తాళ్లపాక అన్నమాచార్యులు
301 మందులేదు దీనికి మంత్ర మేమియు లేదు
For English version
press here
ఉపోద్ఘాతము
“మందులేదు దీనికి” — దేనికి మందు లేదంటున్నారు? ఆలోచింతము. మందు కోసం
వెతుకుతున్నామంటే, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక రుగ్మత ఉందనే స్పృహ
ఉందన్నమాట. అలా రుగ్మత వుందని తెలియడం మనకు జీవించడం. అదే స్పృహ — ఏదో సరిచేయాలి,
ఏదో తొలగించాలి అనే భావన —ఇది ‘మందు మంత్రము దన మతిలోనే కలదు’ అనే రెండవ
పంక్తికి వ్యతిరేకమౌతుంది. అంతే.
ఎటువంటి ఉపాయాలు సూచించకుండా, ఎటువంటి ఆశా చూపకుండా, మన వెతుకులాటే మన బంధనమని చూపించడమే
అన్నమాచార్యుల ముఖ్యోద్దేశం.
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 26-6
సంపుటము: 1-161
|
|
మందులేదు దీనికి మంత్ర మేమియు లేదు మందు మంత్రము దన మతిలోనే కలదు ॥మందు॥ కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ గట్టు వదలించకొనఁ గొంత వలదా వదలించఁబోయిన వడిగొని పైపైనే కదియుఁగాని తన్ను వదల దేమియును ॥మందు॥ మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండి యెనసిన తిరువేంకటేశుని తనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములు తనకుఁ దానే వీడుఁ దలఁకవలదు గాన ॥మందు॥
|
Details
and Explanations:
పల్లవి
మందులేదు
దీనికి మంత్ర మేమియు లేదు
మందు మంత్రము
దన మతిలోనే కలదు ॥పల్లవి॥
|
Telugu Phrase
|
Meaning
|
|
మందులేదు
దీనికి మంత్ర మేమియు లేదు
|
(మంత్రము
= రహస్యము) మందులేదు ఈ జీవితమును సరియొనర్చుటకు. అట్లని రహస్యమైనదీ కాదు.
|
|
మందు మంత్రము
దన మతిలోనే కలదు
|
ఆ మందేదో, ఆ రహస్యమేదో
అంతా నీ మతిలోనే వుంది. (
|
భావము:
దీనికి, ఈ జీవితాన్ని (ఫలవంతం చేయుటకు) మందులేదు. అట్లని రహస్యమైనదీ కాదు. మందు మంత్రము ఉన్నవనుకొనుట మతిలోని
ఊహ మాత్రమే. (లేనిదానిని వున్నది అనుకోవడమే ఊహ.)
గూఢార్థవివరణము:
బయటకు
ఒప్పుకున్నా, లోపల గూడు కట్టుకున్న భావనల సంగతేమిటని
ఆచార్యులవారి ప్రశ్న.
"మందు
మంత్రము దన మతిలోనే కలదు" అన్నది కీలకం. ఇది లోపల దాచిన నిధి కాదు. ఆశావహ దృక్పథం
కాదు. ఈ పల్లవి మందు, మంత్రాలకై ఎదురు చూచుట,
విస్మరించుట రెండూ తగనివని చెబుతున్నది. ఆ రెండు కాని తటస్థము సులభం
అనిపించినా, తటస్థముగా ఉండటానికి చేయు ప్రయత్నమే 'మందు' గైకొనుట అవుతుంది.
దానిని కూడదంటున్నారు ఆచార్యులవారు.
