Monday, 20 October 2025

T-273 పంట వండుకొనేవారిభాగ్యము

 తాళ్లపాక అన్నమాచార్యులు

273 పంట వండుకొనేవారిభాగ్యము

For English version press here 

ఉపోద్ఘాతము

అతి మాధుర్యమైన కృతులలో ఇది ఒకటి — ఇక్కడ అన్నమాచార్యులు “పరమయోగం” తన చైతన్యమంతటా ఎలా వ్యాపించిందో సూచిస్తున్నారు. “పరలోకముల నుండి విస్తరించిన తీగ”లా అది తనలో ప్రవహించిందని ఆయన చెబుతారు. ఇది చెదురు మదురు ఘటన​ (చర్య) కాదు; మానవుడు తన చైతన్యంలో మొత్తం విశ్వం యొక్క  అంతర చలనమును (movement) అనుభవించుట​— మనిషిలోని అన్ని రకముల శక్తి ఆ ఒక్క క్షణంలో ఏకమై, అతడి (తనువుకు చెందిన​) సర్వసాధారణ జ్ఞానం మరుగైపోయే స్థితి. 

ఈ అనుభవాన్ని ప్రకృతిలో ఒక విశిష్టమైన సంఘటనతో పోల్చవచ్చు — యెల్లోస్టోన్ జాతీయ ఉద్యానవనంలో గమనించిన “ట్రాఫిక్ కస్కేడ్” (ఆహారం మరియు పోషణల పర్యవసాన ప్రభావము- సోపాన క్రమము) అనే ప్రక్రియతో. అక్కడ కేవలం ఇరవై ఐదు బూడిద రంగు తోడేళ్ళను 1995లో తిరిగి ప్రవేశపెట్టడం ఒక చిహ్నాత్మక ప్రారంభం మాత్రమే. దాని ప్రభావం — కేవలం పదేళ్లలో — అడవుల పునరుద్ధరణ ద్వారా నదులు స్థిరపడి, గట్ల కోత తగ్గి, ప్రవాహం సమతులమైంది. అడవులు యథాస్థితికి పునరుద్ధరించబడుట​, ప్రకృతి మళ్లీ మేల్కొనడం — ఎవరు ఊహించని అద్భుతం. 

అలాగే, పరమయోగం అనే స్థితి కూడా మనిషి కృషితో సాధ్యమయ్యేది కాదు. అది దైవకృపతో సంభవించే అంతర సమతులనం — ఆ “మరొక శక్తి” స్వయంగా మన చైతన్యంలో ప్రవేశించే దివ్య క్షణం. 

అందుకే, మనిషి యొక్క ప్రధాన ధర్మం — ఏ పరిస్థితిలోనైనా ధార్మికుడిగానే నిలవడం. ఎందుకంటే, ఆ పవిత్రతే దైవకృపకు ద్వారం; అదే ఆ మహా యోగం అవతరించగల స్థలం. 

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 148-6 సంపుటము: 2-222
పంట వండుకొనేవారిభాగ్యము లిటమీఁద-
నంటిముట్టి వెదకితే నాతుమ లోనున్నది ॥పల్లవి॥
 
వేదములలో మొలచె వేదాంతాలఁ గొనసాగె
గాదిలి శ్రీహరిభక్తికల్పలత
పోదియెక్కె వై రాగ్యబోధలచేఁ బలుమారు
పాదుకొని వేరువారె పంచసంస్కారాలను ॥పంట॥
 
అల్లుకొనె మునులలో నంటెనుఁ బురాణాల
చెల్లుబడి శాస్త్రాలఁ జిగిరించెను
చల్లఁగాఁ బూవులు వూచె సత్కర్మవిదులను
మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున ॥పంట॥
 
పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె
పరగె సురలనే పందిటియందు
యిరవై శ్రీవేంకటేశుఁ డిందుకు ఫలమైనాఁడు
గురుసేవలను దొరకును వివేకులకు ॥పంట॥

Details and Explanations:

