తాళ్లపాక చిన తిరుమలాచార్యులు
279 ఎంతలే దిది యెంచిన
For English version press here
తాళ్లపాక చిన తిరుమలాచార్యులు
చిన తిరుమలాచార్యుల కవిత్వం అవగాహనకు వ్యాకరణం. దానిలో తిరస్కారమూ లేదు, ఆమోదమూ లేదు — కేవలం అవగాహన. ఆయన కవితలు త్యాగానికి పిలుపు కావు; ముక్తిని కాంక్షించమని చెప్పవు. అవి మన అంతర్ముఖతను నిద్రలేపే నిశ్శబ్ద మంత్రాలు. వారి కవిత్వములో నాకు అర్ధమైనది.
ఇదే ఆయన వంశం కొనసాగించిన మార్గం — వంశపారంపర్యముగా కాదు, అవగాహనగా పునర్జన్మించిన జ్ఞానం.
చిన తిరుమలాచార్యుల వాక్యాలలో లోకానుభవం, భావనల్లో లోతు. ఆయనకు ఆకాశాన్ని తాకే రూపకాలు అవసరం లేదు — భూమిని తాకే పదాలు చాలు. ఇనుము, రాయి, నీరు, దంతం, ఇల్లు — ఇవన్నీ ఆయన కవిత్వంలో మనిషి అంతర్ముఖతకు ప్రతీకలు. భాషలో ఎటువంటి అలంకార ఆర్భాటం లేదు; కానీ ప్రతి మాటలో ఒక బంధనపు బరువు, దానిని చూసే స్పష్టత వుంది. ఆయన శైలిలో పరిహాసం సూత్రబద్ధమైనది — ఎవరిని అవమానించేది కాదు, అవగాహన మేల్కొల్పేది. ఆయన కవిత్వం ఒక ధ్వని కవిత్వం — కనిపించేదానికంటే లోపల వినిపించేది ఎక్కువ. వికారములో మునిగిన మనసుకు అద్దం ఎదురుచూపుతూ, “నీవు చూడలేదా?” అని ప్రశ్నిస్తాడు.
అన్నమాచార్యుల దగ్గరనుండి ఆయనకు వచ్చినది — నిజాయితీతో కూడిన తత్త్వదృష్టి. పెద్ద తిరుమలాచార్యుల దగ్గరనుండి ఆయనకు వచ్చినది — స్పష్టమైన ఆలోచనా నిర్మాణం. కానీ చిన తిరుమలాచార్యులు మరింత మానసిక లోతు కలవారు — వికారమనే మనసు నిర్మాణాన్ని ఆవిష్కరించారు. ఆయనకు భక్తి అంటే నియమం కాదు, స్పష్టదృష్టి. కవిత్వం అంటే నినాదం కాదు — చూపును సరిచేయు నిశ్శబ్దం.
ఉపోద్ఘాతము
విశాలమైన జ్ఞానాన్ని అతి చిన్న మాటలలో కురుచబెట్టగలిగిన ఆ సామర్థ్యమే తాళ్లపాక వంశపారంపర్యపు ప్రత్యేకత. అన్నమాచార్యులనుండి మొదలైన ఆ మాధుర్యమైన సంక్షిప్తతా కళ — పెద్ద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులలో మరింత మెరుగై వ్యక్తమవుతుంది. కొన్ని అక్షరాలలోనే అనంతాన్ని దాస్తారు.
ఈ కీర్తనలో చిన తిరుమలాచార్యులు ఒకే పాదంలో — “సంతోషించని సంసారంబు” — అనగా మానవుల అశాంతత, అలజడుల తత్త్వాన్ని, మనోవిజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను రెండు పదాల్లోకి కుదించారు. శ్రమ మరియు శాంతి మధ్యనున్న ఆగాధము పూడ్చరానిది. దాన్ని చెప్పటానికి గ్రంథాలు కూడా సరిపోవు. ఆయన దాన్ని ఒక్క వాక్యంలోనే శ్వాసింపజేస్తారు.
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 2-5
సంపుటము: 10-10
|
|
ఎంతలే దిది యెంచిన
సంతోషించని సంసారంబు ॥పల్లవి॥ యేలకొ నేఁ డీదేహి
ఆలరి భోగము లడిగీఁగాక
చాలించఁగఁ జాలఁడు
కోలుముందు హరిఁ గోలువఁగరాదా ॥ఎంత॥ యెందైనను యీమనసు పందదనంబునఁ బారీఁగాక ముందరికోరిక ముణుఁగదు కందువ శ్రీవిభుఁ గానఁగరాదా ॥ఎంత॥ విడువనితగు లీవేడుక తొడిఁబడ నెందైన దొరసీఁగాక కడగని శ్రీవెంకటనాథు బడిబడిఁ
దిరుగుచు బ్రదుకఁగరాదా ॥ఎంత॥
|
Details
and Explanations:
|
Telugu Phrase
|
Meaning
|
|
ఎంతలే
దిది యెంచిన
|
తరచి చూచిన
ఈ జీవితం
|
|
సంతోషించని
సంసారంబు
|
ఎంత శ్రమపడినా సంతృప్తిని చెందనిది ఈ సంసారము.
