Wednesday, 10 December 2025

T289 ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము

 తాళ్లపాక పెద తిరుమలాచార్యులు
289 ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము
మనలోని నటన పూర్తిగా కరిగినపుడు
మాత్రమే స్వేచ్ఛలోకి అడుగిడతాం.”

 

ఉపోద్ఘాతము

 

క్రూరత్వమునకు కుదువ యీ బ్రదుకు
అన్నారు అన్నమాచార్యులు
క్రూరత్వం అంటే కత్తులతోను చాకులతోను పొడిచుకోవడమే కాదు
అలాంటి మాటలు మాట్లాడడం కూడా.

కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మనము చక్కని రాజమార్గమునకు
బదులు ఏరకంగా తప్పించుకోవాలి
అన్న వంకర మార్గము మీద ఎక్కువ ద్యాస పెడతాం.
ఇదే మనం మనకే వేసుకునే మానసిక శిక్ష.
అదే మనలోని క్రూరత్వం.

ఈ విషయాన్నే తండ్రికి తగ్గ తనయుడు
తాళ్లపాక పెదతిరుమలాచార్యుడు చెబుతున్నాడు
స్వామి ఇది నా తప్పు అని విన్నవించుకుంటున్నాడు
అంతేకానీ కారణాలు వెతకట్లేదు.

మనం సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే
దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల సాకులు వెతుకుతాం.
సమయం దొరకలేదు సార్”,
వాళ్ళు ఇచ్చిన డేటా సరిగ్గా లేదు సార్”,
మన ఉద్యోగులు మీద పని ఒత్తిడి ఎక్కువైపోయింది సార్”,
ఆ కాంట్రాక్టులో ఈ క్లాజు లేదు సార్”,
అందరికీ పని చేస్తుంది; కానీ వీళ్ళకే పనిచేయట్లేదు సార్”,
చాలా తక్కువ జీతం ఇస్తున్నారు సార్
ఇలాంటి లక్షలాది కారణాలు వెతుకుతాం

జాగ్రత్తగా గమనిస్తే 500 సంవత్సరాల క్రితమే
ఈరోజు మనం ఉన్న స్థితిని పెద తిరుమలాచార్యులు గారు చెప్పారు
నిజం ఒప్పుకోవడానికి కావాల్సిన ధైర్యం మాత్రమే
అది ఒక్కటే ఉంటే చాలు
మన ఎంతో బాగుపడతాం.

కీర్తన సంక్షిప్త చిత్రం
పల్లవి:
స్వామీ ఇదే నాలోని దుర్జనము. నువ్వు నాకే శిక్ష అయినా వెయ్యి.
చరణం 1:
భగవదాశ్రయపు ప్రాపు వెనుక దాక్కొని ప్రయోజనములేదు.
చరణం 2:
శాస్త్రమును గుడ్డిగా పాటించడం కంటే అర్థం చేసుకోవడం ఎక్కువ ముఖ్యం.
చరణం 3:
శ్రీ వేంకటేశుడే ఏలిక అని తెలిసుకొని అన్య ము మరచి యుండుటయే భక్తి.​.
అధ్యాత్మ​ కీర్తన
రేకు: 5-5 సంపుటము: 15-30
ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము
యే యపరాధమో కాని యింతేసి సేసితిని         ॥పల్లవి॥

ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగలను
వేమారుఁ బాపములకు వెరవ నైతిని
నీ మఱుఁగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి
నేమపు పుణ్యములు మానితి నేను      ॥ఏ॥

తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున
పగటున దేవతల పంపు సేయను
నగుతా నీ నామము నాలికనున్న బీరాన
జగతి నిత్య కర్మము జారి పోఁదోసితిని ॥ఏ॥

హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు
వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతివి
యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని
మత్తుఁడనై అన్యచింత మఱచితిని    ॥ఏ॥
Details and Explanations:
పల్లవి
ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము
యే యపరాధమో కాని యింతేసి సేసితిని ॥పల్లవి॥
              Telugu Phrase
Meaning
ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము
ఇదే నాలోని దుర్జనము. నువ్వు నాకే శిక్ష అయినా పెట్టు (నాకు సమ్మతమే)
యే యపరాధమో కాని యింతేసి సేసితిని
ఆ అపరాధం ఏమో కానీ ఎంతో చేశానో నాకే తెలియడం లేదు

భావము: స్వామీ ఇదే నాలోని దుర్జనము. నువ్వు నాకే శిక్ష అయినా పెట్టు (నాకు సమ్మతమే). ఆ అపరాధం ఏమో కానీ ఎంతో చేశానో నాకే తెలియడం లేదు.


