తాళ్లపాక అన్నమాచార్యులు
245 ఏ కాలమేది దనకెట్ల సుఖమైయుండు
For English version press here
ఉపోద్ఘాతము
కృతిరస విశ్లేషణ: ఈ కీర్తనని ప్రధానముగా ‘ధ్వని కావ్యం’గా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ధ్వనించ బడినది. కృతి విషయమంతా లక్ష్యార్థము అనిపిస్తుంది.
దీనిలోని స్థాయీ భావమును ‘వైరాగ్యం’గా భావిస్తే కృతిలోని ముఖ్య రసము ‘శాంత రసము’ అని మనకు తెలుస్తుంది. ఇందులోని శృంగారము ‘అంగిరసమై’ సౌందర్యమును, ఆత్మీయ భావనను కలిగిస్తుంది.
ఇది విలక్షణమైన ప్రక్రియ. ఇటువంటి సాధారణంగా బాహ్యముగా శృంగారము కనబడును. సాధారణంగా హాస్య రసము, వీర రసము అంగీరసములుగా వుండును. కానీ ఈ కృతిలో శాంత రసమునకు శృంగారము అంగీరసముగా కలుపుట కష్టసాధ్యము.
సాహిత్యమును
అర్ధము చేసుకొనుట కష్ట సాధ్యము కనుక ఈ కీర్తనను ‘నారికేళ
పాకము’గా భావించ వలెను.
శృంగార కీర్తన |
రేకు: 74-3 సంపుటము: 5-255 |
ఏ కాలమేది దనకెట్ల సుఖమైయుండు
-
నా కాలవశతఁ దానట్లుండవలనె
॥పల్లవి॥ బలువియోగాగ్ని దలఁపంగ నెట్టిదొకాని
చలిగాలి యెండనుచు జాలిఁ బడవలనె
వలరాజుకోపమెటువంటిదో పడఁతులకు
తలిరాకు చేఁదనుచుఁ దలపోయవలనె
॥ఏకా॥ భావంబు తలపోఁత బలిమెట్టిదోకాని
నోవి దోఁపనిచోట నొచ్చెననవలనె
ఈ విరహపరితాపమిఁకనెట్టిదో
కాని
కోవిలల కూఁతలకుఁ గోపించవలనె
॥ఏకా॥ తిరువేంకటేశుకృప తియ్యమెట్టిదొ
కాని
చిరునవ్వు మోవిపైఁ జెరలాడవలనె
సురతసౌభాగ్యముల సొంపులెట్టివొ
కాని
మురిపెంపుఁ గనుచూపు ముయ్యఁగావలనె ॥ఏకా॥
|
Details and Explanations:
పల్లవి:
Telugu
Phrase |
Meaning |
ఏ కాలమేది |
ఏ కాలమెలా
వుంటుందో ఎవరికీ తెలియదు |
దనకెట్ల సుఖమైయుండు |
అది మనకు
సౌఖ్యం ఇస్తుందా లేదా చెప్పలేం. |
నా కాలవశతఁ
దానట్లుండవలనె |
కాలం ఎలా నడిపిస్తే, దానికి వశులమై అలా ఉండక తప్పదు. |
|
|
ప్రత్యక్ష భావము:
వ్యాఖ్యానం:
Part 1:
Part 2:
భావము: కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు; కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును.
దీని అర్థం ఏమిటంటే—దైవం ఒక సమయపాలకుడిలా కూర్చొని, మంచి కాలం, చెడు కాలం ఏర్పరచి, ఫలాలు పంచే వాడు కాదు. మనం అనుకునే కాలం—దానిలోని సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నీ ప్రకృతి యొక్క సహజ క్రమం.
ఈ ప్రకృతి ప్రవాహంలో చిక్కుకున్న మనసు మాత్రం “కొంచెం వేచి చూద్దాం, మంచి కాలం వస్తుంది, దేవుడు సులభం చేస్తాడు” అని ఆశపడతాం. కానీ —ఆ ఆశ తప్పుదారి అనికృష్ణుడు చెబుతున్నాడు. ప్రభువు అకర్త—గుణాల ఆటలో ఆయనకు సంబంధం లేదు. కాలం ప్రవహించడమూ, కర్మఫలాలు కలగడమూ స్వతహాగా జరుగుతుంది.
