తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
271 అనాది జగములు అనాది దేవుఁడు
For English version press here
ఉపోద్ఘాతము
తాళ్ళపాక కవులు అసమాన్య చైతన్య స్థితిలో తమ అనుభవమునకు వచ్చిన సత్యములను పాటలుగా పాడి తరించారు. మునుపెన్నడు మానవ చరిత్రలో పేర్కొనని ఆ అపూర్వము, అచింత్యము, అసాధారణము అమోఘము అద్వితీయము అగు అవ్యక్త భావములను కీర్తనలలో పొందుపరిచి అమరులయ్యారు. అటువంటి కీర్తనలను మణుల రాశులలో ఈ కీర్తన శిఖరాగ్రము అని చెప్పుటకు సందేహము లేదు.
అన్నమాచార్యుల వంశమునకు ఉన్న మహత్తు — వారు వేదాంత గంభీరతను సాధారణ భాషలో, ప్రతివారికి సుకుమారముగా, సులభముగా, మనసుకు పట్టు రీతిలో చెప్పగలగడమే. అన్నమాచార్యులు గానీ, పెద తిరుమలాచార్యులు గానీ — ఈ సాధారణ జీవితంలోని వాడుక పదములతోనే అసాధారణ సత్యాలను తమ రచనలలో దాచారు. ఆ చిన్నిపదములు తమంతట తాము వ్యక్త పరచలేని భావములను వాటి కూర్పులో అతి లాఘవముగా నింపి, జీవమేలేని అక్షరాలకు ప్రాణం పోశారు; చిన్న అక్షరాలలో విశ్వవిశాల భావమును చొప్పించారు. అవి కేవలం భక్తి గీతాలు కాదు; అవి మానవ మానసిక పరిణామమునకు దిక్సూచికలు.
మనిషి మొదటి కర్తవ్యమూ, ప్రధాన తపనయూ — తాను ఉన్న జగత్తుని, దానికి సృష్టికర్తనూ శోధించుటయే. కానీ ఆ ప్రయత్నములోనే తడబడుతూ వుంటాడు — తన ఊహలకీ, తర్కాలకీ బానిసై. కాలమనే చింత, జ్ఞానమనే గర్వము — ఇవే మానవుని ప్రధాన శత్రువులు. ఇవి మనసును క్షణక్షణం అగ్నిలా దహించి మనిషిని ప్రక్కదోవలో నడిపిస్తాయి. క్షణములో కోటికి కోటవ వంతును కొవగలవాడు, యుగాల నిడివిని ఊహించగలవాడు; అయినా దేవుడు ఏ కొలతలోకు దొరకడని గ్రహించడు.
మనిషికి కర్మతో కూడిన ప్రయాణమూ అంతే విరోధభరితం. నిజమైన కర్మ ధర్మంలోను, ఆశలోను, నిబంధనలోను లేదు; చేయువాడూ, చేయబడునదీ — రెండూ ఒక్కటయ్యే చోట మాత్రమే అది ఉంటుంది. అది కర్మ కాదు — కర్మాతీత స్థితి. అదే తాళ్ళపాక కవుల తత్వమునకు గుండె చప్పుడు. ఆ కవులు తెలిపిన తత్వాలను అర్థం చేసుకోవడం అంటే — మానవ చరిత్రలో ఎవరూ తాకని స్థాయిలోకి అడుగుపెట్టినట్టే.
మనిషి ఈ లోకములోకి పుట్టి తల్లిదండ్రులచేత, సమాజమును చేత శిక్షణ పొంది కుటుంబ పోషకుడవుతాడు. అదే జీవితమని నమ్మి, అదే విజయమని భావించి, ఆ పరుగు పందెములో తానే మునిగిపోతాడు. దేవుని గురించి ఆలోచించటానికి సమయముండదు; కానీ రాజకీయాలు, యుద్ధాలు, బ్యాంకులు, సినిమాలు — దేవుని స్తోత్రపద్యాలు రాయటానికీ సమయముంటుంది. ఇది మనిషిలో అణవణువు కూరుకుపోయిన అనుకరణ స్వభావమునకు నిదర్శనం. ఆత్మతో సంబంధం కోల్పోయిన మనసు బయట ప్రపంచాన్నే ప్రతిబింబంగా చూస్తుంది — దానినే సత్యమని నమ్ముతుంది. తప్పుదారి పట్టిన చర్య ఎంత శ్రమించినా ఫలించదు.
