Friday, 25 July 2025

T-244 నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె

 తాళ్లపాక అన్నమాచార్యులు

244 నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె

(రామాయణం నేపథ్యంగా అన్నమాచార్యుల అద్భుత రచన)

For English version press here

ఉపోద్ఘాతము

గుచ్చినా గాయం కాని వ్యంగ్యం…
మధురంగా గిలిపెట్టె సత్యపు చిలిపి చప్పుడు.

 

మాటలకందని మౌనపు లోతులు…
మసక బారిన మనసు హద్దులు చెరిపే దివ్య సవ్వడి.
 
ఎక్కడో దాగిన పరిమళ మధురం…
మాటల పుట్టలపై విరిసే అలికిడి.
 
రహస్యాల అపార జాలం…
తెర తీసినా ఇంకొక తెర మిగిలి,
తెర వెనక మరో లోకం విప్పే.
 
పుటతెరిస్తే పుట పొడిచే కొత్తదనం…
ఎప్పుడూ ఆగని ఆవిష్కార గమనము.
 
అన్నమయ్య పదాల ఈ యాత్ర…
అంతులేని ఆలోచనల పాతర,
మనసు దోచుకునే పల్లవిల దొంతర,
వినేవారి హృదయాల్లో నిశ్శబ్ద జాతర. 

కృతిరస విశ్లేషణ​:ఈ కీర్తనని ప్రధానముగా ధ్వని కావ్యంగా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ధ్వనించ బడినది. కృతి విషయమంతా నిందాస్తుతి అనిపిస్తుంది. దీనిలోని స్థాయీ భావమును ఉత్సాహముగా భావిస్తే కృతిలోని ముఖ్య రసము వీర రసము అని మనకు తెలుస్తుంది. ఇందులోని హాస్యము అంగిరసమై మరింత సౌందర్యమును కలిగిస్తుంది. సాహిత్యమును అర్ధము చేసుకొనుట కష్ట సాధ్యము కనుక ఈ కీర్తనను నారికేళ పాకముగా భావించ వలెను. 

అధ్యాత్మ​​  కీర్తన

రేకు: 102-2 సంపుటము: 2-8

నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె
కాఁతాళపు లోకులాల కంటిరా యీ సుద్దులు        ॥పల్లవి॥
 
మీఱిన పుత్రకామేష్టి మించి లంకకుఁ బైవచ్చె
ఆఱడి రామావతార మసురబాధ
తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ
పాఱి పాఱి నమ్మ నెటువలెవచ్చు వీరిని    ॥నూఁతు॥
 
చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ
వేడుక మాయమృగము వేఁటాయను
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె
యీడుగాని రాచపుట్టు యెట్టు నమ్మవచ్చును       ॥నూఁతు॥
 
వుమ్మడిఁ గోఁతులకూట ముదధికిఁ గట్లు వచ్చె
తమ్మునిబుద్ధి రావణుతల వోయను
పమ్మి శ్రీవేంకటేశుని పట్టానకే యింతానాయ
యిమ్ముల నిట్టిదేవరనెట్టు నమ్మవచ్చును ॥నూఁతు॥ 

Details and Explanations:

పల్లవి:

నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె
కాఁతాళపు లోకులాల కంటిరా యీ సుద్దులు   ॥పల్లవి॥ 

పదబంధం

అర్థం

నూఁతులు దవ్వఁగఁబోతే

ప్రజలకు మేలు చేయడానికి నూతులు తవ్వబోతే

బేతాళములు వుట్టె

పిశాచాలు పుట్టాయట

కాఁతాళపు లోకులాల

కోపాల లోకపు ప్రజలారా !

కంటిరా యీ సుద్దులు

ఈ మాటల లోతులు కనుగొనగలరా?


 

ప్రత్యక్ష భావము:

ప్రజలకు మేలు చేయడానికి నూతులు తవ్వబోతే
పిశాచాలు పుట్టాయట
కోపాల లోకపు ప్రజలారా !
కనుగొంటిరా ఈ మాటలు.
 
