Wednesday, 24 December 2025

T-293 ఆహా యేమి చేప్పేది హరి నీమాయ

 తాళ్లపాక అన్నమాచార్యులు
293 ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
For English version press here
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము

ఉపోద్ఘాతము
ఈ కీర్తనలో అన్నమాచార్యులు
అతి సున్నితమైన, అంతే నిశితమైన విధముగా
ఎటువంటి శంకలకు తావివ్వక
సంసారవృక్షము యొక్క నైజమును తెలుపుచున్నారు.
అది భూమిలోనిది కాదు.
కాలములోనిది కాదు.
పంచభూతాలుగా పట్టుబడే వస్తువు కాదు.
అది శరీరములో చొరబడి,
అక్కడి నుండి బాహ్యవస్తువుల రూపములో అగపడుచూ
మానవుని పరీక్షించుచున్నది.
అంతరంగము – బహ్యరంగము అనే విభజనయే మాయ.
ఈ నిర్మాణాన్ని అత్యంత సూక్ష్మంగా గమనించిన అన్నమాచార్యులకు
సంజ్ఞలన్నీ మటుమాయమవగా
ఆయన స్పష్టంగా చెప్పిన మాట —
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము.”
ఉత్సాహముతోనూ,
ఆసక్తితోనూ,
అనురక్తితోనూ,
ఆతృతతోనూ,
ఆలంబనతోనూ,
గుర్తెరుగుటతోనూ,
గమనించుటతోనూ,
స్పర్శతోనూ,
స్మరణతోనూ,
విషయములను నొక్కి పట్టినా,
వదిలిపెట్టినా,
అందుకొని భోగించినా,
త్యజించి వదిలినా,
ఊహించి మనసులో తలచినా —
ఏ మార్గములో అయినా
పెరుగునది సంసారవృక్షమే.

అధ్యాత్మ​ కీర్తన
రేకు: 140-1 సంపుటము: 2-172
ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
మోహములే చిగిరించీ మొదల జవ్వనము        ॥పల్లవి॥

యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో
పొంచి వారివెంటవెంటఁ బోవదాయను
అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము         ॥ఆహా॥

దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో
కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు
ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము  ॥ఆహా॥

యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు
నిచ్చలు శ్రీవేంకటేశ నిధానము నీభక్తి
యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము              ॥ఆహా॥
Details and Explanations:
పల్లవి
ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
మోహములే చిగిరించీ మొదల జవ్వనము ॥పల్లవి॥ 
              Telugu Phrase
Meaning
ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
హరి! ఆహా నీ మాయ మా ఊహలకందనిది కదా, నేను ఇది మాయ అని ఎలా చెప్పగలను?
మోహములే చిగిరించీ మొదల జవ్వనము
(మొదల = పూర్వము నుండి) పూర్వము నుండి మోహము, యవ్వనమను పూలు చిగురించుచునే వున్నాయి కదా

భావము:
(అన్నమాచార్యులు జీవనము అను
ఒకానొక అద్యంతములు లేని సంసార వృక్షమును వర్ణించుచున్నారు.)
హరి! ఆహా నీ మాయ మా ఊహలకందనిది కదా, నేను ఇది మాయ అని ఎలా చెప్పగలను? పూర్వము నుండి మోహము, యవ్వనమను పూలు చిగురించుచునే వున్నాయి కదా

గూఢార్థవివరణము: 
మోహములే చిగిరించీ మొదల జవ్వనము
అన్నమాచార్యులు జీవనము అను
ఒకానొక అద్యంతములు లేని సంసార వృక్షమును వర్ణించుచున్నారు.
ఆ సంసార వృక్షమును పోషించునవి మొదళ్ళు.
అవిలేక అది నిరాటంకముగా పెరుగుతూ ఉండ​లేదు.
ఇక్కడ జవ్వనముతో పునరుత్పత్తి శక్తిని సుచించారు.
జవ్వనము మోహములను చిగురింపజేయును

'ఆహా'తో దాని నైజమును గుర్తించలేని మన అశక్తతను చెపుతున్నారు.

