Wednesday, 22 October 2025

T-274 నదు లొల్లవు నా స్నానము

 తాళ్లపాక అన్నమాచార్యులు

274 నదు లొల్లవు నా స్నానము

For English version press here 

ఉపోద్ఘాతము 

ఈ కీర్తనలో అన్నమాచార్యులు “స్నానం” అనే ఆచారాన్ని అంతరార్థంతో కొత్తగా నిర్వచించారు. ఇది పవిత్ర నదులలో తటాకములలో స్నానము చేయడం గురించి కాదు — మనసులోని కలుషములను శుద్ధి చేసుకోవడమే ప్రధానము. ప్రతి చరణం బాహ్య క్రతువు నుండి అంతర్ముఖ జాగృతికి మెల్లగా తీసుకువెళ్తుంది. నిజమైన స్నానం వినమ్రతలో, భగవంతుని స్మరణలో, మౌనమైన ఆత్మశుద్ధిలో జరుగుతుంది. ఇలా అన్నమాచార్యులు స్నానము అనే మాటను ఆత్మ జ్యోతికి చేరే ప్రసాదంగా మలిచారు. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 8-3 సంపుటము: 1-51
నదు లొల్లవు నా స్నానము కడు-
సదరము నాకీ స్నానము      ॥నదు॥
 
ఇరువంకల నీ యేచిన ముద్రలు
ధరియించుటే నా స్నానము
ధరపై నీ నిజదాసుల దాసుల
చరణధూళి నా స్నానము    ॥నదు॥
 
తలఁపులోన నినుఁ దలఁచినవారలఁ
దలఁచుటే నా స్నానము
వలనుగ నినుఁ గనువారల శ్రీపాద-
జలములే నా స్నానము       ॥నదు॥
 
పరమభాగవతపాదాంబుజముల
దరుశనమే నా స్నానము
తిరువేంకటగిరిదేవ నీ కథా-
స్మరణమే నా స్నానము       ॥నదు॥

Details and Explanations:

పల్లవి
నదు లొల్లవు నా స్నానము కడు-
సదరము నాకీ స్నానము  ॥నదు॥ 
               Telugu Phrase
Meaning
నదు లొల్లవు నా స్నానము
ఎన్ని సార్లు పవిత్ర నదుల్లో స్నానం చేసినా, అవి నా అంతరంగమును శుద్ధి చేయలేవు.
సదరము నాకీ స్నానము
ఈ “సదరము” — అంతరశుద్ధి అనే కఠిన సాధనలో స్నానం చేయడమే నాకు నిజమైన పవిత్ర స్నానం.

 

సూటి భావము:

ఎన్ని సార్లు పవిత్ర నదుల్లో స్నానం చేసినా, అవి నా అంతరంగమును శుద్ధి చేయలేవు. ఈ “సదరము” — అంతరశుద్ధి అనే కఠిన సాధనలో స్నానం చేయడమే నాకు నిజమైన పవిత్ర స్నానం..


గూఢార్థవివరణము: 

ఇక్కడ అన్నమాచార్యుడు సత్యశుద్ధి అంటే బాహ్యజలస్నానం కాదని, అంతరశుద్ధినే నిజమైన స్నానం అని సూచిస్తున్నారు.  అనుశాసనికపర్వము, మహాభారతంలో భీష్ముడు ధర్మరాజునితో చెప్పిన తాత్పర్యం కూడా ఇదే. ధర్మరాజు, పవిత్రతను ఇచ్చే తీర్థాలు ఏవి అని అడగగా భీష్ముడు ఇలా సమాధానమిచ్చాడు. 

. దమమును దపము నహింసయు
శమమును తీర్థముల వాన శౌచాతిశయం
బమలగుణ; కల్గు, రిత్త జ
లములం దోఁగిన శుచిత్వ లాభము గలదే?

తాత్పర్యం: నిర్మలములైన గుణములుగల ధర్మజా! దమము, శమము, అహింస, తపము అనునవి తీర్థములే. వాటివలన అతిశయమైన శుచిత్వం లభిస్తుంది. పై గుణములు లేక వట్టినీళ్ళలో మునిగితే పావనత్వం చేకూరుతుందా? (చేకూరదని భావం).

