తాళ్లపాక అన్నమాచార్యులు
276 ఏలికె విందరికి యీ దేహభూమి నీది
For English version press here
ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో అన్నమాచార్యుడు “ధర్మోపదేశకుడు” కాదు, భావాల చట్టాలనుండి మనసును విముక్తం చేయు సన్యాసి. అన్నమాచార్యుడు — మార్గదర్శి కాదు, విమోచకుడు. ఆయన “మంచి చేయుము” అని ఉపదేశించే నైతిక ప్రవక్త కాదు; “మంచి-చెడులనే విడనాడుము” అని సవాలు చేసే తత్వవేత్త.
అన్నమాచార్యుడు ప్రతిపాదించినది, పాడినది
సాంప్రదాయక భక్తి కాదు — అంతర్ముఖ విప్లవం. మనసు సాధారణంగా “ఇది మంచిది, ఇది చెడుది” అనే తీర్పుల్లో సౌకర్యాన్ని వెతుకుతుంది. కానీ అన్నమయ్య అడుగుతున్నది
— "మేలు అన్ని మట్టుపెట్టి మించరాదా జీవుఁడ" = “నీవు ఏది మేలు అని భావిస్తున్నవో అదే దైవమును తెలియు
దారిలో బంధనమయితే, వాటినే
విడిచిపెట్టకపోతే, దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు?”
|
అధ్యాత్మ కీర్తన |
|
రేకు: 238-2
సంపుటము: 3-217 |
|
ఏలికె విందరికి యీ దేహభూమి నీది మేలు అన్ని మట్టుపెట్టి మించరాదా జీవుఁడ ॥పల్లవి॥ వెలిఁబడ్డ యింద్రియాల వెలయ లోనికిఁ బిల్చి కొలువులు సేయించుకొనరాదా కలఁచెడి లోలోని కామాదిశత్రువుల బెళకనీకడ్డపెట్టింపించరాదా జీవుఁడ ॥ఏలి॥ అట్టే పరువుదోలిన ఆసలనే గుఱ్ఱముల గట్టిగ లోలాయమునఁ గట్టుకోరాదా వొట్టి యెదుట పౌఁజులై వుండిన భోగములను ముట్టి యంతర్యామికిచ్చి మొక్కరాదా జీవుఁడ॥ఏలి॥ పంపువెట్టి దండంపిన బలు నీ వుద్యోగాల- గుంప గూర్చి ముక్తి చూరగొనరాదా ఇంపుల శ్రీవేంకటేశుఁడితఁడే సర్వకర్త సొంపుగ భావించి చక్కఁజూడరాదా జీవుఁడ ॥ఏలి॥
|
Details
and Explanations:
|
Telugu Phrase
|
Meaning
|
|
ఏలికె
విందరికి యీ దేహభూమి నీది
|
ఓ
ప్రభూ! భువనమంతటికీ యజమానుడవైన నీవే, ఈ దేహరూపమైన భూమి నీదే.
|
|
మేలు అన్ని
మట్టుపెట్టి మించరాదా జీవుఁడ
|
ఓ జీవుడా!
నీవు ‘ఇది మేలు’ అని భావించేది కూడా విడనాడి, ఆ మానుకొనుటలోనే నీవే విధించుకున్న పరిమితులన్నింటినీ మించిపోరాదా?
|
సూటి భావము:
“ఓ
ప్రభూ! సమస్త జీవులకు నాయకుడవైన నీవే —నా ఈ దేహరూప భూమి నీదే. ఓ జీవుడా! నీవు ‘మంచిది’
అని భావించేదానినీ త్యజించి, ఆ త్యాగములోనే మంచిచెడులల గడపలు
దాటి పరిపూర్ణతను అందుకో.”
గూఢార్థవివరణము:
యీ
దేహభూమి నీది
ఇక్కడ అన్నమాచార్యుడు తన దేహాన్ని, తన స్థితిని, తన స్వంతమనే భావననే దైవమునకు అర్పిస్తున్నాడు. దేహం అంటే కేవలం శరీరం కాదు — అది మనస్సుతో విడదీయరాని సంబంధం కలది. ఇవి రెండూ కలిపే “క్షేత్రం”. ఆ క్షేత్రం యజమాని దేవుడే. అన్నమయ్య యొక్క మరో కీర్తన “ఆతనికి నీవు మేలు, ఆతఁడు నీకు మేలు” లో చెప్పిన పరస్పర ఆధారభావమే ఇక్కడ అంతర్లీనమై ఉంది.
