Friday, 5 December 2025

T-288 తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే

తాళ్లపాక అన్నమాచార్యులు

288 తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే

For English version press here 

నాడె రీతి తిరుగాడు బ్రతుకు 

ఉపోద్ఘాతము 

ఆలోచించి వ్రాస్తే ఇలాంటి కవిత రాదు,
ఊహల శ్రమతోను పుట్టదు.
ఒక క్షణం—
సత్యమే మాటల రూపం దాల్చాలనుకున్నట్లు
నిశ్శబ్దంగా, పదునుగా అవతరిస్తుంది.

ఇక్కడ కనిపించేది భావోద్వేగానికి అతీతమైన ఋషి.
అలంకారాల్లో చిక్కుకోడు.
మృదుత్వము, మాధుర్యము కాదు అతడి గమ్యం.
అన్నమాచార్యుడు—
గాలిలేని రాత్రిలో దీపంలా,
ఏది సత్యమే అది మాత్రమే చూపిస్తాడు.
మన నమ్మకాల ముసుగులన్నింటినీ
ఒంటి చేత్తో తుడిచేస్తాడు.

ఇలాంటి కీర్తన ఎలా వ్రాశారో?
ఇది సంప్రదాయాలకు ఛాందసాలకు బలి కాకుండా ఎలా బట్టకట్టినదో?
ఏమైతేనేం.. శతాబ్దాల గడులను దాటి
అస్ఖలితముగా మనదగ్గరకు వచ్చింది.
అద్భుత అతిథిలా మన ముందుంది—
సత్యానికి రక్షణ అవసరం లేదని
గుర్తు చేసే సాన్నిధ్యం.

ఈ కవిత మనల్ని రంజింపజేయడానికి రాలేదు.
మన మోహం, మన అహంకారమనే వస్త్రాలను
నిర్వస్త్రం చేయడానికి వచ్చింది.

దీని శ్వాసలో క్షణం అయినా
సాక్షిగా నిలిచి చూస్తే చాలు.
మనం అదృష్టవంతులం.

కీర్తన సంక్షిప్త చిత్రం

పల్లవి:
ఒకే సమయంలో నిన్ను, దైవమును కూడా మఱవకుండా వుండగలవా?
చరణం 1:
గాలి బుడగలాంటి జీవితం — నమ్మశక్యం కాదు, వదలశక్యం కాదు
చరణం 2:
శరీరం చెబుతున్న భావాలు, సంజ్ఞలు —సందర్భానుసారంగా మారే నీడలు.
చరణం 3:
ఇంత అనిత్యమైన మనసులో శ్రీ వేంకటేశుని నిలపడం —ఉపయుక్తమేనా? 
అధ్యాత్మ​ కీర్తన
రేకు: 293-6 సంపుటము: 3-541
తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే
మనసులోనే కలుగు మహామహిమ      ॥పల్లవి॥

కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల
కనుదెరచినంతనే కలిగెఁ దాను
ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు
తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు ॥తనుఁ॥

కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా
బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను
యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు
వొడలితోడివే యివి వుండినట్టే వుండును ॥తనుఁ॥

అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు
పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా
అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును॥తనుఁ॥
Details and Explanations:
పల్లవి
తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే
మనసులోనే కలుగు మహామహిమ              ॥పల్లవి॥
              Telugu Phrase
Meaning
తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే
అతి జాగరూకతతో తనను తాను మరువక​, అదే సమయములో దైవమును విడువక​ (ఉంటే)
మనసులోనే కలుగు మహామహిమ
మనసులోనే కలుగును మహామహిమ

భావము: ఎవ్వడైతే అతి జాగరూకతతో తనను తాను మరువక​, అదే సమయములో దైవమును విడువక ఉంటే, ఆతని మనసులో మహామహిమ కలుగును.


గూఢార్థవివరణము: 

సాధారణంగా మనము శ్రద్ధ పెట్టినప్పుడు అచేతనావస్థ నుంచి చేతనావస్థకు చేరుతాము. చేతనలో మనం కేంద్రీకరించే విషయం స్పృహలోకి వస్తుంది. మరొక విషయంపై మనసు మార్చినప్పుడు మొదటి విషయం స్పృహ నుంచి తప్పి, రెండవదే పరిపూర్ణంగా నిలుస్తుంది. ఒకేసారి రెండు విషయాలపై మనసు కేంద్రీకరించటం అసాధ్యం. ఈ మానసిక పరిమితినే అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నరు. 