మొదటి చరణం:
కదలకుండఁగఁ
దన్నుఁ గట్టివేసినఁ గట్టు
వదలించకొనఁ
గొంత వలదా
వదలించఁబోయిన
వడిగొని పైపైనే
కదియుఁగాని
తన్ను వదల దేమియును ॥మందు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
కదలకుండఁగఁ దన్నుఁ గట్టివేసినఁ గట్టు
|
కదలనీయకుండా
తనను కట్టివేసిన కట్లు
|
|
వదలించకొనఁ గొంత వలదా
|
కొంతైనా
వదిలించుకోవద్దా అనిపించును
|
|
వదలించఁబోయిన వడిగొని పైపైనే
|
వదిలించుకొను ఆ యత్నములోనే అత్యంత వేగముగా తన పైపైనే
|
|
కదియుఁగాని
తన్ను వదల దేమియును
|
తిరుగుచుండును
కానీ తనను వదలదేమియును
|
భావము:
తనకు ఏమి
చేయుటకు అవకాశం ఇవ్వని కట్లను కొంతైనా వదిలించు కోవాలనిపించును. ఆ ప్రయత్నంలో అవేమో
ఇంకా వేగంగా బిగించుకొనును గానీ, (నిన్ను) వదలదేమీ.
గూఢార్థవివరణము:
ఈ చరణం
భావము సుస్పష్టం. అయితే అన్నమాచార్యులే కాదు, అనేక మంది అదే మాట చెప్పారు. వారందరు
అలా ఎందుకు చెప్పారో తెలుసుకుందాం. దీనిని చక్కగా చూపు ఒక అధివాస్తవిక చిత్రము ‘ద ఫైర్సైడ్
ఏంజెల్’ (కోపిష్టి దేవత) అను పేరు గల మాక్స్ ఎర్నెస్ట్ అను ప్రసిద్ధ కళాకారుడు నిర్మించిన
చిత్రమును పరిశీలించుచూ తెలుసుకుందాం.
తీరుబాటులేని
కార్యశీలుడు:
ఒక నిర్మానుష్యమైన
బంజరు భూమి నేపథ్యంలో మానవుని లాగా కనబడుతున్న ఒక వింత ఆకారం మనం మనకు కనపడు తుంది.
ఇతడి అవయవములు దేహం ప్రస్ఫుటముగా వేర్వేరు రంగుల్లో ఉండి అవి తమతమ వైపు ఆ జీవిని లాగుచున్నవి
అనిపింపచేయును. రెండు కాళ్లకి వేర్వేరు బూట్లను చూపి అతను ఒక త్రాటిపై నడచువాడు కాడు
అని సూచించిరి. ప్రకాశవంతమైన ముదురు రంగుల వస్త్రాలు ఐశ్వర్యాన్ని మరియు సంక్షేమమును
సూచిస్తున్నాయి. అతడి తీరు చూస్తే తీరుబాటులేక సమయము వృథాచేయక కార్యశీలునిలా ముందుకు
పరుగిడు తత్వము కనబడుతోంది.
ఆధునిక అనాగరికత:
మొత్తంమీద
అతడి భంగిమ నిలకడ లేని ఆదుర్దాను, గమ్యములేని గమనమును, తగినంత సంపద వుండికూడా కలవరపాటును, ఆధునికతతో కూడిన అనాగరికతను చూపుచున్నది.
ఆహుతియైన
క్రమశిక్షణ:
మనం కూడా
ఆ బొమ్మలో చూపిన జీవి మాదిరి గానే అనేకానేక విషయములలో చిక్కుకుని వాటినుంచి బయటికి
రాలేకపోతాం. ఈ బంధనాలు బయటనుండి
వచ్చినవిగా అనిపించినా, వాటిని బిగించేది మాత్రం వదిలించుకోవాలనే
తపనే. మనసు నాలుగు వైపులకు లాగుతుండగా దారి, గమ్యము, స్థిరత్వము లేని జీవనముతో పెనుగులాడతాం.
ఇదే అసలైన ఘర్షణ.