అందుకే
మంచి కాలం కోసం ఎదురు చూడటమే మాయ. కాలానికి ఆది లేదు,
అంతమూ లేదు; అది సుఖాన్ని హామీ ఇవ్వదు. దైవం మాత్రం
కాలాతీతం, ఆ ప్రవాహానికి అతీతం. దానిని చేరుకోవడానికి కాలంతో
బంధింపబడిన యత్నం లేదా ఎదురుచూపు ఉపయోగం లేదు.
మొదటి చరణం:
పదబంధం |
అర్ధము |
బలువియోగాగ్ని
దలఁపంగ నెట్టిదొకాని |
పలు వియోగాగ్నులను తలపోయగా, అవియేమిటో గాని |
చలిగాలి
యెండనుచు జాలిఁ బడవలనె |
చలిగాలి కూడా 'వేడి'యనుచు నామీద నేనే జాలి పడవలసె |
వలరాజుకోపమెటువంటిదో
పడఁతులకు |
చంద్రుని కోపమెటువంటిదో గానీ ప్రియురాళ్ళకు |
తలిరాకు చేఁదనుచుఁ దలపోయవలనె |
తీయని చిగురాకులు 'చేదు' అనుకొంటూ గడపవలసె |
ప్రత్యక్ష భావము
ఓ
దైవమా! సుఖమైన కాలాన్ని ఇస్తావని నిన్ను ప్రేమిస్తే,
దానికి బదులు నీవిచ్చేది ఈ వియోగాగ్నులే— అవి ఎలా ఉంటాయంటే…
చల్లని గాలీ ఎండలాగా అనిపించి, నాపైన నేనే
జాలి పడవలసివస్తుంది;
పైగా ఈ చంద్రుని కోపమెటువంటిదంటే,
ఆ మృదువైన ప్రియురాలినే ఎంత దహింపజేస్తుందో గానీ…
తీయని చిగురాకులకూడా చేదుగా అనిపించుకునే రోజులు వచ్చాయి.
నిన్ను ప్రేమించడమే మా తప్పా?
వ్యాఖ్యానం:
“మాయ గుచ్ఛం”:
మాగ్రిట్ గారు వేసిన “పుష్పగుచ్ఛం”
పరిశీలించండి. చూపరులకు ముద్దుగావున్న కుండ ఒక గదిలోని బల్లపై ఉంచబడింది.
బల్ల, గోడలు ముదురు రంగులో ఉండటంతో కుండ మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ పుష్పగుచ్ఛంలా అనిపిస్తున్న ఆ ఆకృతి నిజంగా లేదు—అది కేవలం అలా కత్తిరించబడిన
ఆవరణం (ఒక కటౌట్) మాత్రమే. ఆ రంధ్రం గుండా వెలుపలున్న నీలి ఆకాశం, సూర్యకాంతితో నిండిన ప్రకృతి, పుష్పాలతో విరబూసిన మొక్కలు
కలిసి చిత్రాన్ని పుష్పగుచ్ఛమని మన కంటికి మోసగిస్తున్నాయి. చిన్న చిన్న పువ్వులు కుండలోనే
పెరిగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ, అవి నిజానికి బయటివే. సూర్యకాంతి
ఆ పుష్పాలను మరింత వెలుగులో ముంచుతూ, మాయ మరియు వాస్తవం మధ్య
ఉన్న సరిహద్దును చెరిపేస్తోంది.
వర్ణించలేని వియోగాగ్ని
పుష్పగుచ్ఛం—మృదువుగా, అందంగా,
కానీ దాని చుట్టూ ఖాళీని గుర్తు చేసే కొనరేఖ,
ఆ రేఖలే మన జీవన సాకులు,
మిషలు, మోహములు, పోషణలు,
తలములు.
మన ప్రేమ కూడా—
మొదట సువాసనగా అనిపించే,
పెంచుకున్న మమతలై,
కాల గమనంతో శూన్యమై,
తీయని చిగురాకులు చేదుగా మారిపోవు.
మనసు ఆలింగనం చేసేది
తనకు విరుద్ధమై జారిపోతుంది,
చివరగా హృదయం అడుగుతుంది—
“నిన్ను ప్రేమించడమే మా తప్పా?”
ఆ బొకే అందం మాత్రం మిగిలే ఉంది,
చెదరలేదు, చెదరదు కూడా.
ఇప్పుడు ఆ భావన
హద్దులను చెరిపేస్తూ ఇంటా బయటా నిండిపోయింది.
