తాళ్లపాక అన్నమాచార్యులు
315 ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు
For English version
press here
ఉపోద్ఘాతము
ఈ కీర్తన వింటూనే లేక చదువుతూనే
“మెట్టవేదాంతాన్ని వల్లె వేశారు అన్నమాచార్యులు” అనడానికి అవకాశాలు ఎక్కువ వున్నాయి. పైగా వారు తమ కాలమునకు తగ్గట్లుగా దైవమునకు
సంబంధించిన కల్పనలు, మనోచిత్రములను విరివిగా వాడిరి. అవి ఈ భావనను మరింత ప్రేరేపిస్తాయి. కానీ వారు
ఒక సున్నితమైన స్థితిని తాకి, ఆ స్థితిలో తాను అనుభవించిన దానిని
సహజముగా వ్యక్తపరిచారు. తత్వము మాట్లాడటం వేరు. అనుభవించటం వేరు. మాట్లాడే వారు కోకొల్లలు.
అనుభవించి చెప్పిన వారు అరుదు. నిజంగా దైవము తెలిసినవారి మాటలు చాలా సాధారణముగా
వినిపిస్తాయి; తెలియని వారి మాటలే ఎక్కువగా రుచిగా
అనిపిస్తాయి.
మన మేధస్సు తెలిసిన దానికే అయస్కాంతంలా అతుక్కుపోతుంది. అందువలన
ఈ కీర్తనలోని పదములు మొదట వినుటకు సాధారణంగా అనిపించవచ్చు. భగవద్గీతలో (2.69) చెప్పినట్లు — ప్రపంచమునకు పగలు అనిపించేది
జ్ఞానులకు రాత్రి; ప్రపంచమునకు రాత్రి అనిపించేది జ్ఞానులకు
పగలు. ఈ విషయమును దృష్టిలో పెట్టుకోకపోతే, ఇటువంటి మాటలు
వట్టి మాటల్లా అనిపించుట సహజమే. ఈ కీర్తనలో కవి అడిగిన “ఎక్కడి పుట్టుగలు? ఇకనేక్కడి మరణములు?” అనే ప్రశ్న కూడా ఒక విధంగా దృష్టి
కోణమును పరీక్షించునదే.
కీర్తనలోని ఘట్టముల పురోగతి
పల్లవి: జీవన్మరణములు
వేరు వేరు ఘటనలు కావు
మొదటి చరణము: దైవముపై ఎడతెగని ఆసక్తితో భక్తి పరిపూర్ణమగును
రెండవ చరణము: ఇతరములమీద ఆధారము తగ్గిపోతుంది
మూడవ చరణము: భగవంతుని కృప శరీరమంతా వ్యాపిస్తుంది.
|
అధ్యాత్మ సంకీర్తన
|
|
రేకు: 280-2
సంపుటము: 3-460
|
|
ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో ॥పల్లవి॥ కెరల పాపములకుఁ గెరల కర్మములకు హరి నీ నామము నోరనంటితేఁ జాలు నరకములేమి సేసు నా నేరమేమిసేసు నిరతి నా మతిలోన నీ వుండఁగాను ॥ఎక్క॥ చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటికి నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా ॥ఎక్క॥ దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా యెగ్గులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన వుగ్గువలె నీప్రసాద మూనినది వొడల ॥ఎక్క॥
|
Details
and Explanations:
పల్లవి:
ఎక్కడి పుట్టుగ
లిఁక నెక్కడి మరణములు
మిక్కిలి
నీ ముద్రలు నా మేననున్న వివిగో ॥పల్లవి॥
|
పదబంధం
|
అర్థం
|
|
ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు
|
(కవి దైవముతో కాదు, తనలోనే
కానీ వ్యక్తీకరణకు అందని ఇంకొక దానిని సంబోధిస్తూ ఇలా అంటున్నారు) ఈ పుట్టుకలు మరణములు
ఇంకెక్కడ?
|
|
మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో
|
(మిక్కిలి = లెక్కించ లేనన్ని) నేనెక్కడ చూచినా నీ ముద్రలే నాలోనూ
బయటా (అంతటా) కనబడుతున్నవి
|
సూటి భావము:
(కవి దైవముతో కాదు, తనలోనే కానీ వ్యక్తీకరణకు అందని ఇంకొక
దానిని సంబోధిస్తూ ఇలా అంటున్నారు) ఈ పుట్టుకలు మరణములు ఇంకెక్కడ? నేనెక్కడ చూచినా నీ ముద్రలే నాలోనూ బయటా (అంతటా) కనబడుతున్నవి.
