Tuesday, 19 May 2026

T-332 రమణి నేర్పు నేరములాయె

 తాళ్లపాక అన్నమాచార్యులు
332 రమణి నేర్పు నేరములాయె
For English Version Press Here

పరిచయం

ఈ కీర్తనలో అన్నమాచార్యులు
జీవితములో దిశను మార్చు సూక్ష్మ కదలికలను
అత్యంత మనోహరముగా కనుల ముందర నిలబెట్టినారు.

నీటిబొట్లు కొన్ని చేరి నదులైనట్లు
అతి చిన్న చిన్న అతిక్రమణలే
మనిషి జీవిత దిశను మెల్లగా మార్చివేయుచున్నవి.

జీవితపు మాధుర్యములోనే చిరుచేదు పుట్టుట
తనంతట అది జరుగదు.
దారితప్పుట ప్రతీ అడుగులోనూ సంభవించుచుండును.
దానిని గమనించడమే నిజమైన జీవన సున్నితత్వమని
ఈ కీర్తన నిశ్శబ్దముగా సూచించుచున్నది.

జీవితములోని అనిశ్చిత, అనూహ్య కదలికలను విడిచి పారిపోవుట కాదు,
దానిలోనే చిక్కుకొని పోవుట కాదు,
అదే జీవన ప్రవాహములో
అంతరంగమున మేలుకొనిన జీవ వికాసము
సంభవించవచ్చునని
అన్నమాచార్యులు ఈ కీర్తనలో సూచించినారు.


శృంగార ​​​ సంకీర్తన
రాగి రేకు: 42-3  సంపుటము - సంకీర్తన: 6-3
రమణి నేర్పు నేరములాయె
జమళి విధుల సరసపు విభుఁడా        ॥పల్లవి॥

తెఱవకు నంపిన తెల్లని కలువలు
మఱపున కెందామర లాయె
నెఱుఁగము నీవిపు డింతచేతువని
కఱతలకలికివి గా విభుఁడా  ॥రమణి॥

మగువకు నంపిన మకరంద మిచ్చటి
జిగి దొలంకేటి చిఱుచేఁదాయె
అగు నీ యెకసక్యమ్ముల మాటల
వగ నెఱజాణండవా విభుఁడా              ॥రమణి॥

చెంతల ముత్యపుం జిప్పల తోయము
లంతలోనె ముత్యములాయె
సంతత కరుణా జలనిధి లక్ష్మీ
కాంతుఁడవఁట వేంకట విభుఁడా        ॥రమణి॥
Details and Explanations:
పల్లవి:
రమణి నేర్పు నేరములాయె
జమళి విధుల సరసపు విభుఁడా ॥పల్లవి॥
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
రమణి నేర్పు నేరములాయె
ఆ రమణి నేర్చిన నేర్పులతో విభుని చేరబోయెను. ఆమె నేర్పులే అమెకు అడ్డంకులుగా తోచినవి.
నేర్పులకన్నా హృదయ సమర్పణయే విభునికి చేరువ చేయునట్లు కనిపించుచున్నది.
జమళి విధుల సరసపు విభుఁడా
ఇద్దరు దేవేరులతో సమముగా సరసముగా మెలుగుచున్న విభుఁడా!
ఓ దేవా! నీవు ద్వంద్వములతో నిండిన జీవన విధులను సమముగా మోచుచు కూడా  అందులోనే సరసము  అనుభవించువాడవై కనిపించుచున్నావు.
గూఢార్థవివరణము:

నేర్పులు, అలవాట్లు, భావరూపణలు —
ఇవన్నియు ముందుగా ఏర్పరచిన పద్ధతులను నేర్చుటకే సంబంధించినవి.
అవి ఎంత సక్రమమైనవైనా
మనస్సును ముందే నిర్ణయించిన చట్రములలో బంధించుచున్నవి.
ఇవన్నియు ముందుగా ఏర్పరచిన పద్ధతులను నేర్చుటకే సంబంధించినవి.
అవి ఎంత సక్రమమైనవైనా
\మనస్సును ముందే నిర్ణయించిన చట్రములలో బంధించుచున్నవి.

