Saturday, 9 May 2026

T-328 సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట

 తాళ్లపాక అన్నమాచార్యులు
328 సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట
For English version press here

పరిచయం

ఈ కీర్తనలో అన్నమాచార్యులు
పంట అంటే పండుట; కృషి; ఫలము అని
మరియు అవి సూచించు సమానార్థములను
కలిపి చెప్పినారు అనుకోవచ్చును.

మొదటిగానే  "సందెకాడఁ బుట్టినట్టి"
ఆ పంట సందేహాస్పదమగు చోట పుట్టినదని చెప్పారు.

అసాధారణమైనది ఎక్కడో
వేరే లోకంలో,
వేరే అనుభవంలో,
వేరే స్థితిలో
ఉందని సాధారణ అంచనా. 

కానీ, అసాధారణమైనవి అనేక విషయాలు
సామాన్యంగా కనిపించే వాటిలోనే దాగి ఉంటాయి.
రేడియం వంటి గొప్ప మూలకం కూడా 
సాధారణమైన ఖనిజంలోనే కనుగొనబడింది.
మనిషి జీవితమూ అంతే అని ప్రాజ్ఞుల ఆంతర్యము.

రైతు పంటను పెంచగలడు కానీ సృష్టించలేడు.
పెరగడానికి అడ్డుగా ఉన్న కలుపు తొలగిస్తే చాలు
పంట అదే పెరుగుతుంది.

సత్యం అనేది సమస్య కాదు.
మన చూపే "కలుపుమొక్కలు' అనే పొరలతో కప్పబడినది.
భయాలు, వలపులు, పోలికలు, అభిప్రాయాలు, ఊహలు —
ఇవన్నీ పైరులో మొలిచిన గడ్డిమొక్కల్లా మన దృష్టిని కమ్మేస్తాయి.

అసాధారణమైనది సాధారణ జీవితానికి అవతల ఉండకపోవచ్చు.
మనము “సాధారణం” అని అనుకునే జీవితం నిజంగా ఏమిటో స్పష్టంగా చూడటంలోనే అది మొదలవవచ్చు. 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 358-4 సంపుటము: 4-342
సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత -
చందమాయఁ జూడరమ్మ చందమామ పంట   ॥పల్లవి॥

మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్నుఁగొనచూపులపంట
వినువీధినెగడినవెన్నెలలపంట        ॥సందె॥

వలరాజుపంపున వలపువిత్తినపంట
చలువై పున్నమనాఁటి జాజరపంట
కలిమికామినితోడ కారుకమ్మినపంట
మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట           ॥సందె॥

విరహులగుండెలకు వెక్కసమైనపంట
పరగ చుక్కలరాసిభాగ్యముపంట
అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట
యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట   ॥సందె॥

Details and Explanations:

పల్లవి:

సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట యెంత -

చందమాయఁ జూడరమ్మ చందమామ పంట ॥పల్లవి॥

 

పదం / భాగం

అర్థం

సందెకాడఁ

సందెవేళ; పగలు కాదు, రాత్రి కాదు — మధ్యస్థ, అస్పష్ట సమయం

బుట్టినట్టి

పుట్టినట్లైన, ఆవిర్భవించిన

చాయలపంట

రంగురంగుల భావాల పంట; అనేక రూప, వర్ణ భేదాలతో కనిపించే మనుష్యుల స్థితి

యెంత

ఎంత విచిత్రమో, ఎంత విస్తారమో

చందమాయఁ

రూపు దాల్చినది, ఆకృతి పొందినది

జూడరమ్మ

చూడండి ఓ జనులారా

చందమామ పంట

చంద్రుని వెన్నెల పంట; వెన్నెలలో పండిన భావాల ప్రపంచం

 


భావము:

సందెవేళలో— పగలు, రాత్రి కాదు అన్న ఆ అస్పష్ట స్థితిలో—

ఈ రంగురంగుల భావాల పంట పుట్టింది.

 

ఓ జనులారా చూడండి ఎంతో విచిత్రమైన​—రూపు దాల్చినది

ఈ చంద్రుని వెలుగులో ప్రభవించే పంట.”


గూఢార్థవివరణము:

ఈ పల్లవిలో అన్నమాచార్యులు

చంద్రుణ్ణి వర్ణించడం లేదు.

ఆయన గమనిస్తున్నది:

అస్పష్టతలో ఆ పంట ఎలా రంగులు పులుముకుంటుందో చూపుతున్నారు.


సందెకాడఁ”

ఇది కేవలం సాయంకాలం కాదు.

