తాళ్లపాక అన్నమాచార్యులు
316 లోకమింతా నిండె లోచూపు వెలిచూపు
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు ఈ కీర్తనలో పరమయోగుల అంతర్ముఖ పరివర్తనను, వారి చిత్తస్థితిని తెలుపుచున్నారు. లోచూపు
మరియు వెలిచూపు అన్న భేదము క్రమంగా కరిగిపోవుచు, లోకమంతయు
ఒకే త్రాటిపై కనిపించు స్థితి ఉద్భవిస్తుంది. అటువంటి స్థితిలో తీర్పులు చెప్పు
స్వభావము, మేలు–కీడు అనే విభజనలు స్వయముగా తగ్గిపోతాయి. ఈ
కీర్తన భేదము నుండి సమత్వమునకు జరిగే మృదువైన ప్రయాణాన్ని సూచిస్తుంది. దాని
సరళతలోనే ఒక ప్రశాంతమైన దృష్టి ప్రతిఫలిస్తుంది. మానవునిని లోకమునుండి విడదీయు
పొరలన్నీ క్రమంగా తొలగిపోతాయి. అప్పుడు తనకు, లోకమునకు
మధ్యనున్న వ్యత్యాసం నశించి, దృష్టికోణం మారి
లోకరంజకులౌతారు.
కీర్తనలోని ఘట్టముల పురోగతి
పల్లవి: లోచూపు వెలిచూపు ఏకమై లోకముపై
ఏకదృష్టి కలుగును.
మొదటి చరణము: విమర్శ, నిందలకు బదులు ఆత్మపరీక్ష మొదలగును.
రెండవ చరణము: మేలు
కీడు, కల్లనిజాల తీర్పులు మాని ఉన్న దానిని ఉన్నట్లుగా
స్వీకరించుదురు.
మూడవ చరణము: అట్టి
స్థితిలో వేంకటేశుఁడు తానే తగులుకొని వారిని రక్షించును.
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 339-3
సంపుటము: 4-228
|
|
లోకమింతా నిండె లోచూపు వెలిచూపు శ్రీకాంతుఁడై తోఁచె చిక్కినవి యాలా ॥పల్లవి॥ సకలజీవులలోన సర్వేశ్వరుఁడు వాఁడె వొకరి నౌఁగాదన నోపను నేను అకట యాతనిచేఁతే అందరునుఁ జేసేవారే వికటాలెందుకు నాడ వెరపయ్యీ నాకు ॥లోక॥ భువియందు దీని యందు పురుషోత్తముఁడు వాఁడె వివరించ మేలు గీడు వెదక నే నోప చెవి విన్న మాటలెల్ల శ్రీపతియై తోఁచీని ఇవల కల్లనిజాలు యెంచఁజాల నేను ॥లోక॥ పగటందు రేయందు పరమాత్ముఁడు వీఁడె తగిలి పాసే నన్న తలఁపునోప జిగి మించ నాలోన శ్రీవేంకటేశుఁడే బగివాయఁ డెన్నఁడును బదుకవో మనసా ॥లోక॥
|
Details
and Explanations:
పల్లవి:
లోకమింతా
నిండె లోచూపు వెలిచూపు
శ్రీకాంతుఁడై
తోఁచె చిక్కినవి యాలా ॥పల్లవి॥
|
పదబంధం
|
అర్థం
|
|
లోకమింతా నిండె లోచూపు వెలిచూపు
|
ఈ లోకమంతా నిండి పోయెను లోచూపు వెలిచూపు కలిపి
|
|
శ్రీకాంతుఁడై తోఁచె చిక్కినవి యాలా
|
ఈరోజు ఇవన్నీ కలిపి చూచినపుడు ఒకటిగా — శ్రీకాంతుని వలె —
తోచుచున్నవి
|
సూటి భావము:
మనము లోపలి ప్రపంచాన్ని, బయటకు కనిపించే
ప్రపంచాన్ని వేరువేరుగా అనుభవిస్తాం. అందువలన మన అనుభవంలో లోచూపు (లోపలి చూపు),
వెలిచూపు (బయటి చూపు) అనే రెండు భిన్న స్థితులు ఉంటాయి. కాని ఈ పల్లవిలో
కవి చెప్పేది వేరే దృశ్యం. ఇక్కడ కవి ఒక అపూర్వమైన అనుభవాన్ని సూచిస్తున్నారు.