స్వతంత్ర విచారణకు ఇవే అడ్డంకులని
అన్నమాచార్యులు సూచించుచున్నట్లు కనిపించుచున్నది.
జీవితము నిశ్చితముగా అనిశ్చితము.
ఆ అనిశ్చితమును పాత నేర్పుల చట్రములో బిగియించుటయే
మన ఈ నాటి జీవితముగా మారిపోయినది.

Bottom of Form


మొదటి చరణం:
తెఱవకు నంపిన తెల్లని కలువలు
మఱపున కెందామర లాయె
నెఱుఁగము నీవిపు డింతచేతువని
కఱతలకలికివి గా విభుఁడా         ॥రమణి॥ 
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
తెఱవకు నంపిన తెల్లని కలువలు
(తెఱవ = అతివ​)
ఓ స్వామీ! నీవు కానుకగా పంపిన తెల్లని కలువలు
ఓ దేవా! నిర్మలులను అంపితివి ఈ లోకములోకి
మఱపున కెందామర లాయె
నీ మోహములో, ప్రేమ తాపములో అవి ఎఱ్ఱని తామరలై మారిపోయినవి.
జీవన సంబంధములలో ప్రవేశించిన తరువాత నిర్మలత్వము పోయి రంగు కానవచ్చుచున్నది.
నెఱుఁగము నీవిపు డింతచేతువని
నీమీది మోహము, తాపము ఇంత మార్పు తెచ్చునని ఎఱుఁగము            .
ప్రభూ! మా మనసులు ఇంత సూక్ష్మమని ఎఱుగము. కేవలమీ జీవన యానములో పాలుపంచుకొనుట కూడా విక్షేపణయే?
కఱతలకలికివి గా విభుఁడా
(కఱతల కలికివిగా = దుశ్చేష్టల వాడివిగా) (ప్రేమగా కవి తిడుతున్నాడు​) ప్రియుడా పోకిరి చేష్టలు నీవి!
ఓ దేవా! ఒక ప్రక్క నిర్మలులు అవ్వండి అంటావు. నీవేమో ఈ ఆకతాయి చేష్టలు. నాకేమీ పాలు పోవటం లేదు.

గూఢార్థవివరణము: 

మొదటి రెండు పంక్తులలో
జీవితము మెల్లగా రంగు మారుచున్నదని తెలిపారు.
ఈ మార్పు ఒక్క అలవాటుతోనో, ఒక్కరోజులోనో మనమీద వచ్చి పడినది కాదు.

చిన్న చిన్న విషయములలో
సత్యమునుండి మనము దూరముగా జరుగు
అనేక అతి సున్నితమైన మార్పుల కలయికతో ఏర్పడు అగాథమిది.
ఇలా మనస్సు తన అసలు స్వచ్ఛతను కోల్పోవుచున్నది.
దీనికి కారకులము మనమే.


రెండవ చరణం:
మగువకు నంపిన మకరంద మిచ్చటి
జిగి దొలంకేటి చిఱుచేఁదాయె
అగు నీ యెకసక్యమ్ముల మాటల
వగ నెఱజాణండవా విభుఁడా     ॥రమణి॥ 
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
మగువకు నంపిన మకరంద మిచ్చటి
ఓ స్వామీ! నీవు దేవేరికి పంపిన మధుర మకరందము
ఓ దేవా! మధురముగా ప్రారంభమగు జీవనానుభవములు
జిగి దొలంకేటి చిఱుచేఁదాయె
కాంతులొలుకుతున్నా చిఱుచేఁదాయె
జీవన సంబంధములలో ప్రవేశించిన తరువాత ఆ మాధుర్యము పొంద దగినదిగా అనిపించినా చిరుచేదు అడ్డుపడుతోంది.
అగు నీ యెకసక్యమ్ముల మాటల
యెకసక్యమ్ముల = పరిహాసములు, హేచ్చుతగ్గులు గలవి, వికటపు మాటలు,  పొసగని మాటలు) నీ సరసమైనా పరిహాసపు మాటలు
దేవా! నీ ఈ పొసగని మాటలు, జీవనములోని హేచ్చుతగ్గులు
వగ నెఱజాణండవా విభుఁడా
(వగ = శృంగారచేష్ట, విలాసము)
ప్రియుడా! నెఱజాణుడవు నీ ఈ విలాసములను నేనెట్లు గ్రహించగలను?
వగ = సంతాపము, శోకము) సంతాపము, శోకములలో వున్న మాకు నీ నెఱజాణతన మేట్లు తెలిసేము?
 గూఢార్థవివరణము: 