ఇది:

స్పష్టత తగ్గే సమయం

రూపాలు మసకబారే స్థితి

ఊహలు పనిచేయడం మొదలయ్యే వాతావరణం

పగలు కాదు.
రాత్రి కాదు.

మధ్యలోని ఒక అనిశ్చిత స్థితి.


చాయలపంట”

ఇది అత్యంత ముఖ్యమైన పదబంధం.

 

పంట” అనగా:

కాలక్రమంలో పండినది.

 

చాయలు” అంటే కేవలం రంగులు కాదు.

ఇది:

నీడ; కాంతి; శోభ; వర్ణము; ప్రతిబింబము; రక్షణము; వరుస;

మొదలగునవి చూపుతుంది

మారే స్పందనలు

మారుచుండే అనేక స్థితులు

అనే అర్థాల్ని సూచిస్తాయి.

 

ఈ సందెవేళలో పండిన ఒక అస్పష్టమైన​ పంటలాగా కనిపిస్తున్నది.


చందమాయఁ జూడరమ్మ”

అమ్మలారా చూడండి— ​

ఆ పంట అనేక రూపులు దాల్చి

బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నది.


కేంద్ర పరిశీలన

అస్పష్టతలో—

ఆ పంట తన రంగులను పులుముకుంటుంది.


మొదటి చరణం:

మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట

నినుపై దేవతలకు నిచ్చపంట

గొనకొని హరికన్నుఁగొనచూపులపంట

వినువీధినెగడినవెన్నెలలపంట ॥సందె॥

 

పదం / భాగం

అర్థం

మునుపఁ

ఆది నుంచీ, ముందుగా

బాలవెల్లి

పాలవెల్లి, పాలసముద్రము

మొలచి పండినపంట

మొలకెత్తి పండిన పంట; ప్రారంభమై వికసించిన జీవక్రమము

నినుపై

నిండి, సంపూర్ణమై

దేవతలకు నిచ్చపంట

దేవతలకు నిత్యము లభించు పంట

గొనకొని

స్వీకరించి, పొందుకొని

హరికన్నుఁగొనచూపులపంట

హరి దృష్టిలో గమనింపబడుచున్న పంట

వినువీధి

ఆకాశ మార్గము

నెగడి

చలి కాచుకొనుటకు వేసెడి మంట

వెన్నెలలపంట

వెన్నెలవలె వ్యాపించిన పంట


భావము:

ఆదిలో ఈ పంట— పాలసముద్రములో మొలచినది.

దేవతలకు నిత్యముగా లభించునది

ఎల్లప్పుడూ పరిపూర్ణమిది.

హరి కనుసన్నలలో గమనింపబడుచూ,

ఆకాశమంత వ్యాపించి,

చలిలో వెచ్చదనమిచ్చే నెగడిలా

ఈ వెన్నెలల పంట విస్తరించి యున్నది.


గూఢార్థవివరణము:

ఈ చరణంలో “పంట” మరింత విస్తరించిన భావాన్ని సంతరించుకుంటుంది.

ఇది కేవలం పొలంలో పండే పంట కాదు.
జీవ అస్తిత్వమంతటిని ఆవరించిన
ఒక నిరంతర కదలికలా కనిపిస్తుంది.


మునుపఁ బాలవెల్లి మొలచి పండినపంట

కవి ఈ పంటకు ఆదిని (మూలమును) పాలసముద్రమును చూపుతున్నారు.

నినుపై దేవతలకు నిచ్చపంట

దేవతలకు ఇది అనునిత్యము లభించునది.

నినుపు” అనగా కొఱతలేనిది.


గొనకొని హరికన్నుఁగొనచూపులపంట

ఇక్కడ “హరి”అనగా ఇరువైపులా వ్యాపించిన వానిని

అనగా

ఈ దృశ్య ప్రపంచము

దానికి ఆవల ఉన్న దానిని

ఆవరించిన వానిగా చూడవచ్చును.

ఆతడి దృష్టిలోనే

ఈ పంట గమనింపబడుచున్నది.

అంటే:

ఈ ప్రపంచము యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లు కనిపించినా,

ఒక క్రమములోనే విస్తరించుచున్నది.


వినువీధినెగడినవెన్నెలలపంట

నెగడి” అనగా

చలిలో వెచ్చదనం కోసం వేసే మంట.

ఇక్కడ వెన్నెల కేవలం చల్లదనం కాదు.

ఆకాశమంత వ్యాపించి,

జీవితానికి వెలుగు, వెచ్చదనం ఇచ్చే సూర్యుడు

చల్లదనము, ఆహ్లాదము ఇచ్చే చంద్రుడు,

వెన్నెల,

ఆకాశం —

ఇవి అన్నీ ప్రకృతిలోని భాగాలు.