మొదటి చరణం:
యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో
పొంచి వారివెంటవెంటఁ బోవదాయను
అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము ॥ఆహా॥
Telugu Phrase
Meaning
యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో
ఎంచి చూడగా, పురాతన కాలం నుండి ఈ భూమి అదే. కానీ, దానికి రాజులు మారుతూ వున్నారు.
పొంచి వారివెంటవెంటఁ బోవదాయను
అంతేకాని, ఈ భూమి ఆ రాజుల వెంబడి పోవుట లేదు.
అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల
(గడెకుడుకల = గడియలను కూడు యంత్రము) ప్రక్కనే, రాత్రింబవళ్ళు అను  గడియలను కూడుతూ
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము
(తన ప్రవాహములో) ముంచి (పోగులు) పోసి (ప్రక్కన వేసి) కాలము తాను ముందుకు పోతుంది.

భావము:
అసలంటు ఎంచి చూస్తే, పురాతన కాలం నుండి ఈ భూమి అదే. కానీ, దానికి రాజులు మారుతూ వున్నారు. కానీ భూమి వారిని వెంబడించదు. అలాగే, రాత్రింబవళ్ళు అను మానములతో తన ప్రవాహములో సమస్తమును ముంచి, పోగులుగా ప్రక్కన వేసి, కాలము తాను ముందుకు పోతుంది.

గూఢార్థవివరణము: 
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము
ఆ సంసార వృక్షము నైజామును గుర్తించలేము.
ఈ సంసార వృక్షమునకు భౌతికంగా ఆధారం భూమి.
దాని మొదలు, కొమ్మలు కాలం.
భూమి ఆ వృక్షపు అనవాళ్ళు తెలుపదు.
కాలము దాని జాడలను తెలియనీయదు.
భూమి మీద ఆయా రాజుల జాడలు
ఎటువంటి అధారములు లేకుండా మాయమైనట్లు
కాలము జాడలతో గానీ, ఏ విధమైన బండ గుర్తులతో గానీ
ఇది ఇక్కడి నుండి మొదలైనది అని చెప్పుటకు వీలునివ్వక
తాను కప్పిన వాటినన్నిటిని
కొంత సమయం తర్వాత
ఎటువంటి ఔదార్యము చూపక పోగులుగా ప్రక్కన వేసి,
ముందుకు సాగుతుంది.

పై వివరణలతో ఆధారములను బట్టి గానీ,
కాలములో వెనుకకు వెళ్ళి కానీ దాని నైజాము తెలియలేము.

రెండవ​ చరణం:
దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో
కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు
ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము          ॥ఆహా॥
Telugu Phrase
Meaning
దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో
దేవతాలోకము ఒక్కటే.  కానీ దేవేంద్రులు మారుతుంటారు.
కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు
ఎవరూ దీనిని కైవశము చేసుకొన వీలుగాదు.
ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి
(ఆవటించు = రాబట్టు, సంగ్రహించు, సంతరించు, సమకట్టు.
పంచభూతాలనేటి శాఖలు వెళ్లి = పంచభూతాల శాఖలు ఆయా చోట్లకు చేరుకొని)

