Saturday, 20 December 2025

T-292 అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు

 తాళ్లపాక అన్నమాచార్యులు
292 అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
For English version press here

ఉపోద్ఘాతము

ఈ కీర్తనలో అన్నమాచార్యులు
అందునిందు నున్నవారు అని
మానవులు అనేక తలములలో
(పాతాళము నుంచి దేవతా తలము వరకు)
వారివారి కర్మఫలానుసారము
అనేక స్థితులకు మానవులే చేరుకుందురని అన్నారు.
ఐతే వీరంతా భవస్థితిలోని వారే కావున
వారికి ఇతరులకు స్వేచ్ఛనిచ్చు ప్రజ్ఞ వుండదు అన్నారు.


అధ్యాత్మ​ కీర్తన
రేకు: 102-6 సంపుటము: 2-12
అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు    ॥పల్లవి॥

చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు ॥అయ్యో॥

పాతాళవాసులను పలులోకవాసులును
యీతరవాత నుండిన యీ జీవులే
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు         ॥అయ్యో॥

యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు     ॥అయ్యో॥

Details and Explanations:

పల్లవి
అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు ॥పల్లవి॥
              Telugu Phrase
Meaning
అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
అయ్యో మాయలు బొంది (స్థితి కల్పించు కపటములకు లోనై), అయా లోకములలో వున్నట్లు కనిపించు వారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు
ఐతే వారెవరూ మోక్షము ఇచ్చుటకు అర్హులు గారు. ఈ లోకములోని మందుబుద్ధులు ఆ విషయము నెఱుగరు.

 భావము:
అయ్యో మాయలు బొంది (స్థితి కల్పించు కపటములకు లోనై), అయా లోకములలో వున్నట్లు కనిపించు వారెవరూ మోక్షము ఇచ్చుటకు అర్హులు గారు. ఈ లోకములోని మందుబుద్ధులు ఆ విషయము నెఱుగరు.

గూఢార్థవివరణము: 
అందునిందు =
అక్కడ (స్వర్గములొ, దేవ లోకములలో), ఇక్కడ (ఈ భూమిపై) 

ఈ విషయమును పలువురు మహానుభావులు చెప్పిన వాటితో పోల్చి నిర్ధారించుదుము. భవస్థితి అంటే పుట్టుట​, పోవుటలకు లోనై వుండు, కాల పరిమితులకు లోబడిన స్థితి. బుద్ధుల వారు చెప్పిన 31 భవ స్థితులు, జిడ్డు కృష్ణమూర్తి గారు పేర్కొన్న పొరలు, గమనించిన ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అవి అన్నియు మానవుని అంతరంగమున నామముతోను, స్పర్శతోను గుర్తించగలిగినవి. కావున అవి భవస్థితికి సంబంధించినవి.

బుద్ధుడు చెప్పిన 31 భవస్థితులు (31 Planes of Existence): బుద్ధుడు మొత్తం సృష్టిని మూడు ప్రధాన లోకవర్గాలుగా విభజించాడు. ఈ లోకాలన్ని మానవ  (బంధిత​) స్థితినుంచి చేరుకున్నవే. ఏ లోకమైనా, మనము గుర్తించ గలిగివైతే, ఎదో విధముగా బంధమునే సూచించును. 

కామ లోకంకోరికల ఆధీనంలో ఉన్న మొత్తం11 స్థితులు (నరక లోకాలు, ప్రేత లోకం, అసుర లోకం, జంతు లోకం, మానవ లోకం ఆరు దేవ లోకాలు ఇవి అన్నీ కూడా బంధిత స్థితులే) 

రూప లోకం (Rūpa Loka)ఇవి ధ్యానంలో ఏర్పడే సున్నిత స్థితులు. మొత్తం 16. కామ కోరికలు లేవు, కానీ రూప స్మృతి ఉంది. 

అరూప లోకం (Arūpa Loka)రూపమే లేని చైతన్య స్థితులు అనంత ఆకాశ స్థితి, అనంత చైతన్య స్థితి, శూన్యత (ఏమీ లేదు అన్న భావం), సంజ్ఞా-అసంజ్ఞ స్థితి.


భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకము చూడండి.

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 3-10 ।।

సృష్టికర్త ప్రారంభంలో, మానవజాతితో పాటు యజ్ఞములను కూడా సృష్టించి, ఇలా చెప్పాడు, ‘ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి.’ 

ఈ శ్లోకమును పైన అన్నమాచార్యులు చెప్పిన దానితోను, మహానుభావుల ఆవిష్కరణలతోను అనుసంధానించి చూచుట ద్వారా మానవ జన్మ యొక్క విశిష్టతని తెలియవచ్చును. మానవ జన్మ ఒక్కదానికే స్వేచ్ఛను పొందు అవకాశము స్పష్టము.

