Tuesday, 16 December 2025

T-291 ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు

 తాళ్లపాక అన్నమాచార్యులు
291 ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు

ఉపోద్ఘాతము 
ఈ కీర్తనలో అన్నమాచార్యులు
మానవులు తమలోనికి తాము చొచ్చుకుని పోకుండా
సాధించగలిగింది ఏమీ లేదు అంటున్నారు.


అధ్యాత్మ​ కీర్తన
రేకు: 5-6 సంపుటము: 1-35
ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-
వాని నన్నొకయింత వదలక నను నేలవలదా   ॥ఏ నిన్ను॥

అపరాధిఁ గనక నన్నరసి కావుమని
అపరిమితపు భయ మంది నీకు శరణంటిఁ గాక
నెపములేక నన్ను నీకుఁ గావఁగనేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా    ॥ఏ నిన్ను॥

ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
వనవరతము నా యాతుమ విహరించుమంటిఁ గాక
యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-
ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప ॥ఏ నిన్ను॥
Details and Explanations:
పల్లవి
ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-
వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ॥పల్లవి॥
              Telugu Phrase
Meaning
ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు -

 

(దూరు = నిందించు అన్న అర్ధం తీసుకొంటే) ఓ దైవమా నిన్ను తప్ప మరవరిని నిందించ గలను.
 
(దూరు = చొచ్చుకొనిపోవు, ప్రవేశించు అన్న అర్ధం తీసుకొంటే, అన్నమాచార్యులు తామెవరో తెలియని స్థితిలో వున్నారు) ఏ దేహములో ప్రవేశించక అంటే నాలో నేను ప్రవేశించక (నేనేమిటో నాకే తెలియక​), నేను ఎవ్వరి శరణ్యములో వుందును? (నేను ఎవ్వరి శరణ్యము కోరగలను?)
నీ వాని నన్నొకయింత వదలక నను నేలవలదా
(దైవముతో ఇలా అంటున్నారు) నీ వాణ్ణి. ఇసుమంత కూడా వదలక నా అంతరంగమును పాలించ రాదా?

భావము:
                    (అన్నమాచార్యులు తమకు తామెవరో తెలియని స్థితిలో వున్నారు)
                               ఏ దేహములో ప్రవేశించక అంటే నాలో నేను ప్రవేశించక
                   (నేనేమిటో నాకే తెలియక​), నేను ఎవ్వరి శరణ్యములో వుందును?
        (నేను ఎవ్వరి శరణ్యము కోరగలను? లేను. అవసరంలేదు అన్నది ధ్వనిస్తోంది) 
                                (ఐనా దైవముతో ఇలా అంటున్నారు) నేను నీ వాణ్ణి.
                ఇసుమంత కూడా వదలక నా అంతరంగమును పాలించ రాదా?

 గూఢార్థవివరణము: 
ఈ పల్లవిలో అన్నమాచార్యులు వారు ఒక సంక్లిష్టమైన దశను చూపుతున్నారు.
వారికి తానెవరో; తాను ఎక్కడున్నాడో;
తను ముందు ఎవరున్నారో; తానేమి మాట్లాడుతున్నారో; 
ఏదీ నిర్దిష్టంగా తెలియడం లేదు.
“దైవమా నన్ను నాలోకి (ఈ దేహంలోకి) ప్రవేశించమని చెబుతున్నావు. 
ఆ ప్రవేశించిన తర్వాత నేను నిన్ను మరిచిపోవచ్చును.
 నీవు ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండరాదు”
అని దైవంతో చెబుతున్నారని అనిపిస్తుంది.

ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు”
అన్నమాచార్యులు తామెవరో తెలియని స్థితిలో వున్నారు.
అన్నమాచార్యుల స్థితి
మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు పరిస్థితిలా ఉంది.
తాను స్వర్గానికి వెళ్ళినా తన తమ్ములను భార్యను మర్చిపోలేక
తాత్కాలికంగా నరకంలోకి ఉండిపోవడానికి నిశ్చయిస్తాడు.

అన్నమాచార్యుల వారికి ఆ క్షణంలో
ఆ దేహముగల జీవి గత చరిత్ర అంతా గుర్తుకు వచ్చింది.
ఆ దేహ సంబంధమైన  బాధను తిరిగి కోరుకోవడం లేదు.
వారికి కావాల్సింది దైవసాన్నిధ్యం ఒక్కటే.