మానవునిలోని పంచభూతాల శాఖలు ఆయా చోట్లకు చేరుకొని రాబట్టు, సంగ్రహించు, సంతరించు, సమకట్టు విషయములు ఆకలింపుకు వచ్చును.
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము
(సావధానానఁ = ఉత్సాహం, ఆసక్తి, అనురక్తి, ఆతృత, ఆలంబన, గుఱుతెఱుగుటతోను, గమనించుటతోను, స్పర్శతోను, స్మరించుటతోను, ఇవికాక ఆయా విషయములను నొక్కి పట్టుటతోను, )
సావధానానఁ పెరుగును సంసారవృక్షము. (అనగా ఏమి చేసినను, అందుకొని భోగించినా, ఊహించి మనసులో తలచినా, త్యజించి వదిలినా పెరుగును ఈ సంసారవృక్షము).
సూటి భావము:
దేవతాలోక మొక్కటే. కానీ, దేవేంద్రులు మారుతూ వుంటారు. అ దేవేంద్ర సింహాసనం ఎవరికి స్వాధీనం కాదు. మానవునిలోని పంచభూతాల శాఖలు ఆయా చోట్లకు చేరుకొని రాబట్టు, సంగ్రహించు, సంతరించు, సమకట్టు విషయములు ఆకలింపుకు వచ్చును. సావధానానఁ (= ఉత్సాహం, ఆసక్తి, అనురక్తి, ఆతృత, ఆలంబన, గుఱుతెఱుగుటతోను, గమనించుటతోను, స్పర్శతోను, స్మరించుటతోను, ఇవికాక ఆయా విషయములను నొక్కి పట్టుటతోను, వదిలిపెట్టుటతోను) పెరుగును సంసారవృక్షము. (అనగా ఏమి చేసినను, అందుకొని భోగించినా, ఊహించి మనసులో తలచినా, త్యజించి వదిలినా పెరుగును ఈ సంసారవృక్షము).

అన్వయార్థం:
ఈ దేహమునకు ఎవరూ యజమానులు కారు.
పంచభూతాల శాఖలు దేహములో ప్రవేశించి
ఆవటించి అందించు ఆకలింపులు అంతే.
ఈ అనిత్యములను తెలియుట,
వానికి మూలమును చూచుట ముఖ్యం.
మూలము తెలియు వాడు తెలివి పడును.
తెలియని వాని తెలివి సంసారవృక్షము.

గూఢార్థవివరణము:
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము
ఆ సంసారవృక్షము నైజమును విశదీకరించు చున్నారు.
ఆ సంసార వృక్షము నైజామును
భూమి ఆధారముగా గానీ,
కాలమును బట్టి గానీ తెలియలేము.

దానికి ఎవరు కర్తలు కారు. యజమానులు కారు.
గమనించిన "సావధానానఁ" మనో కార్యముల మీదకు ఎక్కువ ఒరిగి వుంది.
అవి చేపట్టినా, పట్టక పోయునా ఆ వృక్షము పెరుగుతోంది.
అదే చిక్కు.

దానికి గల ఒకే వొక చికిత్స దాని మూలము వరకు దూరుట​.

భగవద్గీతలో పేర్కొన్నది ఇదే
 
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ ధృడేన ఛిత్త్వా ।। 15-3 ।।
(ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము
ఈ జగత్తులో గ్రహింపబడదు,
దాని యొక్క మొదలు, చివర, లేదా
సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు.
కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును
అనాసక్తి/వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి). 

దీనికి "‘నేను’ అను గ్రహణ విధానం" మూలము.
దానికి 'నేను’ అన్నది అధిగమించకుండా దారి లేదు
దానిని మానసిక​ మరణము సంభవించ కుండా తొలగించుట ఎట్లు?
దైవ కృపను నమ్మక ఇది సాధ్యం కాదు.
నమ్మకం లేక దైవ కృప సంభవించదు.
 ఈ మీమాంసలో పడినవారు ధైర్యం చేయలేరు.

అందుకే ఆచార్యులవారు
 "తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు"
(యెంత సేవించినాఁ దనివిలేదు అను సాకును వదలుము)
అన్నారు.
తనకు సత్యమునకు మధ్య​ అడ్డులన్నీ తొలగించువాడు ఇవి ఆలోచించడు.

కావున
"సావధానానఁ బెరిగీ సంసారవృక్షము"
ఒక ప్రతిపాదన కాదు.
కళ్ళ ముందు వున్న​ కఠిన వాస్తవం.

