Tuesday, 12 August 2025

T-249 ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక

 తాళ్ళపాక అన్నమాచార్యులు

249 ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక

For English version press here 

మనసును అద్దంలా చూపించలేనిదీ కవిత్వమేనా?

ఉపోద్ఘాతము

ఈ కీర్తనలో
అన్నమాచార్యులు ఒక లోతైన
అంతర్గత విభజనను వెలికి తీస్తున్నారు.
రెండు స్వరాలు వినిపిస్తాయి —
ఒకటి లోకపు భావాలలో మునిగిపోయినది,
మరొకటి నిశ్శబ్ద సాక్షిగా పరిశీలిస్తున్నది.
 
ఆ “ఇతర స్వరం” పోరాడదు, పరిష్కారం చూపదు —
కేవలం ప్రతిబింబిస్తుంది.
ప్రేమ, కోరిక, ప్రతిఘటన, నిరాశ —
ఎలా ఉన్నాయో అలా యథాతథముగా చూడమంటుంది.
 
అన్నమయ్య బోధించరు. తీర్పు చెప్పరు.
ఈ అంతఃకలహాన్ని చూడు —
దానినుంచి పారిపోకు, అని సూచిస్తారు.
ఆయన మనలో రేగుతున్న ఈ గందరగోళాన్ని
ఎదుర్కొనమని ఆహ్వానిస్తారు —
దాన్ని తప్పించుకోమని కాదు.
 
భౌతికమైనదీ, ఆధ్యాత్మికమైన వాట్ల మధ్య ఉన్న
విరోధాన్ని బహిర్గతం చేస్తూ,
నిజమైన అవగాహన అనేది
అటో ఇటో ఎంచుకోవడం ద్వారా కాకుండా,
ఆ ఉద్రేకాల మధ్యే నిలిచి చూడడం ద్వారానే వస్తుందని అంటారు.
 
ఇది కవిత్వం రూపంలో ఆత్మపరిశీలన —
భావన మాత్రమే కాదు, అన్వేషణ.
పదిహేనవ శతాబ్దపు భారతీయ సాహిత్యంలో
ఇదొక మౌన విప్లవం —
పరిష్కారాన్ని కాక, ప్రశాంతమైన చేతనావస్థను సూచించే ప్రయాణం.
 
మనలో చాలామంది,
అవును, నేను దీన్ని అర్థం చేసుకున్నాను, అనుభవించాను”
అంటారు.
అది నిజమే — కానీ ఎప్పుడు?
తరచుగా ఆయా సంఘటనల తర్వాత మాత్రమే.
మహానుభావులు, అది జరుగుతున్నప్పుడు గమనిస్తారు.
మనము ఏమి జరిగిందో అను విశ్లేషణలో జీవిస్తాం.
వారు క్షణానుక్షణం చూచూట అను క్రియలో జీవిస్తారు.
మనము  'నాకేమైందన్న​' విచారణలో వుండిపోతాం

కృతిరస విశ్లేషణ​: ఈ కీర్తనని ప్రధానముగా ధ్వని కావ్యంగా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ధ్వనించ బడినది. కృతి విషయమంతా లక్ష్యార్థము అనిపిస్తుంది. దీనిలోని స్థాయీ భావమును వైరాగ్యంగా భావిస్తే కృతిలోని ముఖ్య రసము శాంత రసము అని మనకు తెలుస్తుంది. 

ఈ కీర్తనలో ప్రబలంగా కనిపించే స్థాయి భావం వైరాగ్యమేనని తీసుకుంటే, దాని ద్వారా ఆవిష్కృతమయ్యే రసము — శాంతరసం. 

సాహిత్యమును అర్ధము చేసుకొనుట కష్ట సాధ్యము కనుక ఈ కీర్తనను ‘నారికేళ పాకము’గా భావించ వలెను. ఎందుకంటే ఇందులో అనేక స్థాయిలలో, పొరలలో అసలు విషయాన్ని దాచివుంచారు. ఈ కీర్తనలోని సంక్లిష్ట సంభాషణను ఛేదించుకుని లోపలి మాధుర్యాన్ని ఆస్వాదిస్తే, అది మనకు ఒక విలువైన, మార్గదర్శిగా మారుతుంది. 