(మంచి చేయ బోతే చెడు జరుగుతుంది
అన్నట్లున్నాయి రాముని కథలు.) 

 దాగివున్న భావము:

ఆర్యులారా!

మనమేం చేయుచున్నామో మనకే తెలియదు.
మన చేష్టలు చాలావరకు కోపమనే మొక్క మొలకలు.

సుజనులారా!
పరస్పర విరుద్ధమైన ఆలోచనలు, భావనలు వచ్చినప్పటికీ
ఈ ముఖ్యమైన సత్యాన్ని
తమతమ అంతరంగములో నిశ్శబ్దంగా గమనించండి.

కేవలం గ్రహించండి
అది మంచి అని గాని చెడు అని గాని నిర్ణయించవద్దు.
మంచి వైపు తిరగవద్దు,
చెడును చెరపవద్దు.

అంతే…
తక్షణమే విముక్తి మీది.


వ్యాఖ్యానం: 

Part 1:
Let us understand the phrase
నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె

 

ఈ జీవితం—
విరోధ భావాల విత్తనం,
వ్యతిరేకాల నిగూఢం.
 
ఒకదాన్ని పట్టు,
మరొకటి తప్పు.
ఒకదానికి లొంగు,
ఇంకోటి విరుగు.
 
రెంటికి సమ దూరం నిలు,
సమత్వంలో వుంది కీలు
లేక గజిబిజి విడిపోదు.

Part 2: 

 మనమిప్పుడుకాఁతాళపు లోకులాలని
మాగ్రిట్ గారి ”కోపము నిరంతరం (Perpetual Motion)”
అనే అధివాస్తవిక చిత్రం
చూస్తూ తెలుసుకుందాం.
 

అదిగో కనబడుతున్నాడా

ఆదిమ జాతి మనిషి
కుడి చేతిలో ఎముక పట్టుకున్నాడు—
మారని ఆదిమ ప్రవృత్తి,
గతానికి చెందిన హింసా అవశేషం.

 

ఎడమ, అంటే నైపుణ్యం తక్కువ గల చేత్తో, 
తన తలనే భారంగా ఎత్తుకుంటూ
పనిలేని శ్రమ పడుతున్నాడు.
ముఖంలోని కోపం స్పష్టంగా లిఖించబడింది.
అతను జీవన భారాన్ని మేధస్సుతో
సమం చేయాలనుకుంటున్నాడు—
కానీ అది వ్యర్థ ప్రయత్నం.


ఎదో చేద్దామని ఆరాటం,
పనిలేని పోరాటం.

హతవిధీ! ఎక్కడి ధర్మమిది?
ఆత్మగౌరవం కోసం
అహంకారంతో నడిచే వృథా యుద్ధం.


మనసు—

భయంలేకుంటే అఖండ శక్తి.
కానీ దాని నేపథ్యంలో
చెడ్డపేరుకి కృంగే అశక్తి.
పేరుపై మచ్చే నిజమైన విచ్ఛిత్తి.
 

తప్పించుకోవాలనే ప్రతి యత్నం
తన మూల్యం వసూలు చేస్తుంది;
వేదన మనసును
మోకాళ్లదాకా వంచేస్తుంది.
తప్పించుకోవాలనే ఆలోచన కూడా
కొత్త బంధనమే.


నిరర్ధక కర్మలు ప్రతిక్రియలకు విత్తనాలు;
ప్రతిక్రియలు కోపాన్ని పండిస్తాయి.

కోపం తిరిగి మనసునే రూపుమాపు.

మనం బలమని భావించే ఈ బలహీనత—
ఒక చక్రం మాత్రమే:

తనని తానే మోసుకుంటున్న భారము,
ఎప్పటికీ చేరని ప్రయాణం.
 

వీటికతీతంగా—
చూశారా అక్కడ!