కానీ ఆ క్షణంలో వారికి  తనకు చెయ్యవలసినది చేయబోయేది
ఏది కానవచ్చుట లేదు
కార్యములనుండి కర్మలనుండి విముక్తుడైనారు.
ఆ స్థితిలో వారి మనసు భగవంతుని మనసుతో ఐక్యమైపోయింది
దైవం లేని చోటు లేదు కానీ
అయినా నా అంతరంగంను వదిలి వెళ్లరాదు
అని షరతు పెడుతున్నారు అనిపిస్తుంది.
తన ఈ మొండితనాన్ని చరణాలలో తనను తానే నిందించుకుంటారు

మనమందరం గతించిపోయిన స్మృతుల గుర్తు చేసుకుంటూ కానీ,
భూతకాలంలో జరిగిన సంఘటనలను
భవిష్యత్తులో కొనసాగించుటకు ఎత్తులు వేస్తూ కానీ
కాలం గడుపుతాం

వేదాలు, భగవద్గీత, మహామహులు అందరూ
జరుగుతున్న ఈ క్షణంలో మన దృష్టిని కేంద్రీకరించమని చెబుతున్నా
వాస్తవానికి మనమెవరూ ఈ జరుగుతున్న క్షణంలో సహజంగా ఉండలేము.
ఒకవేళ పట్టుబట్టి ఉంటే అది కృత్రిమమే.
ఇదే పరిస్థితి అన్నమాచార్యులకు ఎదురవుతున్నది.

వారు మోక్షమును, స్వేచ్ఛను పొందిన
ఇంకా దైవము తనతోనే ఉండాలి అన్న పూర్వ స్మృతులతో
మాట్లాడుతున్నారు అనిపిస్తుంది.

ఇంతకు ముందు చెప్పిన కీర్తనలో క్రింది విధంగా ఉంటుంది
అలమేల్మంగ పురుషాకారమున ఆచార్యుననుమతి మెలఁగును
ప్రపంచమునకు కర్త ఒకడే-దైవము.
అన్నమాచార్యులవారు తనను నిర్దేశించు శక్తిని దైవమునకే ఒసగిరి.
"ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను" అన్నారు.
ఆచార్యులవారి దేహములో దైవ శక్తి ప్రవేశించింది.

మొదటి చరణం:
అపరాధిఁ గనక నన్నరసి కావుమని
అపరిమితపు భయ మంది నీకు శరణంటిఁ గాక
నెపములేక నన్ను నీకుఁ గావఁగనేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా   ॥ఏ నిన్ను॥ 
Telugu Phrase
Meaning
అపరాధిఁ గనక నన్నరసి కావుమని
నేను అపరాధిని కనుక నా పరిస్థితి తెలిసి నన్ను రక్షించమని
అపరిమితపు భయ మంది నీకు శరణంటిఁ గాక
చెప్పలేనంత భయమునకు గురియై నీకు శరణంటిని
నెపములేక నన్ను నీకుఁ గావఁగనేల
ఏ కారణమూ లేకనే నీవు నన్ను ఆదుకొన్నావు
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా
(అపవర్గరూప = మోక్షరూపుడుమోక్షరూపాదయాంబుధి తిరువేంకటాధిపా

భావము:
నేను అపరాధిని కనుక నా పరిస్థితి తెలిసి నన్ను రక్షించమని
చెప్పలేనంత భయమునకు గురియై నీకు శరణంటిని.
 ఏ కారణమూ లేకనే నాలో ఎన్నో తప్పులున్నప్పటికీ
నేను అర్హుడను కాకపోయినా
నీవు నన్ను ఆదుకొన్నావు
మోక్షరూపుడా, దయాసాగరుడా తిరువేంకటాధిపా

గూఢార్థవివరణము: 
అపరాధిఁ గనక నన్నరసి కావుమని
అపరిమితపు భయ మంది నీకు శరణంటిఁ గాక
అన్నమాచార్యులవారు నిజంగా అపరాధం చేసి ఉంటే
వారికీ మోక్షము ప్రాప్తించేది కాదు.
ఆ క్షణంలో వారు అన్నమాచార్యులు మాత్రమే కాదు.
వారి మనసు విశ్వవ్యాప్త చైతన్యముతో ఏకమైనది కావున
మొత్తం మానవాళిని సూచించు వ్యక్తి అనుకోవచ్చును.

ఇక్కడవారు అపరాధినిఅన్న దానితో
తన పూర్వ స్మృతుల వాసనలను తెలిపిన జ్ఞానంతో చెబుతున్నారు అనిపిస్తుంది.

బుద్ధుడు కూడా తన పూర్వజన్మలో
మనిషిగానే కాక జంతువులు కింద కూడా
పుట్టిన వైనం గుర్తుకు తెచ్చుకోండి.
అయినప్పటికీ తన సమస్త శక్తిని ధారపోసి
ఏకాగ్రతతో ధ్యానము చేసి
మానవుల  దుఃఖములకు కారణమును,
దుఃఖ నివారణ మార్గమును కనుగొన్నారు.

అన్నమాచార్యులవారు సమస్త మానవాళి శ్రేయస్సుకొరకు
అతిక్లిష్టమైన మోక్షమునకు ఉపాయములు తెలిపారు.
సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో
దైవము సత్యము కాలములను
సులభమైన రీతిలో
 ప్రజల హృదయాలకు దగ్గరగా తీసుకు వచ్చారు.

గుర్రాన్ని చెరువుకి దగ్గరగా తీసుకురాగలం
కానీ దాని చేత తాగించలేం.
అలాగే అన్నమాచార్యుల వారి ఈ అద్భుతమైన కీర్తనల
సారాంశమును గ్రహించినవారు తమ తమ మనసులలో
ఆ దుర్గమైన మార్గం వైపు అడుగులు వేయగలరు.