ఇలాంటి స్థితిలో మనిషి శాస్త్రాలవైపు, పూజారులవైపు, సమాజపు పెద్దలవైపు చూస్తాడు. కానీ వారూ అదే వ్యవస్థలో పుట్టి పెరిగినవారు — వారు విముక్తికి దారి చూపగలరా? (లేరు). చిన్న తిరుమలాచార్యులు అన్నట్లు, “బందెపసులకు మెడ పన్నించ నేలా” — ఇప్పటికే బందెలదొడ్డిలో పశువుల్లా బంధించబడిన మనుషులకు నీ మెడను వంచనేలా? దేవుని వెతకడం తనకు అప్పగించబడిన పరమ ధర్మమని మనిషి ఎందుకు గ్రహించడు? అతడు దైనందిక జీవనపు బంధాల వల్ల, అవి రేపు ఆర్భాటముల వల్ల ధర్మ మార్గములో ప్రయాణించ లేకపోతాడు.
నిజమైన భక్తి అంటే — తనను ధర్మ మార్గము నుండి తొలగించే ప్రతీ ప్రణాళికనూ తిరస్కరించే ధైర్యం. అదే ఈ కీర్తన సందేశము “భావములోపల భక్తి యిదే.” దైవముపై భక్తి, తన అసలు స్వభావము ఒకటి కావడమే సంపూర్ణ సమర్పణ. ఆ సమర్పణ ఆ ఏకత్వములోనుంచే తెలుస్తుంది —ఇహలోకమూ, పరలోకమూ వేర్వేరు కావు — అవి ఒకటే అను సత్యము.
అధ్యాత్మ కీర్తన
|
రేకు: 19-3 సంపుటము: 15-107
|
అనాది జగములు అనాది దేవుఁడు
వినోదములు గని విసుకదు మాయ॥పల్లవి॥ పుట్టేటి జీవులు పోయిన జీవులు
వొట్టిన జీవులు వున్నారు
చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు
తెట్ట దెరువుననె తెగడు కాలము ॥అనాది॥ కలఁడు బ్రహ్మయును కల రింద్రాదులు
కల వనేకములు కార్యములు
ఫలబోగంబులు పై పై నున్నవి
కలియుఁ గర్మముఁ గడవఁగ లేదూ ॥అనాది॥ శ్రీ వేంకటేశుఁడు చిత్తములో వీఁడె
భావములోపల భక్తి యిదే
భావించి బ్రదుకుట ప్రపన్నులు వీరిదె
యేవలఁ
జూచిన యిహమే పరము ॥అనాది॥
|
Telugu Phrase
|
Meaning
|
అనాది జగములు అనాది దేవుఁడు
|
ఈ జగములు, దైవము అనాదియైనవి
|
వినోదములు
గని విసుకదు మాయ
|
భగవానుని
లీలగా (వినోదార్థముగా) పుట్టిన మాయ విసుగు చెందకుండా నడుస్తూనే వుంటుంది
|
సూటి భావము:
ఈ
జగములు, దైవము అనాదియైనవి — కాలస్మృతికి అతీతములు,
నిత్యసత్యములు. భగవానుని లీలగా పుట్టిన మాయ ఎన్నడూ అలసిపోదు;
వెలుగు–చీకట్ల ఆటలాగా అది నిరంతరం సాగుతూనే ఉంటుంది.
