Sunday, 26 October 2025

T-278 చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు

 తాళ్లపాక అన్నమాచార్యులు

278 చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు 

For English version press here 

ఉపోద్ఘాతము

అన్నమాచార్యుల తత్త్వం అంతా నిత్యజీవితపు మట్టి ధూళిలలోనే శ్వాసిస్తుంది. ఆయన ఎప్పుడూ ఆకాశమంత ఎతైన భావనలలోకి గెంతి మేఘాల సౌందర్యము వెనుక దాక్కోడు— భోజనంలోనూ, శ్వాసలోనూ, శరీర బలహీనతలోనూ, చివరికి అది వెళ్లగక్కు మలంలోనూ — సాధారణంలోనే పరమార్థాన్ని కనుగొంటారు.  ఇతరులు ఉన్నతమైన రూపకాలతో చెప్పేదాన్ని ఆయన అనుభవజీవితపు సాక్షాత్కార చిత్రాలతో ఎదుట పెడతారు. ఆయన ప్రతిభ ఈ  ఆ నిత్య జీవితపు వ్యర్థమనుకునే వాటిని తల్లక్రిందుచేసి చూపుటలో ఉంది — ఆయన సత్యాన్ని ఎక్కరు; దాన్ని దించి మన జీవనభూమి మీద నిలబెడతారు. అందుకే ఆయన ఉదాహరణలు సాధారణమైనవైనా, అవి సత్యాన్ని తళుక్కుమనిపిస్తాయి — అసత్యము ముఖమునుండి ముసుగులను తొలగిస్తాయి. 

ఆయన చూపే — జ్ఞానం వేదాలలోనూ, పర్వతాలలోనూ దాగి లేదు; తినటం, విసర్జించటం, భయపడటం, కోరుకోవటం — ఈ చక్రంలోనే ఉంది — మనం అవగాహనతో చూడగలిగితే చాలు. ఇదే ఆయనను అసమానునిగా చేస్తుంది. ఆయనతో పోల్చగల తత్వవేత్తలు మరెవరూ లేరు. ఆయన కీర్తనలలో ఒక విశ్వమైన మౌనహాస్యం వినిపిస్తుంది — పవిత్రత, అపవిత్రత రెండింటినీ దాటి చూసిన వానికి మాత్రమే దొరికే ఆ హాస్యం. 

ఈ కీర్తనలో అన్నమాచార్యులు అత్యంత విప్లవాత్మకమైన పని చేశారు — శరీరం విసర్జించే హేయమైన మలాన్నే చైతన్యానికి అద్దముగా చూపించారు. జుగుప్స కొలపడనికి కాదు కాదు — అవగాహనకు. ఆయన చెబుతున్నదిదే — “చూడుము, జీవితంలోని వాటిలో అత్యంత హేయమైనదానిని కూడా మనసు అంటిపెట్టుకుంటుంది. మలమంటే ఇష్టం కాబట్టి కాదు; తెలిసినది కాబట్టి.” 

అన్నమాచార్యుల మేధస్సు ఇక్కడే తేజోవంతమవుతుంది — ఆయన పరిశుద్ధతను మహిమ పరచి విరక్తిని బోధించరు; పరిచయమైనదానిలో దాగిన ఆసక్తిని బట్టబయలు చేసి, బంధనాన్ని అనావృతం చేస్తారు — అది హేయమైనదైనా సరే. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 2-6 సంపుటము: 15-13
చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు
మదనాతురుఁడ నాకు మంచితన మేది ॥పల్లవి॥
 
ముట్ట యోగ్యము గానివి మోచితిఁ దోలు నెమ్ములు
అట్టె బ్రతికేననే ఆసలు బెట్టు
జట్టిగాఁ బ్రాణము తీపు చావంటే వెలుతు నేను
యిట్టి యజ్ఞానికి జ్ఞాన మెట్టు గలిగీని    ॥చదివే॥
 