రెండవ చరణం:
మనసు లోపలనుండి
మరి మీఁదఁ దానుండి
యెనసిన తిరువేంకటేశుని
తనరిన తలఁపునఁ
దలఁప దుష్కృతములు
తనకుఁ దానే
వీడుఁ దలఁకవలదు గాన ॥మందు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండి
|
"తాను" అనేది మనసు లోపల వుండక దానిపై పెత్తనము చెలాయించ
బోతుంది
|
|
యెనసిన తిరువేంకటేశుని
|
(ఎనసిన = సమానం చేయు); సమముగా చూచు తిరువేంకటేశుని
|
|
తనరిన తలఁపునఁ దలఁప దుష్కృతములు
|
(తనరిన = కొనసాగించు) తనను తాను కొనసాగించు నిమిత్తము తలచుట కూడా
దుష్కృతము
|
|
తనకుఁ దానే వీడుఁ దలఁకవలదు గాన
|
ఎందుకంటే, ఆ కట్లు
కదిలించ కుండా ఉంటే తమంతట తామే తెగిపోవును.
|
సూటి భావము:
మనసులోపల
నుండి, ఆ మనసుపై అధికారము చెలాయించు "తాను" అనువాని
ఆధ్వర్యములో, సమస్తమును సమము చేయు తిరువేంకటేశుని ఎంత తలచినా
ఆవి అన్ని దుష్కృతములగును. ఎందుకంటే, ఆ కట్లు కదిలించ కుండా ఉంటే
తమంతట తామే తెగిపోవును. (అన్నమాచార్యులు తిరువేంకటేశుని
తలపును ఖండించడం లేదు; తలచేవాడైన ‘తాను’ కొనసాగింపునే మన
ముందు ఉంచుతున్నారు.)
గూఢార్థవివరణము:
తనరిన
తలఁపునఁ దలఁప దుష్కృతములు
ఇక్కడ అన్నమాచార్యులు
తిరువేంకటేశుని తలచుట కూడా ఒక తలపేనని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. అంతకంటే ముఖ్యం
మనసుపై అజమాయిషీ చేయు తలపు. ఇది ఒక చేయు వానిని, ఇంకొకటి,
దేనిమీద క్రియ గావింపబడినదో దానిని కల్పించును. ఇదియే మనసు తనను తాను
విభజించుకొను ప్రక్రియ. ఇది ఇంతవరకు అర్థం చేసుకోవడం సులభం.
అకారణ
నిరూపణ
మనసు లేదా
చైతన్యం తామున్నామని నిరూపించుటకు ఏదో ఒక కార్యములో పాల్గొనవలెను. భగవద్గీత 3-5 చూడండి.
"కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్గుణైః" (=ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. నిజానికి, ప్రాణులన్నీ తమతమ ప్రకృతి జనితమైన
స్వభావాలచే ప్రేరితమై కర్మలు ఆచరించవలసియే ఉండును). లేకున్న వాని అస్తిత్వమునకు ముప్పు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు "తానను" భావమును వీడి ఉండలేదు. ఇది అంతర్గత పోరాటం.
అందుకే తానను స్పృహయే మనిషికి సత్యమునకు మధ్య విభజన కారకము.
ఆ
చూచే చూపొకటే సత్యము
తనను సత్యము
నుండి విడదీయు దానిని నేర్పుతో చూచుట జీవనము. తక్కినవన్ని దుష్కృతములు. భగవద్గీతలో
పేర్కొన్న వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన*!| (2-41) {ఈ నిష్కామ కర్మయోగము నందు నిశ్చయాత్మకమైన మార్గమొకటియే ఉండును} యొక్క అర్థం ఇదే. ఆ నేర్పుతో చూచువారు యథార్థముగా జీవించుదురు. ఆ నేర్పులేనివారు సత్యమునకు దూరంగా నిరంతర ఘర్షణలో కాలము వెళ్ళబుచ్చుదురు.
నేర్పుగల
మహానుభావులకు సర్వజన హితము, సర్వమత సమానత్వము స్వాభావికము. సహజము. మనలా అలవర్చుకున్న సంప్రదాయములు కావు.

No comments:
Post a Comment