. దొరకొనని వానిఁ గోరక,
దొరకొనినందున మమత్వ తుష్టహృదయతం
బొరయక, విగతస్పృహులగు
పురుషులు, శుచు; లేల తీర్థములు వారలకున్?

తాత్పర్యం: ఏది లభించదో దానిని కోరకుండా, దొరికిన వాటిపట్ల మమకారం చూపకుండా నిరాసక్తులుగా ఉండేవారే నిజమైన పవిత్రులు. అలాంటివారికి తీర్థాల అవసరమేంటి?

ఆ. అరయ దుర్గమములు, నతి విషమంబులు
నైన తీర్థములు ధరాధినాథ!
యధిక భక్తి యుక్తి నాత్మఁ దలంచినఁ
జాలు నరుల కల్మషములు వాయు.

తాత్పర్యం: పోవటానికి వీల్లేనివి, దూర ప్రదేశాలలో ఉండేవి, అయిన తీర్థాలను భక్తితో స్మరిస్తే చాలయ్యా ధర్మరాజా! మనుష్యుల పాపాలన్నీ పోతాయి.


కడుసదరము నాకీ స్నానము 

ఇది అన్నమాచార్యుని వాక్యంలో ఉన్న అసలైన బలమైన పదం. కడుసదరము” అనేది కేవలం చాతుర్యము కాదు — అది ఒక అంతర్ముఖ సాధన, ఒక కఠినమైన మనోశిక్షణ. ఇదే ఆయన చెబుతున్నాడు — ఈ అంతరస్నానం ఏ నదిలోనో మునుగుట కన్నా కఠినమైనది.

ఎందుకంటే ఇది మనకు బాహ్యంగా ఏదో జోడించడం కాదు; లోపల ఉన్న వాటిని విడిచిపెట్టడం. మనం స్నానం చేయాల్సింది నీటిలో కాదు, మన ఆలోచనల్లోమనం సాధించాల్సింది సంపాదన కాదు, విసర్జన. 

ఒక ఆలోచనను, ఒక అభిప్రాయాన్ని విడిచిపెట్టడం సులువుగా అనిపించినా — మనకు ఎంతో ఇష్టమైన, మన బంధువుల గురించి, మన అహంకారానికి సంబంధించిన భావాలను విడిచిపెట్టగలమా? మనకు రుచించే ఆహారమూ, ద్వేషించే పదార్థమూ ఒకే దృష్టితో చూడగలమా? ఈ “విడిచిపెట్టడమే” నిజమైన స్నానం. ఇది అంతర్ముఖ బోధ యొక్క స్నానం — కడుసదరము స్నానంమనలోని మలినత్వాన్ని ఆత్మజలముతో కడిగేసే స్నానం.


సారసంగ్రహం (మూడు చరణముల కలిపి)

  1. మొదటి చరణంలో — మనలోని ద్వంద్వాలను గమనించడం.
  2. రెండవ చరణంలో — దేవుని స్మరించే మహనీయులను స్మరించడం.
  3. మూడవ చరణంలో — భక్తుల సాక్షాత్కారమును, కథాస్మరణను ఆత్మశుద్ధిగా గ్రహించడం. 
ఈ క్రమం భౌతిక స్నానం నుండి ఆత్మస్నానం వరకు
గల పరిణామమును, పరిణతిని సూచిస్తుంది.

మొదటి చరణం:

ఇరువంకల నీ యేచిన ముద్రలు
ధరియించుటే నా స్నానము
ధరపై నీ నిజదాసుల దాసుల
చరణధూళి నా స్నానము ॥నదు॥ 
Telugu Phrase
Meaning
ఇరువంకల నీ యేచిన ముద్రలు
నా యీ సాధనలేని మార్గములో రెండు వైపులా ఎప్పటికప్పుడు పుట్టుకువచ్చు గుర్తులను గమనించుతూ.
ధరియించుటే నా స్నానము
అవియే నీ వైపు తీసుకువెళ్లు సూచికలుగా తెలిసి వుండుటయే నా ఆత్మ శుద్ధి.
ధరపై నీ నిజదాసుల దాసుల
ఈ భూమిపై నీ నిజమైన భక్తుల సేవకుల
చరణధూళి నా స్నానము
వారి పాదధూళి నా తలపై ధరించుటే నా పవిత్ర స్నానము.