కావలె ననుచుఁ గోరి కడుపు నించిన రుచి
యీపల హేయమై వెళ్లీ యేఁ జూడగానే
దావతి మనసందుకే తగిలీఁ గాని రోయదు
భావించి నన్నెంఱుఁగని భావ మెఱిఁగీనా  ॥చదివే॥
 
యోని గతుఁడనై పుట్టి యోనికి మగ్నుఁడనైతి
పూని లోకబండఁ డనే బుద్దెఱిఁగీ
నేనా యెంత సిగ్గెబుఁగ నీవే విచారించి కావు
శ్రీనిథి శ్రీ వేంకటేశ చేతిలోని వాఁడను  ॥చదివే॥

Details and Explanations:

పల్లవి
చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు
మదనాతురుఁడ నాకు మంచితన మేది ॥పల్లవి॥ 
               Telugu Phrase
Meaning
చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు
వేదాలు చదివి, ఆచారాలు పాటిస్తూ ఉన్నా — వాటి సారం లోపలిదాకా వంటబట్టలేదు.
మదనాతురుఁడ నాకు మంచితన మేది
విషయములు నన్నుకట్టడి చేస్తూ వుండగా చేసే పనులలో మంచితనం ఎలా చిగురిస్తుంది?     
 

 

సూటి భావము:

వేదాలు చదివి, ఆచారాలు పాటిస్తూ ఉన్నా — వాటి సారం లోపలిదాకా వంటబట్టలేదు. విషయములు నన్నుకట్టడి చేస్తూ వుండగా చేసే పనులలో మంచితనం ఎలా చిగురిస్తుంది?  


గూఢార్థవివరణము: 

మదనాతురుఁడ నాకు మంచితన మేది

ఇక్కడ అన్నమాచార్యులు పశ్చాత్తాపం కాదు — పరిశీలన చేస్తున్నారు. వేదాధ్యయనం, ఆచారాలు — ఇవన్నీమనసులోపలి దాకా జీర్ణించుకోకపోతే, బయట ప్రదర్శించే అలంకారాలుగా మాత్రమే మిగిలిపోతాయి. అవగాహన లేకుండా నియమాలు పాటించటం, వాంఛలతో నడిచే మనసుపై ప్రభావం చూపలేవు. కోరికలు మదిలో కదలుతున్నంతకాలం, శ్రమించి చేయు ‘మంచి’ కూడా ఆ కోరికల లాగ అపసవ్యపు దారినే నడుస్తుంది.  మంచిపని చెయ్యాలంటే ఆ నిష్కల్మష స్థితి నుండి వుద్భవించాలి తప్ప కోరిక కారణమవ్వరాదు.


మొదటి చరణం:
ముట్ట యోగ్యము గానివి మోచితిఁ దోలు నెమ్ములు
అట్టె బ్రతికేననే ఆసలు బెట్టు
జట్టిగాఁ బ్రాణము తీపు చావంటే వెలుతు నేను
యిట్టి యజ్ఞానికి జ్ఞాన మెట్టు గలిగీని ॥చదివే॥ 
Telugu Phrase
Meaning
ముట్ట యోగ్యము గానివి మోచితిఁ దోలు నెమ్ములు
ఈ ముట్టుటకు కూడా యోగ్యము గాని చర్మము ఎముకతో కూడిన ఈ శరీరము
అట్టె బ్రతికేననే ఆసలు బెట్టు
ఎలాగోలాగ బ్రతుకుతాననే ఆశతో
జట్టిగాఁ బ్రాణము తీపు చావంటే వెలుతు నేను
పైగా ప్రాణమంటే తీపితో చావును భయపడతాను నేను
యిట్టి యజ్ఞానికి జ్ఞాన మెట్టు గలిగీని
ఇట్టి అజ్ఞానినైన నాకు జ్ఞానమెట్లు కలుగును?

భావము: 

ఈ ముట్టుటకు కూడా యోగ్యము గాని చర్మము, ఎముకలతో కూడిన ఈ శరీరము; ఎలాగోలాగ బ్రతుకుతాననే ఆశతో;  పైగా ప్రాణమంటే తీపితో చావుకు భయపడతాను నేను. ఇట్టి అజ్ఞానినైన నాకు జ్ఞానమెట్లు కలుగును?


