Friday, 26 December 2025

T-294 చాటెద నిదియే సత్యము సుండో

 తాళ్లపాక అన్నమాచార్యులు
294 చాటెద నిదియే సత్యము సుండో


ఉపోద్ఘాతము

భక్తి అనగా
"దైవమా నేను నీ బంటును. నువ్వు నన్ను రక్షించుము"
అని కాదు.
"నేను నీ భక్తిలో సహజముగానే మునిగి ఉంటాను.
తరువాత జరుగు ఘటనలను యథాతథముగా స్వీకరిస్తాను".
అని.

కావున భక్తిని ఆ కోణములోనే చూడవలెను.
వేరు దృష్టికోణములన్ని సంసార వృక్షములో తగులుకొనునవే.

దైవము మానవుల నుంచి ఎటువంటి సేవలు కోరడు.
సర్వసమున్నతుడగు దైవమునకు ఏ సేవలు అవసరములేదు.
పైగా సేవ చేయుటకు దైవం దగ్గరగా వెళ్ళవలసిందే.
అనగా, “నేను” అను అస్తిత్వమును దాటినపుడే సేవకు అర్హుడగునది!
కాబట్టి “సేవ” అన్న ఈ చిన్న పదం అత్యంత మర్మమైనది.

ఈ కీర్తనలో అన్నమాచార్యులు
చేటు లేదీతని సేవించినను” అన్నది
సేవ చేయబోయేవానికి భరోసా ఇచ్చుచున్నారా?
ఇదే కీలకముగ ఆలోచించవలసిన విషయము.


అధ్యాత్మ​ కీర్తన

రేకు: 138-5 సంపుటము: 2-164
చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేవించినను              ॥పల్లవి॥

హరినొల్లని వారసురలు సుండో
సుర లీతని దాసులు సుండో
పరమాత్ముఁడితఁడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదిఁకను     ॥చాటె॥

వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో
సోదించె శుకుఁడచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాడతఁడు సుండో
యేదెస వెదికిన నితఁడే ఘనుఁడు      ॥చాటె॥

యిహపర మొసఁగను యీతఁడె సుండో
వహి నుతించెఁ బార్వతి సుండో
రహస్యమిదివో రహి శ్రీవేంక
మహీధరంబున మనికై నిలిచె            ॥చాటె॥
Details and Explanations:
పల్లవి

చాటెద నిదియే సత్యము సుండో
చేటు లేదీతని సేవించినను ॥పల్లవి॥

              Telugu Phrase
Meaning
చాటెద నిదియే సత్యము సుండో
ఇది ఒకటే పరమ సత్యము చాటిచెబుతున్నాను
చేటు లేదీతని సేవించినను
(చేటు=వినాశము, కీడు, అశుభము, మరణము) ఈతనిని (అనగా వేంకటేశ్వరుని) సేవించితే ఎటువంటి నాశము జరుగదు.

భావము:
ఈతనిని (అనగా వేంకటేశ్వరుని) సేవించితే ఎటువంటి నాశము జరుగదు. ఇది ఒకటే పరమ సత్యము చాటిచెబుతున్నాను.

గూఢార్థవివరణము:
చేటు లేదీతని సేవించినను
ఉపోద్ఘాతములో చెప్పినట్లుగా
సేవ చేయడంలో ఎదో మర్మము లేకుండా
అన్నమాచార్యులు "చేటు" అనే పదం వాడేవారా?
"సేవ​"లోని రహస్యమును విడగొట్టుటకు ప్రయత్నిద్దాం.

