తాళ్లపాక అన్నమాచార్యులు
330 భగవద్విభవపు ప్రత్యక్షం బిది
పరిచయం
మానవుని ఆరాటము
దైవమును, సత్యమును తెలియుట.
పురాణముల నుండి ఈనాటి సినిమాల వరకు చూచినచో,
ప్రతినాయకుడు అన్నివిధముల సమర్థుడై యుండును.
ఏదో ఒక చిన్న బలహీనత తప్ప.
ఆ బలహీనతే అతడిని తప్పుదోవ పట్టించును.
ప్రతినాయకుని ఆ బలహీనత వంటిదే
మానవుని జీవితమని ఈ కీర్తన సూచించునట్లు కనిపించును.
ఈ కీర్తనలో పేర్కొన్న “దైవికము”
దైవ సంకల్పముతో జరుగుచున్న చర్యలు.
జననము, మరణము, తహతహలు,
వానలు, మొలకలు,
శరీర పోషణకు ఆరాటము —
ఇవన్నియు మన కళ్ల ముందే జరుగుచున్నవి.
“దైవికము” అనగా
ఇవి మన ఆధీనములో లేవని కవి గమనింపజేస్తున్నారు.
ఇవన్నియు చూచుచూ, వినుచూ, అనుభవించుచూ ఉన్నప్పటికీ,
మనిషి తన ఊహలు, గర్వము, తెలిసిన
భావనలలోనే చిక్కుకొని
ప్రత్యక్ష జీవ వైభవమును కోల్పోతున్నాడని ఈ కీర్తన సూచిస్తుంది.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 278-2 సంపుటము - సంకీర్తన: 3-448
|
|
భగవద్విభవపు ప్రత్యక్షం బిది జిగి నిందొకటియుఁ జేయఁగఁ గలమా ॥పల్లవి॥ దైవికమెపో తతియగు వానలు తావగు మొలకలు దైవికమే కావిరినివెల్లాఁ గంటా వింటా దైవమునేలో తలఁచము మనము ॥భగ॥ జననమరణములు హరి దైవికమే తనుపోషణములు దైవికమే యెనసి యివెల్లా నెఱిఁగియు మరిగియు కొన దైవమునేలో కొలువము మనము ॥భగ॥ యిహపరంబులును యివి దైవికమే తహతహ లుడుపఁగ దైవికమే అహిపతి శ్రీవేంకటాధిపు కృపచే మహిమ గంటిమిఁక మఱవము మనము ॥భగ॥
|
Details
and Explanations:
పల్లవి:
భగవద్విభవపు
ప్రత్యక్షం బిది
జిగి నిందొకటియుఁ జేయఁగఁ గలమా ॥పల్లవి॥
|
పదం / భాగం
|
అర్థం
|
|
భగవద్విభవపు
|
భగవంతుని వైభవమునకు చెందిన
|
|
ప్రత్యక్షం బిది
|
ప్రత్యక్షముగా కనిపించునది ఇదియే, ఇదే
|
|
జిగి నిందొకటియుఁ
|
అహంకారముతో, గర్వముతో,
స్వప్రయత్న భావముతో ఇందులో ఒక్కటైనను
|
|
జేయఁగఁ గలమా
|
చేయగలమా? సాధించగలమా?
|
భావము:
ఈ
జగత్తంతయు
భగవంతుని
వైభవమునకు ప్రత్యక్ష రూపముగా కనిపిస్తున్నది.
ఈ
విస్తార విశ్వములో ఒక్కటైనను చేయగల శక్తి మనకు గలదా?
గూఢార్థవివరణము:
ఈ
పల్లవిలో అన్నమాచార్యులు
సృష్టిని భగవంతుని చేత సృష్టింపబడిన వస్తువుగా మాత్రమే చూపుటలేదు.
ఆయన
గమనిస్తున్నది:
ఈ సృష్టియే భగవద్విభవము ప్రత్యక్షముగా కనిపించు స్థితి.
అంటే:
వానలు,
మొక్కలు,
జననము,
మరణము,
జీవనపోషణ,
ఆరాటము —ఇవన్నియు వేరువేరు సంఘటనలు కాక,
ఒకే చైతన్యములోని విడదీయలేని భాగములై కనిపిస్తున్నవి.