గూఢార్థవివరణము:
“ఎక్కడి
పుట్టుగ? ఎక్కడి మరణములు?”
ఇది భౌతికముగా
పుట్టుకలు, మరణములు లేవని చెప్పుట లేదు. క్రిందటి కీర్తనలో
బాహ్యముగాను, అంతరంగములోను జరిగే ఘటనలు వేరు వేరు కావని,
అవి అన్నీ ఒకే త్రాటిపై నడచు విషయములని తెలుసుకున్నాము.
కానీ మనస్సు
ఒక దానిని పట్టి ఇంకొక దానిని మొదటి దాని కంటే
వేరుగా చూచునని తెలుసుకున్నాము. మనిషి మౌలికముగా లోని ప్రపంచమును, బయటి ప్రపంచమును వేరు చేయును. ఇదే మూల విభజన. సమస్యలన్నింటికీ దోహదము చేయునది.
కానీ ఈ పట్టి ఉంచుటకు ఎకైక కారణము మనస్సు. అది తన నిరంతర
కొనసాగింపును కాపాడుకొనుటకై ఈ విభజనను పట్టి ఉంచుతుంది.
“నీ ముద్రలు”
ఈ పల్లవిలో
“నీ ముద్రలు” అని ఎందుకన్నారో గమనింతుము: “ముద్ర” అంటే ఒక గుర్తు, ఒక చిహ్నం. (కవి క్రిందటి కీర్తనలో బాహ్యము అంతరంగముల మధ్య దూరం కరిగిపోవుట
చెప్పుకున్నాము) కవికి ఆ ముద్రలే తన శరీరంతటా — తనలోనూ బాహ్యముగాను కనబడుతున్నవి. కవి ఈ రకముగా తాను చూచు సమస్తము ఒకే సూత్రములోని
విషయములని స్వయముగా గ్రహించి “ఎక్కడి పుట్టుగ? ఎక్కడి మరణములు?”
అనగా పుట్టుక, మరణములను మనస్సు వేరు వేరు
ఘటనలుగా చూచుటనే ప్రశ్నిస్తున్నారు.
ఈ దృశ్యమయ ప్రపంచము కనబడినంత సులువుకాదు. కనబడనంత కఠినము కాదు. నేర్పు చూచుటలోనే ఉన్నది. అదే
భగవద్గీత చెప్పునది. "యః పశ్యతి స పశ్యతి" (ఆ రకముగా చూచువాడు ద్రష్ట).
మొదటి చరణం:
కెరల పాపములకుఁ
గెరల కర్మములకు
హరి నీ నామము
నోరనంటితేఁ జాలు
నరకములేమి
సేసు నా నేరమేమిసేసు
నిరతి నా
మతిలోన నీ వుండఁగాను ॥ఎక్క॥
|
Telugu Phrase
|
Meaning
|
|
కెరల పాపములకుఁ గెరల కర్మములకు
|
(కెరల= అతిశయించు,
విజృంభించు), విజృంభించు పాపములకుఁ, లేక్కలేనన్ని కర్మములకు
|
|
హరి నీ నామము నోరనంటితేఁ జాలు
|
హరి నీ నామము నోటితో పలికితే చాలు
|
|
నరకములేమి సేసు నా నేరమేమిసేసు
|
నరకములేమి చేయును నా నేరములు ఎన్నైనా ఏమి చేయును
|
|
నిరతి నా మతిలోన నీ వుండఁగాను
|
(నిరతి = ఎడతెగని) ఎడతెగని ఆసక్తితో నా మతిలో నీవుండగాను
|
సూటి భావము:
శ్రీహరి
నీ నామము నోటితో పలికితే చాలు నా శరీరములో విజృంభించు పాపములు, లేక్కలేనన్ని కర్మములు మటుమాయమైపోవా?
మిక్కిలి ఆసక్తితో నా మతిలో నీవుండగాను నరకములు, నా తప్పులు వాటంతట అవే తొలగిపోతాయి.
గూఢార్థవివరణము:
మొదటి చూపులో
ఈ చరణము "హరి"మీద భారమువేసినట్లు కనబడుతున్నా, మనము ఇప్పటి వరకు చేసిన పాపములు, కర్మములకు పరిష్కారం హరి నామము నోటితో పలికితేనే లభించగలదని అన్నారు.
