తాళ్లపాక అన్నమాచార్యులు
333 ఉన్న విచారములేల వోవో సంసారులాల
For
English Version Press Here
పరిచయం
అన్నమాచార్యులు ఈ పల్లవిలో మానవులను సంతాపములోకి
నెట్టివేస్తున్న విచారములను ప్రశ్నించుచున్నారు.
ఈ జీవనమును ఇప్పటి మాదిరి చేజిక్కించుకొనుట ఒకవైపు ఈ జీవమంతటిని
క్రమబద్ధముగా నడుపు బ్రహ్మలఁ గన్నతండ్రిఁ ఇంకొక వైపు ఉన్నట్లుగా భావించవచ్చును.
మనము సహజముగా తెలిసిన ఈ వైపుకు మొగ్గుదుము. అయినా కానీ "ఉన్న విచారములేల వోవో
సంసారులాల" అన్న దానిని తాత్వికముగా గ్రహించి సంతోషించుదుము. "యిన్నిటి
కితఁడే రక్ష" అన్నది వాస్తవముగా అంగీకరించము. కేవలము చేతులు జోడించి
"నువ్వే రక్ష" అని పలుకుదుము.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 90-1 సంపుటము - సంకీర్తన: 1-441
|
|
ఉన్న విచారములేల వోవో సంసారులాల యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో ॥ఉన్న॥ తక్కక బ్రహ్మలఁ గన్నతండ్రిఁ గొలిచి మీరు యెక్కువ సంతతిగల్గి యీడేరరో అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరు చొక్కి మీమీ దంపతులు సుఖమున నుండరో ॥ఉన్న॥ భవరోగవైద్యుని పాదములు సేవించి భువి రోగములఁ బాసి పొదలరో తవిలి పదిదిక్కులు తానైనవానిఁ గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో ॥ఉన్న॥ తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే యెల్లగాఁ బుట్టించి పెంచే యేలి కీతఁడే చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో ॥ఉన్న॥
|
Details
and Explanations:
పల్లవి:
ఉన్న విచారములేల
వోవో సంసారులాల
యిన్నిటి
కితఁడే రక్ష యిదే మీకు మనరో ॥పల్లవి॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
ఉన్న విచారములేల వోవో సంసారులాల
|
ఓ సంసారులారా! ఈ విచారములలో ఎందుకు మునిగియున్నారు?
|
ఓహో సంసారులారా! మీరు గుర్తించగలిగినవన్నీ ఇదివరకే
కూడబెట్టుకున్న విచారములు కావా? వాటిలోనే
ఎందుకు ఇరుక్కొని జీవించుచున్నారు?
|
|
యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో
|
ఈ సమస్తమునకు రక్షకుడు ఇతడే కాదా? ఒక్కసారి ఇది మన్నించి చూడండి
|
జీవితమును అటునిటు ఊగించు ఈ అంతరంగ గందరగోళముల మధ్య నిలిచే
ఆధారము ఇతడే కాదా? ఒక్కసారి నిలిచి గమనించండి అని
అన్నమాచార్యులు సూచించినట్లు కనిపించుచున్నది.
|
గూఢార్థవివరణము:
అన్నమాచార్యుల
కీర్తన పైకి సంసారులకిచ్చు ఓదార్పులా కనబడుతున్నా పాత పద్ధతులు, అలవాట్లు, అభిప్రాయములు వదలకుండా క్రొత్తదానికి
మార్గము లేదన్న విషయాన్ని గుప్పించారు. మనము ఊహించుకొని పట్టుకున్న ఆధారములను
వదలిన కానీ అసలు ఆధారము కానరాదని సూచన కాబోలు.
రక్షణ
అంటూ వేరేదేమీ లేదని ఉన్నది ఈతడే నని ఎత్తి చెబుతున్నారు.
మొదటి చరణం:
తక్కక బ్రహ్మలఁ
గన్నతండ్రిఁ గొలిచి మీరు
యెక్కువ
సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణులఁ
దలఁచి మీరు
చొక్కి మీమీ
దంపతులు సుఖమున నుండరో ॥ఉన్న॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
తక్కక బ్రహ్మలఁ గన్నతండ్రిఁ గొలిచి మీరు
|
అనేక బ్రహ్మలకు తండ్రియైన పరమాత్మను సేవించండి
|
అవశ్యముగా అనేక బ్రహ్మలకు మూలమైన వానిని కనుగొను యత్నములో
ఉండండి.
|
|
యెక్కువ సంతతిగల్గి యీడేరరో
|
మీరు మంచి సంతానముతో అభివృద్ధి పొందుదురు
|
ఆ విరివియైన (దేనికీ లోటులేని) దానిని పొంది జీవితం సాఫల్యం చేసుకోండి
|
|
అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరు
|
లక్ష్మీనారాయణులను హృదయములో తలచండి
|
హృదయములో ఉన్న లక్ష్మీనారాయణులను స్పృశించండి
|
|
చొక్కి మీమీ దంపతులు సుఖమున నుండరో
|
మీరు దంపతులుగా సుఖముగా జీవించండి
|
ఆ పరవశములో మీమీ దంపతులు సుఖమున నుండరో
|
గూఢార్థవివరణము:
ఇక్కడ
"యెక్కువ సంతతిగల్గి యీడేరరో" అనగా ఆ విరివియైన (దేనికీ లోటులేని)
దానిని తెలియుట ముఖ్యమని సూచన. అలాగే "అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి
మీరు" హృదయములో ఉన్న లక్ష్మీనారాయణులను స్పృశించండి అని ఆదేశము కావచ్చును.
