తాళ్లపాక అన్నమాచార్యుల
మీద
పెదతిరుమలాచార్యుల కీర్తన
300 హరి యవతారమీతడు అన్నమయ్య
For English version
press here
ఉపోద్ఘాతము
ఈ ప్రపంచములో ఎందరో మహానుభావులు ఆ తెలియని, తెలియలేని భగవంతుని తత్వము తెలుపుటకు అనేక
విధాలుగా ప్రయత్నాలు చేసారు. ముఖ్యంగా దానిని నిర్ధారణ చేసి చెప్పలేక కొత్త పదములు,
క్రొంగొత్త వ్యక్తీకరణల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
ముందుగా ఒకేసారి అనేక అర్ధాలు వచ్చునట్లు వ్రాయుట ఒక ఒరవడిగా మారింది.
అలాగే ఆ వ్యక్తీకరణలో, చదివిన ప్రతీ సారి బావిలో ఊట ఊరునట్లు నూతన భావముల స్ఫురణకు వచ్చునవి మరింత ప్రాచుర్యం
పొందాయి. దానికి భగవద్గీత ఒక మంచి ఉదాహరణ. భగవద్గీత ఎంతో విప్లవాత్మకమైన
గ్రంథమైనప్పటికీ, దానిని అర్థం చేసుకునే విధానం క్రమంగా ఒక
నిర్దిష్ట పద్ధతి వైపే కేంద్రీకృతమైందని గమనించవచ్చు. దానిపై వచ్చిన అనేక
వ్యాఖ్యానములు ఉదాహరణలు వేరువేరుగా చూపించినా, ఆలోచనల దిశ
మాత్రం ఎక్కువగా ఒకే పంథాలో సాగినదే దీనికి సాక్ష్యం. ఈ రకంగా మానవుని సైద్ధాంతిక అన్వేషణ
నిర్దిష్ట లక్ష్యం వైపే పయనించును కానీ గమ్యమే లేని (తెలియని) సత్యమును పూర్తిగా
స్పృశించలేకపోయింది.
ఈ విధంగా, సిద్ధాంతాలు,
గొప్ప గ్రంథములు అనేక విషయాలను స్పృశించినప్పటికీ, ఆత్మీయ స్థాయిలో, వ్యక్తిగత అనుభవంగా మనిషి తహతహను
పూర్తిగా తీర్చలేకపోయాయన్నది వాస్తవం. ఆర్ద్రత లేని సిద్ధాంతకారుల వచనములు అవి ఎంత సరైనవైనా, దీర్ఘకాలం మనసును తాకలేవు; కొద్ది కాలానికే మరుగున
పడిపోతాయి. వైద్య, విజ్ఞాన–సాంకేతిక, కళా
రంగములలో ఉన్న శాస్త్రవేత్తలు, నిపుణులు అత్యున్నత ప్రమాణాలు,
నిబద్ధత కలిగివున్నా, జీవిత అనుభవ స్థాయిలో
వారు కూడా సాధారణ మనుషుల్లానే నిలుస్తారు. ఈ విధంగా, అత్యున్నత స్థాయి వ్యక్తులనుండి సాధారణ మానవుని వరకు—బాహ్య విజయాల తీపి
మాటున దాగి ఉన్న ఈ జీవితము, చాలాసార్లు ప్రశ్నార్ధకంగానే
మిగిలిపోతుంది. ఈనాడు ఇన్ని సాధనములున్నప్పటికీ, వాస్తవముగా మానవులు
శాంతిగా సహజీవనము చేయలేక పోవుటకు సత్యము నుండి దూరము జరిగి చరించుటయే ప్రధమ కారణము.
ఇటువంటి తార్కికమైన అన్వేషణలకు భిన్నంగా, శతాబ్దాల క్రితం ప్రత్యక్ష అనుభవముతో వేలాది కీర్తనలుగా
అన్నమాచార్యులు, రామదాసు, త్యాగరాజులు భగవత్తత్త్వాన్ని
పాడి అజరామరులయ్యారు. వారికి రాజ, ప్రభుత్వ, మత పెద్దల ఆశ్రయములు లేకపోయినా ప్రజల నాలుకపై నిలిచి వున్నారు. అటువంటి స్వీయ
అనుభవము కొరవడిన సిద్ధాంతాలు, ప్రతిపాదనలు, కీర్తనలు కాలగమనంతో కొట్టుకుపోవడం కూడా గమనించవచ్చును.