పైన పేర్కొన్న విషయముల నుంచి
ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్పదల్చుకున్నాను.
 ఏ జన్మలో అయినా మానవునికి సంభవించు
సవాళ్ళు, మార్గము కఠినమే అయి ఉండును
కాబట్టి వచ్చే జన్మలో మరింత కృషి చేస్తాను అనుకోవడం అవివేకం.
మరణము తరువాత సంభవించు విషయములు మన నియంత్రణలో లేనివి.
 బుద్ధుడు కానీ అన్నమాచార్యులు కానీ తమ తమ జన్మలో చేసిన
 శరణాగతి ధ్యానములతోనే అతిలోక విషయములను చెప్పగలిగారు.

ఆ మహాత్ములలో పూర్వ స్మృతుల దోషములు వున్నప్పటికీ మోక్షమును పొందిరి.
కాబట్టి ఈ జన్మలో చేయు పనులే మోక్షమునకు కారణము.
అనగా ఈ మోక్షము లేదా స్వేచ్ఛ ఇప్పుడే చేపట్టవలసిన విషయము.
వచ్చే జన్మలో కాదు.

అయ్యా వారు కారణ జన్ములు. మేము సామాన్యులము
అని ఆలోచించక ఈ విషయములలో
చొచ్చుకొను పోవుకొలది అత్యంత ఆనందమును అనుభవించగలరు.

రెండవ​ చరణం:
ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
వనవరతము నా యాతుమ విహరించుమంటిఁ గాక
యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-
ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప॥ఏ నిన్ను॥
Telugu Phrase
Meaning
ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
 వనవరతము నా యాతుమ విహరించుమంటిఁ గాక
నీవు కరుణతో నన్ను లేవనెత్తి ఎత్తున కూర్చోబెట్టావు. కానీ నేను నా కొద్దిపాటి హృదయంలో విహరించమని నిన్ను వేడుకుంటున్నాను.
యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-
(యెనసి = సమానం చేయు, సాటిచేయు) ఇటువంటి తక్కువ వాడినైన నన్ను కాపాడి నీ అంత వాడిని చేయుట  నీకు అరుదు కాకపోవచ్చును (నీకు పెద్ద పనేమీ కాదు).
ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప
పరిశుద్ధుడా! పరమతత్త్వానంద మూర్తి, తిరువేంకటాధిప
సూటి భావము:
నేను ఎంతో పాపిని. నీవు కరుణతో నన్ను లేవనెత్తి ఎత్తున కూర్చోబెట్టావు. కానీ నేను నా కొద్దిపాటి హృదయంలో విహరించమని నిన్ను వేడుకున్నాను. ఇటువంటి తక్కువ వాడినైన నన్ను కాపాడి నీ అంత వాడిని చేయుట  నీకు అరుదు కాకపోవచ్చును (నీకు పెద్ద పనేమీ కాదు. కానీ మానవులుగా మాకిది గొప్ప సోపానమును అధిగమించుట​). పరిశుద్ధుడా! పరమతత్త్వానంద మూర్తి, తిరువేంకటాధిప.

గూఢార్థవివరణము:
ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
వనవరతము నా యాతుమ విహరించుమంటిఁ గాక
విలక్షణమైన విషయం ఏమంటే
అన్నమాచార్యుల వారు స్వేచ్ఛ లోనే ఉన్నప్పటికీ
వారు దాన్ని ఇంకా గుర్తించలేదు. అందుకనే పల్లవిలో
వెంకటేశ్వర నా హృదయంలోనే నివసించు అంటూ ఆంక్షలు పెట్టారు

యెనసి
(యెనసి = సమానం చేయు, సాటిచేయు)
ఇది కీలకమైన పదం
ఇక్కడ దైవం తన హృదయ కంపనలతో
అన్నమాచార్యుల హృదయ కంపనాలను ఏకము చేసిరి.
ఆ స్థితిని మరుక్షణమే గ్రహించి 
తన అవివేకమను దైవానికి స్పష్టంగా విన్నవించుకుంటున్నారు.

ఈ చరణంలో అన్నమాచార్యులు గారు
మానవులు ఎదగలేని ఎత్తులో నిలిచి ఉన్నారని తెలుపుతోంది.

మొత్తం మీద ఈ కీర్తన వారికి మోక్షము లభించిన వెంటనే వ్రాసినది అనిపిస్తోంది.
 వారిలో ఇంకా మిగిలిన కొన్ని పాత స్మృతులు ప్రేరేపించగా
 దైవం నాతోనే ఉండాలి అని కోరుకున్నారు.
వాస్తవానికి వారు దైవ సన్నిధిలోనే ఉన్నారు.
ఈ కీర్తన వారి నిజాయితీకి నిష్కపటమునకు సంకేతము.

X-X-The END-X-X

 


 

No comments:

Post a Comment

3(R) tolli kalavē iviyu tolli tānuṃ̐ galaṃ̐ḍē (తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే)

  TALLAPAKA ANNAMACHARYULU 3R తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలఁడే (tolli kalav ē iviyu tolli t ā nu ṃ̐ gala ṃ̐ḍē ) (revised version)  తెల...