నాకే స్వంతమని ఆ గదిలోనే ఉంచబోతే
ఆ అందం మాయమవుతుంది.
హద్దులు గీసుకుంటే ఆ భావన ఉండదు.
ఎల్లలు దాటితేనే అందం.
నీవు గీసిన పొలిమేరలే బంధం.
రెండవ చరణం:
పదబంధం (Phrase) |
అర్థం (Telugu) |
భావంబు
తలపోఁత బలిమెట్టిదోకాని |
అతనిని
తలచే భావముల బలిమి ఎట్టిదో తెలియదు కాని |
నోవి దోఁపనిచోట
నొచ్చెననవలనె |
బాధ తెలియని
చోట కూడా నొప్పి పుట్టి నట్లనిపింప జేసె |
ఈ విరహపరితాపమిఁకనెట్టిదో
కాని |
అతని విరహ
తాపము ఎటువంటిదో కానీ |
కోవిలల కూఁతలకుఁ గోపించవలనె |
కోయిలల
కూతలకు ఎడబాటు హెచ్చి వాటిపై కోపించ వలసె |
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
మూడవ చరణం:
Telugu Phrase |
Meaning |
తిరువేంకటేశుకృప
తియ్యమెట్టిదొ కాని |
తిరువేంకటేశుకృప ఎంత తియ్యనిదో తెలియదు కానీ |
చిరునవ్వు
మోవిపైఁ జెరలాడవలనె |
నా పెదవులపై చిరునవ్వు ఆట్లాడినది |
సురతసౌభాగ్యముల
సొంపులెట్టివొ కాని |
నైపుణ్యము గల కలయికలు సొగసులు ఉల్లాసములు తెలియవు
కానీ |
మురిపెంపుఁ గనుచూపు ముయ్యఁగావలనె |
శృంగారపు ముద్దులతో కనులు మూయగా వలసె |
ప్రత్యక్ష భావము:
తిరువేంకటేశుని
కృప ఎంత తీయనిదో నాకు తెలియదు,
కానీ నా పెదవులపై చిరునవ్వు ఆడిపాడింది.
సంగమంలోని
నైపుణ్యం,
ఆ కలయికలోని సొగసులు, ఉల్లాసములు ఎంతవో
తెలియదు,
కానీ ఆ మురిపెంపు ముద్దులు కళ్లను మూయించేంతగా మత్తెక్కించాయి.
తిరువేంకటేశుని కృప ఎంత తీయనిదో మాటల్లో చెప్పలేను.
ఆ సహానుభూతి తాకిన క్షణంలో
‘ఇది నేను’, ‘అది బయట’ అనే సరిహద్దులన్నీ
కరిగిపోయాయి.
అది శృంగారపు నైపుణ్యం కాదు,
ఆత్మసమర్పణలో కరిగిపోయే మధురత.
ఆనందమో, శాంతమో, తీయదనమో—ఏమో
తెలియదు,
అది అలలై పొంగి,
చిరునవ్వు స్వయంగా నా పెదవులపై తేలియాడింది.
ఆ క్షణం, యుగయుగాల సంగమంలా—
అనుభవించే ‘నేను’ ఎక్కడా లేను.
ప్రపంచం, నేనూ, దైవమూ
ఒకటయ్యాం.
ఆ స్థితిలో చుట్టూ ఏ జగత్తు ఉందో తెలియదు,
కళ్ళూ సహజంగానే మూసుకున్నాయి.
వ్యాఖ్యానం:
ప్రజల
మనసులో దైవాన్ని నిలబెట్టటానికి
ఇటువంటి భావప్రయోగం ఆ కాలంలోనే కాదు,
ఈ రోజుకీ అత్యంత సాహసోపేతమే.
ఉపసంహారము:
కీర్తన
సారాంశం
‘మంచి కాలం’ కోసం ఎదురు చూడటమే మాయ—
సత్యం ఈ క్షణము నందే దాగి వున్నది.
వియోగంలో
చల్లదనం కూడా దహనమే,
తీయదనం చేదే.
కోయిల
కూతకూడా గాయం చేస్తుంది,
తాకని చోట కూడా నొప్పి పుడుతుంది.
చివరికి
వెంకటేశుని కృపతో
‘నేను’, ‘ప్రపంచం’ అన్న హద్దులు కరిగిపోతాయి.
పైపైన
శృంగారం,
తెర వెనక శాంతమే నిలుస్తుంది.
X-X-The
END-X-X
No comments:
Post a Comment