అంతులేని దిగంతం,
గజిబిజికి బీజమైన మనసు,
శాంతి లేక
మెల్లగా ముక్కలైపోతూ…

అంతలో పోల్చుకున్నా – అది నేనే 

అందుకే మాగ్రిట్‌ పెర్పెచువల్ మోషన్
కోపానికి అద్దం—
తానే మోసుకున్న భారము,
గమ్యం లేని ప్రయాణం.


మొదటి చరణం: 

మీఱిన పుత్రకామేష్టి మించి లంకకుఁ బైవచ్చె
ఆఱడి రామావతార మసురబాధ
తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ
పాఱి పాఱి నమ్మ నెటువలెవచ్చు వీరిని         ॥నూఁతు॥ 

పదబంధం

అర్ధము

మీఱిన పుత్రకామేష్టి మించి లంకకుఁ బైవచ్చె

అతిశయించిన పుత్రకామేష్టి యాగము ఘనజ్వాలయై లంక పైకివచ్చె

ఆఱడి రామావతార మసురబాధ

కష్టములు నిందలు రామావతార మంతా రాక్షస బాధలే కదా!

తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ

= హరుదొడ్డ వింటి తూఱి సీతపెండ్లి పండుగాయ (శివుని విల్లు విరిచాడు, సీతపెళ్ళి పండుగలా జరిగింది.)

పాఱి పాఱి నమ్మ నెటువలెవచ్చు వీరిని

చూస్తూ చూస్తూ ఈయన్ను నమ్మడమెలా? (లేము)


 

ప్రత్యక్ష భావము

ఎలా నమ్మగలమీ రాముణ్ణి?
పొసగని పనుల మాయాజాలంలో నిలిచి.

 

పుత్రకామేష్టి యాగమా—
జీవనం మేలుకోసమా? ,
మంచి కోసం వెలిగిన దీపమా?
లంకను ఘోరంగా మింగలేదా.
 
ఆ మహనీయుని జీవితం?
కష్టాల పరంపరలు,
నిందలు,
రాక్షసబాధలతో నిండింది—
ఇతడెలాటి దేవుడు?
తన సంకెళ్ళనే విప్పుకోలేని వాడు!

 

అయితేనేం…
ఒక లాఘవంతోనే
శివుని మహా విల్లు విరిచాడు,
ఆశ్చర్యంతో నిలిచిన జనసమూహం ముందర
సీతకు పెండ్లి పండుగ జరిపాడు. 

పొంతనలేని పనుల జతగాడు
ఎలా నమ్మగలమీతని?

వ్యాఖ్యానం:

నిందాస్తుతి

దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారా?
గిట్టని అంతరంగములారా?
వాని గుట్టులు విప్పుతున్నారా?
మనుష్య స్వభావాల్లారా
అపాదించు లోపాల్లారా?
 

అయితే మాటల గాటుల వెనక
నిశ్శబ్ద గౌరవం లోలోపల,
పలకలేని బంధం లోతులలో
ఉట్టిపడే కీర్తనల మేటుల.
 

ఆ దివ్య రహస్యం—
తర్కానికి అతీతం,
మంచి చెడుల కతీతం—
అక్కడ సందేహమే
ఒక గోప్యమైన ప్రార్థన.


రెండవ​ చరణం:

చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ
వేడుక మాయమృగము వేఁటాయను
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె
యీడుగాని రాచపుట్టు యెట్టు నమ్మవచ్చును  ॥నూఁతు॥ 

పదబంధం (Phrase)

అర్థం (Telugu)

చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ

చూడగా కేకయరాజ్యము నుండి వచ్చిన కైకేయి ఓర్వలేనితనము వల్ల ఆ  రాజ్యము పాపం  చుట్టుకొంది.

వేడుక మాయమృగము వేఁటాయను

మనసుపడి వేడుకగా పెంచుకొందామన్న మాయలేడి వేటడ వలసె.

వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె

ఒడంబడిక ప్రకారం సుగ్రీవునికి మేలు చేయబోతే వాలికి గండమై కూర్చుంది.

