Tuesday, 15 July 2025

T-241 మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక

 తాళ్లపాక అన్నమాచార్యులు

241 మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక 

For English version press here

ఉపోద్ఘాతము

అన్నమాచార్యులు కవిత్వం వ్రాయలేదు.

ఆయన వాస్తవం ఎదుట
నగ్నంగా నిలిచారు.

ఆయన జీవించారు —
ఉపమగా కాదు,
మాయలకందని అనుభూతిగా.


దృష్టిని ఆయన వెంబడించలేదు.
తనంతట తానే ఖాళీ అయిపోయారు —
ఆ దృష్టి లోపలికి ప్రవేశించడానికై.

దాంతో,
ఆయన ఐచ్ఛికంగా పలికిన మాటలే
రసవత్తమైన మేటలు.


ఆ పదాలు ఆలోచనలు కావు.
అవి ఆ మీదటి స్థితులు.
పరుసములంట లేనివి.
విరసము తాకలేనివి.
తిరిగిపోలేనివి.
తిరుగులేనివి.


తానూహించిన మార్పు
వంటింటి తాళింపు
తర్కం లేని తీర్పు 
సమయమును ఆర్పు
కరిగిపోయే తీపు 

ఆ తెరతీయు నేర్పు
అరయలేని కూర్పు
అది తెలిసిన చెప్పు

చూడకు ఓదార్పు
కావాలి ఓర్పు
కాదు కుండల మార్పు
కాదిది సొలపు
దైవమొక తెలియని సెగ.​ 


అధ్యాత్మ​  కీర్తన

రేకు: 340-1 సంపుటము: 4-232

మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక
వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటే కాదా ॥పల్లవి॥
 
పెక్కుమారులు నిన్నుఁ బేరుకొని జపించఁగ
మక్కళించి నీకుఁ గొంత మహిమెక్కీనా
వొక్కమారు జపించి నే నూరకుండినంతలోనే
తక్కక నీమహిమలోఁ దరగి పోయీనా         ॥మమ్ము॥
 
తగిలి నేఁ గాలమెల్ల ధ్యానము సేయఁగ నీకు
జిగి నీమేనికిఁ గింత చేవ యెక్కీనా
అగపడి యొకవేళ నటు దలఁచి మానితే
చిగురై యంతటిలోనె చిక్కి వాడీనా ॥మమ్ము॥
 
యిన్ని యాల శ్రీవేంకటేశ మాయింటిలోననే
వున్నతి నీవారమని వుంటేఁ జాలు
సన్నము దొడ్డెంచనేల సరివలసీచోట
అన్నియు నిత్యమింతే యలమట కోపము ॥మమ్ము॥

Details and Explanations:

పల్లవి:

మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక
వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటే కాదా      ॥పల్లవి॥ 

పదబంధం

అర్థం

మమ్ముఁ జూడనేల

మమల్ని చూసి ఏమి ప్రయోజనము?

నీ మహిమే చూతువుగాక

కనబడేవన్నీ నీమహిమలే కదా

వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటే కాదా

పరసువేది లోహమును ఒక్కసారైనా తాకితే —అది ఇక బంగారమే అయిపోతుంది. అందుచేత, నీ సాంగత్యం ఒక్కసారైన  చాలు —మనసు పూర్తిగా మారిపోతుంది.


 

ప్రత్యక్ష భావము: 

ప్రభూ! మమల్ని చూసి ఏమి ప్రయోజనము?
ఈ కనబడు మహిమలన్ని నీవే కదా.

పరసువేది లోహమును ఒక్కసారైనా తాకితే —
అది ఇక బంగారమే అయిపోతుంది.

అందుచేత, నీ పరుసము వంటి సాంగత్యం
ఒక్కసారైన  చాలు —
మా మనసు పూర్తిగా మారి నీ వారమయిపోతాము. 

వ్యాఖ్యానం:

PART 1

ఈ పల్లవి ఒక శ్వాసగా వినిపిస్తుంది —
నివేదన కాదు, ప్రార్థన కాదు,
ఒక స్పష్టమైన ఆవిష్కారం.
 
“మమ్ముఁ జూడనేల?”
ప్రభూ, నన్ను ప్రత్యేకంగా చూడమని వేడుకోవటం లేదు ?
నీకు మేము కనిపించాలి అన్న తాపత్రయం మాకింకా మిగిలి ఉంటే,
ఇది భక్తి కాదు — ఇది మనస్తత్వపు మాయ.

 

“నీ మహిమే చూతువుగాక”
నీ మహిమలో ఇతరములకు తావులేదు.
నీవు మాలో వెలిగితే,
మిగతాదంతా ఆ జ్ఞానంలో కరిగిపోతుంది.