గూఢార్థవివరణము: 

ఇంతకు మునుపు చెప్పు కున్నట్లు ఈ జ్ఞానము పొందుట ఒక ఏకపక్ష రూపాంతరము. ఈ రూపాంతరములో పాత మనసు పోయి కొత్తది ఆవిర్భవించాలి. కొత్తదాని మాట పక్కన పెట్టు. అసలు నాకేమౌతుందనేదే మనిషి అసలు బాధ​. అందుకే ప్రాణమంటే తీపి చావంటే భయం. 

ఇక్కడ భగవద్గీత దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరాతథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి2-13 ॥ (ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు అన్నది గుర్తుకు తెచ్చుకుందాం. అదే అన్నమాచార్యులు చెబుతున్నది. 

Progression of the poem:

Body’s bondage  Mind’s bondage  Illusion of knowing  Dawn of seeing.


రెండవ​ చరణం:
కావలె ననుచుఁ గోరి కడుపు నించిన రుచి
యీపల హేయమై వెళ్లీ యేఁ జూడగానే
దావతి మనసందుకే తగిలీఁ గాని రోయదు
భావించి నన్నెంఱుఁగని భావ మెఱిఁగీనా ॥చదివే॥ 
Telugu Phrase
Meaning
కావలె ననుచుఁ గోరి కడుపు నించిన రుచి
రుచిగా వుండే తినుబండారములను తిని కడుపు నింపుకుంటాను
యీపల హేయమై వెళ్లీ యేఁ జూడగానే
కొంతసేపటికి అవే హేయమైన మలముగా మారిపోతాయి
దావతి మనసందుకే తగిలీఁ గాని రోయదు
అయినా మనసు ఈ ప్రక్రియకు అలవాటై దానిని అసహ్యించుకోదు.
భావించి నన్నెంఱుఁగని భావ మెఱిఁగీనా
ఇలాంటి మనసుకు, తానెరిగిన భావాలకతీతమైన ఆ స్థితి ఎప్పుడు తెలిసేది?

సూటి భావము:

ఓ హరి! రుచిగా వుండే తినుబండారములను తిని కడుపు నింపుకుంటాను. కొంతసేపటికి అవే హేయమైన మలముగా మారిపోతాయి. అయినా మనసు ఈ ప్రక్రియకు అలవాటై దానిని అసహ్యించుకోదు. ఇలాంటి వాటికి మరిగిన మనసుకు, తానెరిగిన భావాలకతీతమైన ఆ స్థితి ఎప్పుడు తెలిసేది? (ఇలాగే వుంటే ఎప్పటికీ తెలియదు)


గూఢార్థవివరణము: 

దావతి మనసందుకే తగిలీఁ గాని రోయదు” — ఈ చరణంలో అన్నమాచార్యులు మనసు పనిచేయు విధానమును చెబుతున్నారు. అలవాటుపడిన వాటిని అది అసహ్యమని తెలిసినా ఈసడించుకోదు. అది తెలిసిన దానిలోనే కదులుతుంది — తెలిసిన రుచులు, తెలిసిన అలవాట్లు, తెలిసిన వాంఛలు. ఆ పరిచయం దాని బంధనమవుతుంది. యొక్క పరిచయ బంధనాన్ని సూచిస్తున్నారు. అజ్ఞానం అనేది అసహ్యమని తెలిసినా చూడగలగడం — అదే మన యిష్టాల మూలం. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.   