ఇక్కడ ఆయన రెండు అసాధ్య స్థితులను ఒకే అక్షం మీద ఉంచుతున్నారు. సాధారణంగా మన అనుభవంలో “చూచువాడు” – “చూచినది” – “చూచుట” అనే మూడు భాగాలు ఉంటాయి. “చూచినది” మారితే, ఆ అక్షమే మారిపోతుంది. కానీ అక్షం మారకుండా చూసే స్థితికిచూచువాడు”, “చూచినది” రెండూ కరిగిపోవాలిమిగిలేది ‘చూచుట’ మాత్రమే. 

నేను” – “అది” అన్న విభజన నుండే ద్వంద్వం పుడుతుంది. ఆ విభజన కరిగితే ద్వంద్వం కూడా కరుగుతుంది. అప్పుడు మనలోని అంతర్గత ప్రకాశం తనంతటదే వెలుగుతుంది. అదియే మనసులోనే కలుగు మహామహిమ. 

బుద్ధుడు రెండవ వారము “అనిమేష లోచన”లో గడుపుతాడు. ఇది కూడా  అన్నమాచార్యులు  చెప్పినటు వంటిదే. ఏ మనసైతే "తాను" అన్న స్పృహనుండి "దైవము" అను స్పృహల  మధ్య ఆడుటలేదో, అది పూర్తిగా చూచుట అను యత్నము నుండి విముక్తియై సర్వమును గ్రహించుటకు అనుకూలమగును.


మొదటి చరణం:
కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల
కనుదెరచినంతనే కలిగెఁ దాను
ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు
తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు              ॥తనుఁ॥ 
Telugu Phrase
Meaning
కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల
(కనురెప్ప మూసితేనే = మరణము) కనురెప్ప మూసితేనే ఏ దిక్కుననో దాగెను ఈ జగము.
కనుదెరచినంతనే కలిగెఁ దాను
(కనుదెరచినంతనే = జననము) కనుదెరచినంతనే కలిగెను ఈ జగము.
ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు
దీనిని నమ్మి వుండలేము. అట్లని నమ్మకపోవుట కూడా కష్టము
తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు
ఆతని తోడివే ఇవన్నీ. అతడుంటేనే వుండును.

భావము:

మరణముతో ఏ దిక్కుననో దాగెను ఈ జగము.  జననముతోనే కలిగెను ఈ జగము. దీనిని నమ్మి వుండలేము. అట్లని నమ్మకపోవుట కూడా కష్టము. ఆతని తోడివే ఇవన్నీ. అతడుంటేనే వుండును.


గూఢార్థవివరణము: 

ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు
ఈ జగము మానవుని జీవన్మరణములతో నిమిత్తము లేకుండా వున్నది.
అయితే అది వున్నదని కానీ, లేదని కానీ
జీవించి వున్నప్పడే నిర్ణయించవలెను.
కానీ నిర్ధారణ చేయుటకు మన వద్ద గల సాధనమేమి?
తనను జగములో కనుగొనుట అసాధ్యము.
కానీ తనలో జగమును కనుగొన ఆస్కారము గలదు.
ఇదియే అంతరదృష్టి.

తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు
ఈ జగము ఆ దైవముతోడిదే.
కావున ఈ జగమును మానవుడు తన నుండి వేరుగా చూచిన దైవము కానరాదు.

అన్నమాచార్యులు ఈ చరణంలో
పల్లవిలోని ప్రశ్నకు మార్గము చూపుతున్నారు.

రెండవ​ చరణం:
కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా
బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను
యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు
వొడలితోడివే యివి వుండినట్టే వుండును ॥తనుఁ॥
Telugu Phrase
Meaning
కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా
కడుపు నిండినంతనే రుచులెల్లా మైకము కమ్మినట్లనిపించు
బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను
భయంకరమైన ఆకలియైతే అవియే ప్రియమగును
యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు
మధ్యమధ్యన చేదు గాదు. ఇంతలోనే తీపీ కాదు
వొడలితోడివే యివి వుండినట్టే వుండును
శరీరపు వికారములు ఇవి. అలా మారుతూ వుంటాయి.

సూటి భావము:

కడుపు నిండినంతనే రుచులెల్లా మైకము కమ్మినట్లనిపించును. భయంకరమైన ఆకలియైతే అవియే ప్రియమగును. మధ్యమధ్యన చేదు గాదు. ఇంతలోనే తీపీ కాదు. శరీరపు వికారములు ఇవి. అలా మారుతూ వుంటాయి.


