Tuesday, 6 January 2026

T-3 తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే

 తాళ్లపాక అన్నమాచార్యులు
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే
For English version press here

ఉపోద్ఘాతము

అన్నమాచార్యులు సులభముగా కనబడు పదముల వెనుక అంతులేని భావములను సృష్టించుతారని చెప్పుటకు ఈ కీర్తన ఉదాహరణ​. ఇందులో మనకు భౌతికంగా అగపడె విషయాన్ని చెబుతూనే కాళ్ళ క్రింది నేలను తప్పించి అగమ్య భావములలో విహరింప చేస్తారు. ఇది తాత్వికమైనదే కాదు, ఏ శాస్త్రము చేరని ఎత్తులలో నిలుచు అమోఘ రత్నము. ఇందులోని విషయములు మానవ జాతి వున్నంత వరకు అబ్బుర పరచుచునే ఉండును.


అధ్యాత్మ​ కీర్తన

రేకు: 313-1 సంపుటము: 4-73

తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు పల్లవి॥

కనుదెరచినంతనే కలుగు నీ జగము
కనుమూసినంతనే కడుశూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోఁచీని తొల్లి॥

తలఁచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలు చంచల వికారభావ విూ గుణము తొల్లి॥

ముందు దాఁగలిగితే మూఁడు లోకములుఁ గల-
వెందుఁ దా లేకుంటే నేమియును లేదు
అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
కందువల నితనిసంకల్ప విూపనులు తొల్లి॥
Details and Explanations:
పల్లవి
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు పల్లవి॥
              Telugu Phrase
Meaning
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే
ఈ కనబడు ప్రపంచము (అందలి ఈ వింతలు) ముందే వున్నవా? లేక "తానను" భావము ముందు వున్నదా? (దేవుడు అను)
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు
ఇది అబద్ధము అని చెప్పలేము. అట్లని అత్యంతము నిజము అని చెప్పలేము.

భావము:
ఈ కనబడు ప్రపంచము (అందలి ఈ వింతలు) ముందే వున్నవా? లేక "తానను" భావము ముందు వున్నదా? ఈ కనబడు ప్రపంచము అబద్ధము అని చెప్పలేము. అట్లని అత్యంతము నిజము అని చెప్పలేము.

గూఢార్థవివరణము: 
తొల్లి కలవే ఇవియు
మనలో ఎక్కువమందికి ఈ ప్రపంచము అను స్పృహ తమతో పాటే ఉద్భవించిందన్న అనుమానము ఉంటుంది. దీనికి వివరణ ఇవ్వలేకపోయినా ఆ భావము అంత అసమంజసము కాదు.  ఎందుకంటే ఇంకొకరి మనసులోని భావములను ఎంత చక్కగా వ్యక్త పరచినాపరహృదయము ప్రత్యక్షము కాదు కాబట్టిమనకై మనము తెలియు భావములతో పోల్చలేముకదా?

ఇక్కడ తాను అన్నది దైవము కాదు, ఎందుకంటే నాస్తికుడే "తొల్లి కలవే ఇవియు" అనగలడు. అన్నమాచార్యులు ఆ కోవకి చెందరు.

తొల్లి తానుఁ గలఁడే
ఒకవేళ "తాను" అను భావము మొదటి నుంచి వున్నట్లయితే, ఈ ప్రపంచములోని కొంత చిన్న భాగమైనా తన కళ్ళ ముందర సంభవించి వుండవలెను కదా? అదీ మనమెవరూ అనుభవించలేదు కదా?

తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే
అనుభవించువాడు’ లేక ‘అనుభవింపబడినది’ వేర్వేరుగా నిలబడ లేవు. పరస్పరము ఒకాదానినొకటి బలపరచు విషయములుగా కనబడతాయి.

కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు
ఇవి ముఖ్యంగా బౌతిక వాస్తవికతను తెలియ చెప్పుటతో "కల్ల అని నిర్ద్వందంగా చెప్పుటకు వీలుకాదు. ఈ విశ్వములోని ఏ వస్తువుకూడా శాశ్వతమని భావించుటకు వీలుకాక అనిత్యములై వుండుటను ఎవరైననూ గమనించవచ్చును.