భావించి నన్నెంఱుఁగని భావ మెఱిఁగీనా” — తానెరిగిన అనుభవాలకతీతంగా ఈ మనసు ఏదైనా గ్రహించగలదా? లేదే! ఎందుకంటే దాని పరిధి “నేను తెలిసినది, నేను అనుభవించినది” అన్న గోడల మధ్యే. 'రుచి–అరుచి'లు కూడా మనసును బంధిస్తాయి. 'సుఖదుఃఖాలు' కూడా అదే చక్రంలో తిరుగుతాయి. తెలిసినవి చూచిచూచి అలుపెరగదు. ఆ పాత సారాయినే కొత్త సీసాల్లో పోసుకొని అనుభవిస్తుంది.  ఇదీ మన అసలు స్థితి. తాను తెలియంది తెలియాలంటే అది ప్రక్కకైనా తప్పుకోవాలి. మౌనమైనా పాటించాలి. కానీ మనమున్న ఉద్రేకస్థితిలో అది ఏమాత్రమూ సాధ్యం కాదు. అది సంపూర్ణంగా మారాలీ. అదే అసలు విప్లవం. అదే ఆచార్యుల ఉద్దేశ్యం. 

ఈ చరణం మొదటి చరణానికి అనుసంధానంగా ఉంది — దేహబంధమును చూపిన చోట, ఇప్పుడు మనోబంధమును సూచిస్తున్నారు. రెండు కలిపి చూస్తే — జ్ఞానము అనేది వేదాలు చదివి, ఆచారాలు పాటించి పొందేది కాదు; దేహమూ, మనసూ తమ చక్రగతుల​నుండి విముక్తి పొందినప్పుడు స్వయముగా ప్రత్యక్షమవుతుంది. 


మూడవ​ ​ చరణం:
యోని గతుఁడనై పుట్టి యోనికి మగ్నుఁడనైతి
పూని లోకబండఁ డనే బుద్దెఱిఁగీ
నేనా యెంత సిగ్గెబుఁగ నీవే విచారించి కావు
శ్రీనిథి శ్రీ వేంకటేశ చేతిలోని వాఁడను   ॥చదివే॥
Telugu Phrase
Meaning
యోని గతుఁడనై పుట్టి యోనికి మగ్నుఁడనైతి
యోనిమార్గంలో పుట్టి, జీవితమంతా మళ్లీ దానిపట్లే ఆకర్షితుడనౌతాను.

పూని లోకబండఁ డనే బుద్దెఱిఁగీ

తరువాత శ్రమించి, ఆధ్యాత్మికముకాక లోకబంధనమిచ్చే జ్ఞానమనే మాయలో చిక్కుకుంటాను.
నేనా యెంత సిగ్గెబుఁగ నీవే విచారించి కావు
నేను సిగ్గు ఎరగను. దానికి అర్ధమే లేదు. నేనెవరో నేను స్పష్టంగా చెబుతున్నా. నీ ముందుంచుతున్నాను. నీవే దీనిని ఆలోచించి నన్ను రక్షించు.
శ్రీనిథి శ్రీ వేంకటేశ చేతిలోని వాఁడను
ఓ శ్రీనిధీ వేంకటేశా! నేను నీ చేతిలోని వాదను. నీవేమి చేసినా సమ్మతమే.

సూటి భావము:

ఓ ప్రభో! స్త్రీలో పుట్టి, జీవితమంతా స్త్రీలకై తపించుతూ గడిపాను. ఆ తరువాత ఈ లోకజ్ఞానం సంపాదించడమనే వలలో పడిపోయాను. నాకు సిగ్గు లేదు. నేనెలాంటి వాడనో అలాగే నీకు దాచకుండా చూపుతున్నాను. నీవే దీనిని విచారించి నన్ను రక్షించు. ఓ వేంకటేశా! నేను నీ చేతిలోని వాడను. నీవేమి చేసినా ఆమోదమే.


గూఢార్థవివరణము: 

పూని లోకబండఁ డనే బుద్దెఱిఁగీ”ఇక్కడ లోకబండడు అంటే లోకంలో తిరుగుతూ అలవడిన బుద్ధి సంపాదించుకున్నఅజ్ఞానం. మనిషి శ్రమించి నేర్చుకుంటున్నది ముక్తికి కాదు — మరింతగా బంధానికి దారి. తెలిసినదానినే పెంచి పోషించు మనసు ఇది.