"లోచూపు
వెలిచూపు అన్న భేదం కరిగిపోయి అవి రెండూ కలిసిపోయినట్లు అనిపిస్తున్నది. అప్పుడు ఈ
లోకమంతా ఒకటిగా నిండి పోయినట్లు కనిపిస్తున్నది. ఆ స్థితిలో కనిపించేవన్నీ వేరు వేరు
వస్తువులుగా కాక ఒకే స్వరూపముగా — “శ్రీకాంతుఁడై” — తోచుచున్నవి."
గూఢార్థవివరణము:
మనము
ఏదైనా విషయాన్ని చూచినప్పుడు కేవలం కళ్లతోనే చూడము. మన స్మృతి, ఊహ, గత అనుభవాలు కూడా ఆ చూపులో కలిసిపోతాయి. అందువలన
మనము చూస్తున్నది ఉన్నదానిని ఉన్నట్లుగా కాక, మనలో ఇప్పటికే
నిలిచిన భావాలతో కలిపి చూస్తాం. ఇదే కారణంగా లోపలి ప్రపంచము,
బయటి ప్రపంచము అన్న విభజన మన అనుభవంలో నిలుస్తుంది.
కాని
కవి సూచించే స్థితిలో ఈ విభజన కనిపించదు. లోచూపు వెలిచూపు కలిసినపుడు చూస్తున్నది
ఒకటే. అందుకే కవి “శ్రీకాంతుఁడై తోఁచె” అని అన్నారు. ఇక్కడ ఒక నిర్దిష్ట
దైవరూపాన్ని సూచించుటకన్నా సమస్తమూ ఒకే సూత్రముపై నిలిపి ఉంచే అనుభవాన్ని తెలియజేయుట
ప్రధానమని భావించవచ్చును. లోచూపు వున్నంతకాలము వెలిచూపు ప్రభావితమౌతూనే ఉంటుంది.
అయితే లోచూపును వెలికి తీయలేము. దాచలేము. పనిచేయకుండా చేయలేము. చేయగలిగిన దొక్కటే
— దాని ఉనికిని ఒప్పుట. అప్పుడు మన చూపులో ఉన్న వక్రత స్వయంగా గమనింపబడుతుంది.
అన్నమాచార్యులు
మరొక కీర్తనలో ఇదే భావాన్ని వేరొక రూపంలో సూచించారు:
వెలినుండి
లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి
సత్యము
వెలుపలా, లోపలా సమముగా వ్యాపించి ఉన్నది. (గీత: సమం సర్వేషు
భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్). అయిననూ పలుమారు బయట వెదుకుతావే గాలి (= అజ్ఞానమా! నీలోనే
ఉన్న దానిని బయట వెదుకుతావే).
లోపలలోను
బయటలోను నిండి ఉన్న దానిని మనము బయటనే (ఇతరుల మాటలపై ఆధారపడి) వెదకుటకు అలవాటు పడిన
వారమని కవి సూచిస్తున్నారు.
అందువలన
సమస్య దైవము లేక పోవుట కాదు; మనము చూచు విధానంలో ఉన్నది భేదం. మనకు
సత్యమునకు మధ్య ఏర్పడిన తెర అజ్ఞానము. ఆ తెర తొలగిననాడు లోచూపు వెలిచూపు అన్న విభేదం
సమసిపోయి సమస్తము ఒకటిగా నిండి ఉన్న దృశ్యముగా అనిపిస్తుంది.