మొత్తానికి ఈ పల్లవి "అనుభవించువాడు" మరియు "అనుభవింపబడినది" సమ కాలములో ఉద్భవించునవని చెబుతున్నా, అవి అన్నీ అనిత్యములని జమకట్టి, ఇవేవీ సత్యమునకు ప్రమాణములు కావని చెబుతున్నది. కావున  మానవుని వద్ద ప్రామాణికముగా తీసికొనుటకు ఆధారములు పరిమితము లేక మృగ్యము అని చెప్పుకొనవచ్చును. మానవులు అనుభవము ద్వారా తెలియగలుగునది "సత్యము" అని చెప్పుటకు అధారములు లేవు.


పల్లవి సత్యమును నిర్ణయించలేని మన అశక్తతను సూచిస్తుంది.
మూడవ చరణంతానను’ స్పృహ లేనిచో జీవనమనే భావమే లేదని స్పష్టం చేస్తుంది.
మధ్య చరణాలు ఈ రెండు స్థితులకూ మధ్యనున్న సంబంధాన్ని చూపే ఉపపత్తులుగా, అనుభవస్థాయిలో వాటికి ఋజువునిస్తాయి.


మొదటి చరణం:
కనుదెరచినంతనే కలుగు నీ జగము
కనుమూసినంతనే కడుశూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోఁచీని తొల్లి॥
Telugu Phrase
Meaning
కనుదెరచినంతనే కలుగు నీ జగము
కనుదెరచినంతనే (పుట్టిన వెంటనే) కలుగును ఈ జగము.
కనుమూసినంతనే కడుశూన్యమౌను
కనుమూసినంతనే (మరణముతోనే) మిక్కిలి శూన్యమైపోవును
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
(కలిమియును= జీవించి వున్నానను ఊహయు; లేమియును = దాని అభావమును) కనురెప్ప మరఁగుననె ఈ జీవించి వున్నానను ఊహయు, దాని అభావము కూడా దాగి ఉన్నాయి.
తన మనోభావనలఁ దగిలి తోఁచీని
ఇవి మనోభావనలను తాకుట వలన తెలియు చున్నాయి

భావము: 
(అన్నమాచార్యులు అతి పదునైన​ పరిశీలన చేయుచున్నారు). కనుదెరచినంతనే (పుట్టిన వెంటనే) కలుగును ఈ జగము. కనుమూసినంతనే (మరణముతోనే) మిక్కిలి శూన్యమైపోవునుకనురెప్ప మరఁగుననె ఈ జీవించి వున్నానను ఊహయుదాని అభావమును దాగి ఉన్నాయి. ఇవి జీవుని మనోభావనలతో కలియుటతో తెలియు చున్నాయి .

గూఢార్థవివరణము:. 
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
ఇక్కడ అన్నమాచార్యుల వారు మొదటి రెండు పంక్తులలోని భౌతిక స్థితి నుండి. తనువు లోపల అనుభవించు స్థితికి బదిలీ అవుతున్నారు. ఏ మానవుడూ కూడా తాను మరణించానని తెలియలేడు. అంటే అది ఎంత సూక్ష్మమైనా, అసలు భావమంటూ వుంటే జీవించి వున్నట్లే. ఏ భావమూ అనుభవించబడనిదే మనకు మరణంగా కనిపిస్తుంది.

తన మనోభావనలఁ దగిలి తోఁచీని
తాను జీవించి వున్నాడో లేదో తెలియలేని అసంగ్దిద్ధ స్థితిప్రతీ విషయమును నిర్ధారణగా తెలియవలెనను మన మనస్తత్వమునకు పెద్ద సవాలే. మన అహంభావము అంగీకరించలేనిది తాను స్వయంగా నిశ్చితంగా తెలియలేనిదే. ఇదే జీవనములోని అశాంతికి మూలము. ఈ అశక్తతయే  ఇది మంచి, ఇది చెడు అను భావములను సృష్టించునది. నిశ్చయ వివేకమే మనిషి ప్రగతికి కారణము. కానీ అదియే తనలోనే యున్న పరతత్వమును తెలియలేక పోవుటకు కారణము కూడా. ఈ పరస్పర  విరుద్ధములే మనిషి లోపలి కలతకు మూలం. 