మొదటి చరణం:
హరినొల్లని వారసురలు సుండో
సుర లీతని దాసులు సుండో
పరమాత్ముఁడితఁడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదిఁకను          ॥చాటె॥
Telugu Phrase
Meaning
హరినొల్లని వారసురలు సుండో
హరిని ఒప్పుకోనివారివి అసుర గుణములని తెలియండో.
సుర లీతని దాసులు సుండో
సత్యముగా దేవతలందరూ ఈతని దాసులు
పరమాత్ముఁడితఁడె ప్రాణము సుండో
పరమాత్ముఁడితఁడె ప్రాణము ఈతడని తెలియండో.
మరుగక మఱచిన మఱి లేదిఁకను
(ఈ ప్రాణముకై, ఈ దేహముకై) ఆశించక ఆశపడక అది కాపాడుకోవాలను కోరికను మఱిచిన తిరిగి జన్మించరు. మీరు అమరులగుదురు.

భావము:
హరిని ఒప్పుకోనివారి స్వభావము రాక్షసము (అజ్ఞాన సమము) అని తెలియండో. సత్యముగా దేవతలందరూ ఈతని దాసులు. పరమాత్ముఁడితఁడె ప్రాణము ఈతడని తెలియండో. (ఈ ప్రాణముకై, ఈ దేహముకై) ఆశించక ఆశపడక దానిని కాపాడుకోవాలను కోరికను మఱిచిన తిరిగి జన్మించరు. మీరు అమరులగుదురు.

గూఢార్థవివరణము: 
హరినొల్లని వారసురలు సుండో
ఇక్కడ ఆచార్యులవారు  
'హరి'ని తెలియకుండు స్థితిని
మనుష్య స్వభావము కన్నను తక్కువగా చూపారు.​

సుర లీతని దాసులు సుండో
వెంటనే హరిదాసులను దేవతాస్వభావులుగా చిత్రించారు.

పరమాత్ముఁడితఁడె ప్రాణము సుండో
మనలోని ప్రాణము హరియే.
అనగా ప్రాణమును తెలియకుండా బ్రతుకువాడు
నిర్లక్ష్యజీవి అనుకోవచ్చును.

మరుగక మఱచిన మఱి లేదిఁకను
ప్రస్తుతపు దేహమునకు అలవాటుపడి,
దానిపై నుండి నీ చూపులను త్రిప్పి చూసిన (హరి కనబడును),
అపుడు నీకు తిరిగి జన్మము వుండదు.

మానవ జన్మము యొక్క విశిష్ట స్థానమును చెబుతున్నారు.
'హరి'ని తెలియకుండువారు రాక్షస స్వభావులు
తెలియువారు దేవతలు
అందరి ప్రాణము హరియే.
అలవాటుపడిన ఈ దేహపు జీవనమును విడుచుటయే సేవ.

నీచ స్థితులకు జారుట సహజ క్రమము

సేవ అనగా హరిని తెలియుటయే.
వేరొకటి కాదు.
అయ్యా ప్రాణమును వదలునంతటి
తెగింపు చేయ వలసిన విషయమేమి?” అనవచ్చును
అంటే ఏమీ చేయకుంటే ఇలాగే వుండిపోము.
దిగజారుతూ పోతామని హెచ్చరించుచున్నారు.

ప్రాణము అన్నది ఒక వస్తువుకాదు.
అది నిరంతర ప్రవాహము.
ఆ ప్రాణమును ఈ దేహము నిరంతరం
నీచ స్థితులకు లాగుతూ వుంటుంది.

దేహము పదార్థ సమ్మిళితము.
నమయముతో బాటు 
నీచ స్థితులకు జారుట సహజ క్రమము.
పదార్థ ధర్మము.


భౌతికశాస్త్రంలో ఎంట్రొపీ (entropy) అనేది
"వినిమయానికి అందుబాటులో ఉన్న శక్తి క్రమంగా
అప్రయోజనకరమవుతూ పోతూ ఉండడనికి సూచకం.
అందుమూలమున​
ఏ వ్యవస్థనైనా అలాగే వదిలేస్తే,
అది తనంతట తాను క్రమబద్ధతనుండి
తక్కువ స్థాయిలకు క్రుంగిపోతూ వుంటుంది.