పల్లవి
పంట వండుకొనేవారిభాగ్యము లిటమీఁద-
నంటిముట్టి వెదకితే నాతుమ లోనున్నది ॥పల్లవి॥ 
               Telugu Phrase
Meaning
పంట వండుకొనేవారిభాగ్యము లిటమీఁద-
చేతికిచ్చిన పంటను ఎలా వండుకుంటావో అది నీ భాగ్యము
నంటిముట్టి వెదకితే నాతుమ లోనున్నది
ఆంటిముట్ట కుండా వెదకితే ఆత్మలోనే వున్నది ( ఆ పంట, ఆ భాగ్యము)

 

సూటి భావము:

మానవుడా! చేతికిచ్చిన పంటను ఎలా వండుకుంటావో అది నీ భాగ్యము. ఆంటిముట్ట కుండా వెదకితే ఆత్మలోనే వున్నది ( ఆ పంట, ఆ భాగ్యము)

దాగివున్న భావము:

మానవుడా! నీకివ్వబడిన ఈ జన్మ ఒక పంట లాంటిది. దానిని ఆ దేహమనే చేనులో (ఆ క్షేత్రములో) ఏ పంటలు పండుతాయో నీ భాగ్యము కొలది నీవే తెలుసుకో. ఆ పొలములో అంటి అంటకుండా సంచరించగలిగితే ఆ మహాభాగ్యము ఆత్మ లోనే వుంది. 


గూఢార్థవివరణము: 

అన్నమాచార్యులవారు ఈ దేహమును ఒక పొలముతో పోల్చుతున్నారు. దీనిని భగవగీత లోని ఈ శ్లోకముతో సమానముగా చూడవచ్చును. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే । ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః13-2 ॥ (భగవానుడు ఇలా పలికెను: ఓ అర్జునా, ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానిని క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది). 

రెండవ పంక్తిలో ఆ పొలములో అంటి అంటకుండా సంచరించగలిగితే అని మెలిక పెట్టారు. మనము ఈ దేహమును తెలియమని చెప్పటం వింత కాదు. అయితే ఇటువంటి దేహముతొనే ముందటి కాలంలో మునులు తరించారని అన్నమాచార్యులవారు చెప్పనే చెప్పారు. (దురిత దేహులే తొల్లియును శ్రీ /హరి భజించి నిత్యాధికులైరి ॥పల్లవి॥)


మనుష్యదేహం — అన్నమాచార్యుల దృష్టిలో — సృష్టిలో మనకు తెలిసిన ఏ వస్తువు దీనికి సమానమైనది కాదు.  దానిలో మనస్సే సృష్టి రహస్యమంతా తనలో కప్పి వుంచుకుంది. ఆ లోతైన మూలం నుండే ఈ జగత్తు రూపం దాల్చింది. వింత ఏమిటంటే — అల్లకల్లోలమైన ఈ విశ్వం, అంతులేని వ్యోమము (అంతరిక్షము / ఆకాశము) — అంతా ఈ చిన్న మనస్సులోనే నిక్షిప్తమై వుంది. అయితే ఈ నిజం సులభంగా బయటపడదు; మనిషి తనను ఈ జీవిత నాటకంలో తననూ ఒక నటుడిగా భావించునంతవరకూ. 

మనిషి “నేనే చేస్తున్నాను” అనే భావాన్ని విడిచినప్పుడు మాత్రమే తలుపు తెరుచుకునే అవకాశం ఉంటుంది.  మనస్సు నిలిచిపోయినప్పుడు అది మరణం — కానీ మరణం మార్గం కానే కాదు. ఇక్కడ చెప్పబడినది ఒక అసాధారణ స్థితి — దేవకృపతో మనిషి “అదేమో తెలియని" దశలో ప్రవేశించే స్థితి. ఈ జగత్తును ఆ మార్పును యథాతథంగా  సంపూర్ణంగా అంగీకరించడమే దీనికి గల  ఒకే తాళం చెవి.  దేనిని అడ్డుకోకుండా తన అంతరాత్మలో ప్రతిఫలింపనివ్వడం.