మూడవ​​ చరణం:
యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు
నిచ్చలు శ్రీవేంకటేశ నిధానము నీభక్తి
యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము          ॥ఆహా॥
Telugu Phrase
Meaning
యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
వారున్నవైపు అన్నమాచార్యులకు దైవము (సత్యము) మాత్రము కానవస్తున్నది. ఇంకొక వైపు అనేక మంది భక్తులు అగపడుతున్నారు
తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు
(తచ్చి = సాకు) యెంత సేవించినాఁ దనివిలేదు అను సాకును వదిలి
నిచ్చలు శ్రీవేంకటేశ నిధానము నీభక్తి
(నిచ్చలు = ఎల్లప్పుడు, నిధానము = నిక్షేపము, దాచుకొన్నది) శ్రీవేంకటేశ ఎల్లప్పుడు నీ భక్తి దాచుకొన్న నిక్షేపం వంటిది.
యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము
హెచ్చైనవాడవు శ్రీవేంకటేశ నీవు. నా జీవితం ధన్యం.
సూటి భావము:
(అన్నమాచార్యులు తనను తాను ఎఱిగి,  "సావధానానఁ బెరిగీ సంసారవృక్షము" అని ప్రజలకు అదేశమిచ్చి ఇలా అంటున్నారు) యెంత సేవించినాఁ దనివిలేదు అను సాకును వదిలితీక్షణముగా సంసారవృక్షమును తెలియు వారికి ఓ దేవా నీ వొక్కఁడవే. యిటు  (ఈ సంసారములో) నీదాసు లెందరో. ఎల్లప్పుడు నీ భక్తి దాచుకొన్న నిక్షేపం వంటిది. హెచ్చైనవాడవు శ్రీవేంకటేశ నీవు. నా జీవితం ధన్యం.

గూఢార్థవివరణము:
యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
ఏక రంధియై సత్యముకై పాకులాడువారు
తమలో తామేమి కోల్పోవుతున్నది గమనించక విడుచుదురు.
ఇక్కడ అన్నమాచార్యులకు అదే ఎదురౌతున్నది.
'నేను'ను విడిచిన వారి దేహము పరమాత్ముని మాత్రమే చూడ గలుగుతున్నది.
ఆ స్థితిలోవారికి తానెవరో తెలియదు.
దైవకృప వారి హృదయమంతా నిండినది.
వారికి శ్రీవేంకటేశు దాసులు అనేకులు స్ఫురణకువచ్చిరి.

తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు
(మిషలు, సాకులకు స్థానము  లేదు)
ఏక రంధియై కాక వేరే ఏ విధముగా ఎన్ని పాట్లు పడినను ప్రయోజనములేదు.
సాకులు చూపవద్దు. 'మాకదిలేదు, ఇదిలేదు' అను మిషలు పనిచేయవు.
 
నిచ్చలు శ్రీవేంకటేశ నిధానము నీభక్తి
అన్నమాచార్యులు అనేక సార్లు ప్రేర్కొన్న సంపదలు తనలోనే నిక్షిప్తమైవున్నవే.

యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము
. ఆచార్యుల వారు తాను ఎక్కడ వున్నది తెలుపలేకపోయినా
ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు తెలియుచున్నది

X-X-The END-X-X

1 comment:

  1. Really nice sir. poetry will always have two meanings for each of its words. One is dictionay meaning. The other one is the author's actual idea of using that particular word at that place. In fact it is a gift from the God to the chosen people to convert their life as a mission and create the literature as seen in Annamaacharya keerthanas. Your interest in these keerthanas and going in to the depths of meaning is worth to be commended Sir. Please continue and do the research like this. Link them with respect of place, time, and political situations and social conditions Sir.

    ReplyDelete

T-293 ఆహా యేమి చేప్పేది హరి నీమాయ

  తాళ్లపాక అన్నమాచార్యులు 293 ఆహా యేమి చేప్పేది హరి నీమాయ For English version press here సావధానానఁ బెరిగీ సంసారవృక్షము ఉపోద్ఘాతము ఈ కీర్...