అన్నమాచార్యుడు “ఉపదేశకుడు” కాదు. ఆయన “మంచి చేయుము, చెడు చేయకు” అని చెప్పే ప్రవక్త కాదు. “మంచి, చెడులనే విడనాడు.” అని ఆయన సవాలు విసురుతున్నారు. అంటే, నీ మనసు తీర్పులనూ, అభిరుచులనూ, ప్రతిస్పందనలనూ విడిచిపెట్టు. ఎందుకంటే “మేలు” అనే భావన కూడా ఒక బంధనమే; అది మనసుకు ఆపాదించబడిన మానసిక సరిహద్దు. ఆ తీర్పులన్నీ మట్టుపెట్టి, నిశ్శబ్దముగా నిలిచినపుడే మనసు తన మూలసత్యముని దర్శిస్తుంది. అక్కడ “ధర్మం” లేదు, “అధర్మం” లేదు — కేవలం అవగాహన మాత్రమే ఉంది. ఆ అవగాహనలోనే మోక్షముంది.
|
Telugu Phrase
|
Meaning
|
|
వెలిఁబడ్డ యింద్రియాల వెలయ లోనికిఁ బిల్చి
|
బయటకొచ్చి స్వేచ్ఛగా తిరుగు ఇంద్రియాలను లోపలికి త్రిప్పి
|
|
కొలువులు సేయించుకొనరాదా
|
సేవ చేయించుకొనరాదా
|
|
కలఁచెడి లోలోని కామాదిశత్రువుల
|
మనోవైకల్యము కలిగించు కామాదిశత్రువులను
|
|
బెళకనీకడ్డపెట్టింపించరాదా
జీవుఁడ
|
తొట్రుపాటులేకుండా వాటికి అడ్డుపెట్టరాదా?
|
భావము:
(ఇప్పుడు ఈ చరణం అన్నమాచార్యుడి అంతర్ముఖ క్రాంతికి స్పష్టమైన రూపం. ఇది నైతిక నియమాల కీర్తన కాదు — మనసు, ఇంద్రియాల చలనాన్ని గమనించి వాటిని తిరిగి మూలాలను కనుగొనమనే తిరుగుబాటు గీతం.)
బయటకొచ్చి
స్వేచ్ఛగా తిరుగు ఇంద్రియాలను లోపలికి త్రిప్పి వాటితో సేవ చేయించుకొనరాదా? మనోవైకల్యము కలిగించు కామాదిశత్రువులను తొట్రుపాటులేకుండా వాటికి అడ్డుపెట్టరాదా?
గూఢార్థవివరణము:
“వెలిఁబడ్డ యింద్రియాల వెలయ లోనికిఁ బిల్చి”: మన దృష్టి ఎప్పుడూ లోనుంచి బయటకు. కన్నులు చూడదలచినదాన్ని వెతుకుతాయి, చెవి వినదలచినదాన్ని కోరుతవి — ఈ నిరంతర గమనమే మనసు యొక్క విభజన. అంటే ఇంద్రియాలు నిష్పక్షంగా ఉండవు. ఇప్పుడు అన్నమయ్య అడుగుతున్నది — ఈ చలనాన్ని లోనికి తిప్పవచ్చా? ఇది సాధన కాదు, సవాలు. దృష్టి బయట నుంచి లోనికి తిరిగినప్పుడు — అదే యథార్థ యోగదృష్టి.
“కొలువులు సేయించుకొనరాదా” ఇంద్రియాలు లోనికి తిరిగినప్పుడు అవి శత్రువులు కావు — సేవకులు అవుతాయి. వాటి ద్వార సంకేతములు తద్వారా జ్ఞానం కలుగుతుంది.