మాయా దర్పణం — ఒక దృష్టాంతం:

 

ఈ రహస్యాన్ని కొంచెం వివరంగా తెలియుటకు రెనే మాగ్రిట్ వేసిన మాయా దర్పణం అనే చిత్రాన్ని చూద్దాం. ఒకే ఒక మానవ కన్ను మొత్తం చిత్రాన్ని నింపుతుంది. కనుగ్రుడ్డు (ఇరిస్) — మేఘాలతో నిండిన నీలాకాశంలా అంతులేని ప్రశాంతతతో ఉంది; కానీ కృష్ణవర్ణపు కనుపాప (ప్యూపిల్) మాత్రం వెలుగును ప్రసరించనివ్వదు, ప్రతిబింబించనివ్వదు.  కన్ను చుట్టుప్రాంతం వాస్తవికంగా చిత్రించబడినందున, అందులోని ఆ అద్భుత, మాయ-సత్య మిళిత దృశ్యం మరింత మోహనంగా కనిపిస్తుంది. 

కనులు ఆకాశాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. కాని తిరిగి ఆకాశం ఆ కన్నును  చూస్తున్నట్లు అనిపిస్తుంది.   తనలో మరొక లోకాన్ని దాచుకున్నట్లు. మాగ్రిట్ మనల్ని పరిశీలించమని, పరీక్షించమని, ప్రశ్నించమని ఆహ్వానిస్తున్నాడు: “మనం చూస్తున్నది ఆకాశమునా? — లేక మనలోని అంతర్లోకమునా? బయట కనబడే ప్రపంచం నిజమా — లేక మనలోని చైతన్యపు ప్రతిబింబమా?" 

బహుశా, ఒక్క విషయం మాత్రమే నిశ్చయం: 'ది ఫాల్స్ మిర్రర్' అనేది కేవలం కన్ను యొక్క చిత్రం కాదు. అది ఒక చర్చా వేదిక​ — ఈ మాయా దర్పణం మనలను కొత్త దృష్టితో చూసేలా ఆహ్వానిస్తుంది:చూడటానికి కాదు, ‘చూచుట’ను సరిదిద్దుకొనటానికి.


మొదటి చరణం:

వేదములలో మొలచె వేదాంతాలఁ గొనసాగె
గాదిలి శ్రీహరిభక్తికల్పలత
పోదియెక్కె వై రాగ్యబోధలచేఁ బలుమారు
పాదుకొని వేరువారె పంచసంస్కారాలను ॥పంట॥ 
Telugu Phrase

Meaning

వేదములలో మొలచె వేదాంతాలఁ గొనసాగె
వేదములలో ఒక విత్తనమై మొలచినది ఈ పరమయోగం. వేదాంతములలోను కొనసాగినది.
గాదిలి శ్రీహరిభక్తికల్పలత
ప్రేమతో శ్రీహరిభక్తి లత నన్ను అల్లుకుపోయినది
పోదియెక్కె వై రాగ్యబోధలచేఁ బలుమారు
(పోది= అతడు) అతడు వై రాగ్యబోధలతో పలుమారు పరిశుద్ధుడై
పాదుకొని వేరువారె పంచసంస్కారాలను
అవి ఆ క్షేత్రములో  పంచసంస్కారాల రూపంలో బలంగా నాటుకున్నవి.

భావము: 

వేదములలో ఒక విత్తనమై మొలచినది ఈ పరమయోగం.వేదాంతములలోను కొనసాగిన తన గమ్యాన్ని కనుక్కుంది.  ప్రేమతో శ్రీహరిభక్తి లత నన్ను అల్లుకుపోయినది. వైరాగ్యబోధల ప్రభావంతో అది లోలోపల పరిపక్వమైంది — తన మూలాలను పంచసంస్కారాల రూపంలో బలంగా ఆ నేలలో (ఆ క్షేత్రములో) నాటుకుంది.


గూఢార్థవివరణము: 

అన్నమాచార్యుడు ఇక్కడ ‘పంట వండుకొనేవారి భాగ్యము’ ఎలా రూపం దాల్చుతుందో వరుసగా చెప్పుతున్నారు.