యజ్ఞము అనగా వదలిపెట్టుట - కూడబెట్టుటకు పూర్తి వ్యతిరేకము.  కర్త అను భావనను వదలివేయడమే అసలైన యజ్ఞము. అలాగే జాగ్రత్తగా గమనించితే బుద్ధుల వారు సూచించినట్లుగా, భవస్థితులన్నీ యజ్ఞఫలాలే — స్వేచ్ఛ కాదు.


'జడులు' అని  పేర్కొనడం ద్వారా మనలోని సున్నితత్వం, సూక్ష్మగ్రాహ్యత లోపాలను తెలుపుతున్నారు కానీ విమర్శించుట లేదు. 
మాయ అను భవనములోని 
పై అంతస్తులను భవస్థితి నుండి
మోక్షమునకు దారిలేదు
అని తీక్షణముగా తెలుపుచున్నారు.

మొదటి చరణం:
చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు ॥అయ్యో॥
Telugu Phrase
Meaning
చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
నక్షత్రములై ( మన భాషలో స్టార్స్), దేవతలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
యిక్కడనుండి పోయిన యీజీవులే.
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
అనేక దిక్కులలో  కనబడుతున్నవారిని చూచి దైవము అని తలిచి మొక్కుదురు.
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు ॥అయ్యో॥
వీరందరి కంటే ఎక్కువవాడైన హరిని (తమ ఆత్మలో) చూడలేకున్నారు  మంద బుద్ధులు.

భావము:
నక్షత్రములై (మన భాషలో స్టార్స్), దేవతలై యుండినవారు యిక్కడనుండి పోయిన యీజీవులే (ఉదాహరణకు ధృవుణ్ణి తీసుకోవచ్చును). అనేక దిక్కులలో (బయట​) కనబడుతున్నవారిని చూచి దైవము అని తలిచి మొక్కుదురు.  వీరందరి కంటే హెచ్చగువాడైన హరిని (తమ ఆత్మలో) చూడలేకున్నారు  మంద బుద్ధులు.

గూఢార్థవివరణము: 
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు
ఇక్కడ​
యొక్కుడైన = అంతకంటే ఎక్కువైన  = వాటన్నిటికీ ఆధారమైన
అని తీసుకోవలెను.

మన మనసు సాపేక్షమునే ఎక్కువగా విశ్వసిస్తుంది.
 కనపడుతున్న ఉర్ధ్వ లోకములను వదలి
కనపడని తమలోని హరిని ఎవరు వెతుకుతారండిమతి లేకపోతే కాని?

లోపల, బయట అను రెండు లోకములను
వేరువేరుగా చూచి మానవులు భ్రమలకు లోనౌవుతారు.
ఆ రెండు కూడా ఒకదానికి ఒకటి ప్రతిబింబములే.
ఒకదానికొకటి ఆధారమై నిలిచివున్నవి.
జాగ్రత్తగా చూచిన ఇవన్నియు 'ఎఱుకలోని" విషయములే.
దైవము (లేదా మోక్షము) ​ఎఱుకకు ఆవలి విషయములు.
'ఎఱుకలోని" విషయములను ఎంత పొడిగించిననూ
దానికి సంబంధించని ఆవలి గట్టుకు మార్గములేదు.

రెండవ​ చరణం:
పాతాళవాసులను పలులోకవాసులును
యీతరవాత నుండిన యీ జీవులే
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు          ॥అయ్యో॥ 
Telugu Phrase
Meaning
పాతాళవాసులను పలులోకవాసులును
పాతాళములోను, వేర్వేరులోకములలో నున్నవారు
యీతరవాత నుండిన యీ జీవులే
ఈ భూమిమీద జన్మ తరువాత ఆయా లోకములకు చేరినవారే.
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
పిఱికితనము, భయము ఆవహింపగా ఆ జీవుల పుణ్యకధలు వినుటకు ఉత్సాహం చూపుదురు.
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు  
కానీ ఇటువైపు (ఆ కాతరములేని వైపు) శ్రీహరి గరిమలు మహిమ లెఱఁగరు
సూటి భావము:
పాతాళములోను, వేర్వేరులోకములలో నున్నవారు, ఈ భూమి మీద జన్మ తరువాత ఆయా లోకములకు చేరినవారే. పిఱికితనము, భయము ఆవహింపగా ఆ జీవుల పుణ్యకధలు వినుటకు ఉత్సాహం చూపుదురు. కానీ ఇటువైపు (ఆయా దుష్ప్రభావములులేని వైపు) శ్రీహరి గరిమలు మహిమ లెఱఁగరు.

గూఢార్థవివరణము:
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
"కాతరాన" అని చాలాముఖ్యమైన విషయమును చెప్పారు.
కాతరము = పిఱికిది, భయపడినది, వ్యాకులపడినది, చంచలము.
కాతరాన అనగా కాతరముయొక్క పలుకుబడి అయా జీవులను ప్రేరేపించగా

హేతువు, కారణములున్నంత వరకు 
మనము ఈ 'ఎఱుక​"లోపలి అంచులలొనే కొట్టుమిట్టాదుదుము.
అవగాహన కల్పించు ఆవరణ
మనకు ధైర్యమును శక్తిని ఇచ్చును.
కావున అది 'నిజము' అనిపించును.