అందుకే అన్నమాచార్యులు ఇలా అన్నారు.
దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో ।
ఉబ్బు నీటిపై నొక హంస
(ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఆ గర్భములో తేలినది ఒక హంస​).
మనము కాకులము కాదు.
హంసలము.
గొంగళీ పురుగులము కాదు.
సీతాకోక చిలుకలము.

గొంగళీ పురుగునుంచి సీతాకోక చిలుక సహజ క్రమము.
మనము ఆ క్రమము తెలియక అందులో జోక్యము చేసుకొని అవస్థలు పడతాము.

అయితే, ఏమీచేయక ఉంటే
కాకులు, గొంగళీ పురుగులుగా వుండిపోము.
ఇంకా దీనావస్థలలో కూరుకుపోతాము.
అదే రానున్న ప్రమాదం పట్ల అప్రమత్తతకు సంజ్ఞ.

సేవ అనుదానిని ఇదమిత్థంగా చెప్పుట అత్యంత క్లిష్టము.
ఐనా సాహసం చేసి చెబుతున్నాను.
నీచ స్థితులకు జారుట సహజ క్రమము
సేవ అనగా ఆ జారుటను గమనించుట​.
అదియే జ్ఞానము.

తరువాయి ఘటనలు మానవుని ఆధీనములో లేనివి.
బుద్ధుడు చెప్పిన 31 చేతనావస్థలలో ఏదో ఒక దానికి
కర్మానుసారము తీసుకొనిపోబడుదుము.
ఇది మంచిది. ఇది చెడ్డది అను విచక్షణను వదలి ఉండుటయే జ్ఞానము.

రెండవ​ చరణం:
వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో
సోదించె శుకుఁడచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాడతఁడు సుండో
యేదెస వెదికిన నితఁడే ఘనుఁడు          ॥చాటె॥
Telugu Phrase
Meaning
వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో
అనాదియైన ధర్మరక్షకుఁడు విష్ణుఁడు. ఈ సత్యము తెలియండో
సోదించె శుకుఁడచ్చుగ సుండో
శుకుఁడు అచ్చముగా ఈతనినే శోధించి ముక్తుడాయె తెలియండో
ఆదిబ్రహ్మగన్నాడతఁడు సుండో
సత్యప్రమాణముగా ఆతడు (శుకుఁడు) ఆదిబ్రహ్మమును చూచెను. జనులారా తెలియండో.
యేదెస వెదికిన నితఁడే ఘనుఁడు
మీరే విధముగా చూచిననూ విష్ణుఁని కంటే ఘనమైనది కానరాదు తెలియండో
సూటి భావము:
(అన్నమాచార్యులు ఈ చరణంలో ఆ సేవను సోదాహరణముగా చూపుతున్నరు.​​అనాదియైన ధర్మరక్షకుఁడు విష్ణుఁడు. ఈ సత్యము తెలియండో. శుకుఁడు అచ్చముగా ఈతనినే శోధించి ముక్తుడాయె తెలియండో. సత్యప్రమాణముగా ఆతడు (శుకుఁడు) ఆదిబ్రహ్మమును చూచెను. జనులారా తెలియండో. మీరే విధముగా చూచిననూ విష్ణుఁని కంటే ఘనమైనది కానరాదు తెలియండో.

గూఢార్థవివరణము:
సోదించె శుకుఁడచ్చుగ సుండో
(అచ్చుగ = పరిశుద్ధముగా, నిర్మలముగా)
ఇక్కడ నిర్మలము అనగా ఎటువంటి
ముందస్తు ఊహలు, భావనలు లేకుండా అని గమనించవలెను.
శుకుఁడు నిర్మలమైన మనస్సుతో శోధించెను

ఆదిబ్రహ్మగన్నాడతఁడు సుండో.
సత్యప్రమాణముగా ఆతడు (శుకుఁడు)
నిష్కల్మష పరిశీలనలో
ఆతడు సంసారవృక్ష మూలమగు ఆదిబ్రహ్మమును దర్శించెను.
ఆ మూలము వీక్షణములోనే అతడికి శుద్ధ జ్ఞానము ప్రాప్తించెను.