శృంగార సంకీర్తన

రేకు: 242-1 సంపుటము: 8-247

ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక
కూడి యిట్టె వుండితేను కోపగించేనా ॥పల్లవి॥
 
నామొగము చూడుమా నగితేనె కానవచ్చీ
నీ మనసులోననున్న నిజముఁ గల్లా
యేమతకములు నేల యింతేసి ఆనలేల
నామంచముమీఁద నుంటే నమ్మ నే ననేనా ॥ఆడ॥
 
ముమ్మారునాడుమామాట మొదలనే తెలిసెను
కమ్మిన నీచేఁతల కపటాలెల్లా
సమ్మతించు మననేల చలము సాధించనేల
యిమ్ముల మాయిచ్చనుంటే యీసడించేనా ॥ఆడ॥
 
కాఁగిలించుకుండుమాకాఁక లోనెముంచుకొని
ఆఁగి పెదవి దడిపె ఆసలెల్లాను
వీఁగనేల యిఁకను శ్రీవెంకటేశ కూడితివి
పాఁగి యిట్టె నెలకొంటె బాసలాడిగేనా ॥ఆడ॥

Details and Explanations:

పల్లవి:

ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక
కూడి యిట్టె వుండితేను కోపగించేనా       ॥పల్లవి॥   

Telugu Phrase

Meaning

ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక

నిన్నటిదాకా అక్కడ​, ఇక్కడ ఎదో చేస్తూ కాలం గడుపుతున్న నేను

కూడి యిట్టె వుండితేను కోపగించేనా

(దైవమా) నీతో కూడి వుంటానంటే కోపగించుకుంటావా?

ప్రత్యక్ష భావము:

నిన్నటిదాకా  చెడు తిరుగుళ్లు తిరిగి, కాలం వృథా చేసి, ఇప్పుడు వచ్చి నేను (దైవమా) నీతో కూడి వుంటానంటే కోపగించుకుంటావా?


వ్యాఖ్యానము:

ఈ కీర్తనను అన్నమాచార్యుడి అంతరంగ సంభాషణగా ఊహించవచ్చు.

తన గత జీవితం పనికిరాని పనులలో గడచి పోయినదన్న అపరాధ​​ భావనలో ఇప్పుడు నేను మారతానంటే ఆయన నమ్ముతాడా? సందేహించడా?” — అని కవి మనసులో తటపాయింపు. 

"ఆడనీడ"మనిషి జీవిత యాత్రలో ఆక్కడికి, ఇక్కడికి వెళుతూ, ఏదో సాధించ బోతాను అనుకుంటూ అనేక ప్రయత్నాలు చెస్తాడు. చివరికి అవన్నీ అనుకున్న ఫలితాలు ఇవ్వలేదని, 'అయ్యో నా జీవితము వ్యర్థమైపోయింది' అని తెలుసుకునేటప్పటికి  బాగా అలస్యమైపోయి నిస్సత్తువ​, ముసలితనము ఆవహించి  మార్పును స్వీకరించుటకు అసమర్థుడౌతాడు. 

"నిన్ననేఁ గాక" — ఇది కేవలం సమయానికి సూచన కాదు. ఇది మానసిక గతం — మన లోపల పెరిగిన అలవాట్లు, తప్పుడు మార్గాలు, మనసు మునిగిపోయిన భ్రాంతులు. ఇవన్నీ కలిపి మనల్ని నిజంగా మారకుండా అడ్డుకుంటాయి. అన్నమాచార్యుడి “నిన్న” భావన, షేక్స్పియర్, జిడ్డు కృష్ణమూర్తి భావనలతో పోల్చితే ఇలా ఉంటుంది. 

S. No

వక్త

ప్రకటన

అనుమితి, నిర్దేశము

1

అన్నమయ్య​

ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక

కూడి యిట్టె వుండితేను కోపగించేనా

 

గతము అను మాయ మనల్ని నిజంగా మారకుండా అడ్డుకుంటుంది. నా చేతకానితనమునకు ఆయన  కోపగించుకుంటాడా?

2

షేక్స్పియర్

“And all our yesterdays have lighted fools"

(పోయిన కాలమంతా వెర్రివారి నవ్వులే, దుమ్మున  తుది శ్వాస కలిసే వరకు).  

గతమంతా వెర్రితనముననే గడిచిపోయింది. ఇలాగే చివరిదాకా నడుస్తుంది.