విడివిడిగా కనిపించినా

ఒకే చలనములోని అంతర్భాగాలు..


కీలక పరిశీలన

ఈ “పంట” —

పుట్టి గిట్టిపోయే దాని వంటిది కాదు.

అనాదికాలం నుంచీ పండుచూ,

వ్యాపించుచూ,

అనుభవింపబడుచూ ఉన్న క్రమము.

సృష్టి మొత్తాన్ని ఒక నిరంతర పంటగా గమనిస్తున్నారు.


వ్యాఖ్యాత టిప్పణి

 

ముందుగా క్రింది వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=W88Sact1kws

ఈ వీడియోలో తోడేళ్ళ దగ్గర నుంచి నదుల వరకు అనేక పొరలు తమ తమ స్వతంత్రతను నిలుపుకుంటూనే ఒకే క్రమములో భాగాలుగా కనిపించును. అది వాస్తవముగా పరిశోధనలలో ధృవీకరించినది.

ఇక్కడ చెప్పబడిన ఈ “పంట” కూడా మరింత విస్తృతమైన క్రమమును సూచించును.


రెండవ చరణం:

వలరాజుపంపున వలపువిత్తినపంట

చలువై పున్నమనాఁటి జాజరపంట

కలిమికామినితోడ కారుకమ్మినపంట

మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట ॥సందె॥

 

పదం / భాగం

అర్థం

వలరాజు

మన్మథుడు, ఆకర్షణకు ప్రతీక

పంపున

పంపబడిన, ఆజ్ఞాపించబడిన, ప్రవేశపెట్టబడిన

వలపువిత్తినపంట

వలపు విత్తనములు చల్లబడిన పంట

చలువై

అందముగా, ఆహ్లాదముగా

పున్నమనాఁటి

పున్నమి రాత్రివంటి సంపూర్ణత

జాజరపంట

మోహము, మాయ, స్వీయ వంచనతో కూడిన పంట

కలిమికామినితోడ

సాన్నిధ్యము, కామము, కలయికతో కూడి

కారుకమ్మినపంట

సాంద్రముగా, దట్టముగా వ్యాపించిన పంట

మలయుచుఁ

తిరుగుచు, వ్యాపించుచు, పెనగుచు, ఉద్రేకించుచు

మఱ్ఱిమానిపంట

మఱ్ఱిచెట్టువలె విస్తరించిన పంట; సనాతనముగా వ్యాపించిన జీవక్రమము



భావము:

ఈ పంట—

మన్మథుడు చల్లిన వలపు విత్తనాల

ఆకర్షణతో మొదలైనది.

పున్నమి వెన్నెలవలె

పైకి అందముగా, ఆహ్లాదముగా కనిపించినా

అందులో కపటము వంచనలు కలిసియున్నవి.

సాన్నిధ్యము, కామము, కలయికలతో

జీవమంతటిని

సాంద్రముగా వ్యాపించి—

తిరుగుచు,

పెనగుచు,

ఉద్రేకించుచు—

మఱ్ఱిచెట్టువలె విస్తరించి యున్నది.


గూఢార్థవివరణము:

మొదటి చరణంలో “పంట”

విశ్వమంత వ్యాపించిన ఒక క్రమముగా కనిపించింది.

ఈ చరణంలో అదే “పంట”

వలపు, ఆకర్షణ, మోహం, అనుబంధం రూపాలలో

తనను తాను ఎలా విస్తరించుకొని నిలుపుకుంటుందో

 ప్రత్యక్షంగా చూపుతున్నట్టు ఉంది.


వలరాజుపంపున వలపువిత్తినపంట”

ఈ పంటకు విత్తనం “వలపు”.

ఇక్కడ వలపు కేవలం ఇద్దరి మధ్య ప్రేమ కాదు.
జీవితాన్ని ముందుకు నడిపించే ఆకర్షణశక్తి.

పంపున” అన్న పదం

ఆ చలనము/కదలిక కొరకు నియోగింపబడినదన్న

అర్థములో చెప్ప బడినది


చలువై పున్నమనాఁటి జాజరపంట”

పున్నమి వెన్నెల
ఆహ్లాదమును, సంపూర్ణతను, అందాన్ని సూచిస్తుంది.

కాని కవి వెంటనే
జాజర” అన్న పదాన్ని చేర్చుతున్నారు.