ఇక్కడే రెండో వాక్యం కీలకమైన విషయాన్ని తెరుస్తుంది:
“వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటే కాదా”
 
ఇది పరసువేది ఉదాహరణ —
అనే సాధారణ లోహం,
పరుసవేది అనే పరమ తత్త్వాన్ని ఒక్కసారి తాకినపుడు —
ఇక అది బంగారమే. 
ఒక్కసారే. మళ్ళీ పని లేదు.

ఆ అజ్ఞాత శ్రద్ధతో పుట్టే ఒక్క సన్నివేశం చాలు.
కానీ తీక్షణం ఉన్న ఒక వీక్షణం
అవధుల్లేని ప్రయాణం

PART 2

మహానుభావులంతా ఒకే రకముగా ఆలోచిస్తారనడనికి
మాగ్రిట్ గారు వేసిన క్రింది బొమ్మ సాక్ష్యము.
ఎప్పుడొ అన్నమయ్య వ్రాసినది,
ఈ మధ్య కాలపు  మాగ్రిట్ గారి ఆలోచనలు
దాదాపు ఒకే రకముగా వుండడం చూసి ఆశ్చర్యమేస్తుంది.

  


పల్లవి

చిత్రంలో దాని ప్రతిబింబం

మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక

వుమ్మడిఁ బరుస మంటే దొక్కమాఁటే కాదా

Rene Magritte గారి అదృశ్య ఆభరణం Les Bijoux Indiscrets (1963)

ఒక్కమాఁటే కాదా (ఒక్క సారి దైవమును తాకిన చాలు)

చేయి ఉపరితలాన్ని తాకుతోంది. కానీ ఆ చేయిలోనే ఒక ముఖం – ఆ తాకే మార్పుని కలిగించే అంతర్గత శక్తికి ప్రతీక.” ఇక్కడ చేయి భగవంతుని కొరకు చాపినది అని తెలియవలెను.

పరసువేది అంటే అలౌకిక స్పర్శ

బాహ్య స్పర్శకి భిన్నంగా, ఇది లోపలికి చొచ్చుకుపోయే తాకు — అదే పల్లవిలో ఉన్న స్వరం. ఇది కనబడదు, కానీ మారుస్తుంది.

తాకిన​ (మారిపోయిన) తర్వాత తిరుగు లేదు

ముఖం చేయిలోనే కలిసిపోయింది — ఆ తాకే లోలోపలికి మార్పు తెస్తోంది. వెను తిరుగులేని పరివర్తన.

మమ్ముఁ జూడనేల

ముఖం కళ్లను మూసుకుంది — చూడకపోయినా మార్పు జరుగుతోంది. ఇది గ్రాహ్యమే అయినా, బాహ్య దృష్టికీ అందనిది.

మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక

దృష్టితో కాదు, అంతరంగంతో మాత్రమే నీవు గ్రహించబడతావు. ఆ స్థితిలో నీవే క్రియ, నీవే ఫలితం. అందుకే — 'నీ మహిమే చూతువుగాక' అన్నారు.”

తాకుట అను క్రియలో కాదు, అంతరంగ​ శ్రద్ధలో మార్పు

చిత్రం నిశ్శబ్దం — కాని ఆ మౌనమే అత్యంత శక్తివంతమైన సందర్భాన్ని సూచిస్తోంది


మొదటి చరణం: 

పెక్కుమారులు నిన్నుఁ బేరుకొని జపించఁగ
మక్కళించి నీకుఁ గొంత మహిమెక్కీనా
వొక్కమారు జపించి నే నూరకుండినంతలోనే
తక్కక నీమహిమలోఁ దరగి పోయీనా    ॥మమ్ము॥ 

Phrase

Meaning Telugu

Meaning in English

పెక్కుమారులు నిన్నుఁ బేరుకొని జపించఁగ

పెక్కు + మారు = అనేక మార్లు; బేరుకొని జపించఁగ = నీ పేరు ఎలుగెత్తి జపించగా

Those who chant your name many times

మక్కళించి నీకుఁ గొంత మహిమెక్కీనా

మక్కళించి = ఎగదోసిన; నీకుఁ గొంత మహిమెక్కీనా = నీ మహిమ పెరిగిపోతుందా? (పెరగదు)​

Will that increase your glory? (not)

ఒక్కమారు జపించి నే నూరకుండినంతలోనే

నే = నేను; ఒక్కమారు జపించి = ఒకసారి నీ పేరు తలచి; నూరకుండినంతలోనే = ఊరకుండిపోతే అంతలోనే.

If I take your name only once and remain quiet

తక్కక నీమహిమలోఁ దరగి పోయీనా

తక్కక = తప్పక; నీమహిమలోఁ దరగి పోయీనా = నీ మహిమ తగ్గి పోదు.

