Sunday, 17 May 2026

T-331 కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ

 తాళ్లపాక అన్నమాచార్యులు
331 కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ

పరిచయం

ఈ కీర్తనలో తాళ్లపాక అన్నమాచార్యులు
శృంగారమును, తత్వమును
ఒకే ప్రవాహముగా నడిపించిన
అపూర్వ కవిత్వ నైపుణ్యము కనిపించును.

మొదట ఈ కీర్తన
గోవిందరాజు ఇద్దరు దేవేరులతో
సరసముగా నడుచుకొనుచున్న చమత్కార వర్ణనగా కనిపించును.
కానీ ప్రతీ ఉపమానములోను
ఇంకొక లోతైన ఆంతర్యము దాగియున్నది.

సూదిమొన​, కావడి, బండి చక్రములు, పెండ్లికొడుకు వంటి
అతి సాధారణ జీవన దృశ్యముల ద్వారానే
అన్నమాచార్యులు
రెండు వైపులను సమముగా మోయు
జీవిత కదలికలను సూచిస్తున్నారు.

“కొత్తలు” అనే పదమే ఈ కీర్తనకు మూలస్వరూపము.
ప్రపంచమంతయు
క్షణక్షణమూ కొత్తదనముతో విప్పారుచుండగా
మనిషి మాత్రం తెలిసిన దానిలోనే నిలువ బోవును.
కాని గోవిందరాజు
ఆ కొత్తదనమునే భోగించుచున్నవాడై కనిపించును.

ఈ కీర్తనలో
శృంగారము సరసముగా భాసించుచుండగానే
దాని వెనుక
తెలిసినది - తెలియనిది,
ఇహము - పరము,
సంబంధము - సమత్వము
అన్నీ ఒకే కదలికగా తొంగిచూచును.

ఇదే అన్నమాచార్యుల కవిత్వ మహిమ.

శృంగార​​​ సంకీర్తన
రాగి రేకు: 131-3  సంపుటము - సంకీర్తన: 7-183
కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ
పొత్తుల మగఁడవై భోగించే విపుడు      ॥పల్లవి॥

పాదము లిద్దరి మీఁదఁ బంచివేసి చాఁచుకొని
సోదించి నీవిరుమొన సూదివైతివి
సాదించి యిద్దరు చేతి సన్నల నిన్నునొత్తఁగా
దాదాత వలపు దూఁచే తాసు వలెనైతివి            ॥కొత్త॥

కన్ను సన్నల నిద్దరి కళలు రేఁచి రేఁచి
వన్నెసరసముల కావడివైతివి
అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి
పన్ని రెండు చక్రముల బండివైతివి   ॥కొత్త॥

అండనె శ్రీ వేంకటేశ అదె గోవిందరాజవై
చండిదీర సిరికి భూసతికి నీవు
రెండు చేతుల యిద్దరికిఁ గాఁగిలిచ్చియిచ్చి
కొండుక జమళి పెండ్లి కొడుకవునైతివి ॥కొత్త॥
Details and Explanations:
పల్లవి:
కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ
పొత్తుల మగఁడవై భోగించే విపుడు ॥పల్లవి॥
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ
ఓ గోవిందరాజా! నీ సరసములు ఎప్పటికప్పుడు కొత్తవిగా కనిపించి ఆకర్షించుచున్నవి..
ఓ గోవిందరాజా! నీ వైభవముతో ఈ జగత్తంతయు క్షణక్షణమూ అంతులేని కొత్తదనముతో విప్పారుతున్నది.
పొత్తుల మగఁడవై భోగించే విపుడు
(పొత్తు = ఐకమత్యము, ఉమ్మడి, అవిభక్తత)

ఓ స్వామీ! ఇద్దరు దేవేరులతో సమముగా పొత్తులుంచుకొని వారిపైవాడివై భోగించే విపుడు.

ఓ స్వామీ! నీవు లోకాలకు ఉమ్మడివాడవై వారిపైఅధిపతివై సహజంగా భోగించేవు. ఏది మాకు కనుపించక నిశ్చితానిశ్చితములలో వెరగొంది కొట్టుమిట్టాడుచున్నామో, అదియే నీకు భోగమైనది.
గూఢార్థవివరణము:
“కొత్తలు” అనే పదముతో "ఈ జగత్తులో పుట్టే ప్రతి జీవి, ప్రతి మొలక, ప్రతి అనుభవము ఇప్పటివరకు కనిపించని కొత్తదనముతో, తాజాదనముతో, నవీనతను తొలుకుతు ఆవిర్భవించుచున్నది" సూచించారు.
 