అంటే:

అందం,
ఆకర్షణ,
మాధుర్యం—

ఇవి మోహముతో వేరుచేయలేనివిగా కలిసియున్నవి.


కలిమికామినితోడ కారుకమ్మినపంట”

ఈ పంట ఇప్పుడు
మరింత సాంద్రమవుతుంది.

సాన్నిధ్యం,
కామము,
అనుబంధం—

ఇవి జీవన కదలికను మరింత లోతుగా లాగుతాయి.

కారుకమ్మిన” అన్న పదం
దట్టముగా, విడదీయలేనట్లుగా వ్యాపించిన స్థితిని సూచిస్తుంది.


మలయుచుఁ దమలోనిమఱ్ఱిమానిపంట”

ఈ పంట ఇప్పుడు
ఒక మఱ్ఱిచెట్టువలె విస్తరించి కనిపిస్తుంది.

తిరుగుచు,
పెనగుచు,
వ్యాపించుచు,
ఉద్రేకించుచు—

జీవితం తనను తాను అనేక రూపాలలో కొనసాగించుకుంటున్నట్లు కనిపిస్తుంది.

ఇది పుట్టి అంతమయ్యేది కాదు.
తనను తాను విస్తరించుకొనే జీవక్రమము.


కీలక పరిశీలన

ఈ చరణంలో “పంట” —

జీవులను

ఆకర్షణ,

మోహం,

అనుబంధం,

విస్తరణ

రూపాలలో తనలోనికి లాగుకొంటూ

కొనసాగించుకొనే క్రమము.


వ్యాఖ్యాత టిప్పణి

మనము వలపు, ఆకర్షణ, మోహం, అనుబంధం

మిగిల్చిన​ కట్టడములను చూడగలము.
కాని, ఆ “పంట”లోనికి ప్రవేశించలేము.
ఆ కట్టడములు జరిగిపోయిన​ చరిత్రకు సాక్ష్యములు మాత్రమే.

మనకు తెలిసినది ఎక్కువగా భూతకాలమే.
వర్తమాన క్షణములో జరుగుచున్న ఈ “పంట”ను ప్రత్యక్షంగా గమనించుట అరుదు.

అందులోనికి ప్రవేశించుటకు
ముందు చెప్పుకున్న పొరలు, తెరలు సడలవలెను.
కాని, చాలాసార్లు ఆ పొరలు ఉన్నాయనే విషయమే మనకు స్పష్టంగా కనిపించదు.

వలపు, సాన్నిధ్యము, కామము, కలయిక, మోహము —
ఇవి మనలో ఎలా కదులుచున్నవో
నిశితముగా గమనించుటకు కావలసిన నిశ్చలత, ఆసక్తి మనకు తక్కువ.

అందువలన
ఎవరో చెప్పిన భావమును విని ఆనందించగలము గాని,
ఆ “పంట”ను ప్రత్యక్షముగా అనుభవించుట అరుదుగా జరుగుతుంది.


మూడవ చరణం:

విరహులగుండెలకు వెక్కసమైనపంట

పరగ చుక్కలరాసిభాగ్యముపంట

అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట

యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట          ॥సందె॥

పదం / భాగం

అర్థం

విరహులగుండెలకు

విరహము, ఆరాటము, లోపభావములో కదిలే హృదయములకు

వెక్కసమైనపంట

తీవ్రముగా విస్తరించు, అదుపులేక పెరుగుచు ఉండే పంట

పరగ

సముచితముగా, అనుకూలముగా, తగినరీతిగా

చుక్కలరాసి

ఆకాశమందలి అనేక చుక్కలు, నక్షత్ర సమూహము

భాగ్యముపంట

భాగ్యముగా లభించిన పంట

అరుదై

అరుదుగా, దుర్లభముగా

తూరుపుఁగొండ

తూర్పు కొండ; ఉదయ దిశను సూచించునది

నారఁగ బండినపంట

ఫలించిన, పక్వమునకు వచ్చిన పంట

యిరవై

అంతర్భాగముగా, లోనై

శ్రీవేంకటేశునింటిలోనిపంట

శ్రీవేంకటేశుని ఇంటిలోని పంట; లోపలి అనుభవముగా ఉన్న పంట


 

భావము:

ఈ పంట—

విరహముతో, ఆరాటముతో కదిలే హృదయాలలో
మరింత విస్తరించుచూ ఉంటుంది.

ఈ పంట యొక్క జీవ కదలికను గమనించినవారికి—
ఆకాశంలోని అనేక చుక్కలవలె

ఉండు భాగ్యముగా లభించునది

అయితే ఈ పంట దుర్లభమైనది.
తూర్పుకొండపై
పక్వమునకు వచ్చినది.

