక్కినవన్నీ చింతలతో పెనవేసుకున్న విషయములే. 


రెండవ​ చరణం:

యిచ్చకమె కలిగితే యెక్కు వేమి తక్కు వేమి
హెచ్చినమోహములకు నెగ్గు సిగ్గేది
పచ్చి యైనపనులకు పాడి యాల పంతమేల
చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట       ॥ఇత॥ 

Telugu phrase

Meaning in Telugu

యిచ్చకమె కలిగితే యెక్కు వేమి తక్కు వేమి

ఇష్టము, ప్రేమ కలిగితే ఎక్కువ తక్కువలకు చోటు వుండదు కదా!

హెచ్చినమోహములకు నెగ్గు సిగ్గేది

పెరిగిన మోహములకు సిగ్గుతో పని ఏమి (ఆచార్యులవారు, ముఖ్యంగా తాత్విక దృష్టిలో, సిగ్గు బిడియములకు తావులేదంటున్నారు.)

పచ్చి యైనపనులకు పాడి యాల పంతమేల

ప్రేమలోని పచ్చి యైనపనులు సరియైనవో కావో నిర్ణయించడమెఏలా?

(తాత్విక దృష్టిలో) ఆ అద్భుతమైన  నవజాతావస్థ  అనగా పుర్వ వాసనలు పూర్తిగా సమసిపోయి ప్రస్తుత సమయములో జీవించుట నేర్చు స్థితిలో, ఏమీ తెలియని స్థితిలో మంచి చెడులను నిర్ణయించనేలా?

చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట

శీఘ్రముగా తమకు తాము తెలియునది మంచి మాట.

సూటి భావము:

సఖుడా! ఇష్టము, ప్రేమ కలిగితే ఎక్కువ తక్కువలకు చోటు వుండదు కదా! పెరిగిన మోహములకు సిగ్గుతో పని ఏమి? ప్రేమలోని పచ్చి యైనపనులు సరియైనవో కావో నిర్ణయించడమెఏలా? శీఘ్రముగా తమకు తాము తెలియునది మంచి మాట. 

దాగివున్న భావము:

అసలైన  ప్రేమలో ఎక్కువ తక్కువలకు చోటు వుండదు కదా!  సిగ్గు బిడియములకు తావులేదు. (ఆచార్యులవారు, ముఖ్యంగా తాత్విక దృష్టిలో అన్ని విషయములు ఎక్కువ తక్కువ లెంచక బహిర్గతము చేయవలెను అనే అర్ధములో). ఆ అద్భుతమైన  నవజాతావస్థ  అనగా పూర్వ వాసనలు పూర్తిగా సమసిపోయి ప్రస్తుత సమయములో జీవించుట నేర్చు స్థితిలో, ఏమీ తెలియని స్థితిలో మంచి చెడులను నిర్ణయించనేలా? శీఘ్రముగా తమకు తాము తెలియునది జ్ఞానము.

గూఢార్థవివరణము:

హెచ్చినమోహములకు నెగ్గు సిగ్గేది నిజమైన ప్రేమలో సిగ్గు, బిడియములు అడ్డంకులు కావు. మనసులో దాచుకున్న భావాలన్నీ స్వచ్ఛంగా వెలికి రావాలి. ఆచార్యులవారు చెప్పినట్లే — “కొమ్మ తన ముత్యాల కొంగు జారఁగఁ బగటు” అన్నట్లు, తెరలా కప్పుకున్న ఎగ్గు–సిగ్గులు తొలగిపోవాలి. అదే అంతర్ముఖతకు ద్వారం. 

చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట నిజమైన జ్ఞానం అనేది తమకు తాము తెలిసికోవడమే. కానీ మన ప్రస్తుత స్థితిలో అది సాధ్యం కాదు; ఎందుకంటే మనమే కట్టుకున్న గోడలు — అహంకారం, స్వీయ-పరిమితులు — మనసును కప్పేస్తాయి. అవి కరిగిపోకముందు నిజస్వరూపం ప్రత్యక్షం కాదు. అవి ఎంత త్వరగా కరిగిపోతే అంత త్వరగా ఆత్మబోధ కలుగుతుంది.


మూడవ​ ​ చరణం:

అన్నిటా నొక్కటియైతే నైన దేమి కాని దేమి
యెన్నికల కెక్కితేను యీడు జోడేది
వున్నతి శ్రీవెంకటేశుఁ డొనగూడె నేర్పు లివి
కన్నెలుఁ దాఁ గూడిన గతులే సంగతులు        ॥ఇత॥ 

తెలుగు పదబంధము

అర్థము

అన్నిటా నొక్కటియైతే నైన దేమి కాని దేమి

అన్నింటిలో ఒక్క మనసైతే అయినదీ, కానిదీ వుంటుందా?

యెన్నికల కెక్కితేను యీడు జోడేది

ఉచితమా? కాదా? అని చూడబోతే సారూప్యమెక్కడ​?