“భగవద్విభవపు ప్రత్యక్షం బిది”
ఈ
ప్రపంచము కేవలం భౌతిక సంఘటనల సమాహారము కాదు.
భగవంతుని
వైభవమే ప్రత్యక్షముగా విస్తరించి ఉన్నట్లు కవి సూచిస్తున్నారు.
ఇక్కడ
“భగవంతుడు” అనగా మనము ఊహింపలేని దైవత్వమునే కాక
సృష్టి
అంతటిని ఆవరించిన జీవ క్రమముగా కూడా చూడవచ్చును.
“జిగి నిందొకటియుఁ జేయఁగఁ గలమా”
ఈ
పల్లవిలో అత్యంత సూక్ష్మమైన పరిశీలన ఇదే.
మనిషి
తన క్రియలకు తానే కర్తనని భావిస్తాడు.
కాని కవి ప్రశ్నిస్తున్నది:
ఈ
విశ్వవ్యాప్త చైతన్యములో
మనము పూర్తిగా స్వతంత్రంగా చేయగలిగినది.
ఒక్కటైనను ఉన్నదా?
ఈ
ప్రశ్న మనిషి అహంకారమును మాత్రమే కాదు,
తన స్వతంత్రతపై కలిగిన గట్టి నమ్మకమును కూడా సడలించును.
కీలక
పరిశీలన
ఈ
పల్లవిలో సృష్టి —
భగవంతునికి
వేరుగా ఉన్న ఏర్పాటు కాదు,
భగవద్విభవము
ప్రత్యక్షముగా కనిపించు ఏకచర్యగా సజీవ క్రమముగా గమనింపబడుచున్నది.
మొదటి చరణం:
దైవికమెపో
తతియగు వానలు
తావగు మొలకలు
దైవికమే
కావిరినివెల్లాఁ
గంటా వింటా
దైవమునేలో
తలఁచము మనము ॥భగ॥
|
పదం / భాగం
|
అర్థం
|
|
దైవికమెపో
|
దైవికమైనవియే
|
|
తతియగు వానలు
|
సమయానుకూలముగా కురిసే వానలు
|
|
తావగు మొలకలు
|
వాటివలన పుట్టే మొలకలు
|
|
దైవికమే
|
దైవస్వరూపమైనవే
|
|
కావిరిన్
|
పొగక్రమ్మినట్లుండునది, (ఉత్పాతసూచకముగా నలుపెక్కిన) ఎఱుపురంగు గలది
|
|
ఇవెల్లాఁ
|
వీటినన్నింటిని
|
|
గంటా వింటా
|
చూస్తూను, వింటూను,
అనుభవిస్తూను
|
|
దైవమునేలో తలఁచము మనము
|
దైవమును తలచము మనము
|
భావము:
సమయానుకూలముగా
కురిసే వానలు,
వాటి వలన పుట్టే మొలకలు —
ఇవన్నియు దైవికమైనవే.
వాటి వలన పుట్టే మొలకలు —
ఇవన్నియు దైవికమైనవే.
అయినను,
ఈ విశ్వవ్యాప్త జీవ కదలికను
చూచుచూ,
వినుచూ,
అనుభవించుచూ ఉండగానే —
ఈ విశ్వవ్యాప్త జీవ కదలికను
చూచుచూ,
వినుచూ,
అనుభవించుచూ ఉండగానే —
తానూ
ఆ ప్రకృతి పుట్టించిన వాడనని మరచి
మనిషిని గర్వమను పొగక్రమ్మినట్లు
దైవమును తలచుట అరుదుగా జరుగుచున్నది.
గూఢార్థవివరణము:
పరస్పరాధారమైన అనేక చర్యలు
(వాన కురియుట ములకలు మొలుచుట మొదలగునవి) అవశముగా జరుగుతుండగా మనకు ఇప్పటి బ్రతుకు
సుఖమయమై ఉంది. మనము ఆ చర్యలలో కొన్నింటికి కారణం ఊహించగలము. వానిలో కొన్ని మనకు
అనుకూలముగా కనిపించును. కొన్ని కావు. ఈ బేరీజులు, కారణములు,
ఊహలలో జీవితం అనుకూలముగా మార్చుకొన ప్రయత్నిస్తాం. హితమైన వాటిని
గరిష్టము చేసి బతుకుట జీవితమని భావిస్తాము.