అయితే అన్నమాచార్యులు వారు తమ కనుల ముందరి సత్యమును తేలికైన భాషలో
గరిమను అలాగే నిలుపుతూ ప్రజల హృదయాలకు చేరువలో
నిలిచారు. ముఖ్యంగా మానవులకు నిజం జీవితంలో ఎదురయ్యే అతి చిన్న సమస్యల నుండి, అత్యంత సహజముగా అన్పింపచేయు అసత్యాలనూ, వర్ణింప అలవికాని భావములను, తేలిచి తేల్చి చెప్పలేని
తెరగులను తెంపుతో తెలిపారు. వారు దర్శించని మానవ కోణం లేదంటే అతిశయోక్తి కాదు.
వీరి ఆలోచనలలో బుద్ధుని ప్రతీత్య సముత్పాదనం తాలూకు ఛాయల నుండి ఇరవైయవ
శతాబ్దపు తత్వవేత్తల ప్రతిపాదనముల ధ్వని, వేదాంత సారపు రుచి కనబడతాయి. వారి పదముల కూర్పు కాలాతీత
గమనమును, పలికిన భావము కంటే పలకని భావము మిన్నయై ఎటూ నిర్ధారించలేని
ప్రశ్నలై తికమక పెట్టును.
ప్రత్యక్ష అనుభవము ప్రతిపాదికగా చెప్పిన వీరి కీర్తనలు జాగ్రత్తగా
పేర్చుకొన్న భావనలను కూల్చుతూ, పేరుకొన్న
హృదయపు చీకటులను చీల్చుతూ, నిలబడుటకు నేల, వాలుటకు గోడ, అందిపుచ్చుకొనుటకు అనువు, శోధించుటకు కేంద్రమును సూచించక, కనబడువానికి,
కనబడని వానికి అస్తిత్వం కల్పించక, అడుగు అడుగున,
క్షణక్షణానికి సవాలు విసురుతూ, శ్రోతలు కూడా తమ
స్వంత ఆలోచనలపై నిలబడునట్లు చేయుటయే లక్ష్యముగా రచించబడినవి.
ఇంకొక ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే వేలాది కీర్తనలలో తిరిగి తిరిగి
ప్రస్తావించకుండా, ప్రతి ఒక్క కీర్తనను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
ఈ రకంగా దాదాపు లెక్కకు మిక్కిలి కోణములలో మనకు తారసపడు జీవిత సత్యాలను వెలిబుచ్చారు.
అన్నమాచార్యులు తమ కీర్తనల ద్వారా కేవలం చరిత్రపుటల్లోనే కాదు, ప్రతీ మానవునికి అత్యున్నత శిఖరాలకు చేరు ప్రతిభ వుందని నిరూపించిన చిరస్మరణీయుడు. పాట నిలిచినంతకాలం అన్నమాచార్యులు జీవించి ఉంటారు.
|
అధ్యాత్మ కీర్తన |
|
రేకు: 117-4
సంపుటము: 2-100 |
|
హరి యవతారమీతడు అన్నమయ్య అరయ మా గురుడీతఁ డన్నమయ్య॥పల్లవి॥ వైకుంఠనాథుని వద్ద వడిఁ బాడుచున్నవాఁడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాడు ఆకడీకడఁ దాళ్ళపాక అన్నమయ్య॥హరి॥ క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య ధీరుఁడై సూర్యమండల తేజమువద్ద నున్నవాఁడు ఆరీతులఁ తాళ్ళపాక అన్నమయ్య ॥హరి॥ యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాఁడు హావభావమై తాళ్ళపాక అన్నమయ్య ॥హరి॥
|
X-X-The
END-X-X
No comments:
Post a Comment