మొదటి చరణం:
సకలజీవులలోన
సర్వేశ్వరుఁడు వాఁడె
వొకరి
నౌఁగాదన నోపను నేను
అకట
యాతనిచేఁతే అందరునుఁ జేసేవారే
వికటాలెందుకు
నాడ వెరపయ్యీ నాకు ॥లోక॥
|
Telugu Phrase
|
Meaning
|
|
సకలజీవులలోన సర్వేశ్వరుఁడు వాఁడె
|
సమస్త ప్రాణులలో సర్వేశ్వరుఁడు
అతడే
|
|
వొకరి నౌఁగాదన నోపను నేను
|
వీరిలో ఏ ఒక్కరిని విమర్శించుటకు, నిందిచుటకు సాహసించలేను
|
|
అకట యాతనిచేఁతే అందరునుఁ జేసేవారే
|
అహహ (అశ్చర్యమును తెలుపుతు) ఆతని చేతనే అందరునుఁ చేసేవారైనారు
కదా!
|
|
వికటాలెందుకు నాడ వెరపయ్యీ నాకు
|
ఈ స్థితిలో
వికటపు పనులు ఇంకా నాకెందుకు? అవి చేయుటకు
జంకనా నేను? (చేయ నని తాత్పర్యం)
|
సూటి భావము:
(ఇక్కడ
అన్నమాచార్యులు అను వ్యక్తి లేడు. భేదములన్నీ సమసిపోయి సమస్తము ఒకటైన యంత్రము వలె అగపడుతుండగా
ఆ యంత్ర మూలమును చూచుచు అన్నమాచార్యులు తనలో ఇలా అనుకుంటున్నారు). సమస్త ప్రాణులలో సర్వేశ్వరుఁడు అతడే (ఆ మూలమే). ఇంతమందిలో ఏ ఒక్కరిని
విమర్శించుటకు, నిందిచుటకు సాహసించలేను. అహహ (అశ్చర్యమును
తెలుపుతు) ఆతని చేతనే వీరందరునుఁ చేసేవారైనారు కదా! ఈ స్థితిలో వికటపు పనులు ఇంకా నాకెందుకు?
అవి చేయుటకు జంకనా నేను? (చేయ నని తాత్పర్యం)
గూఢార్థవివరణము:
పల్లవిలో
కవి లోచూపు — వెలిచూపు అన్న భేదం కరిగిపోయిన స్థితిని సూచించారు. ఎటువంటి హెచ్చుతగ్గులు
లేనప్పుడు, సమస్తము ఒకే మూలమునుంచి వచ్చినప్పడు చేయగలిగిన కార్యమేమ? ఉదాహరణకు, మీరు కూరగాయలు కోస్తున్నప్పుడు పొరపాటుగా
మీ చేయి కోసుకుందని అనుకోండి. అప్పుడు మీరు ఎవరిని నిందిస్తారు? వాస్తవానికి గాయానికి మందు వేసుకొని, కట్టుకట్టి,
అది తగ్గేవరకు నిరీక్షిస్తారు. కవి చెప్పేది కూడా ఇదే — అట్టి
స్థితిలో నిందకు స్థానం ఉండదు.
అలాగే
“వికటాలెందుకు” అన్న మాట పరిశీలించదగ్గది. వికటం
అంటే విరుద్ధము, అక్రమము. ఈ ప్రపంచములో ఒక సహజ కార్యక్రమము
జరుగుతున్నది. అయితే మానవుడు చేసే కొన్ని కార్యములు ఆ సహజ కార్యక్రమముతో
విరుద్ధముగా నిలుస్తాయి.
ఉదాహరణకు
పాలిథిన్ సమస్యను తీసుకోవచ్చు. అది లోకములో మనుష్యులే సృష్టించిన సమస్య.
(అలాగని అభివృద్ధి ఉండకూడదని కాదు.) కానీ మానవుని కార్యములు సహజ ప్రకృతి
కార్యక్రమములకు విరుద్ధముగా జరిగిన సందర్భాలు అనేకం.
