Saturday, 27 December 2025

T-295 ఆ మీఁది నిజసుఖ మరయలేము

 తాళ్లపాక అన్నమాచార్యులు
295 ఆ మీఁది నిజసుఖ మరయలేము
For English version press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు క్రొత్త సూక్తులు చెప్పలేదు.
మనమెలా వున్నామో మన కళ్ళముందు అద్దంపెట్టి చూపుతారు.

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 107-1 సంపుటము: 2-37
ఆ మీఁది నిజసుఖ మరయలేము
పామరపు చాయలకే భ్రమసితిమయ్యా ॥పల్లవి॥

మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా ॥ఆమీఁ॥

బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మనందు కిందుమీఁదు నేఱక
పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా ॥ఆమీఁ॥

బాలులు యిసుకగుళ్లు పఁస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాఁడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా ॥ఆమీఁ॥
 Details and Explanations:
పల్లవి
ఆ మీఁది నిజసుఖ మరయలేము
పామరపు చాయలకే భ్రమసితిమయ్యా ॥పల్లవి॥
              Telugu Phrase
Meaning
ఆ మీఁది నిజసుఖ మరయలేము
(అరయలేము = విచారించలేము, చూడలేము, తెలియలేము)  ఆ తరువాత  వాస్తవముగా కలుగు సుఖము తెలియలేము.
పామరపు చాయలకే భ్రమసితిమయ్యా ॥పల్లవి॥
(పామరపు = తెలివిలేమి, అజ్ఞానము) మా అవివేకమువల్ల నీడలను చూసి నిజమని భ్రమపడ్డాము

భావము:
ఆ తరువాత  వాస్తవముగా కలుగు సుఖము తెలియలేము. అవివేకముగా ఈ నీడలను చూసి యథార్థమని భ్రమపడ్డాము.

గూఢార్థవివరణము:
ఆ మీఁది నిజసుఖ మరయలేము
ఆ మీఁది” అనగా — అది అనుభవ పరిధికి అతీతమైనది.
కనుక దానిని ఇక్కడ నుంచి విచారించలేము.
నిజముగా అక్కడ సుఖముందా? లేదా? అని నిర్ధారించలేము.

క్రింది అన్నమాచార్యుల పల్లవిని చూడండి
అదిగాక నిజమతం బదిగాక యాజకం-
బదిగాక హృదయసుఖ మదిగాక పరము ॥పల్లవి॥
భావము:  
పరము (అన్యము; మీఁదిది)  మన అభిప్రాయాల (/ఊహల) కంటే వేరుగా
యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా,
మానవుని యే చేష్టలను ఆశ్రయించక
ఊరట కూడా కలిగించక పోవచ్చు.

 పామరపు చాయలకే భ్రమసితిమయ్యా
మానవుడు తాడును పాముగాను
నీడను నిజముగాను పొరబడతాడు.
ఉదాహరణకు క్రింది సాల్వడార్ డాలి గారు
 వేసిన అధివాస్తవిక చిత్రమును చూడండి.
(the Knight at the Tower)

ఈచిత్రములో ఒక కవచధారియైన వీరుడు కర్రపట్టుకొని
మనవైపుకు కాక అటువైపుకు వారికి భరోసా
ఇస్తున్నట్లు కనబడుతుంది.

కుడిప్రక్కన ఒక ఒక పొడవైన స్తంబం నిలబెట్టబడివున్నది.
ఆ స్తంబం నీడ అవతలవున్న ఊరును,
నీడకు దగ్గరలో వున్న ఇద్దరు వ్యక్తులను చూడండి.
ఆ వ్యక్తి కవచవీరుని వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నట్లుంది.
ఆ వ్యక్తి నీడ స్తంబంనీడకు వేరు వైపున ఉన్నది.
దీనిని బట్టి వానిలో ఒకటి అవాస్తవము.

నీడ ఆవలి వ్యక్తులు కవచధారి వైపు చూస్తూ 
"నువ్వే నన్ను రక్షించాలి అన్న" భావన కలుగుతుంది.
కవచధారిని సమముగా కాక, మాములు కంటే
ఎత్తుగా చూపి ఆ వ్యక్తులు అతడే తమ రక్షకుడని భావించుటకు
తగ్గ పరిస్థితులు కల్పించారు.
పైగా కవచధారి తలచుట్టూ ప్రకాశవంతమైన కాంతిని నింపి
ఆ భావనకు పదును పెట్టారు.

ఆ నీడ ఆ వ్యక్తికి కవచధారికి మధ్య ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది.
వాస్తవానికి మన పరిస్థితి ఆ నీడకు ఆవలి వ్యక్తిలాగానే వుంటుంది.
ఆ స్తంబం మనలో దాగివున్న భావనలకు, ఊహలకు సూచిక​.
ఆ వాతావారణం మనమే 'స్థితి కపటములకు'లోనై కల్పించుకున్నది.
ఆ నీడ కేవలము భ్రమ​. అది నిజముగా లేదు. ఒకే నీడ ఆ వ్యక్తులది వాస్తవము.