మొదటి రెండు పంక్తులలో
జీవితములో చిరుచేదు పుట్టుటను చూపిరి.
ఇది నిస్పృహ కాదు.
వాస్తవమైన జీవన కదలిక.

తీపి, చేదులు సాపేక్షములు.
వీనిలోనే హేచ్చుతగ్గులు పుట్టుచుండును.
సాపేక్షములను వదలక
నిరపేక్షమునకు దారిలేదని
అన్నమాచార్యుల ఆంతర్యము కాబోలు.


మూడవ చరణం:
చెంతల ముత్యపుం జిప్పల తోయము
లంతలోనె ముత్యములాయె
సంతత కరుణా జలనిధి లక్ష్మీ
కాంతుఁడవఁట వేంకట విభుఁడా ॥రమణి॥
భావము:

కీర్తన పాదము

శృంగార భావము

తత్వ భావము

చెంతల ముత్యపుం జిప్పల తోయము
సముద్రములోని ముత్యపు చిప్పలలో చేరిన​ నీరు
ఈ జీవనములోనే ముత్యపు చిప్ప సముద్రములోని అలజడులకు లోనైననూ తనలోని కార్యము ముత్యమును పొదుగుటలోనే నిమగ్నమై ఉన్నట్లు, తనకు లభించినదానితోనే అందులోనే సంతృప్తి చెందువాడు
లంతలోనె ముత్యములాయె
శీఘ్రముగానే అది ముత్యములు  అగును
అంతలోనే ముత్యమువలే ఒప్పుచుండును.
సంతత కరుణా జలనిధి
ఓ కరుణాసముద్రా!
ఓ కరుణాసముద్రా!
లక్ష్మీ కాంతుఁడవఁట వేంకట విభుఁడా
ఓ వేంకట విభూ! ఈ చరాచర జీవములకు జీవమొసగువాడావట నీవు​.
ఓ వేంకటేశా! నీవు ఈ జీవజాలమంతటికి  కాంతినొసగువాడవట​. (ముత్యమువలే మెరయునదియు పరమాత్మయే)

గూఢార్థవివరణము: 
“ముత్యపుం జిప్పల తోయము” అనే ఉపమానములో
అన్నమాచార్యులు అత్యంత సూక్ష్మమైన జీవన రహస్యమును సూచించుచున్నారు.
ముత్యపు చిప్ప సముద్రమును విడిచి వేరుగా జీవించదు.
అదే అలల మధ్య, అదే అలజడుల మధ్య జీవించుచూనే
తనలోని కార్యమును నిశ్శబ్దముగా కొనసాగించుచున్నది.

జీవితములోని అనిశ్చిత కదలికలు, విక్షేపణలు, హేచ్చుతగ్గులు మధ్యనే
అంతరంగము ముత్యమువలె రూపాంతరము సంభవించవచ్చునని
ఈ ఉపమానము సూచించుచున్నది.

“అంతలోనె ముత్యములాయె” అనగా ఎక్కువ సమయము పట్టదని సూచన​.

మొదటి రెండు చరణములలో
రంగు మారుట, చిరుచేదు పుట్టుటను చూపిన అన్నమాచార్యులు
ఈ చరణములో
అదే జీవిత ప్రవాహములో
అంతరంగ వికాసమునకు అవకాశమున్నదని సూచించినారు.

X-X-X THE END X-X-X

No comments:

Post a Comment

T-332 రమణి నేర్పు నేరములాయె

  తాళ్లపాక అన్నమాచార్యులు 332 రమణి నేర్పు నేరములాయె For English Version Press Here పరిచయం ఈ కీర్తనలో అన్నమాచార్యులు జీవితములో దిశను మార్...