“చేఁతలు” అనగా ఎవరి ఊహలకు పూర్తిగా చిక్కక, క్రమబద్ధమైనను మానవుల ఉజ్జాయింపులకు అందని క్రమమునకు లోబడి, అనూహ్యముగా విప్పారుచుండే  కార్యములు.
 
“పొత్తుల మగఁడవై” అనే ప్రయోగము తెలిసినది - తెలియనిది, ఇహము - పరము, రెండు వైపులను కలిపి అచింత్యముగా మోయు స్థితిని సూచించుచున్నది.
 
మనకు ఈ జీవితం అనిశ్చితి, మార్పు, కలతల సమాహారముగా కనిపించును. కాని గోవిందరాజు మాత్రం ఆ కొత్తదనమునే భోగించుచున్నవాడై కనిపించును.Bottom of Form

Bottom of Form


మొదటి చరణం:
పాదము లిద్దరి మీఁదఁ బంచివేసి చాఁచుకొని
సోదించి నీవిరుమొన సూదివైతివి
సాదించి యిద్దరు చేతి సన్నల నిన్నునొత్తఁగా
దాదాత వలపు దూఁచే తాసు వలెనైతివి ॥కొత్త॥
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
పాదము లిద్దరి మీఁదఁ బంచివేసి చాఁచుకొని
ఓ స్వామీ! ఇద్దరు దేవేరులపై సమముగా పాదములు చాచి వారిని సముచితముగా ఆదరిస్తున్నావు.
ఓ స్వామీ! లోకములకు ఇరు వైపులా సమముగా నిలిచినవాడవై కనిపించుచున్నావు. 
సోదించి నీవిరుమొన సూదివైతివి
జాగ్రత్తగా చూచినచో ఇరువైపులను కలుపు  సూదిమొన లాంటి శీర్షముగా నీవు ఉండగా  వారిరువురు సమ్మోహితులై నీవు తమవైపే పూర్తిగా ఉండవలెనని కోరుచున్నారు.     
రెండు వైపులను కలుపు పర్వతశిఖరము వలె పైకి పోగా పోగా సూదిమొనవలె కనబడు చేరరాని ఎత్తులో అత్యంత సూక్ష్మరూపమై ఉన్నావు. ఆ స్థితిలో నీవు కనపడినను చిక్కించుకోలేని స్థితి.
సాదించి యిద్దరు చేతి సన్నల నిన్నునొత్తఁగా
ఇద్దరు దేవేరులూ తమ సంకేతములతో నిన్ను తమవైపుకు లాగుచున్నారు.
రెండు వైపులా జీవులూ తమ తమ ఆశల, జీవితము కొనసాగింపులకై ఆరాటములతో నిన్ను ఒత్తిడి చేయుచున్నట్లు కనిపించుచున్నది.
దాదాత వలపు దూఁచే తాసు వలెనైతివి
(దాదాత =గట్టిగాఇంచుమించుగా) ఓ స్వామీ! నీవు ఆ ఇద్దరి ప్రేమలను తూచుచూ సమముగా మెలుగుచున్న త్రాసువలె కనిపించుచున్నావు.
ఓ స్వామీ! రెండు వైపులను సమముగా మోయుచూ సమతుల్యముగా నిలుపుచున్నావు. కవి నిన్ను చూచి సానుభూతితో చిరునవ్వు నవ్వుచున్నట్లు అనిపించును.

గూఢార్థవివరణము:
 
పాదము లిద్దరి మీఁదఁ బంచివేసి చాఁచుకొని” అనే ప్రయోగములో అన్నమాచార్యులు గోవిందరాజును లోకములలో రెండువైపులా సమముగా విస్తరించి ఉన్నవాడిగా చూపుచున్నారు.
 
మొన సూదివైతివి” అనే ఉపమానము అత్యంత సూక్ష్మమైన సంగమస్థితిని సూచించుచున్నది. సూదిమొన ఎంత సూక్ష్మమో అంత​, తెలిసిన (ఈవల) – తెలియని (ఆవల) లోకములు కలిసే అంచు. మన ఊహలకు అందనిదై కనిపించుచున్నది.

తాసు వలెనైతివి” అనే ఉపమానములో కవి గోవిందరాజును రెండు వైపుల ప్రేమలను, ఆరాటములను, కొనసాగింపులను సమముగా మోయుచున్న త్రాసువలె దర్శించుచున్నారు.
 
