Saturday, 17 January 2026

T-299 గతులన్ని ఖిలమైన కలియుగమందును

 తాళ్లపాక అన్నమాచార్యులు
299 గతులన్ని ఖిలమైన కలియుగమందును
For English version press here
ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో అన్నమాచార్యులు రామానుజాచార్యుల పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నారు. దారులన్నీ మూసుకుపోయినట్లుగా అనిపించే కలియుగములో కూడా, సర్వస్వము కోల్పోలేదని అనుభవపూర్వకంగా తెలిసిన భావానికి ఇది ఒక కృతజ్ఞతా స్వరం.
రామానుజాచార్యులు చూపిన దిశ, తాను అనుభవించి తెలిసిన సత్యముతో సహజంగా కలిసివున్నదని గుర్తించిన సందర్భములో, అన్నమాచార్యులు ఈ కీర్తన ద్వారా తన ఋణానుభూతిని—మెప్పుతో మేళవించి—పలికినట్లు భావించవచ్చు. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 175-4 సంపుటము: 2-372
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము             ॥పల్లవి॥

యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము          ॥గతు॥

వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము          ॥గతు॥

నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము   ॥గతు॥
Details and Explanations:
పల్లవి
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము          పల్లవి॥
              Telugu Phrase
Meaning
గతులన్ని ఖిలమైన కలియుగమందును
మర్గములన్నీ మూసుకుపోయిన ఈ కలియుగములో
గతి యీతఁడే చూపె ఘనగురుదైవము
అంతా కోల్పోలేదు అని నిర్ధారించినవాడు ఈతడే — రామానుజుడు.

భావము:
ఈ కలియుగములో సత్యమునకు దారి చూపగల మార్గములన్నీ శిధిలమైన వేళ, అంతా కోల్పోలేదు అని నిర్ధారించినవాడు ఈతడే — రామానుజుడు.

గూఢార్థవివరణము: 
కలియుగము
కలియుగములో జనులు తమోగుణయుక్తులు అయి రాగద్వేషసహితులును, తపోవిరహితులును, క్షుద్రోగపీడితులును, దురాచారులును, అనృతవాదులును, కృతఘ్నులును, అల్పాయుష్కులును, దుఃఖపీడితులును అయి జన్మింతురు అని చెప్పఁబడినది. అట్టి కలికాలములోనూ దైవమును చేరుటకు మార్గములున్నవని చెబుతున్నారు.

మొదటి చరణం:
యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
మీతనివల్లనే కంటి మీతిరుమణి
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
మీతఁడే రామానుజులు యిహపరదైవము              ॥గతు॥
Telugu Phrase
Meaning
యీతనికరుణనేకా యిల వైష్ణవులమైతి-
ఈతని కరుణవల్ల ఈ లోకంలో వైష్ణవ మార్గంలో నడిచే అవకాశము కలిగింది
మీతనివల్లనే కంటి మీతిరుమణి
ఈతని వలననే, కేవలం ఆచారంగా కాక, తిరునామముల అర్థాన్ని దర్శించగలిగాము
యీతఁడేకా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-
ఈతడే అష్టాక్షరిమంత్రోపదేశము ద్వారా దిశను చూపినవాడు
మీతఁడే రామానుజులు యిహపరదైవము
ఈ రామానుజులే, ఇహములోనే పరమ ధర్మమును చూపిన ఆధారము

భావము:
రామానుజాచార్యులు ఉపదేశించిన సమత్వము యొక్క అంతరార్ధమును అన్నమాచార్యులు గ్రహించారు. అష్టాక్షరిమంత్రము, తిరునామ దర్శనము వంటి సంప్రదాయ చిహ్నములను కేవలం మతాచారములుగా కాక, మనిషిని సత్యమునుండి దూరం చేసే అంతరంగపు చీలికలను విడిచి, సమత్వము ప్రాతిపదికగా నిలబడగలిగే జీవనాధారములుగా దర్శించారు.
 