3

జిడ్డు కృష్ణమూర్తి

"yesterday makes us invincible" (నిన్న మనల్ని జయించనివ్వదు)

"నిన్న & దానిలో మిళితమైవున్న కాదనలేని రంగుపూసిన అసత్యము" అనే అడ్డుగోడను దాటనంత వరకు సత్యాన్ని చూడలేవు


 


మొదటి చరణం:

నామొగము చూడుమా నగితేనె కానవచ్చీ
నీ మనసులోననున్న నిజముఁ గల్లా
యేమతకములు నేల యింతేసి ఆనలేల
నామంచముమీఁద నుంటే నమ్మ నే ననేనా ॥ఆడ॥ 

పదబంధం

అర్ధము

నామొగము చూడుమా నగితేనె కానవచ్చీ

అన్నమయ్య​: నా నవ్వు మొగము చూస్తేనే తెలుస్తోందికదా! (నా నిష్కల్మషం)

నీ మనసులోననున్న నిజముఁ గల్లా

అంతరంగపు ధ్వని: నువ్వు నిజములను కొంటున్నవన్నీ అసత్యములే.

యేమతకములు నేల యింతేసి ఆనలేల

అన్నమయ్య​: ఈ మాయ లేల​? యింతేసి ఎందుకయ్యా

నామంచముమీఁద నుంటే నమ్మ నే ననేనా

అంతరంగపు ధ్వని: మనము ఒకే మంచము (=శరీరము) పంచుకుంటున్నాము. అయినా నన్ను నమ్మలేనంటావు?

ప్రత్యక్ష భావము:

నా నవ్వు మొగము చూస్తేనే తెలుస్తోందికదా! (నా నిష్కల్మషం) - నీకలా అనిపించవచ్చు. కానీ నువ్వు నిజములను కొంటున్నవన్నీ అసత్యములే. మరైతే ఈ మాయ లేల​? యింతేసి మాయ లేందుకయ్యా - మనము ఒకే శరీరము పంచుకుంటున్నాము. అయినా నన్ను నమ్మలేనంటావు? 

ఈ చరణంలో అన్నమయ్య మరియు “ఇతర స్వరం” రెండు పలుకుతుంటవి. కావున అర్ధం చేసుకొనుటకు కొంత శ్రమించ వలసి వస్తుంది. ​ 


వ్యాఖ్యానము:

ఈ “ఇతర స్వరం” నిశితంగా పరిశీలించే స్వభావముకలది. నిజాయితీగాను, కానీ మృదువుగాను పలికుతూనే మాయనూ, సత్యాన్నీ ఎత్తి చూపుతుంది. దానికి అన్నమయ్య స్వరంతో ఏకీభవించాలనే నీయమము లేదు.  “ఇతర స్వరం” అది బయటి వ్యక్తిత్వానికి (ఆత్రుత, భౌతిక బంధంలో ఇరుక్కున్న మనసుకు) స్పందిస్తోంది. ఇక్కడ అన్నమయ్య మనసులో అనుకుంటున్న దాంట్లోని తప్పులను నిర్ద్వందంగా బయట పెడుతోంది. 

ఇంత సంక్లిష్ట రచనను ఆన్నమాచార్యులు  సాధకులకు విప్పిచెప్పుటకు సహాయకంగా వుంటుందని వ్రాసి వుండవచ్చును. 

మన మనస్సులలో ఇలాంటి సంఘర్షణలు జరుగుతుంటాయిగా. ఇందులో ఏమి ప్రత్యేకత అని అడగవచ్చును.  మనము అనుభవించేది కండీషన్డ్ మైండ్ యొక్క (స్థితివ్యాజమునకు లోబడిన) స్వరము మాత్రమే. ఇక్కడ కనబడుతున్నది వాస్తవముగా మనిషిలోని అవ్యక్త భాగము. అన్నమాచార్యులవారు అటువంటి స్థితిని చేరుకొని వ్రాసినది. తనలోని వాస్తవములు చూడని భాగమును పారదర్శకంగా చూపుతున్నారు. 

ఆచార్యులవారు "ఆకాశ పాకాశ మరుదైన కూటంబు లోకరంజకము తమలోనిసమ్మతము" అని అంటారు (అర్థం: "ఈ అస్తవ్యస్తముగా కనబడు ప్రపంచం మరియు ఆత్మ విడదీయరాని ప్రతిబింబములు. ప్రపంచాన్ని నిజంగా చూడడమంటే తనను తాను చూసుకోవడమే." దానికి విలోమము కూడా నిజమే: ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రపంచం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యము. దీనిని ఏమాత్రం సందేహాలకు తావు లేకుండా అంగీకరిస్తే ఈ ప్రపంచం లోకరంజకముగా మారుతుంది.) 