ఈ చరణమంతయు శృంగార రసముతో తొణుకుచుండగానే దాని వెనుక జీవితపు సమతుల్యత, కొనసాగింపు, రెండు వైపుల పరస్పర​ కదలిక నిశ్శబ్దముగా తొంగిచూచుచున్నవి.

రెండవ చరణం:
కన్ను సన్నల నిద్దరి కళలు రేఁచి రేఁచి
వన్నెసరసముల కావడివైతివి
అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి
పన్ని రెండు చక్రముల బండివైతివి ॥కొత్త॥
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
కన్ను సన్నల నిద్దరి కళలు రేఁచి రేఁచి
నీ కనుసన్నలలో ఇద్దరు దేవేరులూ తమ తమ శృంగార కళలను ప్రదర్శించి నిన్ను రంజింపజేయుచు తమవైపు త్రిప్పుకొనుచున్నారు.
నీ కనుసన్నలలో లోకాలలోని జీవులు తమ తమ కార్యములలో ఉత్సాహముతో లీనమై సృష్టిని ఎగదోయుచున్నారు.
వన్నెసరసముల కావడివైతివి
ఓ స్వామీ! దొరసానులిద్దరి సరసములను సమముగా మోయు రంగుల కావడివలె కనిపించుచున్నావు.
ఓ దేవా! నీవు రంగుల కావడిలో లోకములను ఇరువైపులా సమముగా ఉంచి మోయుచున్నట్లు కనిపించుచున్నావు. లోకములను మోయు ఆ కావడి ఎంత నిడివైనదో!
అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి
(ఆపె = స్త్రీ; సెలవు = విరామము (ఒకదానికి విరామము అన్న అర్థములో తీసుకొనవలెను)

ఒక దేవేరితో ఉన్నపుడు మరియొకరిని విరామములో పెట్టి సరసముగా నవ్వించుచున్నావు.
ఈవల - ఆవల అను స్థితుల మధ్య జీవులను తెలియకుండనే, విరామము లేక మార్చుచూ జీవక్రమమును నడిపించుచున్నట్లుగా కనిపించుచున్నది.
పన్ని రెండు చక్రముల బండివైతివి
(పన్ని = ఎత్తుగడ, నేర్పు) ఓ స్వామీ! నీ ఎత్తుగడ ఏమో తెలియుటలేదు. సామ్రాజ్ఞులిద్దరిని సంతోషపరచుచూ నీవేలో బండివై భోగించుచున్నావు..
ఓ సామీ! నీ నేర్పు మాకు తెలియుటలేదు. లోకములను బండి చక్రముల వలె  త్రిప్పుచున్నావు. పగలు రాత్రి యను చక్రములకు నీవు ఇరుసువై నడిపించుచున్నావు.
గూఢార్థవివరణము:
 
కన్ను సన్నల” అనగా గోవిందరాజు కనుసన్నలలోనే ఈ సరస క్రీడలన్నియు జరుగుచున్నట్లుగా కవి సూచించుచున్నారు. తమ తమ కళలను ప్రదర్శించుటలో జీవులు నిమగ్నులై తమ చర్యలకే ఆకర్షింపబడి అందులోనే మునిగిపోవుచున్నారు.
 
వన్నెసరసముల కావడివైతివి” అనే ఉపమానములో అన్నమాచార్యులు గోవిందరాజును కావడి మోయువాని వలె దర్శించుచున్నారు. రెండు వైపుల తూకము సమముగా లేనిచో కావడి మోయుట కష్ట సాధ్యము.
 
అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి”: సెలవు = ఒకదానికి విరామము. “అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి” అనగా 'ఒకదానికి విరామము రెండవది ఆరంభం'. ఇంకా దీనికి వ్యతిరేకము 'రెండవదానికి విరామము, మొదటిదానికి ఆరంభం' కూడా సంభవం అన్న అర్థములో తీసుకొనవలెను. జీవక్రమము నిరంతరముగా మారుచున్నను జీవులు దానిని పూర్తిగా గ్రహింపకుండానే తమ తమ అనుభవములలో నిమగ్నులై యుండుచున్నారు.
 
రెండు చక్రముల బండి” అనే ఉపమానము నిరంతర కదలికను సూచించుచున్నది. 'పగలు - రాత్రి', 'తెలిసినది - తెలియనిది', 'ఇహము - పరము' అన్నియు ఆ కదలికలో భాగములై కనిపించుచున్నవి.
 
ఈ చరణమంతయు శృంగారము సరసము హాస్యముతో  వెల్లివిరియుచుండగా దాని వెనుక జీవిత ప్రవాహము, సమతుల్యత, మార్పు, అనూహ్య క్రమము నిశ్శబ్దముగా స్పర్శించుచున్నవి.