భావము: 

ఓ ప్రభూ!  నా యీ సాధనలేని మార్గములో ఇరు వైపులా నీవు  ఉంచిన ఎప్పటికప్పుడు పుట్టుకువచ్చు సూచికలను (ఒకటి మోహము, ఇంకొకటి దాని వ్యతిరేకత)— తెలిసి వూరక వుండుటయే నా ఆత్మ శుద్ధి. ఈ భూమిపై నీ నిజమైన భక్తుల సేవకుల పాదధూళి నా తలపై ధరించుటే నా పవిత్ర స్నానము.


గూఢార్థవివరణము: 

ఇరువంకల నీ యేచిన ముద్రలు 

అన్నమాచార్యుల ఈ వాక్యం సులభంగా కనిపించినా, లోతుగా వెళ్ళినప్పుడు అద్భుతమైన అంతరార్ధాన్ని కలిగియున్నది. ఇక్కడ ముద్రలు అనగా బయటకు కనబడు గుర్తులు కాదు — మనసులో పుడ్చుకుపోయిన ఆశలు, నమ్మకములు, ఆకాంక్షలూ, ఉద్రేకములు, ఉద్వేగములు మరియు ఉద్రిక్తతలు. 

ఈ “ముద్రలు” మనలో తలెత్తే వాసనాలు మరియు సంస్కారాలు — మనసును ఒక్కొక్కటి ఒక్కో వైపు లాగుతాయి. మార్గమేలేని సత్యమార్గములో ఈ వత్తిళ్ళను గమనించుట — కానీ వాటిలో చిక్కుకోకపోవుట — అదే “ముద్రలను ధరించుట.” 

ఇది ఒక జాగృత స్థితి.  తనలోనే ఏం జరుగుతుందో మూడవ వ్యక్తిలాగ తిలకించుట, రెండు వైపులా ఉన్న తోదోపుళ్ల మధ్య నడుచుట — ఇది భౌతిక స్నానం కాదు, జ్ఞానస్నానం.


ప్రతీకాత్మక దృశ్యము —
 హిల్మా ఆఫ్ క్లింట్ “Swan No.13” 

హిల్మా ఆఫ్ క్లింట్ చిత్రంలో బాగా ప్రకాశవంతమైన పైభాగము (తెలిసినది), చీకటితో కూడుకున్న దిగువ భాగము (తెలియనిది) స్పష్టంగా విడివిడిగా కనబడతాయి. వీటి కేంద్రముగా ఒక వృత్తము, రెండు త్రిభుజాలు అగపడతాయి. వృత్తము త్రిభుజముల రంగులు వెలుగు వైపు వెలుగుతోను చీకటి వైపు చీకటితోను నింది వుండడము గమనించవచ్చును. ఆ వృత్తమును మానవునిగా తీసుకుంటే  పై భాగం బాహ్య ప్రపంచాన్ని, కింద భాగం అంతర్ముఖ ప్రపంచాన్ని సూచిస్తుంది. ఆ త్రిభుజాలు పైన పేర్కొన్న పరస్పర విరుద్ధములైన ముద్రల వంటివి. అవి నిరంతరము మానవుని తమ దారిలోకి లాక్కెళ్ళు ఆకర్షణలను సూచిస్తాయి. వాటి సూటికొనలు అవి చూపు వత్తిడికి చిహ్నములు. మొత్తం మీద మానవుని ఆటంకపరచు శక్తులకు ప్రతీక​. ఇవి రెండూ ఒకదానిలో మరొకటి ప్రతిబింబాల్లా కనబడతాయి. మానవుడు ఆత్మలోనికి మునిగిపోతున్నట్లుగా కనిపిస్తాడు. ఇది మానవుని వాస్తవ పరిస్థితికి అద్దంపడుతుంది. 