మొదట చరణంలో అది వేదాలలో ఒక మొలుస్తున్న విత్తనంలా ఉంది — జ్ఞానానికి పూర్వమైన స్ఫురణ — జ్ఞానాన్ని మించే చైతన్యం. వేదాంతములలో అది దిశను పొందింది — తెలుసుకోవడం దాటి, తెలిసినదానిని వదిలి వెళ్లే చైతన్యం. అది భక్తిరూప లతగా, శ్రీహరి ప్రేమలో మెల్లగా చిగురిస్తోంది. వైరాగ్యబోధలతో అది పరిపక్వమవుతోంది; మనిషి లోపల ప్రపంచకార్యాల పట్ల ఆకర్షణ తగ్గి, నిశ్చలత్వం పెరుగుతోంది.అప్పుడు ఆ యోగం మనలోని పంచసంస్కారాల రూపంలో స్థిరమవుతుంది —అనగా మనసు, వాక్కు, శరీరం అన్నీ ఒకే శ్రుతిలో దేవుని వైపు మలచబడతాయి. 

రెండో చరణంలో ఈ యోగం తన పరిధిని విస్తరించుకుంటుంది — మునులలో, శాస్త్రాలలో, సత్కర్మాలలో తన ప్రతిధ్వనిని విస్తరించింది. 

మూడో చరణంలో అది పరిపుష్టమవుతుంది — దేవతల సన్నిధిలో వికసించి, భగవంతుడే ఆ యోగానికి ఫలమవుతాడు. ఇలా చూస్తే — మొదటి పాదం విత్తనం, రెండోది విస్తృతి, మూడోది పుష్పంఒకటే దివ్యప్రవాహం, కాని దశలు మారుతాయి.

మనిషి దానిలో కర్త కాదు; దానిలో కరిగిపోయే సాక్షి మాత్రమే.


రెండవ​ చరణం:
అల్లుకొనె మునులలో నంటెనుఁ బురాణాల
చెల్లుబడి శాస్త్రాలఁ జిగిరించెను
చల్లఁగాఁ బూవులు వూచె సత్కర్మవిదులను
మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున ॥పంట॥ 
Telugu Phrase

Meaning

అల్లుకొనె మునులలో నంటెనుఁ బురాణాల
పరమ యోగులైన మునులతోను పవిత్రమైన పురాణములతోను అల్లుకొనెను
చెల్లుబడి శాస్త్రాలఁ జిగిరించెను
దివ్య  శాస్త్రాలలోను చిగురించెను.
చల్లఁగాఁ బూవులు వూచె సత్కర్మవిదులను
తాను తెలియకుండానే సత్కర్మవిధులను పూవులు పూచెను
మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున
మెల్లమెల్లగా ఆ నీడలు నిండినవి నాలో. (నా ఇప్పటి అజ్ఞానమును కప్పివేసినవి). నేను ఎవరో తెలియని స్థితిలో సుజ్ఞానము ప్రకటమాయెను.

సూటి భావము:

చెప్పలేని అనుభూతి పరమ యోగులైన మునులతోను పవిత్రమైన పురాణములతోను  అన్నమాచార్యుని కలిపి అల్లుకొనెను. దివ్య  శాస్త్రాలలోని సారము ప్రస్పుటమాయెను.  తనకు తెలియకుండానే సత్కర్మవిధులను పూవులు పూచెను. నాలో మెల్లమెల్లగా ఆ నీడలు నిండినవి. (నా ఇప్పటి అజ్ఞానమును కప్పివేసినవి). నేను ఎవరో తెలియని స్థితిలో సుజ్ఞానము ప్రకటమాయెను.


గూఢార్థవివరణము: 

ఈ చరణము అన్నమాచార్యుల అంతరానుభూతిలో “పరమయోగం” దిగివచ్చిన క్షణాన్ని స్పష్టంగా చిత్రిస్తుంది. 