మూడవ చరణం:
అండనె శ్రీ వేంకటేశ అదె గోవిందరాజవై
చండిదీర సిరికి భూసతికి నీవు
రెండు చేతుల యిద్దరికిఁ గాఁగిలిచ్చియిచ్చి
కొండుక జమళి పెండ్లి కొడుకవునైతివి ॥కొత్త॥
భావము:
కీర్తన పాదము
శృంగార భావము
తత్వ భావము
అండనె శ్రీ వేంకటేశ అదె గోవిందరాజవై
శ్రీ వేంకటేశా! గోవిందరాజ స్వరూపమున నీ రాణుల ప్రక్కనే అండగా నిలిచినవాడవై కనిపించుచున్నావు.
శ్రీ వేంకటేశా! గోవిందరాజ స్వరూపమున ప్రజలకు అండగా, చేరువగా నిలిచినవాడవై కనిపించుచున్నావు.
చండిదీర సిరికి భూసతికి నీవు
(చండిదీర = కోపముతీర​, అలుకలు తీర​)
ఓ స్వామీ! శ్రీదేవి, భూదేవి యిరువురినీ సమముగా ఆదరించి వారి అలకలు తీర్చుచున్నావు.
ఆ దేవదేవునికి కూడా మానవుని సౌభాగ్యమే!          
ఓ స్వామీ!  ఈ ఇహ లోకమును, పర లోకమును సమముగా చూచి తుల్యతతో నిలుపుచున్నావు. ఇది మానవుల సౌభాగ్యము!
రెండు చేతుల యిద్దరికిఁ గాఁగిలిచ్చియిచ్చి
ఓ దేవా! ఇద్దరు దేవేరులనూ రెండు చేతులతో సమముగా కౌగిలించుకొని జీవమంతటిని రసవంతముగా చేయుచున్నావు.             
ఓ దేవా! నీవు రెండు వైపులను సహజముగా ఒకే ఆలింగనములో మోయుచున్నట్లు కనిపించుచున్నది. నీ గాఢ పరిష్వంగములో ఈ జీవములలో చలనములు బుట్టినవి.
కొండుక జమళి పెండ్లి కొడుకవునైతివి
(కొండుక = ఎల్లప్పుడు యౌవనముతో; జమళి = జంట) ఓ స్వామీ! ఎల్లప్పుడు యౌవనోత్సాహముతో ఇద్దరు దేవేరులకు మనోహరముగా నిత్య పెండ్లికొడుకువలె కనిపించుచున్నావు.
ఓ స్వామీ! నీవు ఎల్లప్పుడు నూతనోత్సాహముతో లోకాల యిరువైపుల జీవులకు ఆకర్షణీయముగా నిత్యకల్యాణ వైభవముతో వెలుగుచూ కనిపించుచున్నావు.


గూఢార్థవివరణము:
 
అండనె శ్రీ వేంకటేశ” అని దైవమును ఈ లోకములోనే నిలిచిన జీవసాన్నిధ్యముగా సూచించుచున్నారు.
 
కొండుక జమళి పెండ్లి కొడుకవునైతివి” అనగా ఎప్పటికప్పుడు కొత్తదనముతో, యౌవనోత్సాహముతో జీవితమును నడిపించు శక్తిగా వర్ణించారు.

సమీక్ష​
పై కీర్తనలో
పాదము లిద్దరి మీఁదఁ బంచివేసి చాఁచుకొని
సోదించి నీవిరుమొన సూదివైతివి
సాదించి యిద్దరు చేతి సన్నల నిన్నునొత్తఁగా
దాదాత వలపు దూఁచే తాసు వలెనైతివి

వన్నెసరసముల కావడివైతివి
అన్నిటా సెలవుల నవ్వాపెకు నీపెకు నిచ్చి
పన్ని రెండు చక్రముల బండివైతివి

చండిదీర సిరికి భూసతికి నీవు
రెండు చేతుల యిద్దరికిఁ గాఁగిలిచ్చియిచ్చి
అనునవి సమత్వము యొక్క ప్రాముఖ్యతను చాటుతున్నవి

X-X-X THE END X-X-X

No comments:

Post a Comment

T-331 కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ

  తాళ్లపాక అన్నమాచార్యులు 331 కొత్తలు నీ చేఁతలు గోవిందరాజ For English Version Press Here పరిచయం ఈ కీర్తనలో తాళ్లపాక అన్నమాచార్యులు శృంగారమున...