ఎందుకంటే ఒక భాగం సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తుంది. మరొక భాగం గత ప్రభావాల వల్ల (247వ కీర్తనను చూడండి) దానిని భిన్నంగా అర్థం చేసుకుంటుంది. అందుకే, మన మనసులలో తరచుగా గందరగోళం తలెత్తుతుంది. మనలాంటి సామాన్య ప్రజలకు ఈ రెండింటినీ ఒకేసారి చూడటం అసాధ్యం, కానీ అన్నమాచార్యులు ఈ ద్వంద్వాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలిగారు. మనం కూడా తరచుగా ఇలాంటి అంతర్గత సంఘర్షణలను అనుభవిస్తాం, కానీ లౌకిక మార్గాలు ఇచ్చే సౌకర్యములకు అలవాటుపడిన మనస్సు కష్టాల వైపుకు మొగ్గదు. 

ఈ చరణం మన అంతర్గత మానవ పరిస్థితిని లోతుగా చూపుతుంది. ఇది మన లౌకిక స్వభావానికి మరియు మన నిజమైన, బంధాలు లేని స్వభావానికి మధ్య ఉన్న పోరాటాన్ని ప్రదర్శిస్తుంది.


రెండవ​ చరణం: 

ముమ్మారునాడుమామాట మొదలనే తెలిసెను
కమ్మిన నీచేఁతల కపటాలెల్లా
సమ్మతించు మననేల చలము సాధించనేల
యిమ్ముల మాయిచ్చనుంటే యీసడించేనా ॥ఆడ॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

ముమ్మారునాడుమామాట మొదలనే తెలిసెను

అన్నమయ్య: "నేను చెప్పబోయే మాటలు నాకు ముందే తెలుసు, ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను.

కమ్మిన నీచేఁతల కపటాలెల్లా

అంతరంగపు ధ్వని:  “"నీ పనులు, నీ పన్నాగాలే నీ మోసాలకు మూలం.

సమ్మతించు మననేల చలము సాధించనేల

అన్నమయ్య: ఎందుకిలా నా అంగీకారం కోరి నన్ను పరీక్షలతో సవాలు చేస్తావు?"

యిమ్ముల మాయిచ్చనుంటే యీసడించేనా

అంతరంగపు ధ్వని:  నీ మనసు నా మనసులో లీనమైతే, అసమ్మతికి ఎక్కడ చోటు ఉంటుంది?"


 

ప్రత్యక్ష భావము

ఈ చరణంలో కూడా సంక్లిష్టమైన అంతరంగ సంభాషణ కొనసాగుతుంది. అన్నమయ్య స్వరం, తాను చెప్పే మాటలు, చేసే పనులు తనకు ముందే తెలుసని, ఒక ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటానని చెబుతుంది. దీనికి మరో స్వరం బదులిస్తూ, ఈ రచించిన ప్రణాళికలే మానవుల తప్పిదాలకు మూలమని అంటుంది. నియంత్రించలేని వాటిని వాటి మానాన వాటిని వదిలేయాలని సూచిస్తుంది. అప్పుడు అన్నమయ్య, "నీవు అంగీకారాన్ని కోరుతూనే, మమ్మల్ని ఇలా సాధిస్తావు" ప్రశ్నిస్తాడు. దానికి మరో స్వరం, "నీ మనసు కేవలం నాలో నిలిచి ఉంటే, అసమ్మతికి లేదా గందరగోళానికి తావు ఉండదని ముగిస్తుంది".


వ్యాఖ్యానం: 

మనుషులుగా మనం జీవితాలను నిరంతరం దిశానిర్దేశం చేసుకుంటూ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. అయితే, జీవితం మనం రాసుకున్న ప్రతిని అనుసరించదు. అది తన దిశలోనే సాగుతుంది.  సంతృప్తికర జీవితానికి మత గ్రంథాలు బాటలు వేసినా తద్వారా చేసిన ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు. సాంకేతికతలో ఇంత పురోగతి సాధించినప్పటికీ,  ఎన్నో యుగాల క్రితం తలెత్తిన అదే మౌలిక ప్రశ్నలు ఎప్పటిలానే మానవాళిని వేధిస్తున్నాయి. ఈ ప్రపంచం ఇంకా సతమతమవుతూనే ఉంది. 