ఇది ఒక మనిషికి, సమూహానికి పరిమితంకాదు. విశ్వ వ్యాప్తంగా చూడగలిగిన గుణము. అందరు అదే
విధముగా ఉండుటతో మనకు దానిలో తప్పులు కనబడవు. అన్నమాచార్యులు కావిరినివెల్లాఁ (=పొగక్రమ్మినట్లుండునది, ఉత్పాతసూచకముగా నలుపెక్కిన
ఎఱుపురంగు గలది) అని చెప్పడం ఈ నైజమును సూచించుటకే. “గంటా వింటా” అనగా చూచుచూ, వినుచూ కూడా ఆ పొగక్రమ్మిన
ముసుగు నుండి బయట పడడని తాత్పర్యం. ఆ ముసుగు నుండి కనబడునవి మన మనస్సు రువ్విన
యోచనలే. అందుకే అన్నమాచార్యులు "దైవమునేలో తలఁచము మనము" అనగా మనము
దైవమును కాక మనమూహించిన దానిని తలచుదుమని చెప్పారు.
రెండవ చరణం:
జననమరణములు
హరి దైవికమే
తనుపోషణములు
దైవికమే
యెనసి యివెల్లా
నెఱిఁగియు మరిగియు
కొన దైవమునేలో
కొలువము మనము ॥భగ॥
|
పదం / భాగం
|
అర్థం
|
|
జననమరణములు
|
పుట్టుకలు, మరణములు
|
|
హరి
|
సమస్తమును ఆవరించువాడు; జీవ క్రమమును నడిపించు దైవత్వము
|
|
దైవికమే
|
దైవస్వరూపమైనవే
|
|
తనుపోషణములు
|
శరీర పోషణ, జీవన
కొనసాగింపు
|
|
యెనసి యివెల్లా
|
ఇవన్నియు సమానం చేయు, సాటిచేయు
|
|
నెఱిఁగియు మరిగియు
|
తెలిసికొనియు, అలవాటు
పడియు, సహజమని భావించియు
|
|
కొన దైవమునేలో కొలువము మనము
|
చిట్టచివరి దైవమునందు నిలువము, స్థిరపడము మనము
|
భావము:
పుట్టుకలు, మరణములు ప్రకృతి (హరి) అధీనములోనివే.
శరీర
పోషణములు ప్రకృతి పుట్టించి, కల్పించి ఇచ్చినవే
ఇవెల్లా
దైవము ఏర్పరచినవే.
అయినను,
ఇన్నియు తెలిసికొనియు, అలవాటు పడి
ఇవన్నియు
సమానం చేయు
(పుట్టుకలు, మరణములు, పోషణములు సమానం అని పెదవులతో చెబుతామే
కానీ
వాస్తవముగా అంగీకరించము)
ఆ
చిట్టచివరి దైవమునేలో కొలువము మనము
గూఢార్థవివరణము:
పుట్టుక, మరణము, శరీర పోషణ ఇవి యాదృచ్ఛికముగా జరుగునవి కావు.
ప్రతీజీవి ఈ సృష్టిలో ప్రత్యేకమే. కానీ ఎవరో చెప్పిన పుట్టుకలు, మరణములు, సమానం అన్నది నమ్మలేము. మనకై మనము తెలిసిన
నమ్ముటకు అవకాశము ఎక్కువ. దైవమున్నాడన్నది కూడ మనకు ప్రత్యక్ష అనుభవము కాదు. అదీ
విన్నదే. ఎవ్వరు ప్రవేశించి తిరిగిరాని మరణము ముందు మన నమ్మకములు అభిప్రాయములు
సడలిపోవును. వీగి పోవును. అందుకే అన్నమాచార్యులు ఇలా అన్నారు “యివెల్లా నెఱిఁగియు మరిగియు కొన దైవమునేలో కొలువము మనము”
మూడవ చరణం:
యిహపరంబులును
యివి దైవికమే
తహతహ లుడుపఁగ
దైవికమే
అహిపతి శ్రీవేంకటాధిపు
కృపచే
మహిమ గంటిమిఁక
మఱవము మనము ॥భగ॥
|
పదం / భాగం
|
అర్థం
|
|
యిహపరంబులును
|
ఇహము, పరము; ఈ
లోకము, ఆ లోకము
|
|
యివి
|
ఇవన్నియు
|
|
దైవికమే
|
(దైవము = దేవుడు; దైవికము= దైవ నిర్ణయము) దైవికమే= నిర్ణయమే.