వున్నతి శ్రీవెంకటేశుఁ డొనగూడె నేర్పు లివి

ఎక్కడో పై లోకాలలో వున్న శ్రీవెంకటేశుఁని దగ్గరకు చేర్చే నేర్పులు ఇవి

కన్నెలుఁ దాఁ గూడిన గతులే సంగతులు

భక్తులకు ఆ స్వామితో కూడిన మాటలే  సంభాషణా విషయములు

సూటి భావము:

ప్రియునితో ఏకమైపోతే, ఆ నిజమైన ఏకత్వంలో అయినదీ, కానిదీ వుంటుందా? (ఉండదే) అ సమయంలో నీ మనస్సు దైవముతో లీనమైతే అయినదీ, కానిదీ వుంటుందా? (ఉండదే) మా? కాదా? అని చూడవచ్చా​? ఆయనెక్కడ​? నీవెక్కడ​? ఈ దృష్టి వేంకటేశ్వరుని చేరుటకు మార్గమవ్వచ్చును కూడా. జీవనంలోని  సంభాషణలకు మూలము సరసమైన  విషయాలేకావా? 

దాగివున్న భావము:

“ఓ భక్తుడా! నీ మనస్సు దైవముతో లీనమైతే అయినదీ, కానిదీ వుంటుందా? (ఉండదే). ఉచితానుచితములు ఎంచబోతే ఆయనెక్కడ? నీవెక్కడ? ఓ వేంకటేశ్వరా! నిజమైన ఆధ్యాత్మిక సాధనలో నేర్పుంటే నీతో ఏకత్వం పొందడమే. ఈ జగత్తులో సార్ధకమైన సంభాషణలన్నీ ఆ పరంధామమునకు దారి చూపించే మాటలే కావాలి. 

గూఢార్థవివరణము: 

అన్నిటా నొక్కటియైతే నైన దేమి కాని దేమిఅన్నివిధములా దైవముతో ఒక్క మనసైతే, ‘అంగీకారము తిరస్కారము’ అనే లోకవ్యవహారములు తారసిల్లవే. మంచిది/చెడ్డది, నాది/నాదికాదు, అంగీకరించుట/తిరస్కరించుట వంటి వర్గీకరణలు విభజించబడిన మనస్సుకు తార్కాణాలు. 

యెన్నికల కెక్కితేను యీడు జోడేది ఏకత్వంలో కొలతలు లేవు — పోలికలకు తావులేదు. పోలికలు వచ్చిచేరగానే ద్వంద్వం మొదలవుతుంది. 

వున్నతి శ్రీవెంకటేశుఁ డొనగూడె నేర్పు లివివేంకటేశ్వరుని చేరుటకు నిజమైన అర్హత - ద్వంద్వాన్ని అధిగమించి, దివ్యములో ఏకమయ్యే సామర్థ్యం. ఇది  బాహ్యచర్యలతో సాధ్యముకాదు. అది తెలియుటయే నేర్పు. 

కన్నెలుఁ దాఁ గూడిన గతులే సంగతులుమానవజీవితం లోకపరమైన విజయాలు, సుఖాలు, విభేదాల గురించి కాదు. పరంధామమునుకు దారితీసే సంభాషణలే జీవితంలో మాట్లాడదగినవి. 

కన్నెలు” అంటే విముక్తి పొందిన మహర్షులను సూచిస్తుంది. గీతా (10.9) లో చెప్పబడినట్లుగా:

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥”

(“ఆ మహాత్ములు నన్నే ఆలోచిస్తూ, నాలోనే ప్రాణముంచి, ఎప్పుడూ పరస్పరం నా మహిమల గురించి సంభాషిస్తూ, ఆనందముతో తృప్తి పొందుచున్నారు.”) 

అదనపు స్ఫూర్తి: జిడ్డు కృష్ణమూర్తి “దేవుడు” అనే సంప్రదాయక భావనను తిరస్కరించినా, జీవితాంతం వారు చేసిన సంభాషణలు మానవుడు మరియు అతనిలోని “ఇతరుడు/పరుడు” అను రహస్యమే  కేంద్రముగా సాగినవి.


 ఈ కీర్తన ముఖ్య సందేశం 

దైవసంధాన మార్గాన్ని ఇతరులు అడ్డగించరు — వారంతా జీవితయాత్రలో సహప్రయాణికులే. మానవుడు ముఖ్యంగా ప్రణయము, కోరికల రహస్యాన్ని ఛేదించుటకు యత్నించవలె అని అన్నమాచార్యుల సందేశము. ప్రణయము, కోరికలను గుడ్డిగా తిరస్కరించరాదు; ఆలోచనలేక అంగీకరించరాదు. అవి ఇచ్చే విరుద్ధ సంకేతములు మార్గాన్ని మరింత కఠినముచేయును. కానీ, వాటి పాత్రను ఆధ్యాత్మిక సంకేతముగా గ్రహించి — అవి దివ్యసంధానమునకు విరుద్ధముగా వేరుదారులు చూపించే వ్యతిరేక మార్గములని తెలుసుకొని, వాటి నుండి మనస్సును ఉపసంహరించుటయే కీలకం.


X-X-The END-X-X


1 comment:

T-263 వెరవకువే యింత వెరగేలా నీకు

  తాళ్ళపాక అన్నమాచార్యులు 263 వెరవకువే యింత వెరగేలా నీకు For English version press here   ఉపోద్ఘాతము   అన్నమాచార్యుల పదాలు హ్యారీ పా...