అన్నమాచార్యులు తాను అనుభవించి తెలిసిన సత్యానికి అదే దిశలో ముందే ఒక ప్రకాశవంతమైన కాంతి కిరణం ప్రసరించినదని గమనించి, ఆ అనుభవ సమ్మేళనానికి వ్యక్తపరిచిన కృతజ్ఞతయే ఈ చరణం. అందుకే ఇక్కడ రామానుజాచార్యులు ఇహమునకు పరమునకు మధ్య నిలిచిన వంతెనగా కాక, ఆజన్మాంతము ప్రవహించే ఒక సత్యప్రవాహంగా వీక్షించబడుతారు. 

రెండవ​ చరణం:
వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
చలిమి నీతఁడే చూపె శరణాగతి
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మలసి రామానుజులే మాటలాడే దైవము ॥గతు॥ 
Telugu Phrase
Meaning
వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
ఈతడే  వేదపు రహస్యములు ప్రజలందరికీ తెలిపెను.
చలిమి నీతఁడే చూపె శరణాగతి
శరణాగతితో సహవాసమును ఈతడే చూపెను.
నిలిపినాఁ డీతఁడేకా నిజముద్రధారణము
మా మనసులలో నిజముద్రధారణమును  నిలిపినాడు ఈతడే
మలసి రామానుజులే మాటలాడే దైవము
అటువంటి అసాధారణమును తిరిగి తిరిగి మననము చేసుకొనుటకు మాటలలో నిలిపిన దైవ సమానుడు రామానుజులు.
సూటి భావము:
రామానుజాచార్యులు వేదములలో దాగి ఉన్న సత్యాన్ని గోప్యమైన విషయములుగా కాక, మానవులు జీవించగలిగే సత్యముగా వెలికి తీసి ప్రజల ముందుంచారు. శరణాగతిని ఒక విధిగా కాక, జీవన సహవాసంగా చూపించారు. దైవమునకు దూరంగా ఉన్నామనే భ్రమను తొలగించి, దైవసంబంధము మనసులోనే స్థిరపడగలదని ఆయన నిలిపారు.
 
అట్టి సత్యాన్ని మాటలలోనే కాక, జీవితంగా నిలిపిన వ్యక్తిగా రామానుజులు దర్శనమిస్తారు. అందుకే ఆయన ఇక్కడ పూజింపబడే దైవంగా కాదు, మళ్ళీ మళ్ళీ మననం చేసుకొనదగిన సత్యాన్ని మాటల రూపంలో నిలిపిన జీవిత ప్రవాహంగా అన్నమాచార్యులకు కనిపిస్తారు.

గూఢార్థవివరణము:
వెలయించె నీతఁడేకా వేదపు రహస్యములు
"దైవమును పూజించటకు, మోక్షాన్ని సాధించటకు, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటమే మానవ జన్మ మహత్వమని తెలిపారు. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వమని" రామానుజులు నిర్ద్వందంగా పేర్కొన్నారు.

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుగోష్ఠిపురం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తాడు. గురువు 'నీవు నరకానికి వెడతావేమో' నని తక్కిన వారందరు స్వర్గానికి వెళితే తాను నరకానికి వెళ్ళినా స్వీకరిస్తానని చెప్పిన సంగతిని చెబుతున్నారు. 
నిజముద్రధారణము
నిజముద్రధారణము = వాస్తవముగా ఆ దైవపు ముద్రలను ధరించుట ఎట్లో తెలిపినారని భావము = దైవము అప్రత్యక్షముగాన నిజముద్రధారణము తెలుపుట ఆశ్చర్య జనకమని ఆచార్యుల భావము. ఆ మేటి విషయమును మనసులోన  నిలిపిన రామానుజులకు  అన్నమాచార్యులు హృదయాంజలి ఘటించుచున్నారు.​​

మూడవ​​ చరణం:
నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము            ॥గతు॥
Telugu Phrase

Meaning

నియమము లీతఁడేకా నిలిపెఁ బ్రపన్నులకు

మా వంటి ఆశ్రితులకు (శరణాగతులకు) ఆ సమత్వములో నిలుచు  నీయమములు తెలిపెను.
దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే
ఎంతో కృపారసముతో మోక్షమును చూపెను
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను
ఎంతో ఎత్తులోవున్న శ్రీవేంకటేశు కొండను ఎక్కేవాకిలి ప్రవేశించుట సులభముగాను మృదువుగాను చేసెను
దయఁజూచీ మమ్ము నిట్టే తల్లితండ్రి దైవము
దయతో ఆర్ద్రతతో మమ్ము కాపాడు సర్వము తల్లితండ్రి దైవము ఈతడే.