|
|
తహతహలు
|
ఆరాటము, తపన, లోపల
మండుచుండే కదలిక
|
|
ఉడుపఁగ
|
అణఁచగా, విసర్జించగా, పోఁగొట్టగా, నశింపజేయగా
|
|
అహిపతి
|
అహిపతి = ఆదిశేషుడు;
సమస్తమును మోయుచున్న శక్తి సూచనగా కానీ ఇక్కడ అహి= నిమ్నప్రదేశం వైపు పోవునది,
హింసించునది; కుట్టునది అహిపతి = (పై అర్థములను సూచించుచు) తెలియనిదానికి, బాధించుదానికి అధిపతి
|
|
శ్రీవేంకటాధిపు
|
శ్రీవేంకటేశ్వరుడు
|
|
కృపచే
|
కృపవలన
|
|
మహిమ
|
వైభవము, దైవిక విస్తృతి
|
|
గంటిమిఁక
|
ప్రత్యక్షముగా, స్పష్టముగా
|
|
మఱవము మనము
|
మరువము మనము
|
భావము:
ఇహము, పరములు రెండును దైవికములు.
మానవుని
తహతహలు (ఆరాటము, తపన, ఉద్రేకములు)
పోఁగొట్టునది
కూడా దైవికమే.
అనగా
తనకై తాను సాధించలేని దానికి (తెలియనిదానికి)
ఎంతో
కృప గలిగిన శ్రీవేంకటాధిపునికై వేచియుండుట
కూడా దైవికమే.
అదే
దైవ మహిమ.
అది
తెలిసితిమి కనుక ఇక మఱవము మనము.
గూఢార్థవివరణము:
ఈ చరణంలో
అన్నమాచార్యులు అత్యంత సున్నితమైన దానిని చెబుతున్నారు. మానవుని తహతహలు (ఆరాటము, తపన, ఉద్రేకములు) పోఁగొట్టునది కూడా దైవికమే. అనగా మన చేతిలో ఏమీ లేదని తెలిసి ఊరక ఉండుట. అదే
అతి కష్టమైన పని. ఆలోచనలు, చలనములు, ఊహలు
మృగ్యమైన స్థితి. మనము సాధారణంగా చేయలేని పని.
ఈ కష్టసాధ్యమైన అహిపతి (నిమ్నప్రదేశం వైపు పోవునది, హింసించునది,
బాధించునది) కార్యము మనకైమనము చేపట్టలేనిది. అందుకు శ్రీవేంకటాధిపు కృప
కావలెను. అది దైవికము. అందుకై వేచిచూచుట మన చేతిలోనిది కాకపోయినా అహిపతి కార్యమును
అంతరంగమున తెలియుటయే ముఖ్యము. అందుకు అంతరంగము వేరు కార్యములలో వ్యస్తమై ఉంటే శ్రీవేంకటాధిపు
కృపను చేకొనదు.
అన్నమాచార్యులు
"ఆ మహిమ గంటిమిఁ' అనగా ప్రత్యక్షంగా తెలిసి "ఇక
మఱవము మనము" అన్నారు. కానీ ఈ మఱిచిపోనిది ఏమి? ఇటువైపు తెలిసిన
దానిని, అటువైపు తెలియని
దానిని ఒకే సారి వీక్షించిన స్థితి. అది బాధను, హింసను,
ఇహసుఖములను సమము చేయుచూ ఎటువైపుకు మొగ్గని స్థితి.
X-X-X THE
END X-X-X
No comments:
Post a Comment