 యోని గతుఁడనై పుట్టి యోనికి మగ్నుఁడనైతి”అన్నమాచార్యులు ఇక్కడ సూటిగా పూర్ణ జీవన చక్రమును చూపిస్తున్నారు. జీవితం ఎక్కడ మొదలయిందో, దాని చుట్టే తిరుగుతుంది మనసు. శరీరమునకు కారణమే దాని ఆకర్షణగా మారుతుంది. ఇక్కడ ఆయనదా చుకోకుండా ఆత్మాభిమానం అడ్డుపడకుండా తానేమిటో   (సాధారణ మానవుడేమిటో), అరటిపండు తొక్కవలిచినట్లు చూపుతున్నారు. — సత్యం పలకడమే ఆయన లక్ష్యము. 

ముందర చెప్పుకున్న  కీర్తనలోని భావమును సందర్భోచితమని ఇక్కడ  చూపుతున్నాను. 

 

మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె నేఁ
జెల్ల పూవు కొప్పుతావి చెంచుదానను     పల్లవి

Intended meaning:

"నా జీవితము ప్రకృతి చందము.
ఆ మల్లెపూల వాసనతో
చేపల కంపుకొడుతున్న నా కొప్పును నింపలేను.
ఎందుకంటే ఏమి చేసినా ఈ కంపు పోదు.
నా ఈ శరీరము మలినము.
నువ్వే వచ్చి నా కొప్పులో ముడుచుకొని ఉండు."

నేనా యెంత సిగ్గెబుఁగ నీవే విచారించి కావు” ఇదే అన్నమాచార్యుల విప్లవాత్మక స్వరము. ఆయన పశ్చాత్తాపం పడుటలేదు; వాస్తవముగా తనను తానే చూచుట. సిగ్గు, బిడియం, పాపబుద్ధి, భయం ఇవన్నీ తొలగిపోయిన స్థితి ఇది. ఆయన దేవునితో అంటున్నారు —“నేను ఏమిటో అంతా నీ ముందు స్పష్టంగా చెబుతున్నాను. ఇక నీవే నిర్ణయించు, నీవే కాపాడు.” 

శ్రీనిథి శ్రీ వేంకటేశ చేతిలోని వాఁడను”ఈ చివరి పాదం సమర్పణను ముద్రిస్తోంది. తానేమిటో వెల్లడించిన తరువాత, మిగిలింది ఒక్కటే — దైవహస్తానికి తనను అప్పగించుట. ఇది భక్తి కాదు; ఇది పరిపూర్ణ నిజస్వరూపం.


సారాంశము

ఈ చరణములో అన్నమాచార్యులు అత్యంత ధైర్యంగా, మాహాత్ములు సైతం పలుకుటకు వెనుకాడు నగ్న సత్యమును నేరుగా ప్రతిబింబించారు. ఇతరులు ‘పవిత్రత’ అనే రూపకముతో చెప్పే విషయమును ఆయన నిగ్రహంలేకుండా చెబుతారు. ఆసక్తి, సిగ్గు, లోకజ్ఞానం — ఇవన్నీ ఒకే చక్రంలో తిరుగుతున్నట్లు ఆయన చూపిస్తారు. వాస్తవమును మనస్పూర్తిగా సీకరించుటయే ముక్తికి దారి. ఏమీ దాచుకోకుండా, ఏమీ నిరాకరించకుండా తన్ను తానే చూచినప్పుడు — అప్పుడే సమర్పణ సంపూర్ణమవుతుంది.


ఈ కీర్తన ముఖ్య సందేశం


అన్నమాచార్యుల బోధనం అతి ప్రాయోగికమైనది —

ప్రభువుకు నీ హృదయాన్ని విప్పి చూపు.

నిర్బయంగా. నిర్వేదనతో. నిష్కపటంగా


X-X-The END-X-X

No comments:

Post a Comment

278 cadivēvi vēdamu lācāramu madiṃ̐ baṭṭaḍu (చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు)

    TALLAPAKA ANNAMACHARYULU 278 చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు (cadiv ē vi v ē damu l ā c ā ramu madi ṃ̐ ba ṭṭ a ḍ u)   తెలుగులో ...