ఇంతేకాక చిత్రంలోని రంగుల విభజన కేవలం వెలుగు చీకట్లు మాత్రమే కాదు, అది పురుష మరియు స్త్రీ తత్వాల సంకేతం. పసుపు (పురుష తత్వం) మరియు నీలం (స్త్రీ తత్వం) వేర్వేరు మార్గాల్లో ఆకర్షిస్తున్నప్పటికీ, అవి ఒకే కేంద్రం వైపు సాగుతున్నవి.  వాటి ఏకత్వానికి (unity) చేరుకోవాలని తపిస్తున్నవి. 

మనం చూచే సత్యం మన సొంత ప్రతిబింబమే అయి ఉండవచ్చని సూచిస్తుంది. మనకు సత్యముగా గోచరించేది నిజానికి మన స్వంత ఆలోచనలే అనిచెబుతుంది. మనను  తెలిసిన దానికి తెలియని దానిని విడదీస్తున్న సన్నని వర్తులరేఖలోని ఆవరణలో మనకు తెలిసిన మరియు తెలియని (గమనించలేని) అలోచనల పరిథి. అ త్రిభుజాలు బయటనుండి మన లోనికి చొచ్చుకువచ్చు విషయములకు ప్రతీకలు. 

ఆ చిత్రంలోని కేంద్రం — ఇరువైపులా వున్న ప్రతిబింబాలు అంతమయ్యే స్థానం. దానివైపు నడచి వెళ్లడం అనగా “నేను అనే" ఇప్పటి తెలిసిన దాని నుండి అదియేమో  గుర్తించలేని దానిలోకి (తాను అనునది లేని స్థితికి)  ప్రయాణం. 


ఇదే ఇరువంకల నీ యేచిన ముద్రలు అనే వాక్యంలోని గూఢత:
మనసు రెండు వైపులా లాగబడుతున్నప్పుడు సత్యాన్ని అందుకోవడం సాధ్యం కాదు.
ఈ దారి” గానీ “ఆ దారి” గానీ ఎంచుకోవడం కాదు —
తానేమీ చేయలేనని పూర్తిగా గ్రహించిన మౌనంలో ఉండడమే మార్గం.
ఆ మౌనం నుంచే సత్యం స్వయంగా ప్రత్యక్షమవుతుంది. 

ఆ మొత్తము పటము చైతన్యము అనుకుంటే మనము ఆ గీసుకున్న వృత్త​ పరిథిలోనే సంచరిస్తాము. అప్పుడు తెలిసినది తెలియనిదిగా అ చిత్రము అగపడుతుంది. వాటిని అనగా అ రెండింటిని త్యజిస్తూ నిలవగలగడమే అన్నమాచార్యులు పేర్కొన్న "ఇరువంకల నీ యేచిన ముద్రలు ధరియించుట". ఆ స్థితి అనేక శక్తులను సమము చేస్తూనిలవడమే ఆచార్యులు పేర్కొన్న "కడుసదరము నాకీ స్నానము". అన్నమాచార్యులు ఆ స్థితిని బహు సుఖవంతమైన దానిగా వర్ణించలేదు. (అదిగాక నిజమతం బదిగాక యాజకం/బదిగాక హృదయసుఖ మదిగాక పరము ॥పల్లవి॥ అని ఉదాహరించడము సముచితము.


రెండవ​ చరణం:
తలఁపులోన నినుఁ దలఁచినవారలఁ
దలఁచుటే నా స్నానము
వలనుగ నినుఁ గనువారల శ్రీపాద-
జలములే నా స్నానము    ॥నదు॥ 
Telugu Phrase
Meaning
తలఁపులోన నినుఁ దలఁచినవారలఁ
నిన్ను హృదయంలోనుండి స్మరించువారిని
దలఁచుటే నా స్నానము
వారిని స్మరించుటే నాకు పవిత్ర స్నానము.
వలనుగ నినుఁ గనువారల శ్రీపాద-
నిన్ను దర్శించగలిగిన మహనీయుల పాదతీర్థములు,
జలములే నా స్నానము
అవే నాకు నిజమైన శుద్ధి ప్రసాదించు స్నానము.