ఆ కవచధారి కేవలము మన ఊహలలోని వ్యక్తి.
మనకులేని శక్తులు అలాంటి ఊహలకు ఆపాదించి మనిషి తృప్తిబొందుతాడు.
ఆ కవచధారి అక్కడ వున్నాడు అంతే.
తాను రక్షణ కల్పిస్తానని హామి ఇచ్చుటలేదు.
ఆ హామిని ఆ వ్యక్తులు పరిస్థితుల ప్రభావమునను,
అగపడు దృగ్విషయమును కలిపి
వారు తమలో తామే సృష్టించుకున్నారు.

మొదటి చరణం:
మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా ॥ఆమీఁ॥ 
Telugu Phrase
Meaning
మనసునఁ బాలు దాగి మదియించి వున్నట్టు
పాలు తాగేసాననుకొని గర్వము పొందడం ఎంత అవివేకమండి?
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
(ననిచి = అనుకొని) అనుకొని గిలిగింతలు పెట్టారని నవ్వినయట్టు  ఎంత చోద్యమండి?
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
(యెనసి = సమానం చేయు, సాటిచేయు) ఈ సంసారసుఖమును నిజముతో సమానం చేసుకొంటాం. ఎంత వింతండి?
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా ॥ఆమీఁ॥
అలా అనుకొని తృప్తిపడి,  తడఁబడేమయ్యా.

భావము:
పాలు తాగేసాననుకొని గర్వము పొందడం ఎంత అవివేకమండి? అనుకొని గిలిగింతలు పెట్టారని నవ్వినయట్టు  ఎంత చోద్యమండి? ఈ సంసారసుఖమును నిజముతో సమానం చేసుకొంటాం. ఎంత వింతండి? అలా అనుకొని తృప్తిపడి  తడఁబడతామయ్యా శ్రీనివాసా!

గూఢార్థవివరణము: 
తనివొంది యిందులోనే తడఁబడేమయ్యా
ఇక్కడ ఆచార్యులవారు
ఇలాంటి అసంబద్ధమైన, శుష్కమైన తర్కాలను ఒక్కచోట చేర్చి
మానవుని అసలైన స్వభావాన్ని నగ్నంగా చూపిస్తున్నారు.

ఇది
వాస్తవాల మీద ఆధారపడని,
వితండవాద స్వభావం.

తానే అనుకున్నది సత్యమని నమ్మి,
దానికి భిన్నమైన దేనికీ చోటివ్వని
తాబట్టిన కుందేలుకు మూడే కాళ్లుఅన్న
మూర్ఖమైన మొండివాదం ఇది.

సరిగా చూడలేని అసమర్ధతను
తర్కమనే కవచంతో కప్పిపుచ్చుకునే
మేకపోతు గాంభీర్యం.

అలాంటి వారి అంతరంగము
క్రింద మాగ్రిట్ గారు చిత్రించిన
ది లిసనింగ్ రూమ్ (The Listening Room)” లాంటిదే.
ఆ చిత్రంలో
ఆపిల్ గది అంతా నిండిపోయి ఉంటుంది.
ఆపిల్ పెద్దదనికాదు —
గది చిన్నదనికాదు —
నిజం అంతే.

కానీ ఆ నిండుదల
సత్యాన్ని ఒప్పుకొనేందుకు
అవకాశమే మిగలనీయదు.

అది
తనకు తెలిసినదే సత్యమని,
తాను అనుభవించినదే ప్రపంచమని నమ్మి,
వేరే చింతనకు అస్కారమివ్వని
మొండి మనస్తత్వానికి దృశ్య రూపం.

అసంబద్ధమైన ఆలోచనలకే
సంజాయిషీలు చెప్పుకుంటూ
అందులోనే తృప్తిపడి,
అందులోనే తడబడే
మానవుని అసలు పరిస్థితి ఇదే.


రెండవ​ చరణం:
బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మనందు కిందుమీఁదు నేఱక
పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా ॥ఆమీఁ॥
Telugu Phrase
Meaning
బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
బొమ్మలాట నిజమంటూ బాధ్యతగా భావించి  నెరవేర్చినట్లు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
నీటిలో శివతాండావమాడి తానే దేవుడైనట్లు (భావించినట్లు)
కిమ్ముల యీజన్మనందు కిందుమీఁదు నేఱక

(కిమ్ముల= ప్రీతిగొలుపు) ప్రీతిగొలుపు యీజన్మనందు ఏది మంచి ఏది చెడు తెలియక​
పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా
(పమ్మి= అతిశయించి, విజృంభించి) విజృంభించి భోగములనే తెప్పలలో తేలుచూ గడుపుతామయ్యా
సూటి భావము:
(అన్నమాచార్యులు ఈ చరణంలో మరింత క్లిష్టమైన​, కొరుకుడు పడని విషయములను చెబుతున్నరు.) బొమ్మలాట నిజమంటూ బాధ్యతగా భావించి  నెరవేర్చినట్లు, నీటిలో శివతాండావమాడి తానే దేవుడైనట్లు (భావించినట్లు), ప్రీతిగొలుపు యీజన్మనందు ఏది మంచో ఏది చెడో తెలియక విజృంభించి భోగములనే తెప్పలలో తేలుచూ గడుపుతామయ్యా.