పెద్ద తిరుమలాచార్యులు ఈ కీర్తనలో ఒక గంభీరమైన సత్యాన్ని ప్రతిపాదిస్తున్నారు — ప్రకృతియూ, దేవుడూ ఇద్దరూ నిత్యమైనవారని. ప్రతీ ద్రవ్యమూ కాలంతో క్షీణించును. అనిత్యము. అందుకే దైవము ద్రవ్యముకాదు —— అందుకే ఆయన భౌతికంగా లేడు. ఆయన జగములకు శాశ్వత చైతన్యం. ప్రకృతి మాత్రం వర్తులమార్గములో నిరంతరం పునరావృతమవుతూ ఉంటుంది. ఆ రెంటి మర్మము కనిపించేదానిలో కాదు, కనిపించనిదానిలో — మనిషి ఎన్నాళ్ళుగానో గ్రహించలేని తత్వములో ఉన్నాయన్నదే సత్యం.
ఇక్కడ
మాయ అనేది మోసం కాదు; ఇది ఆద్యంతరహితమైన దైవలీల — సృష్టి, స్థితి, లయముల నిరంతర క్రీడ. ఇక్కడ మాయ అనేది మోసం కాదు; ఆ దైవము తనను తానే వ్యక్తముగా,
అవ్యక్తముగా ప్రదర్శించుకునే ఉల్లాస క్రీడ.
కాలక్రమములో అనేక తాత్వికులు, మునులు ఈ సృష్టి–దైవ సంబంధాన్ని వివరిచేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ తుది నిర్ణయానికి రాలేకపోయారు. దైవమనే అంశం ఎల్లప్పుడూ ఆయన లీలారంగముగా ఉంటుంది —తాను దాగి, తానే బయల్పడే వినోదం. ఇదే మాయ — సృష్టి యొక్క నిత్య నాటకం. మనిషి మాత్రం ఆ మాయను కారణాలతో, యజ్ఞాలతో, శాస్త్రాలతో, ఇప్పుడేమో శాస్త్ర విజ్ఞానంతో కూడా గెలవగలనని భ్రమలో ఉంటాడు.
కవి మెల్లగా మనకు గుర్తు చేస్తారు — మనము కాలమును గాని, ప్రకృతిని గాని, దేవుని గాని నిజముగా ఎరుగము. చుట్టూ ఉన్న ఆధారాలు ఎన్నైనా సరిపోవు. ఇక మిగిలేది ఒక్క మార్గమే — అంతర్ముఖత. కానీ అందులో మరొక విరోధం ఎదురవుతుంది. శోధకుడు,శోధించబడినది ఇద్దరూ ఒకరే. అది, ఆ సత్యము అంతర్లీనముగా గ్రహించినపుడు మాతమే “శోధన” అనే చర్యకు ముగింపు వస్తుంది.
పెద్ద తిరుమలాచార్యుల
గూఢత్వం ఇక్కడే కనబడుతుంది. ఆయన మాయను తప్పించుకోమని అనరు, కాలమునుండి పారిపోమని చెప్పరు—అవన్నీ యథార్థంగా యథాతధంగా అంగీకరించమని ఉపదేశిస్తున్నారు.
వ్యతిరేకత అంతా “నేను” అనే భావములోనే ఉంది — “తాను దైవమును కనుగొనగలను” అని గర్వించే
ఆహంకారములో. జీవితం స్పృశించు ప్రతీది దైవ
చిహ్నాలతో నిండి ఉన్నా, మనిషి వాటిని వదిలి వేరే దిశలో అన్వేషణ
చేపడతాడు — సమయం వ్యర్థం చేసుకుంటాడు.
అనాది అన్నది కాలాతీతమైన స్థితిని చూపించునది. అనగా ఆ స్థితికి కాల పరిమాణమునకు, పరిణామమునకు సంబంధము లేదు. పరిమాణము, పరిణామము రెండును కొలుచుటకు సాధనములు. ఆ కొలతలు ఆపాదించబడు తలములలో "అనాది" అన్నది లేదు.
ప్రతిచర్యకు
ఒక మొదలు ఒక చివరా ఉంటాయి. అటువంటి చర్యలు కాలమునకు
లోబడి ఉంటాయి. మనమంతా ఆ చర్యలకు లోబడి జీవిస్తాం. అనగా మన ప్రస్తుత జీవితము ఒక బాణం వంటిది. ఒక
విడిచి పెట్టఁబడిన బాణం వంటిది. అది కొంతదూరం ప్రయాణించి సమయము
తీరగా ప్రయాణం ఆపి యథాస్థితికి చేరుకుంటుంది.