“కలఁచెడి లోలోని కామాదిశత్రువుల” ఇవి బయట శత్రువులు కాదు, లోపల కలిగే అలజడులు — కామం, క్రోధం, లోభం, మోహం. అన్నమయ్య వీటిని నిందించడం లేదు; వీటిని గమనించమంటున్నాడు — వీటి ఉత్పత్తి క్షణంపై అవగాహనతో వుండమంటున్నాడు. కానీ మన అవగాహన అంతా గడచి పోయిన క్షణం లేదా దాని క్రితం అయిన వానిపైననే. జరుగుతున్న క్షణం మనం గమనించ లేము. కానీ అన్నమయ్య చూపించేది — అవగాహనను ఆ గడుస్తున్న క్షణానికే తెచ్చుకో. అది సాధన కాదు; అది సాక్షి స్థితి. (పాత కీర్తనలో “అనాది జీవుఁ డన్నియుఁ గన్నవే” లో ఇది చెప్పబడినది) కాబట్టి ఇది ప్రేర్కొన్నంత సులువు కాదు.
“బెళకనీకడ్డపెట్టింపించరాదా జీవుఁడ” “తొట్రుపాటులేకుండా మనసును దర్శించడం. బాహ్య నియమం కాదు, అంతర్ముఖ జాగ్రత్త. కష్టసాధ్యము.
|
Telugu Phrase
|
Meaning
|
|
అట్టే
పరువుదోలిన ఆసలనే గుఱ్ఱముల
|
ఆ రకముగా పరువు, మర్యాద, అహంభావములు నడుపు ఆశలు అనే గుఱ్ఱములను
|
|
గట్టిగ లోలాయమునఁ గట్టుకోరాదా
|
శ్రమతో గట్టిగా పట్టుకోలేవా?
|
|
వొట్టి
యెదుట పౌఁజులై వుండిన భోగములను
|
నీ ఎదుట కవాతు చేయు సైన్యములను భోగములను వట్టిగా
|
|
ముట్టి
యంతర్యామికిచ్చి మొక్కరాదా జీవుఁడ
|
ముట్టీముట్టక అంతర్యామికిచ్చి మొక్కరాదా జీవుఁడా?
|
సూటి భావము:
జీవుఁడా!
ఆ రకముగా పరువు, మర్యాద, అహంభావములు
నడుపు ఆశలు అనే గుఱ్ఱములను శ్రమతో గట్టిగా పట్టుకోలేవా? నీ ఎదుట
కవాతు చేయు సైన్యములను భోగములను వట్టిగా ముట్టీముట్టక (వాటితో కలుషితం కాకుండా) అంతర్యామికిచ్చి
మొక్కరాదా ?.
గూఢార్థవివరణము:
“అట్టే పరువుదోలిన ఆసలనే గుర్రములు” — పరువు అంటే “మన రూపం, గౌరవం, నేను ఎవరో అనే భావం - అహంభావము” ఆ భావమే మనలను పరుగెత్తించు రౌతు. గుర్రాలు అంటే దాని పరుగులు, అంటే మనసు కలిగించే కోరికల చలనం. ఈ పరుగులు అవసరం వల్ల కాక, మనసు తన్నే తాను నిలబెట్టుకోవాలనే గర్వం వల్ల వస్తాయి.
“గట్టిగ లోలాయమునఁ గట్టుకోరాదా” — అణచివేతతో మనసులో ఎదో ఒక మూల ప్రతిఘటన ఏర్పడుతుంది. కాబట్టి ఇది అణచివేతకు పిలుపు కాదు, అవగాహనాపూర్వక జాగ్రత్తకు పిలుపు. మనసు ఎక్కడకు, ఎలా పరుగెత్తుతుందో గమనించి, అది దారితప్పకుండా ఉంచడం. ఇది అంతర్ముఖ శ్రమ — కానీ అజ్ఞానపు నియంత్రణ కాదు. ఇది మనసును స్థిరంగా నిలిపే పరిశీలనము.