గూఢార్థవివరణము: 

పెదతిరుమలాచార్యులు తానేమి అపరాధం చేసారో తెలియడం లేదు అంటున్నారు. తెలియక చేసినవి అపరాధములు తెలిసి చేసినవి పాపములు.  తమ అపరాధమును నిర్ద్వంద్వంగా ఏమాత్రము సంకోచం లేకుండా ఏ కారణమూ చూపకుండా, నిర్వ్యాజముగా, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటున్న విషయం స్పష్టమవుతోంది.


మొదటి చరణం:
ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగలను
వేమారుఁ బాపములకు వెరవ నైతిని
నీ మఱుఁగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి
నేమపు పుణ్యములు మానితి నేను          ॥ఏ॥
Telugu Phrase
Meaning
ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగలను
వేమారుఁ బాపములకు వెరవ నైతిని
(ఆముకొని = పైకొని;  సలిగ = ప్రాపు, ఆశ్రయము) నేను నీదాసుఁడ నని నీ ఆశ్రయం నాకు దొరికినదని అనుకోని అనేక పాపములను భయపడకుండా చేశాను
నీ మఱుఁగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి
నేమపు పుణ్యములు మానితి నేను
నీ వెనుక చొచ్చిన ధైర్యంతో పుణ్య కార్యములను వదలి ఇలా ఉన్నాను

భావము:
నేను నీదాసుఁడ నని నీ ఆశ్రయం నాకు దొరికినదని అనుకోని అనేక పాపములను భయపడకుండా చేశాను. నీ వెనుక చొచ్చిన ధైర్యంతో పుణ్య కార్యములను వదలి ఇలా ఉన్నాను.

గూఢార్థవివరణము: 
ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగలను
వేమారుఁ బాపములకు వెరవ నైతిని
ఓ భగవంతుడా నీ దాస్యంను చేపట్టాను అని చెప్పినంత మాత్రాన
పాపములనుండి పరిష్కారం లభించదు.

సలిగ = ఆశ్రయం.
భగవదాశ్రయం మన ప్రస్తుత జీవితపు అవస్థలతో సంబంధం లేనిది.
దానిని ఆసరాగా తీసుకొని పాపములలో పడరాదు.
భగవదాశ్రయం అంటే ఇష్టం వచ్చినట్లు వుండడం కాదు.
బాధ్యతాయుతంగా వుండడం.
ధర్మాన్ని దాటకుండా వుండే సంయమనం.
క్రియాశీల ధర్మం ఒకే నిర్వచనంలో ఇమడలేదు.
ఆ అనిర్వచనమైన దానిని పాటించడం మరింత కఠినం.

భగవద్గీతలో ఇలా చెప్పారు. 
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః (5-15)
సర్వాంతర్యామియైన భగవంతుడు,
ఏ ఒక్కని పాపపుణ్యకర్మల యందు పాలు పంచుకోడు.

కాబట్టి దేవుని పేరు చెప్పుకుంటూ ధర్మాన్ని వదిలేస్తే,
అది దాస్యం కాదు — అది అధర్మం
 అని కవి గట్టిగా చెబుతున్నాడు.”


రెండవ​ చరణం:

తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున
పగటున దేవతల పంపు సేయను
నగుతా నీ నామము నాలికనున్న బీరాన
జగతి నిత్య కర్మము జారి పోఁదోసితిని          ॥ఏ॥
Telugu Phrase
Meaning
తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున
నీ ముద్రలు నా శరీరం మీద ధరించి దానిని చనవుగా తీసుకొని
పగటున దేవతల పంపు సేయను
(పగటున= ప్రకటించి) ప్రకటించిన దేవతల ఆజ్ఞలను పాటించడం మానేశాను
నగుతా నీ నామము నాలికనున్న బీరాన
నీ నామము రోజంతా పలుకుతున్నానను బీరముతో గర్వించి
జగతి నిత్య కర్మము జారి పోఁదోసితిని
ఈ లోకములో అనుసరించదగిన నిత్య కర్మమును కూడా  వదలివేసితిని

సూటి భావము:

నీ ముద్రలు నా శరీరం మీద ధరించి దానిని చనవుగా తీసుకొని, సామాన్యముగా తెలియపరచబడిన  దేవతల ఆజ్ఞలను పాటించడం మానేశాను.  నీ నామము రోజంతా పలుకుతున్నానను బీరముతో గర్వించి ఈ లోకములో అనుసరించదగిన నిత్య కర్మమును కూడా  వదలివేసితిని.


గూఢార్థవివరణము:
పెదతిరుమలాచార్యులు ఆత్మ విమర్శకు మరింత పదును పెడుతున్నారు.
ముద్రలు ధరించడం దైవం యొక్క నామము నిత్యమూ జపించడం
 మంచివే కానీ ఆ కార్యక్రమాలను చేస్తున్నాను అన్న గర్వం పనిచెయ్యదు.
అని తెలుపుతున్నారు.
ఇది ఎలా ఉంటుందంటే 
నేను ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యాను 
నాకు చిన్న లెక్కలు గుణింతాలు అవసరం లేదనుకోవడం లాంటిది.