అన్నమాచార్యులు వారి ఇంకొక కీర్తనలో “ఈ వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక” అన్నారు. అంటే, ఈ పుట్టుక అనే జీవితం ఒక సంపూర్ణమైన, శాశ్వతమైన ఆసరా కాదు. ఇది ఒడ కమ్ముఁ గాక – loosely arranged arrow of broken bricks — అంటే ఇటుక తుంపులనో, చెదురుమదురుగా పేర్చిన పదార్థాలనో కలిపి చేసిన బాణంలా ఉంది.
మనం ఇంతకుముందు అనేకమార్లు చెప్పుకున్నట్లు మనము మన సహజ స్థితిలో లేము. వదిలి పెట్టఁబడిన బాణం అంటే సహజస్థితి నుండి ఉద్రేక పరచబడి ఉన్నాం. అంటే సహజ స్థితిని చేరకుండా దైవము తెలియుట అసాధ్యము. భగవద్గీత వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ఇదే విషయాన్ని అంటే ఆ అస్థిరస్థితి నుంచి స్థిరముగా నిలుచు దానిని చూచువాడు ద్రష్ట అని పేర్కొన్నది.
జీవితం సంధించిన బాణం లాంటిది. అది ముందుకు సాగుతూనే వుంటుంది. బాహ్య వీక్షకుడికి అది కదులుతుంటే సమయము అన్న స్పృహ కలుగుతుంది. బాణంతో పయనించు వానికి ఆ సమయము అన్న స్పృహ వుండదు.
ఆ
బాణానికి స్థిరత లేదు, దిశ స్పష్టత లేదు, బలమూ లేదు. మనం దీన్ని ఆశ్రయించదలిస్తే — అది మనకి వక్రీకృత దారిని
చూపిస్తుంది. మనం పట్టుకున్నది జీవితం కాదు, దాని
వక్రీకృత రూపమే.
సారాంశం:
అనాదియైన
సృష్టి లీలలో మనం చిన్నచిన్న అణువుల వంటి వారము. అటువంటి కోట్లాది అణువులు కలిపితే
ఈ జగములు తయారైనవి. అణువులు కూడా పదార్థమే కాబట్టి అవి అనిత్యములు. ఈ అనిత్య జీవితాన్ని
ఎటువంటి సందేహములు, అభ్యంతరములు లేకుండా సహజంగా అంగీకరించడమే
అసలు జీవితం. అనిత్యతను అవరోధముగా కాక అనువుగా చూచినప్పుడు సుఖదుఃఖములు బాధించలేవు.
సృష్టి లీలను అలసట లేకుండా ఆమోదించుటయే “వినోదములు గని విసుకదు మాయ” అనే వాక్యానికి
అంతరార్థం. అదే శాంతి.
Telugu Phrase
|
Meaning
|
పుట్టేటి జీవులు పోయిన జీవులు
|
ఒక చక్రగతిలో జీవులు పుడుతుంటారు. పోతుంటారు.
|
వొట్టిన జీవులు వున్నారు
|
(వొట్టిన = ఏమీలేనీ, కల్తీలేని,
స్వచ్ఛమైన); అమలమగు జీవులు ఇంకా వున్నారు.
|
చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు
|
సూర్యచంద్రాదులు అలా నిరంతరంగా చుడుతూనే వుంటారు
|
తెట్ట
దెరువుననె తెగడు కాలము
|
{తెట్ట దెరువుననె = బహిరంగముగానే;
తెగడు = ఉపేక్షించు, తిరస్కరించు, నిందింౘు} బహిరంగంగానే
మానవుడు ఈ కాలములను మూర్ఖంగా ధిక్కరిస్తాడు.
|
భావము:
ఒక చక్రగతిలో జీవులు పుడుతుంటారు. పోతుంటారు. అయితే వీరిలో పవిత్రత గలిగిన జీవులు ఇంకా నిలిచి ఉన్నారు. ఎడతెగకుండా సూర్యచంద్రుల భ్రమణముతో దినములు గడుస్తాయి. బహిరంగంగానే మానవుడు ఈ కాలములను మూర్ఖంగా ధిక్కరిస్తాడు.