|
సూటి భావము:
జీవితాన్ని
తరచి చూచిన ఎంత శ్రమపడినా సంతృప్తిని చెందనిది ఈ సంసారము
గూఢార్థవివరణము:
సంతోషించని
సంసారంబు
కాలములతో సంబంధము లేకుండా, ఈ పల్లవి జీవితంలోని శాశ్వత అసంతృప్తిని తేటతెల్లం చేస్తుంది — ఎంత తీరిస్తే అంతకు మరింత ఆకలిగొ నునది ఈ సంసారము. చిన తిరుమలాచార్యుల దర్శనము నేటి కాలానికి అన్వయిస్తే మరింత పదును తెచ్చుకుంటుంది. ఈ కాలం మొత్తము “సంతోషించని సంసారంబు” కే ప్రతిరూపం — ఇవాళ మనకు అన్నీ “నిన్ననే జరిగిపోయివుండాలి” అన్న ఆత్రుత. పని, ఫలితం, సుఖం — అన్నీ వెంటనే కావాలి. కానీ ఎంత అందుకున్నా తృప్తి దొరకదు. యాభై సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు వేగము, సమర్థత, నైపుణ్యము పెరిగినా శాంతి మాత్రం కరువయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే “జీవితం స్వేదముతో చేయు ఒత్తిడి వ్యవసాయం”.
కవి
“ఎంతలే దిది యెంచిన” అన్నప్పుడు, మనను ఆగి బేరీజు వేసుకొని చూడమని
చెబుతున్నారు — భౌతిక దేహానికి మనసుకు సమతులన కొరవడుటతో మనసు ముందుకి, దేహము వెనక పడతాయి. తొందరపెట్టు గుణము మనసుది. దానికి స్వీయనియంత్రణలేదు. అందుకే కవి మాటలు ముమ్మాటికీ సత్యము. ఆ తహతహ భౌతికమైనది
కాదు; దాన్ని ఆర్పాలంటే
దాని మూలాన్ని (అంటే మనసును) తెలుసుకోవాలి. అపుడే తృప్తి అనే పదం అర్థమవుతుంది.
తృప్తి పొందుటలో కాదు; తహతహ ఆగిన చోటే మొదలవుతుంది.
|
Telugu Phrase
|
Meaning
|
|
యేలకొ నేఁ డీదేహి
|
ఈ దేహి
ఎందులకో
|
|
ఆలరి భోగము లడిగీఁగాక
|
(ఆలరి= bad, negative) ఆరాటపు భోగములు అడుగంటినదాకా
|
|
చాలించఁగఁ జాలఁడు
|
(ఆ భోగములను) చాలించలేక పోతాడు
|
|
కోలుముందు
హరిఁ గోలువఁగరాదా
|
(కోలుముందు= అన్నిటికంటె ముందు); అన్నిటికంటె ముందు
హరిని సేవించుట మేలు కాదా?
|
భావము:
దేవుడా!
ఈ మనుషులు అన్ని భోగాసక్తులు అడుగంటినదాకా అనుభవించి కాని ఆగలేక పోతారు. మానవులారా! కానీ వీటన్నిటికంటె ముందు
హరిని సేవించుట మేలు కాదా? (అడుసు తొక్కనేల? కాలు కడుగనేల? అను భావము)
గూఢార్థవివరణము:
ఐదు వందల సంవత్సరాల క్రితమే చిన తిరుమలాచార్యులు ఈనాటి మనుషుల స్థితిని చూపించారు — అసలంటూ వుంటే దైవస్మరణ చివరి ప్రయత్నం.
“ఆలరి భోగములు చాలించఁగఁ జాలఁడు” అన్న పదబంధం గమనించ తగినది — ఆరాటం కొద్ది పరిగెత్తుతాం, కానీ ఆగలేము. ఎందుకంటే వాడెవడో కారణమని చెబుతాము. మనమే కారణమని ఒప్పుకోలేము.