యీడుగాని రాచపుట్టు యెట్టు నమ్మవచ్చును

అసమాన వీరుడైన రాచపుట్టును (ఆ రాముడిని) ఎలా నమ్మాలి?


 

ప్రత్యక్ష భావము

నీ పథకం దారి తప్పిందా?
నీ తల్లి కేకయ రాజ్యం
పాపబారిన మునిగిందా?

సీత కోరిన బంగారు లేడి
వేడుకగా దక్కలేదా?
వేటాడి చంపక తప్పలేదా?

సుగ్రీవునితో స్నేహ ఒప్పందమా,
వాలి చావుకు వంతెన అయ్యిందా?

ఇలా అయితే—
ఎలా నమ్మగలము
ఆ సాటిలేని రామచంద్రుని?
 


వ్యాఖ్యానం:

అన్నమాచార్యులు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నారు—
సత్యం అనేది సంశయాల వలయమేనా?
వీటి నుండి బయటకు దారి ఉందా?
లేక మనిషి ఎప్పటికీ
ఈ అంతులేని ఉచ్చుల్లోనే చిక్కుకుపోతాడా?
 
ఆయన ఎవ్వరికీ చెందడు—
తల్లికి,
ఆమె రాజ్యానికి,
ప్రియమైన భార్యకు,
ఆమె కోరికకు,
మిత్రుడికి,
మిత్రుని శత్రువుకి,
శత్రువుకాని వాలికి కూడ.
 
అయితే, "తెలుసు" భావించే మనసు ఏది?
ఇది అంతా ఒక గొప్ప నాటకమా?
ఈ రహస్యాల నడుమ,
ఏది నిజంగా సాటిలేనిది?”
నిజంగా అసమానమైదేది?”

మూడవ​ ​ చరణం: 

వుమ్మడిఁ గోఁతులకూట ముదధికిఁ గట్లు వచ్చె
తమ్మునిబుద్ధి రావణుతల వోయను
పమ్మి శ్రీవేంకటేశుని పట్టానకే యింతానాయ
యిమ్ముల నిట్టిదేవరనెట్టు నమ్మవచ్చును      ॥నూఁతు॥ 

Telugu Phrase

Meaning

వుమ్మడిఁ గోఁతులకూట ముదధికిఁ గట్లు వచ్చె

కోతుల గుంపులన్ని కలిస్తే సముద్రానికే అడ్డు కట్టలు వచ్చయి

తమ్మునిబుద్ధి రావణుతల వోయను

తమ్ముడైన విభీషణుని బుద్ధి రావణుతల పోయేటట్లు చేసింది.

పమ్మి శ్రీవేంకటేశుని పట్టానకే యింతానాయ

అసలు ఇదంతా విశేషించి సందడించి (పమ్మి) వేంకటేశ్వరుని సింహాసనము అధిష్టించడానికే జరిగింది

యిమ్ముల నిట్టిదేవరనెట్టు నమ్మవచ్చును

అనేకరూపాలలో కనబడు ఇట్టి దేవరను ఎట్టు నమ్మవచ్చును?

 

 

ప్రత్యక్ష భావము: 

రామ రామ!
కోతుల గుంపులన్ని కలిసే
సముద్రానికే అడ్డుకట్ట కట్టాయే.

తమ్ముడైన విభీషణుని మాటతోనే
రావణుని తల వాలిందే—
ఇంటి గుట్టే లంకకు చేటయిందే.
 
అసలు ఇదంతా విశేషమై సందడిచేసింది
చివరికి వేంకటేశ్వరుని సింహాసనం అధిష్ఠించడానికేనా?

ఇన్ని రూపాలలో కనబడే
ఈ దేవుణ్ణి ఎట్లా నమ్మగలం?