గూఢార్థవివరణము:
తాళ్ళపాక కవులు తత్వవేత్తలు కారు. అద్వితీయ సమాధి స్థితిలో వారు తమను స్పృశించిన విషయములను కీర్తనలుగా అందించారు. అందుకే ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క విషయం బయటపడుతుంది.
బహుశా ఇది ప్రపంచంలోనే దైవాన్ని, కాలమును జీవులను కలిపి చూచి చెప్పిన మొట్టమొదటి సూత్రీకరణ. ఇటువంటి అసలు సిసలు తాత్విక పరిశీలనలు తెలుగు జాతి గర్వించదగినవి. ఇతర తాత్వికులు దైవము, కాలము, జీవము అనుబంధాన్ని ఆలోచనాత్మకంగా ప్రతిపాదించి వుండవచ్చును. కానీ పెద్ద తిరుమలాచార్యులు దానిని ఆలోచనగా కాదు — సమాధి స్థితిలో దర్శించి చూచారు. ఆ స్థితిలో ఈ మూడు వేర్వేరు కావు; ఒకే చైతన్య తరంగం. మానవజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది.
కానీ అందుకు భిన్నంగా మనము జ్ఞాపకశక్తిపై, శిలా శాసనాలపై, వ్రాసివుంచిన శాస్త్రాలపై ఎక్కువ ఆధారపడతాము. ఇవి అన్నియు కాలముతో సన్నగిల్లి కమేణ నశించును. అందుకే పెదతిరుమలాచార్యులు "తెట్ట దెరువుననె తెగడు కాలము" అని మానవులు కాలమును అవివేకముగా వ్యర్థ పరచుకొందురని అన్నారు. ఇటువంటి విన్నూత్న ప్రకటనలు తాళ్ళపాక కీర్తనలలో కోకొల్లలు కనపడుతాయి. ఈ ఒక్క ఉదాహరణ వారి అనుభవపూర్వక అన్వేషణకు పట్టుకొమ్మ వంటిది.
ఈ సందర్భంగా ఒట్టిన జీవుల ప్రస్తావన సముచితము సమీచీనము. ఇక్కడ ఒట్టిన జీవులు అనగా జ్ఞానమే అంటే భగవంతుడు మాత్రమే ఆధారముగా జీవించు వారు. అనగా వారు ఆహారము కూడా భగవంతుని అనుజ్ఞమేరకే తీసుకొందరు. వారు వారి దేహమునపై ఎటువంటి అధికారము ప్రదర్శించరు. అంతా భగవదర్పణం చేసి మనుదురు.
ఈ చరణం వర్తమాన కాలములో వ్రాయ బడినది. అనగా ఆయా విషయములు ఎప్పటికీ వాస్తవములే.
దీనిని పల్లవితో అతి జాగ్రత్తగా అనుసంధానం చేయవలెను. పల్లవిలో దైవము జగములు పేర్కొన్నారు. దైవమునకు భౌతిక స్వరూపం లేదు జగమునకు దైవ శక్తి లేదు. ఒకదానిపై ఒకటి నిలిచి ఉన్నవి అనుకోవచ్చును.
ఇక్కడ
పేర్కొన్న ఒట్టిన జీవి దేహమును జగమునకు, ఆత్మను దైవమునకు సంబంధించినవి
అని అంచనా వేయవచ్చు. అందుకే పల్లవిలో దైవమును, జగములను రెంటిని
కలిపి చెప్పారు.