కవి ప్రశ్న
దైవసేవ, ఆత్మసమాధి మొదటిస్థానంలో ఉండాలి కదా? సుతిమెత్తగా, కానీ లోతుగా కొరడా దెబ్బలాంటిది.
|
Telugu Phrase
|
Meaning
|
|
యెందైనను
యీమనసు
|
ఈ మనసు ఎందులోనైనా
|
|
పందదనంబునఁ బారీఁగాక
|
(పందదనంబు= పిరికితనము) పిరికిగా
సులభమైన మార్గాన్నే ఎంచుకుంటుంది
|
|
ముందరికోరిక
ముణుఁగదు
|
అలా అని కోరికల అంతుదాకా ములిగి దాన్నీ తెలియలేదు
|
|
కందువ
శ్రీవిభుఁ గానఁగరాదా
|
దగ్గరలోనే దాగిన శ్రీవిభుని
శ్రీహరిని వెదుకరాదా?
|
సూటి భావము:
ఎప్పుడు
ఈ మనసు ధైర్యమును విడిచిపెట్టి, సులభమైన మార్గాన్నే ఎంచుకుంటుంది. అలా
అని కోరికల అంతుదాకా ములిగి దాన్నీ తెలియలేదు. (పైపైన గెంతుతున్న మనస్సు గురించి విడమర్చి
చెప్పారు). అయితే, అంతకంటె సులభమైన, దగ్గరలోనే
దాగిన శ్రీవిభుని శ్రీహరిని వెదుకరాదా?
గూఢార్థవివరణము:
“పందదనంబునఁ బారీఁగాక” — మనసు యొక్క సహజ స్వభావాన్ని కవి ఒకే పదంలో చెబుతున్నారు. ‘పందదనము’ అంటే భయం, ధైర్యహీనత. మనసు ఎప్పుడూ తక్కువ ప్రతిఘటన ఉన్న దారినే వెళ్తుంది. అది సత్యాన్ని ఎదుర్కొనడానికి భయపడుతుంది.
“ముందరికోరిక ముణుఁగదు”
— తాను కోరుకున్నదానిలో కూడా సంపూర్ణంగా మునగదు. ఎందుకంటే, కోరికలోకి లోతుగా వెళ్లినప్పుడు తానే బహిర్గతమవుతుంది. అది తన అబద్ధాలను
చూడాలి — ఆ ధైర్యం దానికి ఉండదు. పైపై తాకి మళ్లీ మరో కోరికకు మళ్లుతుంది. అలా అంతులేని
గెంతులలో దొర్లుతుంది.
తాత్త్విక దృష్టి: చిన తిరుమలాచార్యుల దృష్టిలో భక్తి అనేది తప్పించుకోవడమో త్యాగమో కాదు — తన తహతహను అంతర్భాగాన పరిశీలించుట. మనసు ధైర్యముగా లోతుగా చూసినప్పుడు — కోరికల మాయ తొలగిపోతుంది. అప్పుడు తానను తానుగా కనుగొంటుంది — అదే “కందువ శ్రీవిభుఁ గానఁగరాదా” అనే వాక్యంలో దాగి ఉన్న అర్ధం.
ఇది
అన్నమాచార్యుల వారసత్వం — ధైర్యముగా మనసును పరిశీలించుట. వారి వంశంలో కవిత్వం
చిన్నదైనా లోతు అపారము; మాటలు కొద్దైనా అర్థం సముద్రం.
|
Telugu Phrase
|
Meaning
|
|
విడువనితగు లీవేడుక |
విడువతగిన తగుళ్ళు ఈ వేడుకలు
|
|
తొడిఁబడ నెందైన దొరసీఁగాక
|
(తొడిఁబడ = తొట్రుపడు,
అటమటించు) తత్తఱమున నున్న మనసు దేనికైనా సిద్ధ
పడుతుంది
|
|
కడగని శ్రీవెంకటనాథు
|
మానవులు మనసులో దర్శించగలిగిన చిట్టచివరి వాడు శ్రీవెంకటనాథుడు.
|
|
బడిబడిఁ దిరుగుచు బ్రదుకఁగరాదా
|
(బడిబడిఁ= repeatedly) ఆయన
సన్నిధి చుట్టూ తిరుగుతూ బ్రతకడమే శ్రేయస్కరముకాదా?
|
సూటి భావము:
ఓ మనుషులారా!
మనసు తొడిఁబడలో (తికమకలో) ఉన్నప్పుడుఒకానొక ఆశ్రయమును ఆశించును. అపుడు దేనికైనా ఒడబడుతుంది. అలా ఎదో ఒక వేడుకలో ఎడతెరిపి లేకుండా తగులుకుంటుంది.
అలాంటి వేడుకలు విడువడమే శ్రేయస్కరం. అయితే
అది మనసు చేరగలిగే చిట్టచివరి సత్యాన్ని కనుగొనడనికి మాత్రం ఉపక్రమించదు— అంతర్ముఖంగా
ఆ కడనున్న వాడే శ్రీ వెంకటనాథుడు — ఆతని దివ్య
సన్నిధి చుట్టూ తిరుగుతూ జీవించడం శ్రేయస్కరముకాదా?