ఇంకొంచెం ఆలోచిస్తే మానవునికి తాను ఎప్పడు మరణించినది తెలియదు. అలాగే ఎప్పుడు పుట్టినది తెలియదు. అనగా మనము అంతర్లీనముగా బ్రతికిన విషయమును మాత్రము అనుభవిస్తాము. అందుకనే మనకు జీవితము నిరంతరము అనిపించడంలో ఆశ్చర్యములేదు. మనము ఇతరులను చూచి ఈ మరణము అనునది తెలుసుకొని భయము, భ్రాంతులకు లోనౌదుమని అంటున్నారు.


రెండవ​ చరణం:
తలఁచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలు చంచల వికారభావ విూ గుణము తొల్లి॥
Telugu Phrase
Meaning
తలఁచినంతనె యెంతదవ్వయినఁ గాన్పించు
తలపులు, ఆలోచనలు ఎంత దూరమైనా వెళుతూ ఉంటాయే కానీ వానికి హద్దులు వుండవు.
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
(దమము= అంతరింద్రియ నిగ్రహము) ఈ ఆలోచనలు మరచిన మనసుకు అంతరింద్రియ నిగ్రహము గాఢము, సాంద్రము కావచ్చును.
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
జీవన్మరణములు పొలుసులు (పొరల) వంటి వాటి మరఁగుననె మతిలో గూడు కడుచున్నవి
పలు చంచల వికారభావ విూ గుణము తొల్లి॥
అతి చంచలము, వికారమొందిన భావములను దాటి వున్నది (పర తత్వమను) గుణము

సూటి భావము:

(అన్నమాచార్యులు ఇక్కడ మరింత లోతుగా వెళుతున్నారు). తలపులు, ఆలోచనలు ఎంత దూరమైనా వెళుతూ ఉంటాయే కానీ వానికి హద్దులుండక నిరంతరము కొనసాగును. ఈ ఆలోచనలు మరచిన మనసుకు అంతరింద్రియ నిగ్రహము గాఢము, సాంద్రము కావచ్చును.  జీవన్మరణములు పొలుసులు (పొరల) వంటి వాటి మరఁగుననె మతిలో గూడు కడుచున్నవి అతి చంచలము, వికారమొందిన భావములను దాటి వున్నది (పర తత్వమను) గుణము


గూఢార్థవివరణము:
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
అంతరింద్రియ నిగ్రహము కేవలము మనో సంకల్పమున సంభవించదు. తలపులు, ఆలోచనలు, భావనలు అడగిన కానీ మార్గము లేదంటున్నారు అన్నమాచార్యులు. తలపులు, ఆలోచనలు, భావనలు మానుదామన్నది కూడ మరియొక తలంపు, ఆలోచన, భావనయే. అదే గమనించ వలసినది. దమము అనేది సాధన కాదు — ఆలోచనల ఆధిపత్యం లేని స్థితిని సూచించుచున్నది.

పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
మతిలోని జీవన్మరణములను పొరల గురించి తెలుపుట ఒకింత ఆశ్చర్యము, ఒకింత అద్భుతము అనిపిస్తుంది. మానవ జాతి చరిత్ర సమస్తం ప్రతీ మనిషిలో నిక్షిప్తం అని జ్ఞానుల అభిమతము అని మీకు మునుపే విన్నవించుకున్నాను. ఇక్కడ అన్నమాచార్యులు తాను ప్రత్యక్షముగా చూచినది చెప్పుచున్నారు. అయితే, వారు తత్వవేత్త కారు. ఆ దివ్యానుభూతిలో తమకు తెలియవచ్చినది మనకు కీర్తనలుగా చెప్పారు. జ్ఞానులు జీవన్మరణములను సమదృష్టితో చూచెదరని చెప్పుటకు ఇది ఉదాహరణ​. 

పలు చంచల వికారభావ విూ గుణము
ఇక్కడ వికారభావము అనగా  విలోమభావము అని అర్ధము. భగవద్గీతలోని ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ (=వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము) యొక్క భావము అదే. 'పలు చంచల వికారభావము'తో ఆ యొక్క మాయను తెలియుట అతి సంక్లిష్టము అని విశదపరిచారు. 

ఈ చరణం  సారాంశము
మనము వాస్తవముగా ఈ ప్రపంచములోనే ఉన్నా మనకు  ప్రపంచమునకు  మధ్య మనమొక తెలియని గోడను నిర్మించుకొని జీవనము సాగింతుము. మనకు ప్రపంచము పరోక్ష అనుభవము. ఆ పరోక్షము నుండి విడివడిన వారికి ఈ ప్రపంచము ప్రత్యక్ష అనుభవము.