రెండవ చరణం:
Telugu Phrase
|
Meaning
|
కలఁడు
బ్రహ్మయును కల రింద్రాదులు
|
ఈ జగములో బ్రహ్మయును ఇంద్రాదులును ఉన్నారు.
|
కల వనేకములు కార్యములు
|
అనేక కార్యములు మానవుని ఆశ్రయించి ఉన్నట్లే కనిపిస్తాయి.
|
ఫలబోగంబులు పై పై నున్నవి
|
కర్మఫలాస్వాదన బాహ్యమైనది, పైపైనది మాత్రమే.
|
కలియుఁ
గర్మముఁ గడవఁగ లేదూ
|
దానిలో మునిగిపోతే సత్యానికి దారితీసే గోడను ఎప్పటికీ దాటలేరు.
|
సూటి భావము:
ఈ జగములో
బ్రహ్మయును ఇంద్రాదులును ఉన్నారు. అనేక కార్యములు
మానవుని ఆశ్రయించి ఉన్నట్లే కనిపిస్తాయి. (కానీ అవి చేయవలెనను నీయమము లేదు. మానవులు
కర్తలు కారు భగవద్గీత). ఆవి చేద్దామనుకొనుట ఫలభోగముల క్రిందనే వచ్చును. కర్మఫలాస్వాదన
బాహ్యమైనది, పైపైనది మాత్రమే. కర్మలో పాలుపంచుకొనడం వల్ల ఒనగూడు
ప్రయోజనం లేదు. దానిలో మునిగిపోతే సత్యానికి దారితీసే గోడను ఎప్పటికీ దాటలేరు.
గూఢార్థవివరణము:
“బ్రహ్మ ఇంద్రాదులు ఉన్నారంటున్నారు కదా! మాకు చూపించండి?” అని అడగవచ్చును. అయ్యాలారా, ఇవన్ని పెద తిరుమలాచార్యుల వారు అపూర్వ స్థితికి చేరుకొని వీక్షించినవి. చిల్లర మనుషులు చేరలేని స్థితి. ఈ ప్రశ్నలు ఎంతవరకు సమంజసమో మీకు మీరే నిర్ణయింతురు గాక.
ఈ జగములో బ్రహ్మను ఇంద్రాదులును దర్శించు అభిలాష కూడా కోరికయే. ఆవన్నియు ఫలభోగములుగానే జమకట్టబడును. కర్మలో పాలుపంచుకొనడం మన నరనరములలో వేళ్ళూనుకొనియున్నది. ఇది ధర్మాన్ని నమ్మకపోవడంలాంటిది — ప్రతి మనిషి తానే న్యాయస్థానం ఏర్పరచుకుని, తనకు తోచిన విధంగా శిక్షలు, ఫలితాలు నిర్ణయించుకోవడం వంటిది. ధర్మం తన పని తానే చేస్తుందని మనకు నమ్మకం కోల్పోయినపుడే ఈ దుర్బలత్వం ఉద్భవిస్తుంది.
కర్మలు
ఆశలు కోరికలకు అతీతముగా భగవంతుడే శరణాగతియని వుండలేని అపనమ్మకమే మనలోని ఇప్పటి చేతనత్వమును
నడుపు చోదక శక్తి.
మూడవ చరణం:
తెలుగు పదబంధం
|
భావము
|
శ్రీ వేంకటేశుఁడు చిత్తములో వీఁడె
|
శ్రీ వేంకటేశుఁడు అతడే అంతరంగములో వున్నాడు.
|
భావములోపల భక్తి యిదే
|
మనసులోని అంతరంగ భావమును భక్తిని ఒకే త్రాటిపై నిల్పినవారి భాగ్యము
యిదే
|
భావించి బ్రదుకుట ప్రపన్నులు వీరిదె
|
తామున్న స్థితిని విచారించక దైవ ప్రేరణతోనే బ్రతుకు మహాత్ములకు
|
యేవలఁ జూచిన యిహమే పరము
|
ఏ రకముగా చూచినా ఇహమే పరముగా తెలుసుకొనుదురు.
|
సూటి భావము:
శ్రీ వేంకటేశుఁడు అతడే అంతరంగములో వున్నాడు. అయితే అది మనసులోని అంతరంగ భావమును భక్తిని ఒకే త్రాటిపై నిల్పి గ్రహించు వారి భాగ్యము. తామున్న స్థితిని విచారించక దైవ ప్రేరణతోనే బ్రతుకు మహాత్ములు ఏ రకముగా చూచినా ఇహమే పరముగా తెలుసుకొనుదురు.