సూటి భావము:

మా వంటి ఆశ్రితులకు—శరణాగతులకు—సమత్వములో నిలబడగల జీవన నియమములను రామానుజాచార్యులు స్థిరపరిచారు. ఆ నియమముల ద్వారానే కృపారసముతో మోక్షమును చూపించారు. అత్యున్నతంగా అనిపించే శ్రీ వేంకటేశ్వరుని కొండను ఎక్కుటకు, మానవుని సామర్థ్యానికి తగినట్లు ప్రవేశద్వారమును సుగమముగాను, మృదువుగాను చేసారు. అట్టి కరుణతో, ఆర్ద్రతతో మమ్ము కాపాడే తల్లితండ్రి స్వరూపమైన దైవముగా ఇక్కడ రామానుజులు దర్శనమిస్తారు. (ఇక్కడ “తల్లితండ్రి దైవము” భావం రక్షణ, ఆధారం, భరోసా సూచనగా మాత్రమే నిలుస్తుంది.)

గూఢార్థవివరణము:
నియమము లీతఁడేకా నిలిపెఁ
నియమములు  నిలిపెఁ = అన్నది త్రాసులో సమతుల్యముతో నిలుపుటను (balancing act of equanimity) సూచించుచున్నది. ఒక వైపు జీవన ప్రవాహము, మరొక వైపు మరణపు అచలత్వము— ఈ రెండింటి మధ్య సమత్వముతో నిలబడుట మానవునికి సాధారణంగా అసాధ్యమే. నియమములు నిలిపెఁ” అన్నది, ఆచరణల ద్వారా కాక, సమత్వపు ఆధారమును స్థిరపరచుటగా గ్రహించవలెను. అంతేకానీ​ "నియమములు  నిలిపెఁ"  అన్నది ఏదో నీయమములు పాటించిన సరిపోవునను భావములో తీసుకొనరాదు.

దయతో మోక్షము చూపెఁ
ఇక్కడ మోక్షము అనగా సత్యముతో ధర్మముతో బేధములేక వుండుటను తెలపడమైనది. మానవుడుగా జీవించి వుండగానే  సత్య​, ధర్మ దర్శనము చేయుటయే మోక్షము. అలాగే నియమము లీతఁడేకా నిలిపెఁ మరియు దయతో మోక్షము చూపెఁ వేరు వేరు విషయములు కావు ఒకే అనుభవానికి రెండు వైపులు. 
 
నయమై శ్రీవేంకటేశు నగ మెక్కేవాకిటను 
రామానుజులు మానవులు ఎక్కలేనంత ఎత్తులో నిలబడి మిగిలినవారిని పైకి లాగిన వ్యక్తిగా కాక, ఆ ఎత్తులను ఎక్కుటకు మానవునికి సుగమముగా, మృదువుగా వాకిలిగా అన్నమాచార్యులు దర్శించారు. అట్టి కృపారసముతో ఆయన యుగయుగముల పాటు, బ్రహ్మాండమైన తోరణముగా, కనులకు కనిపించని సత్యప్రవాహముగా నిలిచివుంటారని అన్నమాచార్యులు అనుభవపూర్వకంగా గుర్తించారు.

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-299 గతులన్ని ఖిలమైన కలియుగమందును

  తాళ్లపాక అన్నమాచార్యులు 299 గతులన్ని ఖిలమైన కలియుగమందును For English version press here ఉపోద్ఘాతము ఈ కీర్తనలో అన్నమాచార్యులు రామానుజాచార...