మొత్తంమీద
ఈ చరణంలో మనమున్న ఈ పరిమిత తలపుల స్థితి కంటే అనంతమగు మరియొకటి ఉన్నదని దానిని
తెలియుడని చెప్పినట్లు భావించవచ్చును.
రెండవ చరణం:
భవరోగవైద్యుని
పాదములు సేవించి
భువి రోగములఁ
బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు
తానైనవానిఁ
గవిసి పొగడి
దిక్కు గలిగి బ్రదుకరో ॥ఉన్న॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
భవరోగవైద్యుని పాదములు సేవించి
|
(భవ =జీవనము) ఈ జీవనములో సంభవించు రోగములను పోగొట్టు వైద్యుని పాదములు సేవించి
|
(భవ =పుట్టుక, ఉనికి) పుట్టుకతో వచ్చిన రోగములను నయము చేయు
వైద్యుని పాదములు సేవించి
|
|
భువి రోగములఁ బాసి పొదలరో
|
ఈ లోకములోని రోగములు తొలగి అభివృద్ధి పొందుదురు
|
అంతరంగములోని భారములు క్రమేపి తగ్గి జీవితం తేలికపడును.
|
|
తవిలి పదిదిక్కులు తానైనవానిఁ
|
ఎన్నో దిక్కులుగా వ్యాపించి ఉన్న వానిని
|
సమస్తమును ఏకము చేయుచూ అన్ని వైపులు తానే అయినవానిని.
|
|
గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో
|
(గవిసి = చొక్కా; కప్చా) అతనిని అండను అతడే దిక్కు అని జీవించండి
|
అతడి నామమను వస్త్రమును ధరించి అతడే దిక్కు అని జీవించండి
|
గూఢార్థవివరణము:
ఈ
చరణంలో మొదటి రెండు పంక్తులు "భవరోగవైద్యుని సేవించి" "భువి
రోగములఁ బాసి" అతి సున్నితమైన వానిని చూపుతున్నవి. పుట్టుకతో వచ్చిన రోగము
పోవునో పోదో తెలియదు. భువి రోగములఁను మాత్రము బాసి ఉండవచ్చును. మంచి మాటలు
చెబుతూనే సున్నితంగా హెచ్చరిక కూడా ఉన్నది.
ఎన్నో
దిక్కులుగా వ్యాపించి ఉన్న వానిని = "అనంతము"ను కళ్ళతో చూచుట సాధ్యము
కాదు. మన చూపులన్నీ పరిమితమే. లోన చూచుటకు "ఉన్న విచారములు"
అలుముకుంటున్నాయి. కావున "భువి రోగములఁ" తెచ్చి పెట్టుకున్నవని కవి
అభిప్రాయమై ఉండవచ్చును.
మూడవ చరణం:
తల్లిదండ్రీ
నీతఁడే తగఁ జుట్ట మీతఁడే
యెల్లగాఁ
బుట్టించి పెంచే యేలి కీతఁడే
చల్లగా శ్రీవేంకటేశు
శరణంటి మిదె మేము
కొల్లగా
మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో ॥ఉన్న॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే
|
మీకు తల్లిదండ్రులూ, బంధువులూ ఇతడే
|
జీవితం ఆధారపడుచున్న మూలము ఒక్కటేనని గ్రహించండి. ఈ
ప్రపంచములో సంబంధం కలుపుకోగలిగనది
ఇతడొక్కడే.
|
|
యెల్లగాఁ బుట్టించి పెంచే యేలి కీతఁడే
|
సమస్తమును పుట్టించి పెంచువాడు ఇతడే
|
అదియే ఎల్లగా ఇటువైపు ఈ జీవన ప్రవాహమంతటికీ నియంత్రణ కర్త
కూడా ఇతడే.
|
|
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము
|
చల్లగాచూచు శ్రీవేంకటేశుని మేము శరణు అంటిమి ఇదే
|
(చల్లగా = సులభముగా) అంతరంగమున
సులభ సాధ్యమైన శ్రీవేంకటేశుని మేము శరణు అంటిమి ఇదే
|
|
కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో
|
(కొల్లగా = నిండుగా, గుఱి = నమ్మకం, విశ్వాసం) పూర్తిగా మీరు అందరూ
మామీద నమ్మకముంచి వర్ధిల్లండి
|
(గుఱి = దృష్టాంతము, నిశ్చయత) పూర్తిగా మీరందరు మా దృష్టాంతమును తెలిసి వర్ధిల్లండి.
|
గూఢార్థవివరణము:
“ఇక్కడ ‘యెల్లగాఁ’ అనగా దైవముతో సంబంధం ఒక వైపు, దానికి
సరిహద్దును సూచించుతూ సాధారణ జీవన చక్రము ఇంకొక వైపు అన్నట్లు అన్నమాచార్యులు
అత్యంత సూక్ష్మముగా సూచించినట్లున్నది.
“కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో”: ఇది
ఆత్మ విశ్వాసము కాదు. వారిని అనుసరించమని ఆజ్ఞా కాదు. వారు చెప్పినదానిలో పూర్తిగా
నిశ్చయము చేయగలిగిన దాన్ని వదలివేయుచు వర్ధిల్లమని కవి విన్నవింపు.
"చల్లగా
శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము" అంతరంగమున
సులభ సాధ్యమైన శ్రీవేంకటేశుని మేము శరణు అంటిమి ఇదే. తక్కిన మార్గములు మరింత
కఠినమని కాబోలు.
X-X-X THE
END X-X-X
No comments:
Post a Comment