అల్లుకొనె మునులలో నంటెనుఁ బురాణాల” అని అన్నప్పుడు, అది కేవలం పాత గ్రంథాలను గుర్తు చేసుకోవడమే కాదు — యుగయుగాలుగా మునులచేత ప్రవహించిన ఆ దివ్యచైతన్యప్రవాహం ఇప్పుడు తనలో ప్రవహిస్తున్నదని ఆయన సూచిస్తున్నారు. తాను ఆ స్రవంతికి అనుసంధానమైపోయినట్లుగా అనిపిస్తుంది. 

చెల్లుబడి శాస్త్రాలఁ జిగిరించెను” అనగా — ఆ శాస్త్రాల్లో నిక్షిప్తమైన సత్యం ఇప్పుడు తనలో ప్రత్యక్షానుభవంగా జీవిస్తున్నది. అది పుస్తకాల జ్ఞానం కాదు; అంతరంలో వెలిగే జ్ఞానజ్యోతి.

చల్లఁగాఁ బూవులు వూచె సత్కర్మవిదులను” అని చెప్పినపుడు, ఆ పరమయోగానుభూతి వల్ల సత్కర్మములు సహజంగా పుష్పించినట్లు అవుతాయి. ఇక్కడ ధర్మం సాధన కాదు — అది సుగంధంలా ఆ జ్ఞానపుష్పం నుంచి స్వయంగా విరుస్తుంది. 

మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున” అని చివరగా చెప్పినప్పుడు, ఆయన మనసులోని సాధారణ (=ఈ తనువుకు సంబంధించిన​) బుద్ధి, భావాలు, అనుభవాలు మాయమవుతాయి. ఆ లోకజ్ఞానం క్రమంగా చీకట్లో కలసి, దాని స్థానంలో ఒక మౌన ప్రకాశం విరుస్తుంది. ఆ “నీడలు” అజ్ఞానపు నీడలు కావు — అవి “నేను” అనే భావం కరిగిపోవడానికి ముందున్న సంధ్యా వెలుగులు. అవి ఒక మర్మమైన ప్రశాంతత — దానిని మాటలతో చెప్పలేము. 

ఈ సమస్త ప్రక్రియలలో అన్నమాచార్యుడు తానను తాను చూచువాడు మాత్రమే— కార్యకర్త కాదు, కేవలం సాక్షి. అన్నమాచార్యునిలో ఆ “ఇతరుని కదలిక” ఇతరు ద్వారా జరగుతున్నది — యుగయుగాల మునులలో ప్రవహించిన ఆ దివ్య చైతన్యము ఇప్పుడు అన్నమాచార్యుని అంతరాంతరాలలో పరమయోగముగా వికసిస్తున్నది. ​​


మూడవ​ ​ చరణం:
పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె
పరగె సురలనే పందిటియందు
యిరవై శ్రీవేంకటేశుఁ డిందుకు ఫలమైనాఁడు
గురుసేవలను దొరకును వివేకులకు ॥పంట॥ 
తెలుగు పదబంధం
భావము
పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె
అతనిలో (అన్నమాచార్యునిలో) చిగుళ్ళు పిందెలుగా పరమయోగములు పుట్టినవి
పరగె సురలనే పందిటియందు
బాగుగా దేవతల పందిళ్ళలోనే (సమక్షములోనే)
యిరవై శ్రీవేంకటేశుఁ డిందుకు ఫలమైనాఁడు
గురియై (స్థిరమై) శ్రీవేంకటేశుఁడే పరమయోగముల ఫలము
గురుసేవలను దొరకును వివేకులకు
గురువులకు గురువైన దైవము యొక్క సేవకులై వుండు వివేకులకు దొరకును

సూటి భావము:

అతనిలో (అన్నమాచార్యునిలో) చిగుళ్ళు పిందెలుగా పరమయోగములు పుట్టినవి. బాగుగా దేవతల పందిళ్ళలోనే (సమక్షములోనే) గురియై (స్థిరమై) శ్రీవేంకటేశుఁడే పరమయోగముల ఫలము. గురువులకు గురువైన దైవము యొక్క సేవకులై వుండు వివేకులకు దొరకు ఫలము.