గూఢార్థవివరణము:
మనిషి ఆత్రుత అంతా తన సాపేక్ష స్థితి నుంచే పుడుతుంది. తాను ఇతరుల కంటే ముందున్నాడా, వెనకపడ్డాడా? తాను పక్కవాడి కంటే మేలా కాదా? అదే అతని మానసిక చక్రం. అందువల్ల అతడు సాపేక్షత్వములోనే జీవిస్తాడు; అనపేక్షత్వము (నిరపేక్షత) అతనికి తెలియదు. అతడు సాపేక్షమే కానీ అనపేక్షము (నిరపేక్షము) ఎరుగడు. మానవుని శోధన, తర్ఫీదు, ఆత్మవిమర్శ అన్నీ ఆ చక్రములోనే తిరుగుతూ వుంటాయి. ఆ ఉక్కుచట్రం నుంచి బయటకు రావడానికి సాహసం చేయలేడు. మానవుడు ‘తనకేమగునో’ యని భయమొందును. అద్దాని నుంచి బయటకు వచ్చు ధైర్యమే భక్తి. ఇందులో ప్రతిపాదనలు సిద్ధాంతాల వెనుక దాక్కుని ఉండేందుకు ఆస్కారం లేదు.
శ్రీ వెంకటేశ్వరుడే గురిగా జీవించువారు ద్రవ్యమునుండి, దాని తాత్విక పరిమితుల నుండి విడిపడి ప్రపన్నులుగా మారుదురు. తమ మనస్సును ఆ గురిలో నిలిపిన వానికి, తనకేమవుతుంది? తన శరీరమేమవుతుంది? అనే విచారం ఉండదు. అతడు స్వతంత్రుడు అవుతాడు. వారికి ఈ ద్రవ్య ప్రపంచముతో సంబంధం లేదు. అందుకే ఈ జగములో ఉన్నవి రెండే— దైవము మరియు ద్రవ్యము. ఇది దైవమా, లేక ద్రవ్యమా — అన్న నిర్ణయం మాత్రం మానవునిదే. అణుమాత్రపు సందేహం కూడా ద్రవ్యత్వం వైపే ఒలికిపోతుంది. నిస్సందేహ స్థితి చేరరాని గమ్యం — కానీ అదే నిజమైన అనాది అనుభవం.
ఈ కీర్తన
ముఖ్య సందేశం
X-X-The
END-X-X
భగవంతుడు సనాతనుడు. కాలాతీతుడు.
ReplyDeleteభగవంతునిచే సృష్టింపబడిన మాయ కూడా నిరంతరం సాగుతూనే ఉంటుంది.
"జాతస్య హి ధ్రువో మృత్యుః" పుట్టిన ప్రతీ జీవి గిట్టక మానద. పునరపి జననం పునరపి మరణం అన్నారు ఆదిశంకరులు. అయితే జ్ఞానులైన కొందరు మాత్రం నిర్వికల్ప సమాధిలో దైవాన్ని దర్శించుకొన్నారు. అజ్ఞానుడైన మర్త్యుడు మాత్రం కాలమును ధిక్కరిస్తున్నాడు
అంతరంగమునందే స్థితుడైయున్న భగవంతుడిని భక్తితో కొలిచి, కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సబుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ || అని గీతాచార్యుడు నుడివినట్లు వ్యవహరించేవాడే, ధ్యానమే నిజమైన కర్మగా యెరిగినవాడు యుక్తపురుషుడు.
ఉపోద్ఘాతం అద్భుతం. కీర్తనను విశ్లేషించి వివరించారు శ్రీనివాస్ గారు.
ఓమ్ తత్ సత్ 🙏🏻
కృష్ణ మోహన్