“వొట్టి యెదుట పౌఁజులై వుండిన భోగములను” — ఇక్కడ భోగములు అంటే మన ముందున్న ప్రపంచపు ఆకర్షణలు. అవి సైన్యంలా ఎదురుగా కవాతు
చేస్తూ నిలుస్తాయి — ప్రకాశవంతంగా, భయానకంగా, ఆకర్షణీయంగా. తమలోకి రమ్మంటాయి. లాక్కుంటాయి. "వాటిని అర్థం చేసుకో,
కానీ వాటిలో పడిపోవద్దు. అవి మన భావప్రపంచంలో కనబడే రూపాలు మాత్రమే;
నిజాలు కావు" అని అన్నమాచార్యులు అంటారు.
“ముట్టి యంతర్యామికిచ్చి మొక్కరాదా జీవుడా” — ముట్టడం అంటే తెలుసుకోవడం. అప్పగించడం అంటే 'స్వాధీనం' అనే భావాన్ని విడిచిపెట్టడం. ఇక్కడ “అంతర్యామి” అంటే దేవుడు కాదు. అక్కడ సమయం, చలనం రెండూ నిలిచిన స్థలం. అక్కడ 'నేను' అనే భావన సమసిపోతుంది. అది విశ్వచైతన్యమతో ఏకత్వం. ఆ స్థితిని చేరిన — అన్నమాచార్యుల వంటి మహామునులకు —ఈ ప్రపంచంలో కూడా ఒక అపూర్వమైన క్రమం కనిపిస్తుంది.
ఇంతకు మునుపు మనిషి విడవ బడిన బాణం వంటి వాడని చెప్పుకున్నాం. అనగా మనది అశాశ్వతమైన జీవితం. ఈ స్థితిని నుండి మనకు గల ఒకే ఒక్క అవకాశం ఆ విశ్వచైతన్యమతో కలసి పయనించుట. అదియే ఈ జన్మకు ఉతృష్టస్థితి. మిగిలినవన్నీ భ్రమలలో పయనములే.
ఆ స్థితికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు “ప్రపంచం” అనే భావన మనకు ఉంటుంది. మనం చూసే “ప్రపంచం” అల్లకల్లోలము, అస్తవ్యస్తము. పేర్కొన్న ఆ క్రమం మనకు కనిపించదు. అందుకే మనం మన భావనలకు అనుగుణంగా లేని వితండవాదనలు, అకటవికటములు, కలతలు మనకు నచ్చిన రీతిలో వుండు, సమస్యలు లేని ఒక “స్వర్గం” అనే మరొక ప్రపంచాన్ని ఊహించుకుంటాం. కానీ అది మనసు కల్పనలో పుట్టిన మాయే.
|
Telugu Phrase
|
Meaning
|
|
పంపువెట్టి దండంపిన బలు నీ వుద్యోగాల- గుంప గూర్చి
ముక్తి చూరగొనరాదా
|
(పంపువెట్టి = ఆజ్ఞాపింౘు,
to Oder; దండంపిన = గొప్ప సందేశమిచ్చి పంపబడినవాడివి)
నీవు ఈ లోకంలోకి పొరపాటున వచ్చి పడలేదు. ఒక గొప్ప దౌత్యముతో పంపబడిన
వాడివి. నీకున్న పనులు, బాధ్యతలు, వ్యాపకాలు
ఒక గంపలో పెట్టి ముక్తిని చూరగొనరాదా
|
|
ఇంపుల శ్రీవేంకటేశుఁడితఁడే సర్వకర్త
|
ఇంపుగా, సజావుగా శ్రీవేంకటేశుఁడితఁడే సర్వకర్త
అని గ్రహించుము
|
|
సొంపుగ భావించి చక్కఁజూడరాదా జీవుఁడ
|
ఆ రకముగా భావించి చక్కగా చూచిన ప్రపంచమున అత్యధ్బుత క్రమము గోచరమగును.
|
సూటి భావము:
జీవుడా! నీవు ఈ లోకంలోకి పొరపాటున వచ్చి పడలేదు. ఒక గొప్ప దౌత్యముతో పంపబడిన వాడివి. నీకున్న పనులు, బాధ్యతలు, వ్యాపకాలు ఒక గంపలో పెట్టి కాసేపైనా ముక్తిని చూరగొనరాదా. ఇంపుగా, సజావుగా శ్రీవేంకటేశుఁడితఁడే సర్వకర్త అని గ్రహించుము. ఆ రకముగా భావించి చక్కగా చూచిన ప్రపంచమున అత్యధ్బుత క్రమము సొంపుగా గోచరమగును. ఆ చూపులోనే ముక్తి దాగి ఉంది.