గూఢార్థవివరణము: 

దీనిని ఒక అనుభవాత్మక కోణంలో చూద్దాం. 

పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె” — అని అన్నమాచార్యులు చెప్పినప్పుడు, అది కేవలం యోగ సాధనల ఫలితమని కాదు. ఇటువంటి మనిషిలో లోతైన ఆధ్యాత్మిక అవగాహనలు (పరమయోగాలు) సహజంగానే వికసిస్తాయి — శ్రమతో గానీ, సంకల్పంతో గానీ కాదు. అవి ఒక్కసారిగా జరిగే అనుభవాలు కావు; తరచూ తిరిగి వచ్చే, దివ్యస్పర్శల తరంగాలు, మనస్సు అనే అంతర్గత క్షేత్రంలో తమంత తాముగా పుష్పించేవి. 

ఈ స్థితిని జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన “the Otherఅనే అనుభవంతో పోల్చవచ్చు. ఆయన ఒక సాధారణ మానవుడిగానే ఉన్నప్పుడు, ఒక అపారమైన, అజ్ఞేయమైన, పవిత్రమైన శక్తి ఆయన చైతన్యాన్ని ఆక్రమించింది. ఆయన యోగములోకి ప్రవేశించలేదుయోగమే ఆయనలో వికసించింది. ఆ పుష్పించడంలో ఆయన ప్రమేయం లేదు; ఆ “ఇతర సాన్నిధ్య” దయ వలన సహజంగా సంభవించినది.


అన్నమాచార్యులు ఇలా చెబుతారు — పరగె సురలనే పందిటియందు యిరవై శ్రీవేంకటేశుఁడిందుకు ఫలమైనాఁడుఅని. ఇక్కడ ఆయన సూచిస్తున్నది యోగపు పరమ ఫలితాన్ని — యోగి యొక్క అంతరంగం దివ్య సాన్నిధ్యంతో  ప్రకాశమయ్యే దశను. అన్ని యోగాల ఫలం, అన్ని సాధనల అంతిమ గమ్యం, శక్తి గాని, మోక్షం గాని కావు — దివ్యసాన్నిధ్యమే. ఆ సాన్నిధ్యం శ్రీ వేంకటేశ్వరుడి రూపంలో వ్యక్తమవుతుంది — యోగసిద్ధి యొక్క సజీవకేంద్రంగా నిలుస్తుంది. 

అందుకే చివరగా చెబుతారు — గురుసేవలను దొరకును వివేకులకుఅని, యోగానుభవం ఎవరికి దొరుకుతుందంటే, అహంభావం విడిచి, మనసు వినయంతో, స్పష్టతతో పరిపక్వమైన వారికే. వారు దైవాన్ని సేవిస్తారు — సాధకులుగా కాదు, సమర్పితులుగా. ఎవరికీ ఆ యోగం (కోరితే) లభించదు — అది తనంతట తానే ప్రకటమౌతుంది. అది కదలని నీటిమీద తామరలా వికసిస్తుంది — ఇక ఏదీ కోరని హృదయంలో.


ఈ కీర్తన ముఖ్య సందేశం

అన్నమాచార్యుల బోధనం అతి ప్రాయోగికమైనది —
 దైవార్పణము చేసిన జీవి బాధ్యతను
దైవం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించదు.
ఈ క్షేత్రం మన చేతులలోనే ఉంది. ధర్మంతోభక్తితో దాన్ని సాగుచేస్తే —
ఆ పవిత్రమైన పంట మన అంతరంగంలో దశలవారీగా స్పష్టమవుతుంది.   

No comments:

Post a Comment

273 paṃṭa vaṃḍukonēvāri bhāgyamu (పంట వండుకొనేవారిభాగ్యము)

  TALLAPAKA ANNAMACHARYULU 273 పంట వండుకొనేవారిభాగ్యము (pa ṃṭ a va ṃḍ ukon ē v ā ri bh ā gyamu)   తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. ...