గూఢార్థవివరణము:
చిన్న తిరుమలాచార్యుల ఈ చరణం
మను చంచలత్వమును గుండెలోతుల్లో గుచ్చుకునేలా
చేస్తుంది. “తొడిఁబడ నెందైన దొరసీఁగాక” — అంటే “గందరగోళములో ఉన్న మనసు ఏదో ప్రాపును
లేదా అండను వాంఛిస్తుంది" — మన యుగానికీ వర్తించే అత్యంత ప్రామాణిక వాక్యం.
ఆస్కార్ వైల్డ్ గారు ఒక చోట ఇలా అన్నారు — “చాలా మంది ప్రజలు ఇతరులే. వారి ఆలోచనలన్నీ ఇతరుల అభిప్రాయాల ప్రతిధ్వనులే.” (= కొద్ది మందియే స్వంత భావాలను కలిగి వుంటారు). అంటే — ఇతరుల అభిప్రాయాలతో మనసు తానొక రూపం పొందుతుంది (లేదా ఏర్పరచుకొంటుంది), దానిలో సుఖం వెతుకుతుంది. చిన్న తిరుమలాచార్యుల వాక్యంతో దీన్ని కలిపి చదివితే — మనసు గందరగోళంలో ఉన్నప్పుడు ఏదైనా నమ్ముతుంది, దేనినైనా ఆసరాగా పట్టుకుంటుంది.
తదనుగుణంగా ఆలోచిస్తే, అలాంటి కొద్ది మందియే తమను పైశాచికత్వం ప్రేరిపించగా జత్యహంకారము, పరపీడన, అరాజకము, దౌర్జన్యం,
వర్ణవివక్షత వంటి తరంగాలు మానవ జాతి చరిత్రను రక్తంతో తడిపాయి. మూలకారణం
— మానవుడిని విడదీసే అంధ ప్రేరణ.
ఈ రోజుల్లో ఆ మనసుకు అత్యంత సులభమైన ఆసరా — వినోదం, కడుపు తృప్తి, సిగ్గులేని వినిమయ సంస్కృతి. మన ఆహార పేర్లే మన మనోవైకల్యానికి సాక్ష్యం “Death by Chocolate,” “Feast of Flames,” “Mindful Indulgence,” “Divine Crumble,” “The Velvet Sin,” “The Hungry Hen,” “Fat Bear,” “Round Boy” — ఇవి అన్నీ వ్యత్యాసాలూ కావు; ఇవే మనసు ప్రేరేపించిన భ్రమల ప్రతిరూపాలు.
ప్రచారం, అనుకరణ, భయపెట్టే సామాజిక ఒత్తిళ్లు — ఇవన్నీ మనసును గందరగోళంలో నిలిపి, దానిలోనే సుఖం వెతికేలా చేస్తాయి. ఇదే చిన్న తిరుమలాచార్యులు ఐదు శతాబ్దాల క్రితం చూపించిన వ్యాధి. “తొడిఁబడ నెందైన దొరసీఁగాక” అన్న ఒక పాదంలోనే మన ఇప్పటి మనోవైకల్యాన్ని సున్నితంగా చాటారు.
ఆ చింతనయే — మనసును లోతు త్రవ్వడానికి
భయపెడుతోంది - ప్రక్కత్రోవ పట్టిస్తుంది. “మనసు చేరగలిగే చివరి సత్యం” — దానిని
త్రవ్వే ధైర్యం మనలో ఉందా? నిశ్శబ్దానికి భయపడే మనసు,
వినోదంలో మునిగే మనసు, తన లోతుల్లోకి దిగడానికి
సిగ్గుపడే మనసు — దానికెప్పుడైనా శాంతి లభించగలదా?
“కడగని శ్రీవెంకటనాథు” అంటే — మనసు చివరి వరకు చేరగలిగిన ఆ సత్యం — దానిని తెలుసుకోవడమే ధ్యేయం. అది దొరికితే మాత్రమే శాంతి లభిస్తుంది.
లేకపోతే, మన జీవితం — చప్పగా, నిస్సారంగా, అర్ధరహితంగా — కొనసాగుతూనే ఉంటుంది.
ఈ కీర్తన
ముఖ్య సందేశం
చిన్న తిరుమలాచార్యుల బోధనం ప్రయోగార్హము—
మనసును చివరికంటా త్రవ్వే ధైర్యము తెచ్చుకో.
కానీ అది సులభమైన మార్గాన్నే ఎంచుకుంటుందని
గుర్తుంచుకో.
X-X-The
END-X-X
No comments:
Post a Comment