గూఢార్థవివరణము:
“పంపువెట్టి దండంపిన బలు నీ
వుద్యోగాల- గుంప గూర్చి ముక్తి చూరగొనరాదా” — అన్నమాచార్యులు
ఇక్కడ మనిషి జన్మకు అర్థముంది అని చెబుతున్నారు. నీవు ఈ లోకంలోకి యాదృచ్ఛికంగా
రాలేదు. ప్రతి జీవి గొప్ప ప్రభోదముతో ఈ భూమిపైకి వచ్చాయి.
ఇంకొక కీర్తనలో చెప్పినట్లు దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో, ఉబ్బు
నీటిపై నొక హంస” (= అనేక అడ్డంకులను అధిగమిస్తూ నీ తల్లి గర్భపు
నీటిలో తేలి ఈ భూమిపై బడ్డావు). నీవు తలముక్కలగునట్లు పెట్టుకొన్న
పనులు వృత్తులు, బాధ్యతలు, సంబంధాలు,
కలతలు అన్నీ పక్కన పెట్టి ఆంతర్యాన్ని, ముక్తిని
గమనించమని సూచన.
“ఇంపుల శ్రీ వేంకటేశుఁడితఁడే సర్వకర్త” — ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కదలిక, ప్రతి మార్పు, ప్రతి చలనమూ ఆ ఒకే చైతన్యమునుంచి పుడుతుంది. అదే “వేంకటేశుడు” — అన్నమాచార్యుని భాషలో విశ్వచైతన్యానికి రూపకం. భౌతిక శాస్త్రజ్ఞుడు నోబుల్ బహుమతి గ్రహిత ఎర్విన్ శ్రోడింగర్ (Erwin Schrödinger) చెప్పినట్లే —“There is obviously only one alternative — the unification of minds; their multiplicity is only apparent; in truth there is only one mind.” (ఒకే ఒక ప్రత్యామ్నాయం వుంది. అదే మనస్సులన్నింటినీ ఒకే త్రాటిపై తీసుకు వచ్చుట. వాస్తవానికి ఇన్ని మనస్సులుగ పైపైకి కనబడుతున్నదంతా ఒకే మనస్సు యొక్క కదలికయే.)
“సొంపుగ భావించి చక్కఁజూడరాదా
జీవుఁడ” — మనము చూసే లోకం “నేను” అనే రంగుతో
మసకబారిన అద్దంలా ఉంది. అందుకే మనకు అక్కడ దుఃఖం, యుద్ధం,
హింస, కలహం మాత్రమే కనబడతాయి. కానీ మనసు భావాత్మక
కలుషిత తలఁపుల నుండి, ద్వంద్వ దృష్టి నుండి బయటపడితే — అదే
లోకంలో ఒక అపూర్వమైన క్రమం, ఒక శాంతి, ఒక
సౌందర్యం కనిపిస్తుంది. ఆ “చక్కఁజూడడమే” అన్నమాచార్యుడి దృష్టిలో ముక్తి.
ఈ కీర్తన
ముఖ్య సందేశం
అన్నమాచార్యుల బోధనం
అతి ప్రాయోగికమైనది —
నైతిక ఉపదేశములను, ఆలోచనలకు
ఆవల వున్న ప్రకృతి క్రమమును నీ మదిలోనే
ఆవిష్కరించుము
X-X-The
END-X-X
Just reading lyric and direct meaning ( shoti Bhavam ) is itself major accomplishment and learning for many Annamacharya followers.
ReplyDeleteA series of YouTube video recordings singing lyric like lyricist do ( not musicians ) and with pleasing reading of shoti bhavam ; perhaps it may take 2-3 minutes audio/video. Those recordings can have link to full blog article that explains niguda ardham. This approach popularizes Annamacharya is deep philosopher scholar