కానీ ఈ జీవ ప్రవాహమునకు ఆవలి ఒడ్డున కలది.
అటువంటి హేతువు, కారణములకు లోబడి లేనిది.
అందుకే యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు అన్నారు.
కార్యకారణముల చిక్కులకు అతీతమైనది ఆ విధముగానే తెలియవలెను.

మూడవ​​ చరణం:
యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు          ॥అయ్యో॥ 
Telugu Phrase
Meaning
యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
(ఇరవు= తగిన, అనుకూలము) తగిన ముక్తులను ఎఱుగని ఈ కర్మ బంధితులు
యిరవై మనలోనున్న యీజీవులే
(ఇరవు= స్థానము) ఇక్కడే మనమధ్యలో స్థానము ఏర్పరచుకుని వున్న ఈ జీవులే.
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
ఈ భూలోకపు సంపదలను, అనుభవములను మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు ఒక్కడే.
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు
(చక్కఁ =  చక్కఁబడు = గుణముపడు, తెఱవు అగుపడు, పరిష్కృతమగు;  చక్కఁ గారు = చక్కబడరు) శ్రీవేంకటేశ్వరుఁడు శరణాగతులకు తప్ప తక్కినవారికి చక్కగా అగపడడు.  శరణాగతులకు తప్ప మిగిలినవారు తమతమ స్థానములలోనే వుందురు.
సూటి భావము:
తగిన ముక్తులను ఎఱుగని ఈ కర్మ బంధితులు ఇక్కడే మనమధ్యలో స్థానము ఏర్పరచుకుని వున్న ఈ జీవులే. ఈ భూలోకపు సంపదలను, అనుభవములను మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు ఒక్కడే. శ్రీవేంకటేశ్వరుఁడు శరణాగతులకు తప్ప తక్కినవారికి చక్కగా అగపడడు.  శరణాగతులకు తప్ప మిగిలినవారు తమతమ స్థానములలోనే వుందురు..

గూఢార్థవివరణము:
యిరవై మనలోనున్న యీజీవులే
ఇక్కడే మనమధ్యలో స్థానము ఏర్పరచుకుని వున్న ఈ జీవులే.

ఇరవై=  స్థానము ఏర్పరచుకుని
ఇక్కడ స్థానం ఏర్పరచుకుని అన్న మాటలతో
ప్రతి ఒక్కదానికి మనసులో ఒక తగిన రూపము
భౌతికంగా ఒక ఆకారము లేక
మానసికముగా ఒక భావన ఏర్పరచుకొని ఉండం.
అన్నమాచార్యులు చెబుతున్నది ఏమిటంటే
అటువంటి స్థానమునకు
అటువంటి రూపము దాల్చిన భావనలకు,
ఆకారమిచ్చు ఊహలకు
బద్ధులైన వారు ముక్తి పొందిన వారిని గుర్తించలేరు
అని చెబుతున్నారు.
 
స్థానము ఏర్పరచుకున్న వారు దానిని కోల్పోదురు.
స్థానము పొందవలెనను ఊహ కూడా లేనివారు  దానిని పొందుదురు.

శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు

ఇక్కడ చక్కఁ = అనువుగాసరిగ్గా అన్నవి సరిపోయిననూ
 ఆచార్యులవారు క్షణక్షణానికి మారుతున్న
చైతన్యపు వేగమును అందుకొనుటకు తగిన  అన్న అర్థంలో వాడారు.

దానికి కూడా ఒక కారణం ఉన్నది.
భగవద్గీత (10-40లో) చెప్పిన విధముగా
"నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప"
ఓ పరంతపా నా దివ్య విభూతులకు అంతము లేదు,
 భగవంతుని అనంతమైన విభూతులను అర్థం చేసుకొనుటకు
అంతే వేగముగా పనిచేయు స్ఫురణ కావలెను.

దీనికి తీక్షణమైన ఏకాగ్రత​, ధ్యాస కావలెను.
మనకు అవి లేవని "జడులు" అని సంబోధించారు.
మనలోని ఇప్పటి చైతన్యము ఆ స్ఫురణను అడ్డుకొనును.
ఈ చైతన్యం పూర్తిగా శాంతమైనను కానీ మానవుడు ఆ దివ్య స్థితికి చేరలేడు.

X-X-The END-X-X

 

No comments:

Post a Comment

T-292 అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు

  తాళ్లపాక అన్నమాచార్యులు 292 అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు For English version press here ఉపోద్ఘాతము ఈ కీర్తనలో అన్నమాచార్యులు “ అం...