ఎంత గట్టిగా పిలచితే హరి దగ్గరకు మన మాట చేరుతుంది? గమనించితే, మన మాట ఇక్కడే, ఈ సంసారములోనే
వుండి పోతుంది. పరములో వున్న హరి దగ్గరకు చేరే వీలు లేదు. అనగా అన్నమాచార్యులు పైపైకి
సులభంగా అనిపింప చేసినా హరి నామము నోరనంటుటకు చేయ వలసిన పనిని నాలుగవ పంక్తిలో చెప్పారు.
ఈ చరణములో
"నిరతి నా మతిలోన నీ వుండఁగాను" అన్నది కీలకము = ఎడతెగని ఆసక్తితో నా మతిలో నీవుండగాను". నిరతి
= ఎడతెగని అని ముఖ్యంగా గమనించ వలసినది. కొంత సేపు హరి,
కొంత సేపు సంసారము అంటే కుదరదు. విడువకుండా హరినే పట్టుకొని వుండు ఆసక్తి
సులభము కాదు. అది ఇతర ఆలోచనలకు చోటు లేకుండా నిలిచే ఆసక్తి. ఇంతకు ముందు కీర్తనలో చెప్పుకున్నట్లు దేహముపై మమకారము ఉన్నంత వరకు పరము మనలో ప్రత్యక్షమవ్వదు.
మరి మన
కాబట్టి అన్నమాచార్యులు సులభమైన విషయమేమీ చెప్పలేదు. ఉన్న దానిని మాత్రమే చెప్పారు. కేవలం ఇనుమును బంగారం
చేయు కృషి కంటే నేను ఇనుమును అను స్పృహ లేకున్న ప్రయత్నములు ఫలించవు.
రెండవ చరణం:
చిక్క నింద్రియములకు
చిక్కను బంధములకు
చొక్కి హరి
నీ మఱఁగు చొచ్చితిఁ జాలు
మొక్కనేలే
యెవ్వరికి మొరవెట్ట నేమిటికి
నిక్కపు
మా యిలువేల్పు నీవై వుండఁగా ॥ఎక్క॥
|
Telugu Phrase
|
Meaning
|
|
చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు
|
ఇంద్రియములకు బంధములకు చిక్కకుండా
|
|
చొక్కి హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు
|
(చొక్కి=పరవశముతో; మఱఁగు=అధీనము)
పరవశించి నీ అధీనమైతిని. అంతే చాలు.
|
|
మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటికి
|
ఎవరికో మొక్కనేలా? ఎవ్వరవ్వరికో మొరపెట్టనేలా?
|
|
నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా
|
(నిక్కపు=యథార్థముగా) నిజముగా మా అందరి హృదయములను
ఇండ్లకు నీవు దేవుడవై ఉండగా
|
సూటి భావము:
ఓ హరి!
ఇంద్రియములకు బంధములకు చిక్కకుండా పరవశించి నీ అధీనమైతిని. అంతే చాలు. నిజముగా మా అందరి
హృదయములను ఇండ్లకు నీవు దేవుడవై ఉండగా ఎవరికో మొక్కనేలా? ఎవ్వరవ్వరికో మొరపెట్టనేలా?
గూఢార్థవివరణము:
నిక్కపు మా యిలువేల్పు నీవై
వుండఁగా (= అయ్యా! నీవే అందరి హృదయములను ఏలుతూ ఉండగా). ఇక్కడ అన్నమాచార్యులు అందరి
హృదయములలో దైవము వున్నాడని చెబుతూనే అసలైన
మాట “మొక్కనేలే యెవ్వరికి మొరవెట్ట నేమిటికి”
అని ముందు పంక్తిలో చెప్పనే చెప్పారు. అంటే హృదయములోని దైవమును కనుగొంటే చాలు. ఎవరికి
మొక్కనవసరం లేదు. అంటే పొగరుగా వుండమని కాదు,
వాస్తవంగా అణిగి వుండమని. ముఖ్యంగా గమనించ వలసినదేమంటే తనను తాను తెలియుటకు
"తాను ఇనుమును" అన్న వాస్తవమును అంగీకరించాలి. ఆ సున్నితమైన, కానీ ఖచ్చితమైన ఎదురులేని అవగాహనతో
మొదలు పెడితే "ఎవరికో మొక్కనేలా?
ఎవ్వరవ్వరికో మొరపెట్టనేలా?" ఇంకొక విచిత్రము
కానీ స్పృశించ తగ్గ విషయము స్వాతంత్ర్యము పొందుటకు హరికి అధీనము కావలెను. ఇదే చిక్కుముడి.
