Sunday, 26 October 2025

T-277 హరి హరి నీ మాయామహిమ

 తాళ్లపాక అన్నమాచార్యులు

277 హరి హరి నీ మాయామహిమ 

For English version press here 

ఉపోద్ఘాతము 

“హరి హరి నీ మాయామహిమ” కీర్తనలో అన్నమాచార్యులు మాయ స్వరూపాన్ని లోనుండి పరిశీలిస్తున్నారు. దైవాన్ని మాయను తొలగించమని కాదు, దానిని గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. గుర్తింపులు–మరపుల ఊగిసలాటలలో సాగుతున్న జీవనంలో మన భక్తి మాత్రమే కాదు, ప్రతి మనోవికారం కూడా అస్తిరమే. 

ప్రతి చరణం మనసు కదలికల వల్లే దైవం మనకు దూరమైందన్న భ్రాంతిని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. ఇక ఈ కీర్తన భావప్రపంచపు గోడలు, హర్మ్యాలపై ప్రశ్నగా నిలుస్తుంది.

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 350-3 సంపుటము: 4-293
హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁ గదే ॥పల్లవి॥
 
తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు  ॥హరి॥
 
మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు ॥హరి॥
 
చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు ॥హరి॥

Details and Explanations:

పల్లవి
హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁ గదే ॥పల్లవి॥ 
               Telugu Phrase
Meaning
హరి హరి నీ మాయామహిమ
శ్రీహరి  నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁ గదే
ఆద్దాని సరవి (= క్రమము, మర్మము)  తెలిసికొనునట్లు కరుణించుము
 

 

సూటి భావము:

శ్రీహరి!  నీ మాయామహిమ మర్మము తెలిసికొనునట్లు నను కరుణించుము


గూఢార్థవివరణము:

 

సరవి దెలియ ననుఁ గరుణించఁ గదే
మాయా అనేది దేవుడు మనిషిపై వేసిన ముసుగు కాదు;
మన ప్రస్తుత పరిస్థితిలో మనసు కల్పించిన స్థితి.
దేవుడు సృష్టించిన క్రమంలో ఏ భ్రమ లేదు —
భ్రమ పుట్టేది దాన్ని చూసే మనసులోనే.

 

అన్నమాచార్యుడు ఇక్కడ చెబుతున్నది —
“ఓ హరి! నీవు కల్పించిన మాయా మహిమను నేను తిరస్కరించను.
దానిని గ్రహించే శక్తిని ప్రసాదించు.
దాని వెనుక దాగిన క్రమముమర్మము  నాకు తెలియాలి.”
ఈ మాటలలో జాగ్రత్త, అవగాహన, మరియు అంతర్దృష్టి ఉన్నాయి.
దేవుడు మాయాను తొలగిస్తాడని ఆశించడం లేదు,
మనిషి తానెరిగిన దానిని దాటి చూడడం అన్నమాచార్యుల ఉద్దేశ్యం. 

మొదటి చరణం:
తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు  ॥హరి॥ 
Telugu Phrase
Meaning
తలఁతును నా పాలిదైవమవని నిను
ఒక పరి నిన్ను నా ప్రియమైన దైవమని భావిస్తాను
తలఁతును తల్లివిఁ దండ్రివని
ఇంకోసారి నా తల్లి దండ్రులుగా తలచుకుంటాను.
మలసి యంతలో మఱతును తెలుతును
కాసేపటికి మర్చిపోతాను — మళ్లీ గుర్తు తెచ్చుకుంటాను.
కలవలె నున్నది కడ గనరాదు  ॥హరి॥
కలవలె ఊగిసలాడు నా ఇప్పటి జీవితములో ఆ చివరి అంతు కనిపించడం లేదు

భావము: 

ఓ హరి! ఒక పరి నిన్ను నా ప్రియమైన దైవమని భావిస్తాను; ఇంకోసారి నా తల్లి దండ్రులుగా తలచుకుంటాను. కాసేపటికి మర్చిపోతాను — మళ్లీ గుర్తు తెచ్చుకుంటాను. కలవలె ఊగిసలాడే ఈ జీవన ప్రవాహానికి అంతు కనిపించడం లేదు. ​(ఇదే నిరంతరంగా సాగేటట్లుంది)


గూఢార్థవివరణము: 

ఈ చరణంలో అన్నమాచార్యులు మన భక్తి యొక్క అస్తిరత్వాన్ని సూటిగా చెప్పుతున్నారు. గుర్తు తెచ్చుకునే, మరచిపోయే ఆ మనసు కదలికల వెంబడి మన భక్తి , ఆలోచనలు ఉన్నాయి. గమనిస్తే — జ్ఞాపకశక్తి ఆధారంగా కదిలే ఆలోచనల, భావాల ప్రవాహమే మన జీవనం. ఇది పాపమో, నిర్లక్ష్యమో కాదు — మన భావాలే నశ్వరమని బోధ. 

