Saturday, 10 January 2026

T-298 సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను

 తాళ్లపాక అన్నమాచార్యులు
298 సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను 
For English version press here

ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు "శరణాగతియే వుపాయము, సుఖ తత్వానందమునాత్మజ్ఞానము, పరమపు యోగము, వివేకమగు తుదిపదము, సమాధి లక్షణము తుర్యావస్థ"లనొక్కటిగా నిలబెట్టి ఆ అచింత్యానందమునకు గల ఒకే ఒక "సర్వం విష్ణుమయం బను భావము"యొక్క అర్ధమును తెలుపుచున్నారు.


అధ్యాత్మ​ కీర్తన
రేకు: 179-2   సంపుటము: 2-393
సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము ॥పల్లవి॥

తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి
తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది
మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు ॥సర్వం॥

పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి
పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు
పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి
వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము ॥సర్వం॥

వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి
చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము
పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి
యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ        ॥సర్వం॥
Details and Explanations:
పల్లవి
సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము పల్లవి॥
              Telugu Phrase
Meaning
సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను
"సర్వం విష్ణుమయం" అను భావము అన్నిటను భావములన్నీకరిగిపోగా సత్యముగా తెలియునది ​
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము
సర్వేశ్వరుఁడొక్కడే నిలుచు విషయము. దీనికి శరణాగతియే వుపాయము.

భావము:
'అది' 'వాడు' 'నేను' అను భావములన్నీ సమసిపోయిన స్థితిలో "సర్వం విష్ణుమయం" అను భావము సత్యమై సర్వేశ్వరుఁడొక్కడే శేషమగు విషయము. దీనికి శరణాగతియే వుపాయము.

గూఢార్థవివరణము: 
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు
మానవుడు దైవమును సమీపించలేడు. "పొందుట" అనే భావమే అక్కడ కరిగిపోతుంది. కావున “సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు” మనము జేబులో దాచుకొను వస్తువులా భావించరాదు.

శరణాగతియే వుపాయము
శరణాగతి అనునది 'పని'లా చేయుట కాదు — ఇతర వుపాయములన్నీ కరిగిపోయిన స్థితి. "తానను భావము" సమీపములో వుండగా సర్వస్వములో తనను తాను అణుమాత్రము శంక లేక చూచుటకు సాధ్యముకాదు.

మొదటి చరణం:
తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి
తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది
మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు ॥సర్వం॥
Telugu Phrase
Meaning
తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి
తనకు గల నిర్ణయాత్మక బుద్ధిని, కర్తృత్వ భావనలు తనవి కావు అని తలచి,
తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది
"తానను" ('తాను' అని చెప్పుటకు గల అన్నీక్రియావిశేషణములను - ఊహలను, ఉజ్జాయింపులను) విషయములపై మతి నిలుపక నిశ్చలులైన సంభవించు మరపుతో కలుగు  సుఖ తత్వానందమిది.
మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు
భూమి, ప్రకృతి కారణముగా మొలిచిన ఈ శరీరముపై
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు
"నేనను" భారమును ఆనించక, దానికి తనకు మధ్య మమతలు అను బంధమును విడిచిన కలుగు నాత్మజ్ఞానంబు

భావము:
తనకు గల నిర్ణయాత్మక బుద్ధిని, కర్తృత్వ భావనలు తనవి అని నిలవని స్థితిలో "తానను" ('తాను' తానను భావమునకు ఆధారమయ్యే ఊహలు, ఉజ్జాయింపుల వంటి అల్లికలను) విషయములపై మతి నిలుపక నిశ్చలులైన సంభవించు మరపుతో కలుగు  సుఖ తత్వానందమిది.  భూమి, ప్రకృతి కారణముగా మొలిచిన ఈ శరీరముపై "నేనను" భారమును ఆనించక, దానికి తనకు మధ్య మమతలు అను బంధమును విడిచిన కలుగు నాత్మజ్ఞానంబు

గూఢార్థవివరణము:. 
తానని యెడి బుద్ధి
తానని యెడి బుద్ధి ("నేను" అను భావమును) ఎంత గట్టిగా నిలుచునదో ఇక్కడ సూచించబడుచున్నది
మేనని యెడి బుద్ది
“ఈ శరీరముపై ఆధారపడి నిలిచే ‘నేనను’ బుద్ధి, చివరి వరకూ విడుచుటకు ఒప్పని స్వభావముగలది.”