గూఢార్థవివరణము:
బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
జీవితంలో తల్లి తండ్రి పిల్లలు సహచరి లాంటి బంధములను
వారంతా నిమిత్తమాత్రులైనప్పటికి మానవుడు గంభీరముగా భావించి
జీవితము గడుపుతాడు.
(to be taken conceptually)

తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
శివుడి వేషంవేసి శివుడైపోయినట్లు,
విష్ణువు వేషంవేసి విష్ణుడైనట్లు భావించడం కద్దు.
అయా పాత్రలకు మనము ఎంపిక చేయ బడ్డామే కానీ
వానితో మనము ఆయా దేవతలైపోం.
(ఇది నిత్య జీవితంలో కూడా జరుగుతుండడం గమనించవచ్చును)

కిందుమీఁదు నేఱక
వాస్తవమైన మనోలోకములను (చేతనావస్థలు) గమనించక

పమ్మి భోగములనే తెప్పలఁ దేలేమయ్యా
భయమంది అసలైన జీవితములో అడుగుపెట్టక 
చుట్టూ రక్షణవలయములను తెప్పలు నిర్మించుకొని వాటిలోనే విహరిస్తాం.

మనం జీవితం ఎలా గడపుతామో తెలియము.
రీని మేగ్రిట్ గారు వేసిన క్రింది “Elective Affinities” బొమ్మను చూడండి.
ఆ గుడ్డుకు తగినంత రక్షణ కల్పించబడి మరీ ఈ లోకమునకు వచ్చినది.
దానికి మనము అపాదించు అదనపు రక్షణ అనవసరము. అపాయకరము.
ఆ అదనము అసహజము. అదే మన మొదటి కృత్రిమ అడుగు.
తరువాతివన్నీ ఆ వేరుపడిన మార్గపు ఛాయలే.

జాగ్రత్తగా గమనిస్తే మనము వేసే ప్రతీ మెట్టు
ముందరి మెట్టును అనుసరించునదే.
ప్రతీ అడుగు చూసివేయడమే ఈ జీవితపు  సవాలు.
అలాగైతే ఎలా జీవిస్తామండి?’ అనవచ్చును.
అలా జీవించుటను తెలియునదే జీవనము.
తక్కినవన్నీ ఆ బొమ్మలో గుడ్డులా కృత్రిమ తెప్పలలో తేలు అపమార్గములు.

కాబట్టి ఇక్కడ తెలియవలసినది క్రొత్తగా తెలివి సంపాదించుట కాదు.
వున్న తెలివిని సక్రమముగా ఉపయోగించుట మాత్రమే.


మూడవ​​ చరణం:
బాలులు యిసుకగుళ్లు పఁస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాఁడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా ॥ఆమీఁ॥
Telugu Phrase
Meaning
బాలులు యిసుకగుళ్లు పఁస గట్టు కాడినట్టు
పిల్లలు యిసుకగుళ్లు ఎంతో  నైపుణ్యంగా కట్టి ఆడినట్లు
వీలి వెఱ్ఱివాఁడు గంతువేసినయట్టు
మనచేష్టలు వెఱ్ఱివాఁడు తెలియక గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
శుభముకలిగించు శ్రీవేంకటేశ  నిను గొలువక​ మేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా
ఇన్నాళ్ళూ కాలము వ్యర్థముగా  గడిపితిమయ్యా
సూటి భావము:
పిల్లలు యిసుకగుళ్లు ఎంతో  నైపుణ్యంగా కట్టి ఆడినట్లు, మనచేష్టలు వెఱ్ఱివాఁడు తెలియక గంతువేసినయట్టు శుభముకలిగించు శ్రీవేంకటేశ  నిను గొలువక మేము ఇన్నాళ్ళూ కాలము వ్యర్థముగా  గడిపితిమయ్యా

గూఢార్థవివరణము: 
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా
ఈ లోకములోకి ఎందుకు వచ్చామో తెలియకుండానే ఇన్నాళ్ళు గడిపాము.
ఇకనైనా తెలియండి.
మునుపు చెప్పుకున్నట్లులోకములోకి ఊరకనే రాలేదు. అది నిశ్చయం.
వచ్చి అసలు పని మరచి తిరుగుతున్నామని ఆచార్యుల ఉద్దేశము.

ఆ అసలు పని తెలియుటకు
"యీజన్మనందు కిందుమీఁదు నేఱక"
అన్నదానితో కలిపి చూడండి.
ఆ విషయమును గ్రహించలేని జీవనము వెఱ్ఱివాని గంతులు లాగే.

X-X-The END-X-X

No comments:

Post a Comment

T-295 ఆ మీఁది నిజసుఖ మరయలేము

  తాళ్లపాక అన్నమాచార్యులు 295 ఆ మీఁది నిజసుఖ మరయలేము For English version press here ఉపోద్ఘాతము అన్నమాచార్యులు క్రొత్త సూక్తులు చెప్పలేదు. మన...