కాని
సమస్తమూ ఒకే మూలమునుండి జరుగుతున్నదని గ్రహించినపుడు, మానవుని కార్యముల పరిమితి కూడా స్పష్టమగుతుంది. అప్పుడు అతడు విచిత్రమైన,
విరుద్ధమైన చర్యలకు దిగకుండా జాగ్రత్తపడతాడు. అందుకే కవి “వికటాలెందుకు” అని ప్రశ్నిస్తున్నారు.
రెండవ చరణం:
భువియందు
దీని యందు పురుషోత్తముఁడు వాఁడె
వివరించ
మేలు గీడు వెదక నే నోప
చెవి
విన్న మాటలెల్ల శ్రీపతియై తోఁచీని
ఇవల
కల్లనిజాలు యెంచఁజాల నేను ॥లోక॥
|
Telugu Phrase
|
Meaning
|
|
భువియందు దీని యందు పురుషోత్తముఁడు వాఁడె
|
భూలోకములోను, ఈ స్థితిలోను
పురుషోత్తముఁడు వాడొకడె
|
|
వివరించ మేలు గీడు వెదక నే నోప
|
చెప్పాలంటే దీనిలో మేలు కీడు వెదుకుట నా తరము కాదు
|
|
చెవి విన్న మాటలెల్ల శ్రీపతియై తోఁచీని
|
చెవితో విన్నవన్నీ శ్రీపతియై తోచగాను
|
|
ఇవల కల్లనిజాలు యెంచఁజాల నేను
|
(ఇవల = ఇటువైపు) ఇటువైపు ల్లనిజాలు యెంచఁ సామర్థ్యము
లేదు.
|
సూటి భావము:
భూలోకములోను, ఈ స్థితిలోను పురుషోత్తముఁడు వాడొకడె. దీనిలో మేలు కీడు వెదుకుట నా తరము కాదు.
(ఇది మంచిదో కాదో కూడా నిర్ణయించలేను). చెవితో విన్నవన్నీ శ్రీపతియై తోచగాను ఇటువైపు
కల్లనిజాలు యెంచఁ సామర్థ్యము లేదు (నేను అలాగా అలోచించలేను)? {నాకు దైవమిచ్చినదంతా సమ్మతము. నాకై నాకు అవి మంచివో కాదో చెప్పలేను.}
గూఢార్థవివరణము:
మనము సాధారణంగా న్యాయాధిపతిలా
కనబడిన, వినబడిన ప్రతి విషయంపైన తీర్పులు చెప్పుటకు అలవాటు
పడిన వారము. కానీ ఈ చరణములో అన్నమాచార్యులు తనకు అటువంటి సామర్థ్యం లేదని అంటున్నారు.
ఎందుకంటే సమస్తమూ ఒకే మూలమునుండి ఉద్భవించినట్లు అనిపించినపుడు “మేలు — కీడు” అనే విభజనకు
స్థానం ఉండదు.
మన అభిప్రాయాలే ఇష్టాయిష్టాలను
నిర్ణయిస్తాయి. కానీ మనము వరణాత్మకమైన (= వరించుట, ఎంచుట,
ఎన్నుకొనుట; selective — one at the exclusion of the other)
ప్రపంచములో జీవిస్తున్నాము — అనగా ఒకదానిని ఎంచుకొని మరొకదానిని వదిలే
చూపులో. అట్టి చూపులో ప్రపంచములో తారతమ్యములు, భేదములు,
హెచ్చుతగ్గులే కనిపిస్తాయి.
కాని కవి చెప్పే స్థితిలో అట్టి
ఎంపికకు ఆధారం ఉండదు. అందువలన వినబడిన మాటలన్నీ “శ్రీపతియై” తోచినపుడు, వాటిలో ఏది నిజమో, ఏది కల్లో చెప్పుటకు ఉద్యమించడు.
ఇక్కడ అన్నమాచార్యుల ఇంకొక
కీర్తన గుర్తు చేసుకొనుట ముఖ్యము.
ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
లోకరంజకము తమలోనిసమ్మతము
భావము: ఈ అల్లకల్లొల ప్రపంచము
అపురూపము అశక్యము, దివ్యము అగు సమ్మేళనము. అందులోని భాగమైన నిన్ను నీవు గుర్తించి సమ్మతించిన లోకరంజకము.
మనిషి తనతో తాను అంతర్గతముగా
సహవాసము చేయలేక పోవుటయే అసౌకర్యమునకు కారణము. అందుకు ఉన్నదానిని ఉన్నట్లుగా సమ్మతించక
సర్దిచెప్పుకుపోవు ప్రయత్నములు చేసెదము. ఇది కొనుగోలు చేసిన సంధి. దీనికి మూల్యము
చెల్లించక తప్పదు.
మూడవ చరణం:
పగటందు
రేయందు పరమాత్ముఁడు వీఁడె
తగిలి
పాసే నన్న తలఁపునోప
జిగి
మించ నాలోన శ్రీవేంకటేశుఁడే
బగివాయఁ
డెన్నఁడును బదుకవో మనసా ॥లోక॥
|
Telugu Phrase
|
Meaning
|
|
పగటందు రేయందు పరమాత్ముఁడు వీఁడె
|
పగలు (జీవించి ఉన్నప్పుడు) రాత్రి (మరణించి నప్పుడు) కూడా పరమాత్ముఁడు
వీఁడె
|
|
తగిలి పాసే నన్న తలఁపునోప
|
తలచుకొనగా నన్ను తగులుకొని తానే రక్షించెను
|
|
జిగి మించ నాలోన శ్రీవేంకటేశుఁడే
|
జిగేలు మనగా మించిన ఎన్నో మెరుపులుగా వున్నాడీ శ్రీవేంకటేశుఁడే
|
|
బగివాయఁ డెన్నఁడును బదుకవో మనసా
|
నిన్నేప్పుడు వదలడు శ్రీవేంకటేశుఁడు. ఇది తెలిసి బతకవో మనసా
|
సూటి భావము:
పగలు (జీవించి
ఉన్నప్పుడు) రాత్రి (మరణించి నప్పుడు) కూడా పరమాత్ముఁడు వీఁడె. తలచుకొనగా నన్ను తగులుకొని
తానే రక్షించెను. జిగేలు మనగా మించిన ఎన్నో మెరుపులుగా వున్నాడీ శ్రీవేంకటేశుఁడే. శ్రీవేంకటేశుఁడు మిమ్మల్ని వదలి ఎప్పుడు లేడు. మానవులారా
ఇది గ్రహించి బతకండి.
గూఢార్థవివరణము:
అన్నమాచార్యులు ఇక్కడ అతి ముఖ్యమైన
విషయమును సూచించుచున్నారు. ఆ జీవులకు జీవించి ఉన్నప్పుడు మరణించి నప్పుడు కూడా పరమాత్ముఁడు
తగులుకొని తానే రక్షించెను అన్నది గమనార్హం. దీఒకటి మాత్రం సత్యం. జీవమును మరణమును
కలుపునది అత్యంత విచిత్రమైనదై వుండవలెను. మనము ఊహించలేనిది. దానిపై మరింత చర్చ కేవలము
కల్పితాంశము. చిత్రం దీనిపై కొంత విశదముగా హిల్మా ఆఫ్ క్లింట్ హంస నం. 9 అను చిత్ర రూపములో చెప్పినది. మరింత వివరణకోరువారు క్రింది లింకు ద్వారా చదువగలరు. హంస నం. 9
బగివాయఁ డెన్నఁడును బదుకవో
మనసా: మానవులారా దైవము మనల్ని విడిచి దూరంగా లేడు. ఆయనను
సులభముగా చేరుకొనవచ్చును. నన్ను రక్షించినవాడు మిమ్మల్ని రక్షించడా? మనసా అని చెప్పి, మనసును పునీతము చేసుకుంటే చాలు అన్నారు.
X-X-The
END-X-X
No comments:
Post a Comment