రెండవ​ చరణం:
పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి
పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు
పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి
వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము ॥సర్వం॥.
Telugu Phrase
Meaning
పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి
ఈ జగమనే మాయపై దొర్లుతూనే ఉండే బుద్ధిని
పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు

ఇంద్రియముల గమనములు పట్టని స్థితియే పరమపు యోగంబు

పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి
(పొరిఁ= దృఢముగా, క్రమముగా) దృఢముగా కర్మము వైపు సాగు బుద్ధిలో
వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము
పాపపుణ్యముల లంకెల నుండి విడివడడమే వివేకమగు తుదిపదము.
సూటి భావము:
ఈ జగమనే మాయపై దొర్లుతూనే ఉండే బుద్ధి, ఇంద్రియముల గమనములు పట్టని స్థితియే పరమపు యోగంబు. దృఢముగా కర్మము వైపు సాగు బుద్ధిలో పాపపుణ్యముల లంకెల నుండి విడివడడమే వివేకమగు తుదిపదము.

గూఢార్థవివరణము:
వెరపునఁ
ఇది ఒక ప్రక్రియ కాదు. భయము,  కొక్కెములా పట్టి యుంచు బుద్ధి అక్కడ నిలవని స్థితి మాత్రమే. 
బాపము బుణ్యము విడుచుట
ఇవి రెండును మానవుడు చిక్కుకొను లంకెలు. విడువమని చెప్పుట కాదు — పట్టింపు తానే సడలిపోవుటను సూచించుట మాత్రమే.

మూడవ​​ చరణం:
వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి
చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము
పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి
యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ          ॥సర్వం॥
Telugu Phrase
Meaning
వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి
బాహ్యముగా అగపడు దృశ్యమును, తక్షణమే
చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము
అది కలిగించు చాపల్యము పట్టని స్థితియే సమాధి లక్షణము.

 

పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి
అనేక విధములుగా ప్రవహించుచున్న బుద్ధిలో విచారములు నిలవని స్థితియే
యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ
సంతోషముగా శ్రీ వేంకటపతిని దర్శించుట. ఇది తుర్యావస్థ.
 
సూటి భావము:
బాహ్యముగా అగపడు దృశ్యమును, తక్షణమే అది కలిగించు చాపల్యము పట్టని స్థితియే సమాధి లక్షణము. అనేక విధములుగా ప్రవహించుచున్న బుద్ధిలో విచారములు నిలవని స్థితియే సంతోషముగా శ్రీ వేంకటపతిని దర్శించుట. ఇది తుర్యావస్థ.

గూఢార్థవివరణము:
వేగమే
ఈ “వేగమే” పదము కీలకము. అన్నమాచార్యుల వారు ఇక్కడ బుద్ధి బాహ్యమునకు దొర్లని స్థితిని సూచించుచున్నారు. మనోవేగమును బాహ్యమందలి ఏ వేగమూ తాకలేదు. ఆ వేగము ఎంత సూక్ష్మమంటే — బుద్ధుని పరిశీలనలలో, ఒకసారి కనురెప్ప ఆడుటలోని సమయములో కోటికి కోటవ వంతు సమయమని చెప్పబడినదిగా భావించవచ్చును. అట్టి వేగమును కేవలము స్పృశించగలమే కానీ గ్రహింపునకు తెచ్చుకొనలేము. అదియే బాహ్యప్రపంచమును పూర్తిగా మరచిన సమాధి లక్షణము. అట్టి స్థితిని తాకుటయే కాని ముట్టి వుండుట అసాధ్యము.
 
ఇంకొక దాగి వున్న సందేశము — ఇది గురువులచే గానీ, బాహ్య ప్రేరణలచే గానీ తెలియజేయబడునది కాదు. అందుకే ఇది ఆత్మానుభవమే కానీ సామూహిక సాధన కాదు.

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-298 సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను

  తాళ్లపాక అన్నమాచార్యులు 298 సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను  For English version press here ఉపోద్ఘాతము అన్నమాచార్యులు "...