ఆ ప్రత్యక్ష సాక్షి కేవలం ఒక స్థితికాదు. జీవనము యొక్క పరమోత్కృష్ట స్థాయి. అక్కడికి చేరిన వారు సమస్తము విదితము కాగా, ప్రజల శ్రేయస్సు తమ జీవనము కాగా కాలము గడుపుదురు. జననము మరణము జననము అను చక్రములో తగుల్కొనక విడివడుదురు. ("అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు" అను కీర్తనను చూడండి). 

మూడవ​​ చరణం:
ముందు దాఁగలిగితే మూఁడు లోకములుఁ గల-
వెందుఁ దా లేకుంటే నేమియును లేదు
అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
కందువల నితనిసంకల్ప విూపనులు తొల్లి॥
Telugu Phrase
Meaning
ముందు దాఁగలిగితే మూఁడు లోకములుఁ గల-
ముందుగా 'తానను' స్పృహ కలిగితే మూఁడు లోకములుఁ గలవు (జీవ​, మరణ​,  పర లోకములు​). ఇక్కడ లోకములు= స్థితులు)
వెందుఁ దా లేకుంటే నేమియును లేదు

అటువంటి స్పృహ లేకుంటే ఏమీలేదు. (అంతా శూన్యమే)

అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
అని గ్రహించినది, శ్రీవేంకటేశుఁ డాత్మలోననే వాడన్నది ఒకటే.
కందువల నితనిసంకల్ప విూపనులు 
(కందువ = సంకేతస్థలము, ప్రదేశము, ఏకాంతము) అందు వలన ఈ పనులన్నీ ఇతని సంకల్పములే.
సూటి భావము:
ముందుగా 'తానను' స్పృహ కలిగితే మూఁడు స్థితులు  గలవు (జీవ​, మరణ​, పర). అటువంటి స్పృహ లేకుంటే ఏమీలేదు. (అంతా శూన్యమే) అని గ్రహించినది, శ్రీవేంకటేశుఁ డాత్మలోని వాడన్నది ఒకటే. ఈ సంకేతములే ఈతని సంకల్పములు. (ఇవి తెలియనివారు బ్రతికివున్నా ప్రయోజనము లేదు అనిభావము)

గూఢార్థవివరణము:
ముందు దాఁగలిగితే మూఁడు లోకములుఁ గలవు
మనము ఇక్కడ మనిషికి ప్రపంచానికి గల సంబంధమును తెలుసుకొందాము. రెండవ చరణంలో చెప్పుకున్నట్లే ప్రస్తుతము మనిషి ఈ ప్రపంచంతో సంబంధము తెలియకుండా జీవిస్తున్నాడు.  అసలు ఆ సంబంధం ఏమి? ఇక్కడ “సావధా నానఁ బెరిగీ సంసారవృక్షము (see poem #293)” (=అనిద్ర, జాగరూకత, భద్రము మొదలగునవి సంసారవృక్షమును వృద్ధిచెందించును) గుర్తుకు తెచ్చుకొనవలెను. అనగా ఈ సంసార వ్యాపారములో ఏ విధమైన జోక్యమైనను (అనుకూలమైనను, ప్రతికూల​మైనను గానీ) దానిని మరింత పెంపొందించును. 

ముందుగా 'తానను' స్పృహకు ఇవియే ముఖ్యమైన అడ్డంకులు. కావున మన ఇప్పటి సంబంధము సంబంధమే కాదు. ఈ సంసారవృక్ష సంబంధమును తెలిసిన కానీ అసలు ప్రపంచ నైజమును (సంబంధమును) తెలియలేము.   

అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
అనగా ఈ సంసార రహస్యమును తెలియుట శ్రీవేంకటేశుఁని ఆత్మలో తెలియుట ఒకటే. ఈ ప్రపంచమున ఆ రకముగా జీవించుటయే జీవనము.
 
దా లేకుంటే నేమియును లేదు
ముందుగా 'తానను' స్పృహ లేనివారు వాస్తవముగా జీవించుటలేదని ఆచార్యులు చెబుతున్నారు..

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-3 తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే

  తాళ్లపాక అన్నమాచార్యులు 3  తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే For English version press here ఉపోద్ఘాతము అన్నమాచార్యులు సులభముగా కనబడు పద...