Does your glory get dwindled? (not)


 

ప్రత్యక్ష భావము

అనేక సార్లు నీ పేరు
కీర్తించుచూ, కొనుయాడుచూ జపిస్తూ వుంటే
నీ కీర్తి పెరిగిపోతుందా? (లేదే).

ఒకవేళ నేను ఒకసారి మత్రమే జపించి 
మిన్నకుంటే
తప్పనిసరిగా నీ మహిమ తరిగిపోతుందా? (లేదే).

వ్యాఖ్యానం:

ప్రభువు నామస్మరణం యాంత్రికంగా చేసే పని కాదు.
అన్నమాచార్యుల సందేశం ఇదే —
పేరు పలకడం ముఖ్యమేం కాదు;
దైవం మనలో వసిస్తున్నాడన్న స్పృహే అసలైన జ్ఞానం.
ఆ బోధ మాత్రమే నిజమైన అవగాహన.
మిగతావన్నీ ఆచారకర్మలే — నిర్మార్గమైన క్రియలు.

రెండవ​ చరణం: 

తగిలి నేఁ గాలమెల్ల ధ్యానము సేయఁగ నీకు
జిగి నీమేనికిఁ గింత చేవ యెక్కీనా
అగపడి యొకవేళ నటు దలఁచి మానితే
చిగురై యంతటిలోనె చిక్కి వాడీనా      ॥మమ్ము॥ 

పాదం (Phrase)

అర్థం

తగిలి నేఁ గాలమెల్ల ధ్యానము సేయఁగ నీకు

ప్రతి శ్వాసలోను నిన్నే ధ్యానిస్తూ ఉంటే

జిగి నీమేనికిఁ గింత చేవ యెక్కీనా

తళతళలాడే నీ వొంటికి, నా  యీపాటి ధ్యానము ఏమైనా సహాయ పడుతుందా? (లేదే)

అగపడి యొకవేళ నటు దలఁచి మానితే

నా మనసు వేరే ఏ దానికో అధీనమై, లోబడి నీ ధ్యానము చేయుట మానితే

చిగురై యంతటిలోనె చిక్కి వాడీనా

నేను చెడు చేతల చిక్కితే, ఆ ధ్యానం ముగిసిపోయి, మొలకలోనే వాడిపోతుందా? (కాదే.)

 


 

ప్రత్యక్ష భావము:

నన్ను ఉత్తేజపరుస్తున్న
ప్రతి శ్వాసలోనూ నిన్నే ధ్యానిస్తూ ఉంటే —
తళతళలాడే నీ వొంటికి
నా యీపాటి ధ్యానం ఏమైనా సహాయపడుతుందా? (లేదే.)

ఒకవేళ
నా మనసు వేరే దానికి లోబడి
నీ ధ్యానం మానివేస్తే —
నేను చెడు చేతల చిక్కిపోతే,
ఆ ధ్యానం మొలకలోనే వాడిపోతుందా? (లేదే.)


వ్యాఖ్యానం: 

సత్యం నిలిచియే ఉంటుంది —
మన బలహీన చేతులు ఆనకనే,
ఊపిరితో ఆడే పెదవులు పలుకకనే,
జపాలు, మంత్రాలు లేకనే —
తనంతట తానే, నిశ్చయంగానే.
 

ఎంపిక నీదే —
ఆ వైపు తిరగాలా, లేక మళ్లిపోవాలా?
ఆ ప్రకారం మారేది మనమే,
సత్యం కాదు.
 

అన్నమాచార్యులు వ్రాసినది —
పాఠాలు చెప్పటానికి కాదు,
మాయామంచాల్లో చిక్కుకున్న మనస్సుకు
ఒక అసమాన సౌందర్యము —
అవిచ్ఛిన్న మౌనపు లోతును
కలవు అని చెప్పటానికి.

మన చేష్టలన్నీ ప్రకృతికి సహకారం కాదని,
దానికి విరుద్ధంగా —
ప్రకృతిని వక్రీకరించే ప్రయత్నమే అని
గుర్తుచేస్తున్నారు.
 

ధ్యానము అంటే
మిగతా పనుల్లో ఒకటి కాదు —
అబద్ధాన్ని వదిలి, నిజంగా జీవించటమే.
అది వేషం కాదు,
అది అసలైన చర్య —
అదే నిజమైన జీవనం. 

మిగతావన్నీ —
వాడిపోయే మొలకలు,
అసత్యపు అలంకారాలు.