శాస్త్రములలో చెప్పినవి మోస్తరు-మాదిరి వంటివి.
తూచాతప్పకుండా చేయడం మాత్రమే కాదు.
వాని వెనుక ఉన్న ఆలోచనను వెదికి పట్టాలి.
దీన్ని ఇంకొంచెం విస్తరిస్తే శాస్త్రంను పాటించడం కంటే
అర్థం చేసుకోవడం ఎక్కువ ముఖ్యం.

అర్థం చేసుకున్నవాడు స్వతంత్రంగా ఆలోచించి
శాస్త్రమును చక్కగా పాటించగలుగుతాడు
అర్థం చేసుకొనివారు
నామాలు పెట్టుకున్నాను.
నిత్యమూ జపిస్తున్నాను.
ముద్రలు ధరించుకున్నాను.“
అని విర్రవీగుతుంటారు.

మూడవ​ ​ చరణం:
హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు
వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతివి
యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని
మత్తుఁడనై అన్యచింత మఱచితిని          ॥ఏ॥
Telugu Phrase
Meaning
హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు
(హత్తి = కూడుకొని) కూడుకొని నీవు నాకు గలవు, నీవే నా   అంతర్యామివి అనుచు
వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతివి
నీవే నా  అంతర్యామివి అనుచు ఉత్తమమైన మార్గములనెల్లా విడిచితిని.
యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని
ఈ లోకంలో శ్రీ వేంకటేశ ఏలికవు (ప్రభువు) నీవని
మత్తుఁడనై అన్యచింత మఱచితిని
ఆ మత్తులోనే అన్యచింతలను మఱచితిని.
సూటి భావము:
(పెదతిరుమలాచార్యులు తీక్షణమైన గమనించదగ్గ ​ సంగతిని తెలుపుతున్నారు.) కూడుకొని నీవు నాకు గలవు, "నీవే నా  అంతర్యామివి అనుచు" ఉత్తమమైన మార్గములనెల్లా విడిచితిని. చివరికి ఈ లోకంలో శ్రీ వేంకటేశ ఏలికవు (ప్రభువు) నీవని తెలిసి ఆ మత్తులోనే అన్యచింతలను మఱచితిని.

గూఢార్థవివరణము: 
హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు
వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతివి
ఈ పంక్తుల వరకు పెదతిరుమలాచార్యులు
ఈ లోక వ్యవహారములలో మునిగి ఉన్న మనోస్థితిలో
"చేయని పనులు" "చెయ్యవలసిన పనులు" ఎన్నో కనపడుతూ ఉంటాయి.
ఎన్ని చేపట్టిన ఎన్ని యుగాలు గడిచినా దైవం కానరాడు.
అని తెలుపుతున్నారు.

యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని
మత్తుఁడనై అన్యచింత మఱచితిని
శ్రీ వేంకటేశ ఏలికవు (ప్రభువు) నీవని ఎఱింగి,
నీవు తప్ప నాకు వేరు శరణ్యములేదు
అను భావనలో పూర్తిగా ములిగి నిలిచి వుండుటయే ఉత్తమమైన మార్గము

మొదటి 12 పంక్తులు ఆదర్శము, నీతి వర్తనము
ముఖ్యంగా ఆధిపత్యపు నీడలో నైతిక మాంద్యము
ఆవలంబన ఆశ్రయములు కల్పించు తాత్కాలిక ఉపశమనముల
పరిమితులను సూచించుచున్నవి.

దైవం ఒక పోలీసువాడి లాగా ధర్మాన్ని పరిరక్షిస్తూ కూర్చోడు.
భగవదాశ్రయం అంటే ఇష్టం వచ్చినట్లు వుండడం కాదు.
బాధ్యతాయుతంగా వుండడం.
ధర్మాన్ని దాటకుండా వుండే సంయమనం.
క్రియాశీల ధర్మం ఒకే నిర్వచనంలో ఇమడలేదు.
ఆ అనిర్వచనమైన దానిని పాటించడం మరింత కఠినం.

క్రియా శీల ధర్మమును పాటించనివారు అయోమయంలో పడిపోతున్నారు.
 అంటే, మనం ఉన్న ప్రపంచంలోనే ఉందురు.

మనలను ఎవరో వచ్చి సరైన మార్గంలోపెడుదురు అన్న భావనలో
మనం ఉన్నంతవరకు మోక్షమునకు దారి కానరాదు. 

మనలోని నటన పూర్తిగా కరిగినపుడు
మాత్రమే స్వేచ్ఛలోకి అడుగిడతాం.”

No comments:

Post a Comment

289 ē yājña ayinaṃ̐ beṭṭu yidivō nā durjanamu (ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము)

    TALLAPAKA PEDA TIRUMALACHARYULU 289 ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము ( ē y ā jña ayina ṃ̐ be ṭṭ u yidiv ō n ā durjanamu)   ...