ఇప్పటి స్వతంత్రత బంధము. హరికి అధీనమైన స్వాతంత్ర్యము
చొక్కి
హరి నీ మఱఁగు చొచ్చితిఁ జాలు: అన్నమాచార్యులు ముందటి కీర్తనలో సుకుమారము,
సొగసుతనము, అందము కలబోసిన శాశ్వతమైన దానిని వీక్షించారని
తెలిసితిమి. అట్టి దానికి తాదాత్మ్యము చెంది అక్కడే ఉండ నిశ్చయించారు. అందుకే 'చిక్క నింద్రియములకు చిక్కను బంధములకు'
అని అన్నారు. (ఆ స్థితిలో ఇంద్రియబంధములకు
చిక్కకుండా నిలిచారు.)
కానీ అంతర్లీనముగా కవి
భక్తులను హరిని కనుగొనుటకు తమ స్వతంత్ర దృష్టిని ప్రయోగించమని సూచిస్తున్నారు.
హరిని కనుగొనుటకు ముందుగా ఏర్పడిన మార్గములు పనికిరావు. ఒకరు నడిచిన మార్గమును
మరొకరు అనుసరించినా అదే ఫలితము కలుగదు. అందువలన తమకై తాము తెలియనివారు హరిని
వెదుకుటలో తడబడుట సహజము. ఇక్కడ స్వధర్మమును (= తన గుణములను అనగా తానేమిటో) తెలియుట ముఖ్యము.
మూడవ చరణం:
దగ్గరవు
మాయలింక దగ్గరవు దుర్గుణాలు
నిగ్గుల
శ్రీవేంకటేశ నీవు గల్గఁగా
యెగ్గులేదు
తగ్గులేదు యిఁక నీదాసులలోన
వుగ్గువలె
నీప్రసాద మూనినది వొడల ॥ఎక్క॥
|
Telugu Phrase
|
Meaning
|
|
దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు
|
మాయలు దుర్గుణాలు దగ్గరకు రావు
|
|
నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా
|
కాంతితో నిగనిగలాడు శ్రీవేంకటేశ నీవు గల్గఁగా
|
|
యెగ్గులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన
|
అపరాధము లేదు, తక్కువాలేదు
నీ దాసులకు
|
|
వుగ్గువలె నీప్రసాద మూనినది వొడల
|
(వుగ్గు= పసిపిల్లలకు ఆముదముతో చనుబాలు కలిపిపెట్టు) బిడ్డలకు
ఉగ్గు శరీరమంతా వ్యాపించినట్లు నీ ప్రసాదము నా మేనంతా (వళ్ళంతా) ఎక్కినదయ్యా
|
సూటి భావము:
కాంతితో
నిగనిగలాడు శ్రీవేంకటేశ నీవు గల్గఁగా మాయలు దుర్గుణాలు దగ్గరకు రావు. బిడ్డలకు ఉగ్గు
శరీరమంతా వ్యాపించినట్లు నీ ప్రసాదము నా మేనంతా (వళ్ళంతా) ఎక్కినదయ్యా. ఇప్పుడు నీ
దాసులకు అపరాధము లేదు, తక్కువాలేదు.
గూఢార్థవివరణము:
ఉగ్గు కొంత చేదుగాను, కొంత వెగటుగాను, పసిపిల్లలకు రుచికరముగా వుండదు. అయినా,
తల్లి వారి మంచికై ఉగ్గు పెడుతుంది. ఇక్కడ వళ్ళంతా ఉగ్గు ఎక్కినదయ్యా
అని అన్నమాచార్యులు పల్లవిలోని "మిక్కిలి నీ ముద్రలు నా మేననున్న వివిగో"
అన్న దానిని నిర్ధారిస్తున్నారు.
కొంత చేదు, కొంత వెగటుగల ఉగ్గు లాగే, భగవంతునికి అహము సమర్పించుటలో
కొంత కష్టము, కొంత అసౌకర్యము వుంటాయని భావించవచ్చును. అయితే అవి
మేలు కలిగించేవి కాబట్టి ఓర్చుకోమని ఆచార్యుల ఉద్దేశమేమో!
వ్యాఖ్యానంతర సమీక్ష:
ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి.
మనము గడుపుతున్న ఈ వ్యయప్రయాసల కోర్చిన జీవితము జీవితమేనా? ఇదే విషయమును అన్నమాచార్యులు ఇలా అన్నారు. "చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి?
మరణమేమి?"
X-X-The
END-X-X
No comments:
Post a Comment