కలవలె నున్నది కడ గనరాదు” —మనం ఊహించుకునే దైవ సన్నిధి, దూరం — ఇవన్నీ మన అంతః స్థితులే. అవి వస్తు (మెటీరియల్) ప్రపంచానికి చెందినవి. అది గుర్తింపులు–మరపుల అలలలోనే సాగిపోతుంది. అదియే కలలాంటి జీవనము. ఇక్కడే అన్నమాచార్యుల స్పూర్తి వుంది. ఊహా-మరపుల ఊగులాటలను దాటి స్థిరముగా వున్నదియే దైవ సన్నిధి. మాయను తొలగించమని ప్రార్థించడం లేదు — దానిని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతున్నారు.


రెండవ​ చరణం:
మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు ॥హరి॥
Telugu Phrase
Meaning
మొక్కుదు నొకపరి మొగి నేలికవని
నువ్వు జగములకు ఏలికవని మొక్కుతాను
మొక్కుదు నీ వాదిమూలమని
ఇంకోసారి నువ్వు ఆదిమూలమని భావిస్తాను.
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
నాలోపల నుంచి గర్వముతో 'నువ్వు తెలుసు' అని భావిస్తాను. ఆ వెంటనే తగ్గి, 'తెలియదనుకొంటాను'.
కక్కసమైనది కడ గనరాదు
(కక్కసమైనది = విఱుగని, వంగని, కఠినమైన) విఱుగని, వంగని ఆ సత్యము తెలియలేదు.

సూటి భావము:

ఓ హరి! నువ్వు జగములకు ఏలికవని మొక్కుతాను. ఇంకోసారి నువ్వు ఆదిమూలమని భావిస్తాను. లోలోపల “నిన్ను తెలిసాను” అని గర్విస్తాను — వెంటనే “తెలియలేదేమో” అని తగ్గుతాను. ఏమైనా ఆ చివరి కఠిన సత్యాన్ని తెలియలేకపోతాను.


గూఢార్థవివరణము: 

ఇక్కడ అన్నమాచార్యుడు మనసు యొక్క చంచలత్వాన్ని చిత్రిస్తారు. మన ఇప్పటి భక్తి, బుద్ధి, భావం — ఇవన్నీఆలోచనల కదలికలు మాత్రమే. అందుకే “వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు” అన్నారు — ఒక్క క్షణం మనసు తెలిసినట్టనిపిస్తుంది; మరుక్షణం మాయమవుతుంది. “కక్కసమైనది కడ గనరాదు” —దేవుడు కఠినుడు కాదు; కానీ మన ఊహలకు ఆలోచనలకు అందనివాడు చంచల స్వభావము మానకముందు వరకు అంటే అన్ని సందేహాలు వదలి అతనినే రక్ష అనునంత వరకు సత్యము కానరాదు.


మూడవ​ ​ చరణం:
చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు ॥హరి॥
Telugu Phrase
Meaning
చూతును నీమూర్తి సులభుఁడవనుచును
నీమూర్తిని సులభుఁడవనుచును చూతును
చూతు జగములకు సోద్యమని
ఈ కనబడు జగములకు నీవొక వింతవానిగా వుందువు.
యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి
ఇక్కడే శ్రీవేంకటేశ నన్ను కరుణించితివి.
కౌతుకమొదవెను కడ గనరాదు ॥హరి॥
(కౌతుకమొదవెను = by having much curiosity) కానీ కుతూహలము కొలది నిన్నెరుగరాదు

సూటి భావము:

నీమూర్తిని సులభుఁడవనుచును చూతును. ఈ కనబడు జగములకు నీవొక వింతవానిగా వుందువు. ఇక్కడే శ్రీవేంకటేశ నన్ను కరుణించితివి. కానీ కుతూహలము కొలది నిన్నెరుగరాదు. 


గూఢార్థవివరణము: 

చూతు జగములకు సోద్యమని కంటికి కనబడనివానిని అన్నమాచార్యుల చూశాను అని చెప్పినప్పటికి నమ్ముతారా? చోద్యమని తిరస్కరిస్తారు తప్ప​. 

కౌతుకమొదవెను కడ గనరాదు కుతూహలము కొలది  దైవమును చూద్దామనుకునే వారు కోకొల్లలు. అసలు దేవుడు అనేవాడొకడున్నాడా అనేది వారి సందేహము. ఉంటే ఒకదారి లేకుంటే ఇంకోదారి పడదామనేది వారి ఎత్తుగడ​. కానీ అతడు ఊహలకు ఆలోచనలకు అందనివాడు.  వారి సందేహము అలాగే నిలిచిపోతుంది. 


ఈ కీర్తన ముఖ్య సందేశం


అన్నమాచార్యుల బోధనం అతి ప్రాయోగికమైనది —

మనుషులను చుట్టుముట్టిన మాయ దైవము కప్పినది కాదు.

మానవులు సరిగా చూడలేకపోవుటచేత జనియించినది.


X-X-The END-X-X

No comments:

Post a Comment

277 hari hari nī māyāmahima (హరి హరి నీ మాయామహిమ)

    TALLAPAKA ANNAMACHARYULU 277 హరి హరి నీ మాయామహిమ   (hari hari n ī m ā y ā mahima)   తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి.   INTROD...