మనం సామరస్యంగా జీవించడం నేర్చుకోలేదు. ఒకరి పనులు తరచుగా ఇంకొకరి వాటికి అడ్డుతగులుతూ వుంటాయి. మనం ప్రపంచాన్ని వివిధ దిశల్లో లాగుతున్నప్పటికీ, అది మొత్తానికి అలాగే ముందున్న  చోటే ఉంది—అది సంఘర్షణలు, వైరుధ్యాలతో నిండిన ప్రదేశం. 

ఈ చరణం యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, జీవించడానికి ఉన్న ఏకైక మార్గం భగవంతుడిని సంపూర్ణముగా అంగీకరించడమే. భగవంతునికి కొంత సమయము, వేరేపనులకు మిగతాది అని కేటాయించు వ్యవస్థ ఇప్పటి పరిస్థితికి మూలము.


మూడవ​ ​ చరణం: 

కాఁగిలించుకుండుమాకాఁక లోనెముంచుకొని
ఆఁగి పెదవి దడిపె ఆసలెల్లాను
వీఁగనేల యిఁకను శ్రీవెంకటేశ కూడితివి
పాఁగి యిట్టె నెలకొంటె బాసలాడిగేనా     ॥ఆడ॥ 

Telugu Phrase

Meaning

కాఁగిలించుకుండుమాకాఁక లోనెముంచుకొని

అన్నమయ్య: ఈ లోకముతోడి సంబంధముతొ ఉద్వేగాలతో రగిలిపోతున్నాము. నీవు మమ్మల్ని అక్కున చేర్చుకోరాదా?

ఆఁగి పెదవి దడిపె ఆసలెల్లాను

అంతరంగపు ధ్వని:  ఈ పెదవి తడుపు ఆశలు వున్నంతవరకు అదెలా సాధ్యము?

వీఁగనేల యిఁకను శ్రీవెంకటేశ కూడితివి

అన్నమయ్య: గర్వంతో విర్రవీగనేల​? శ్రీవెంకటేశ కూడితివి కదా?

పాఁగి యిట్టె నెలకొంటె బాసలాడిగేనా

పాఁగి = దారి

అంతరంగపు ధ్వని:  నువ్వా దైవము దారిలో నిజముగా వుంటే ఇలాంటి సందేహాలు తలెత్తుతాయా?


 

ప్రత్యక్ష భావము: 

మూడవ చరణం కూడా సంక్లిష్టమైన అంతరంగ సంభాషణను కొనసాగిస్తుంది. అన్నమయ్య ఇలా ప్రశ్నిస్తాడు: "ఓ ప్రభూ, మేము లోకంలోని ఉద్వేగాలతో (=కాకతో) రగిలిపోతున్నప్పటికీ, మమ్మల్ని ఎందుకు ఆలింగనం చేసుకోవు?" దీనికి అంతరంగపు ధ్వని బదులిస్తుంది: "నీవు నిరీక్షణలో ఉంటూ, అంచనాలు వేసుకుంటూ ఉన్నంత కాలం, అది ఎలా సాధ్యం?" అన్నమయ్య తనలో తాను ప్రశ్నించుకుంటాడు: "నేను శ్రీ వేంకటేశ్వరునితో ఏకమైపోయానని గర్వపడటం ఎందుకు?" దీనికి మరో స్వరం స్పందిస్తూ: "అలాగైతే, నీవు ప్రశ్నలు అడుగుతావా? (నీవు మౌనంగా ఉండవా?)" అని అడుగుతుంది.


వివరణాత్మక వ్యాఖ్యానం:

ఇక్కడ సంభాషణ మరింత పదునుగా మారుతుంది. అన్నమయ్య ఒక సాధారణ మనిషిలాగా "మేము మా లౌకిక బంధాల నుండి బయటపడలేమని నీకు బాగా తెలిసినప్పటికీ, మమ్మల్ని ఎందుకు రక్షించవు?" అని ప్రశ్నిస్తాడు. దానికి దివ్యవాణి ఇలా బదులిస్తుంది: "అలా ఎంచుకోవడం నీ కర్తవ్యమే" (భగవద్గీత 6-5 శ్లోకాన్ని చూడండి: ఉద్ధరేదాత్మనాత్మానం - నిన్ను నువ్వు ఉద్ధరించుకో). అన్నమాచార్యుని తదుపరి ప్రశ్నలకు కఠినమైన మాటలతో జవాబిస్తుంది: "నీవు ఇప్పటికే భగవంతుడితో ఐక్యమైతే, మళ్లీ ప్రశ్నలు ఎందుకు అడుగుతావు?" అని. ఎందుకంటే, ప్రశ్నలతో నిండిన మనసు కోరికలకు ముళ్లపొద లాంటిది. 