గూఢార్థవివరణము:

శరీరము వెలిబుచ్చు భావములు సంజ్ఞలు సందర్భానుసారము.
సాపేక్షమే కానీ నిరపేక్షము (శుద్ధము) కావు.
అన్నమాచార్యులు శరీరపు వికారములు నమ్మి
సత్య నిర్ధారణ చేయరాదని సూచించుచున్నారు.

ఇది తరువాతి చరణానికి నాంది పలుకుతోంది.
అక్కడ అక్కడ శరీరపు సంజ్ఞలే కాదు,
మనసు సూచించు  వికారములు కూడా అనిత్యములే అని చెప్పబడింది.

మూడవ​ ​ చరణం:

అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు
పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా
అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును॥తనుఁ॥
Telugu Phrase
Meaning
అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు
ప్రతిబింబములు ఎన్ని అద్దాలు ఉంటే అన్నింటిలోను అగపడినట్లు
పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా
పొద్దువొద్దు = పొద్దుపొద్దు = ప్రతీ జన్మములోను) నీవు సృష్టించుకున్న వానితోనే నీ భోగములు
అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
(అద్దిన = ఊహించుకొన్న​, పైపైన నిలుపుకున్న​) పైపైన నిలుపుకున్న శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును
తక్కువగా అంచనావేయకండి, అన్నిటా అతని మాయలే కొనసాగుచుండును

 సూటి భావము:

(అన్నమాచార్యులు అత్యంత తీక్షణమైన సంగతిని, అనగా మాయ యొక్క అంచులను చూచుట కష్టసాధ్యమని తెలుపుతున్నారు.) ప్రతిబింబములు ఎన్ని అద్దాలు ఉంటే అన్నింటిలోను అగపపడును. ప్రతీ జన్మములోను నీవు సృష్టించుకున్న వానితోనే నీ భోగములు. అంతే. పైపైన నిలుపుకున్న శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు. తక్కువగా అంచనావేయకండి, అన్నిటా అతని మాయలే కొనసాగుచుండును


గూఢార్థవివరణము: 
అద్దములోఁ దననీడ అంతటా మెరసినట్లు
ఈ ప్రపంచము ఒక అద్దము అనుకొంటే,
అందులో నీవేమేమి చూచితే నీవనుకున్న సంగతులే కానవచ్చును.
కావున అద్దములో కనబడునది నీవు
(అనగా అనిత్యమైన నీవు) అని దాని పొరలు తొలగి పడిపోవునంతగా
తీక్షాణముగా ఏకాగ్రతతో చూడగలవా?

పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా
పోనీలే. వచ్చే జన్మలో ఇంకా మెరుగ్గా వుంటాననుకొంటే
అక్కడా  నీవు సృష్టించుకున్న వానితోనే నీ భోగములు

అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
పైపైన శ్రీవేంకటేశుని నిలుపుకొని ప్రయోజనము లేదు.
కావున అనిత్యమైన మనసును  విడనాడుటయే శరణ్యము.


కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును
కాబట్టి, ఏ ప్రతిమలు, ఏ సంజ్ఞలు, ఏ తపములు
కూడా మాయను దాటి పోలేవు.
మరి మానవుని కర్తవ్యమేమిటీ?
మాయను దాట లేమని నీకు తెలుపుతున్నదేమిటి?
అదీ మాయే.
దానినే వదలివేయ వలెను
అంతే.
అప్పుడే నీవు సత్యమునకు ఎదురుగా నిలబడుదువు.
అదే అన్నమాచార్యులు పేర్కొన్న "మహామహిమ"

ఈ కీర్తన ముఖ్య సందేశం

మహామహిమకు జీవునకు మధ్య నిలిచి వున్నది
మార్పులకు లోబడు చేతనావస్థ​.
ఉన్న అపాటి ఆధారముతో మాయకు ఆవలి గట్టును కనుక్కో.

X-X-The END-X-X


1 comment:

  1. చాలా బాగా చెప్పారు 🙏

    ReplyDelete

288 tanuṃ̐ dā nēmaraka daivamu maravakuṃṭē (తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే)

  TALLAPAKA ANNAMACHARYULU 288 తనుఁ దా నేమఱక దైవము మఱవకుంటే (tanu ṃ̐ d ā n ē maraka daivamu maravaku ṃṭē) for Telegu ( తెలుగు)  Version ...