సూటి భావము:

ప్రభూ! నిన్ను హృదయంలో నిలుపుకున్న మహాత్ములను స్మరించుటే నా అంతర్ముఖ స్నానము. నిన్ను దర్శించిన మహానుభావుల పాదతీర్థములో స్నానముచేయుటే నాకు పరమశుద్ధి.


గూఢార్థవివరణము: 

ఇక్కడ అన్నమాచార్యులు స్ఫుటంగా చెబుతున్నారు — శుద్ధి అనేది దేవుడి నుండి నేరుగా రాదు; ఆయనను గ్రహించిన భక్తుల నుండి మాత్రమే వస్తుంది.” ఇది భక్తిలో ఒక అత్యున్నత దృష్టి. భక్తుడు దేవుణ్ణి సాక్షాత్కరిస్తే, ఆయన హృదయంలోని దయ, వినయం, నిశ్చలత అన్నీ పరమాత్మస్వరూపమే అవుతాయి. అటువంటి భక్తుని స్మరించడమే ఒక స్నానం. 

వలనుగ నినుఁ గనువారల శ్రీపాదజలములు” అనే వాక్యం కేవలం పాదతీర్థం కాదు — అది భక్తుని జీవన ప్రవాహం; ఆయన సద్వర్తనము, దయ, ఆత్మశాంతి — ఇవన్నీ కలిసిన పవిత్ర జలం. అది తాకినచోట మలినం మాయమవుతుంది. అన్నమాచార్యుడికి ఈ స్నానం దేవుని దర్శనం కన్నా గొప్పది. ఎందుకంటే, భక్తుని జీవితం దేవుని ప్రత్యక్ష రూపం.


మూడవ​ ​ చరణం:
పరమభాగవతపాదాంబుజముల
దరుశనమే నా స్నానము
తిరువేంకటగిరిదేవ నీ కథా-
స్మరణమే నా స్నానము     ॥నదు॥
తెలుగు పదబంధం
భావము

పరమభాగవతపాదాంబుజముల

పరమభక్తుల పాదకమలాల దర్శనమే
దరుశనమే నా స్నానము
నా పవిత్ర స్నానము
తిరువేంకటగిరిదేవ నీ కథా-
ఓ శ్రీనివాసా! నీ చరిత్ర స్మరణమే
స్మరణమే నా స్నానము
నా అంతరశుద్ధి

సూటి భావము:

ప్రభూ! పరమభక్తుల పాదకమలాలను దర్శించుటే నాకు పవిత్ర స్నానము. నీ లీలలను, నీ కథలను స్మరించుటే నా నిజమైన అంతరశుద్ధి.


గూఢార్థవివరణము: 

ఇక్కడ అన్నమాచార్యులు ఒక గంభీరమైన సూచన చేస్తున్నారు — పాటంతటా ఎక్కడా “దేవుని దర్శనం” గురించి చెప్పలేదు. అది ఆయన ఉద్దేశపూర్వకమైన మౌనం. మానవులకు  ప్రధానమైనది — స్నానం”, అంటే శుద్ధి ప్రక్రియ. అది భగవంతుని ప్రార్థన ద్వారా కాదు, మనలోని స్వార్థమును, అహంభావాన్ని గమనించి వదిలిపెట్టే అంతర్ముఖ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. 

అదే నిజమైన స్నానం —జలములో కాదు, జ్ఞానంలో; దేవుని చరణాల వద్ద కాదు, దైవము స్ఫురణ ఉన్న భక్తుల హృదయములో.


ఈ కీర్తన ముఖ్య సందేశం

అన్నమాచార్యుల బోధనం అతి ప్రాయోగికమైనది —

తనను తాను శుద్ధి పరచుకొనుటయే
మానవ జీవిత ప్రధానోద్దేశము.
ప్రార్థన కాదు.

X-X-The END-X-X



No comments:

Post a Comment

274 nadu lollavu nā snānamu (నదు లొల్లవు నా స్నానము)

    TALLAPAKA ANNAMACHARYULU 274 నదు లొల్లవు నా స్నానము (nadu lollavu n ā sn ā namu)   తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. INTRODUC...