దాగివున్న భావము:

(ఇక్కడ ఉధధి = మనసు; కోతి= కోరిక​; తమ్మునిబుద్ధి = ఇంటిగుట్టు అని తీసుకుంటే)

మనసే సముద్రమై,
కోరికలు కోతులై
కడతాయి ఆనకట్టలు,
చేస్తాయి ముక్కలు,
తెలుసుకునే వెలుగును మూసేస్తాయి. 

లోపల దాగిన రహస్యాలు
నిజయత్నాన్నే వమ్ము చేస్తాయి,
పురుషార్థమంతా పతనమై
మనిషినే కూలదీస్తాయి.
 

ఈ కలకలం… ఈ గందరగోళం—
వెంకటేశ్వరుణ్ణి తెలిసాను” అనటానికా?
ఎవరైనా…
నిజంగా తెలిసాను”
అనగలరా?


వ్యాఖ్యానం:

ఈ కీర్తన హాస్యమును పండిస్తూనే,

కీలకమైన విషయాలను వెల్లడిస్తుంది.

మనషి చేయబోయిన కార్యము బెడిసికొడుతుందన్నారు.

రాముని అవతారంలో అధిగమించిన

ఎత్తుపల్లాలను విరుద్ధతలను సోదాహరణంగా చూపారు.

ఇంటిగుట్టు (ఈ దేహమును) విప్పక దైవమును తెలియలేము.

పరస్పరము పొసగని విషయముల అలౌకికము దైవము.

 నాకు దైవము తెలుసు అన్నవారికి తెలిసిన దేమిటో

దైవమును నమ్మి ఊరకవుండు వానికి తెలియనిదేమిటో

 


కీర్తన సారాంశం

ఈ కీర్తన రాముని జీవితమును ప్రశ్నిస్తూ జీవనములోని 
అవిభక్తమైన విరుద్ధ భావములను ఎత్తి చూపుతుంది.
 
ఎంత మేలైన ఉద్దేశములున్నా,
కార్యములు ఎలా దోవ తప్పుతాయో తెలియజేస్తుంది.
 
సున్నితమైన హాస్యంతో కోరిక, ధర్మం, ఆలంబము
అనే మాయాజాలాన్ని ప్రతిబింబిస్తుంది.
 
కోతులు కోరికలకు, సముద్రం మనసుకు ప్రతీకలై
సత్యాన్ని మూసే అడ్డంకులవుతాయి.
 
ఆత్మ రహస్యాన్ని విప్పక దైవాన్ని తెలుసుకోలేమని సూచిస్తుంది.
 
నాకు దేవుడు తెలుసు” అని గట్టిగా చెప్పుకునేవారికి తెలిసిందేమిటో?
 
నిజమైన జ్ఞానం నిశ్శబ్ద విశ్వాసంలో, మంచి చెడుల కతీతంగా ఉంటుంది. 

X-X-The END-X-X


 

1 comment:

  1. [26/07, 10:10] Dr P V Ramana: అద్భుతమైన భావం. వైరాగ్య భక్తి!
    అందగాడె వీడూ ఎవ్వరికీ చెందడే
    పొందుగ తనపను లొకటొకటి చేయునే చాల... అంద||
    [26/07, 10:15] Dr P V Ramana: సన్నిధాన వైరాగ్యం అనాలా? సాయుజ్యానికి ముందర వచ్చే సామీప్యం ఉండి కూడా, అన్నమయ్యకు ఇంత వైముఖ్యమా?
    [26/07, 10:19] Dr P V Ramana: రామయ్య భారతవర్ష మంతా తిరిగి తను అనుకొన్న పనులు సాధించి, పనిలో పనిగా మర్యాద రామన్న ఐనాడు! వెంకన్నో, స్థిరోభవ వరదో భవ... ఉన్న చోటు వదలకున్నా, అందరి చేయి పట్టి విడువడు! పోలికే లేదు!

    ReplyDelete

T-253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో

  తాళ్ళపాక అన్నమాచార్యులు 253 తానేడో మనసేడో తత్తరము లవి యేడో For English version press here   ఉపోద్ఘాతము   ఈ అటవీక ప్రపంచములోని అరుద...