మూడవ​ ​ చరణం: 

యిన్ని యాల శ్రీవేంకటేశ మాయింటిలోననే
వున్నతి నీవారమని వుంటేఁ జాలు
సన్నము దొడ్డెంచనేల సరివలసీచోట
అన్నియు నిత్యమింతే యలమట కోపము      ॥మమ్ము॥

 

పాదం (Phrase)

అర్థం (Telugu)

ఇన్ని యాల శ్రీవేంకటేశ మాయింటిలోననే

ఇన్ని చెప్పనేల​? శ్రీవేంకటేశ, నీవు మా దేహములోనే వుంటే

ఉన్నతి నీవారమని వుంటేఁ జాలు

నీవారము అని అంటే చాలు — అదే ఉన్నతమైన స్థితి

సన్నము దొడ్డెంచనేల సరివలసీచోట

చిన్న, పెద్ద  అనే తారతమ్యాలు ఎంచలేని చోట

అన్నియు నిత్యమింతే యలమట కోపము

ఈ విచారము, దుఃఖము, కోపము శాశ్వతంగా ఇలాగే ప్రజలను పరీక్షిస్తాయి.

 

 

ప్రత్యక్ష భావము: 

ఇన్ని చెప్పనేల?
ఓ శ్రీవేంకటేశ్వరా,
నీవు ఈ దేహములోనే దాగి ఉన్నప్పుడు,
మేము నీ వారమే అని సమర్పించుకోవడం
మనిషికి ఉన్నతమైన స్థితి.

 

నీ సన్నిధిలో
తన గొప్పతనాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరమే లేదు,
తనను తక్కువ చేసి చూపాల్సిన పనిలేదు —
ఆ కల్పిత తారతమ్యాలన్నీ
నీలో లేవు,
నీతోనే లీనమైపోతాయి.

 

ఈ విచారం, ఈ దుఃఖం, ఈ కోపం —
ఎప్పటికీ ప్రజలను వేధిస్తాయి,
ఎప్పటికీ వారి మనసును పరీక్షిస్తాయి.
 


వ్యాఖ్యానం:

మౌన సమర్పణ

మనిషి గమ్యం ఒకటే —
తనలోనే దాగి ఉన్న
సత్యాన్ని ఆవిష్కరించడం.

ఎక్కువా తక్కువా
ఎంచాల్సిన పనిలేదు,
ఆ తారతమ్యాలన్నీ
మనసు సృష్టించిన సాపేక్ష మాయలు.

అనంతుని సన్నిధిలో
ఆ భేదాలకు చోటే లేదు —
ఆయనలో అవి కరిగిపోతాయి,
తనలాగా అవిరళమవుతాయి.

అయినా
విచారం, దుఃఖం, కోపం
మనసులో మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి,
ప్రభువు మనలో ఉన్నా కూడా.

ఎందుకంటే
మనిషికి తనను తానే
అధిగమించడం సాధ్యం కాదు.

అందుకే
మౌన సమర్పణే
తనకున్న ఏకైక శరణ్యం.


ఈ అంతర్ముఖ స్థితిలో
కర్త, కర్మ, క్రియ
వేరువేరుగా ఉండవు.
"నేను చేస్తున్నా" అనే ఆలోచన ఉండదు,
"ఇది నాకే చెందాలి" అనే ఆకాంక్ష ఉండదు.
 
కార్యం మాత్రమే మిగులుతుంది —
చిత్తశుద్ధితో, తలంపుల్లేని యధేచ్చ క్రియగా.
 
గమ్యం తెలియని నదీ ప్రవాహంలా —
ఆ మౌనమే
ఎల్లలు లేని జీవనము

కీర్తన సారాంశం

దైవమును ఒక్కసారి స్పృశించుటే చాలు—
పరసువేది తాకిన ఇనుము లాగా
ఒకసారి మారితే తిరుగులేదు.
ఆయన మనల్ని ఎందుకు చూడాలి?
అసలు చూచేది ఆయన మహిమే కాదా!

వేలసార్లు పేరు జపించినా
ఆయన మహిమ పెరగదు;
ఒకసారి పలికి మౌనమై ఉన్నా
ఆ మహిమ తగ్గదు.
నామము పలకటమే కాదు ముఖ్యం,
మనలో ఆయనున్నాడనే స్పృహే సారం.

ఆయన సన్నిధిలో తారతమ్యాలు కరుగుతాయి—
మన గొప్పతనాన్ని చూపవలసిన అవసరం లేదు,
తక్కువతనాన్ని తిట్టుకోవలసిన పనిలేదు.
మిగిలేది మౌన సమర్పణమే.


X-X-The END-X-X


 

1 comment:

  1. చాలా సున్నితమైన తాత్త్విక భావన. నా బోటి సామాన్యులకు అంత త్వరగా ఒంట బట్ట్వ్ది కాదు.

    ReplyDelete

241 mammu jUDanEla nI mahimE chUtuvugAka (మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక)

  ANNAMACHARYULU 241 మమ్ముఁ జూడనేల నీ మహిమే చూతువుగాక mammu jUDanEla nI mahimE chUtuvugAka తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. Introd...