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ చివరి చరణం అంతర్గత సంఘర్షణకు ఒక శక్తివంతమైన ముగింపును ఇస్తుంది. భగవంతునితో నిజమైన ఐక్యత అంటే అన్ని ప్రశ్నలు, కోరికలు మరియు సంఘర్షణలు అంతమైపోవడమే అనే సంపూర్ణ సత్యంతో లౌకిక వేదనలు నిశ్శబ్దమైపోతాయి. మునుపటి చరణాలలోని సంక్లిష్టమైన సంభాషణ ఈ అంతిమ ఆధ్యాత్మిక సాక్షాత్కారంతో పరాకాష్టకు చేరుకుంటుంది.


చివరి మాట​

ఈ కీర్తన ఒక భక్తుడికి మరియు దైవికమైన "మరో స్వరం"కి
మధ్య జరిగే లోతైన అంతర్గత సంభాషణ.
లౌకిక విషయాలలో జీవితాన్ని వృథా చేసిన తరువాత,
ఇప్పుడు దేవునితో ఉండాలని కోరుకుంటే
ఆయన కోపగించుకుంటాడేమోనని
భక్తుడు ప్రశ్నించడంతో ఇది మొదలవుతుంది. 

అయితే, ఆ మరో స్వరం భక్తుడి నిజాయితీని సవాలు చేసి, అతను నిజమని భావించేది కేవలం ఒక భ్రమ అని వెల్లడిస్తుంది. 

మానవ ప్రణాళికలు, కోరికలే అన్ని సంఘర్షణలకు మూలమని అది ఎత్తిచూపుతుంది. 

నిజమైన ఆధ్యాత్మిక శాంతి అనేది మేధోపరమైన వాదనల ద్వారా కాకుండా, మనసును పూర్తిగా దైవానికి అర్పించడం ద్వారా, అన్ని ప్రశ్నలను, కోరికలను మౌనంలో మిళితం చేయడం ద్వారా లభిస్తుందనే సత్యాన్ని ఈ కీర్తన చివరికి తెలుపుతుంది.


X-X-The END-X-X

3 comments:

  1. Great composition by Annamayya and nice explanation.I think as devotees, we must be confident that God is ready to accept us anytime, being timeless He himself, provided we are ready to surrender our ego and be free of desires. We have to be a witness rather than being a doer forever. Witnessing is timelessness. Thanks for the upload.

    ReplyDelete
  2. గుంటుపల్లి రామేశ్వరం16 August 2025 at 19:08

    మీది విశేషమైన పరిశోధన. కీర్తన లోతుల్లోకి వెళ్ళి విశదీకరిస్తున్నారు. ధన్యవాదాలు
    🙏

    ReplyDelete
  3. పల్లవిలో అన్నమయ్య యొక్క అంతరంగ భావాన్ని షేక్స్పియర్,జిడ్డు కృష్ణమూర్తి గార్ల భావనలతో పోల్చి చెప్పటం చాలా బాగుంది. వారు ముగ్గురిలో భావనాసారూప్యత ను విశ్లేషంచటం గొప్ప ప్రయత్నం.

    చరణములలో ప్రకటితమయిన అన్నమయ్య అంతరంగ సంభాషణ పరమాత్మతో జరిగే సంభాషణ అనుకొనవచ్చును. ఇద్దరమూ ఒకే మంచాన్ని పంచుకుంటున్నాము.అంటే ఒకే దేహంలో ఉంటున్నామ. అంటే తన హృదయకుహరంలోనే పరమాత్మ నెలవైయుంటున్నాడు కదాయని సమన్వయం చేసికొనవచ్చును.అప్పుడు పరమాత్మలో ఆత్మ లీనమైతే అసమ్మతికిక చోటేముంటుంది అంటున్నారు అన్నమయ్య అంతరంగసంభాషణలో. కోరికలు వెంటాడుతూ, విర్రవీగుతున్న అహంభావంతో ఉన్న తనను అక్కున చేర్చుకొని కైవల్యమును ప్రసాదించామని
    అంతరంగమందున్న పరమాత్మను వేడికొంటున్నారు ఆచార్యులవారు.

    సులభమైన రీతిలో వ్యాఖ్యానము నందిస్తున్న శ్రీనివాస్ గారు అభినందనీయులు.

    ఓమ్ తత్ సత్ 🙏🏻
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...