మూలము అనగా చివరకంటా
ఎటువంటి మినహాయింపులు లేకుండా
చూచువాడు తెలివి నొందును.
తనకు సత్యమునకు మధ్య​ అడ్డులన్నీ తొలగించు క్రియ జ్ఞానము
ఇదే “సేవ”  అంటే

మూడవ​​ చరణం:
యిహపర మొసఁగను యీతఁడె సుండో
వహి నుతించెఁ బార్వతి సుండో
రహస్యమిదివో రహి శ్రీవేంక
మహీధరంబున మనికై నిలిచె     ॥చాటె॥
Telugu Phrase
Meaning
యిహపర మొసఁగను యీతఁడె సుండో
అయ్యాలారా! నిద్వందముగా ఈ లోకమును, పరలోకమును ఒప్పగించువాడు ఈతడే
వహి నుతించెఁ బార్వతి సుండో
ప్రజలకు సుగమమైన మార్గము తెలుపుటకు పార్వతీదేవి ఇతనినే ధ్యానించెను సుమ్మీ
రహస్యమిదివో రహి శ్రీవేంక
ప్రజలారా! నిగూఢమైన రహస్యమిదే.  ఆసక్తి, తెలివి, జ్ఞానము శ్రీవేంకట పర్వతమే.
మహీధరంబున మనికై నిలిచె
జీవించుచున్నది, వసించుచున్నది ఆ ఒక్కటే.
సూటి భావము:
అయ్యాలారా! నిద్వందముగా ఈ లోకమును, పరలోకమును ఒప్పగించువాడు ఈతడే. ప్రజలకు సుగమమైన మార్గము తెలుపుటకు పార్వతీదేవి ఇతనినే ధ్యానించెను సుమ్మీ. ప్రజలారా! నిగూఢమైన రహస్యమిదే.  ఆసక్తి, తెలివి, జ్ఞానము శ్రీవేంకట పర్వతమే. జీవించుచున్నది, వసించుచున్నది ఆ ఒక్కటే.

గూఢార్థవివరణము: 
యిహపర మొసఁగను యీతఁడె సుండో
ప్రజలారా!
ఇహపరములు నిర్దిష్ట వ్యక్తీకరణకు అనువుగావు.
ఆ చేతన స్థితులలోనో, దానికి వేరైన దానిలోనో
మనను నిలుపగలిగిన వాడు శ్రీవేంకటపతి.

జాగ్రత్తగా గమనించిన ఏ స్థితిలోను నిలకడగా లేక,
భయము ఆవహింపగా చంచల స్వభావమును కలిగి
కేవలము ప్రాణములను నిలుపుకొను
ప్రయత్నములలో ములిగివున్న అవివేకులము మనము.

ఈ చంచల స్థితి అస్తవ్యస్తతతో కూడినది.
అక్కడ నుండి భగవంతుని సృష్టిలోని క్రమమును కనుగొనలేము.
అదియే అజ్ఞానము

మనికై నిలిచె
ఈ ప్రపంచమున సమస్తమును కలుపుచూ,
తక్కినవన్నీ వివిధ అవస్థలలో చిక్కుకొని వున్నను
జీవించుచున్న, వసించుచున్న సూత్రము ఆ ఒక్కటే.
శ్రీవేంకట పర్వతము.
తక్కినవన్నీ కాల ప్రవాహములో కొట్టుకొని
ఆనవాళ్ళుకూడా లేకుండా పోతున్నవి.

X-X-The END-X-X

No comments:

Post a Comment

294 cāṭeda nidiyē satyamu suṃḍō (చాటెద నిదియే సత్యము సుండో)

    TALLAPAKA ANNAMACHARYULU 294 చాటెద నిదియే సత్యము సుండో (c āṭ eda nidiy ē satyamu su ṃḍō) తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి . INTRODU...