చివరకు—
ఇది శ్రీవేంకటేశుని ఇంటిలోనిది.
బయట చూపించగలిగేది కాదు.
లోపల అనుభవింపవలసినది


గూఢార్థవివరణము:

మొదటి చరణంలో “పంట”
విశ్వవ్యాప్తమైన క్రమముగా కనిపించింది.

రెండవ చరణంలో అదే “పంట”
వలపు, మోహం, అనుబంధం రూపాలలో
జీవితాన్ని కొనసాగించు శక్తిగా కనిపించింది.

ఈ చివరి చరణంలో—
అదే “పంట”
అరుదుగా లోపల పండే ప్రత్యక్ష అనుభవముగా కనిపిస్తుంది.


విరహులగుండెలకు వెక్కసమైనపంట”

ఇక్కడ “విరహము” అంటే.

లోపల ఏదో అసంపూర్ణతతో,
ఆరాటముతో,
వెతుకులాటతో కదిలే హృదయ స్థితి.

అటువంటి హృదయాలలో
ఈ “పంట” మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.


పరగ చుక్కలరాసిభాగ్యముపంట”

చుక్కలరాసి” అంటే

ఆ నక్షత్ర సమూహము ఈ జీవ కదలికను,

ప్రత్యక్షముగా గమనించిన అనేక ద్రష్టులకు సూచనగా కనిపిస్తుంది.

ఆకాశములో అనేక చుక్కలు ఉన్నట్లే—

ఈ “పంట”ను గమనించిన ద్రష్టులు కూడా అనేకమని కవి సూచన​.

(ఉదాహరణకు ధృవుడు).


అరుదై తూరుపుఁగొండ నారఁగ బండినపంట”

ఈ పంట అందరికీ సులభముగా లభించేది కాదు.

తూరుపు” ఇక్కడ
ఉదయము,
వెలుగు,
మేల్కొలుపు
సూచించునట్లుగా కనిపిస్తుంది.

ఆ వెలుగులోనే
ఈ పంట ఫలించినట్లు కవి చూపుతున్నారు.


యిరవై శ్రీవేంకటేశునింటిలోనిపంట”

ఇది ఈ చరణంలోని అత్యంత సూక్ష్మమైన పరిశీలన.

ఈ “పంట” బయట కనిపించేది కాదు.

ఇది:
లోపల,
అంతరంగములో,
ప్రత్యక్ష అనుభవముగా పండవలసినది.

శ్రీవేంకటేశునింటి”

ఇక్కడ ఆలయం కాదు.

శ్రీవేంకటేశుని అంతర్భాగములోని ఒక జీవసాన్నిధ్యముగా చెప్పబడింది.

అందువలన:

ఈ పంటను

ఇతరులు చూడలేరు.

విని తెలుసుకోలేరు.

ప్రతివారూ తమలో తాము గమనించవలసినదే.


కీలక పరిశీలన

ఈ చివరి చరణంలో “పంట” —

విశ్వములో వ్యాపించిన జీవక్రమము నుండి,
వ్యక్తి అంతరంగములో ప్రత్యక్షముగా పండే అనుభవముగా మారుతున్నది.


వ్యాఖ్యాత టిప్పణి

మనకై మనము ఆ “పంట”లోనికి ప్రవేశించలేము

కానీ , ఆ జీవ క్రమమును తెలియుటకు మనుజుడేమి చేయవలె?

ప్రస్తుతము మనమొక ఎత్తు నుండి "ఈ పంట" పరిశీలిస్తున్నాము.

ఆ ఎత్తు మనకు తక్కిన జీవములకు ఎడము సృష్టించుచున్నది.

ఆ ఎడమును ఎట్లు తగ్గించుట​?

మనకు ఈ సృష్టికీ మధ్య ప్రత్యక్ష సంబంధము ఎట్లు కలుగును?

ఈ సృష్టి అంతా ఎల్లలు లేక  కూడ బడినదిగా కన్పట్టును.

మనము "ఎత్తు" అను ద్వీపమునుండి  కాక బేషరతుగా ఇందులో కలవక పోతే ప్రత్యక్ష సంబంధము ఎట్లు కూడును?


X-X-X THE END  X-X-X

No comments:

Post a Comment

T-328 సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట

  తాళ్లపాక అన్నమాచార్యులు 328 సందెకాడఁ బుట్టినట్టి చాయలపంట For English version press here పరిచయం ఈ కీర్తనలో అన్నమాచార్యులు పంట అంటే పండుట ; ...